Skip to main content

ఐఐఎం-ఎలో అడుగులే లక్ష్యం..

ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష.. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్). తీవ్ర పోటీ ఉండే క్యాట్‌లో తెలుగు విద్యార్థి టి.వేద సంహిత్ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే 100 పర్సంటైల్ సాధించాడు. క్యాట్‌లో మంచి పర్సంటైల్ సాధించడానికి ఫోకస్ చాలా ముఖ్యమంటున్న వేద సంహిత్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
‘మాది వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట మండలంలోని ఉడుమువారిపల్లె. నాన్న టి.రాజేంద్రరెడ్డి.. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జేసీఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మ శ్రీవాణి.. గృహిణి. అన్న సాయి నివేదిత్ రెడ్డి.. ఇంజనీరింగ్ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించగలిగాను. పదో తరగతి వరకూ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో సాగింది. ప్రస్తుతం ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను.

మేనేజ్‌మెంట్ స్కిల్స్ కోసమే...
నేను ఎంఎస్ చేయాలనుకున్నాను. కానీ గణితం, ఫైనాన్స్‌లపై ఉన్న ఆసక్తితో ఎంబీఏలో చేరాలని నిర్ణయించుకున్నాను. నాకున్న ఇంజనీరింగ్ అర్హతకు తోడుగా ఎంబీఏ చేయడం వల్ల మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకుంటాను. అయితే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జేపీ మోర్గాన్‌లో ఉద్యోగం వచ్చింది. అందువల్ల ఆ కంపెనీలో జాబ్‌లో చేరి రెండేళ్ల పని అనుభవం తర్వాత ఎంబీఏలో చేరాలనే ఆలోచన కూడా ఉంది.

ఫోకస్ ప్రధానం..
నేను క్యాట్‌కు ఆర్నెళ్ల ముందు నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాను. కచ్చితంగా ఇన్ని గంటలు చదవాలనే నియమాలేమి పెట్టుకోలేదు. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోని చదవడాన్ని నేను నమ్మను. చదివిన గంట సేపైనా.. ఫోకస్‌గా చదివితే చాలు. నేను అదే ఫాలో అయ్యాను. నాకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద పట్టు ఉంది కాబట్టి నేను ఎక్కువగా మిగతా రెండు సెక్షన్లు... వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ సెక్షన్ల మీద ఎక్కువ దృష్టి సారించాను. ముఖ్యంగా వెర్బల్ ఎబిలిటీకి ఎక్కువ సమయం కేటాయించాను.

మాక్ టెస్టులతో ముందడుగు...
క్యాట్ లాంటి పోటీ పరీక్షలకు ముఖ్య విజయ రహస్యం ప్రాక్టీస్. మాక్ టెస్ట్‌లు రాసి ఎప్పటికప్పుడూ చేసిన తప్పులను సమీక్షించుకునేవాడిని. ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయడం ఉపకరించింది. ఆయా పరీక్షల్లో చేసిన తప్పులను విశ్లేషించుకొని సరిదిద్దుకున్నాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రతపడ్డాను. ఈసారి క్యాట్ విధానం మారింది. ఇందులో ప్రతి సెక్షన్‌కు గంట సమయం కేటాయించారు. ఈ మారిన విధానానికి అనుగుణంగా ప్రతి సెక్షన్‌ను విడివిడిగా ప్రాక్టీస్ చేశాను. అదే విధంగా మూడు గంటల పాటు ఎగ్జామ్స్ ఉండేలా కూడా మాక్ టెస్టులు రాశాను.

ప్రాక్టీస్‌తోనే...
క్యాట్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పరీక్ష విధానంలో ఎటువంటి మార్పులనైనా స్వీకరించే స్థితిలో ఉండాలి. జరిగిన మార్పులకు అనుగుణంగా వచ్చే సవాళ్లను ప్రాక్టీస్ ద్వారా చాలా సులువుగా అధిగమించవచ్చు. ఎక్కువ మాక్‌టెస్ట్‌లు రాయడం ద్వారా అదే పరీక్షా విధానం అలవాటై.. ఎగ్జామ్ హాల్‌కు ఎలాంటి కంగారు లేకుండా వెళ్లవచ్చు. మార్పులు పెద్ద ప్రభావాన్ని చూపవు. ఏ ఆబ్జెక్టివ్ పరీక్షకైనా సమయ నిర్వహణ కీలకం. క్యాట్ ప్రశ్నల శైలి అంత క్లిష్టంగా ఉండదు. కానీ, గంటలోపు 32 నుంచి 34 ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది కాబట్టి సమయ పరిధే ముఖ్య అవరోధంగా మారుతుంది. సమయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అలాకాకుండా అటెంప్ట్ చేసే ప్రశ్నల్లో కచ్చితత్వం ఉండేలా చూసుకోవడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.

ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరుతా...
ప్రపంచంలోనే టాప్ 100 బిజినెస్ స్కూళ్లలో ఉండే ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరాలనుకుంటున్నాను. దాంతోపాటు మిగతా ఐఐఎంల్లో కూడా ఇంటర్వ్యూలకు హాజరవుతాను. ఆయా ఐఐఎంలు నిర్వహించే రిటన్ ఎబిలిటీ టెస్ట్, బృంద చర్చలు, పర్సనల్ ఇంటర్వ్యూ లాంటి అంశాలపై సీనియర్లతో మాట్లాడి అవగాహన పెంచుకుంటున్నాను. పేపర్ చదివే అలవాటు ఉండడం వల్ల రిటన్ ఎబిలిటీ టెస్ట్‌ను కూడా సులువుగానే ఎదుర్కొగలననే నమ్మకం ఉంది. పర్సనల్ ఇంటర్వ్యూ కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే పనిలో ఉన్నాను.

సలహాలు..
అభ్యర్థులకు వేర్వేరు నైపుణ్యాలు ఉంటాయి. కాబట్టి తమ బలాలు, బలహీనతల ఆధారంగా వారు ప్రిపేర్ అవ్వాలి. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏదైనా సాధించగలరని మాత్రం చెప్పగలను. విజయానికి ప్రాక్టీస్ అనేది కీ లాంటిది!

క్యాట్ సెక్షన్ వారీగా పర్సంటైల్

విభాగం

పర్సంటైల్

వెర్బల్ ఎబిలిటీ

99.99

డీఐ అండ్ ఎల్‌ఆర్

99.99

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

100


అకడమిక్ ప్రొఫైల్

పదో తరగతి

93 శాతం

ఇంటర్మీడియట్

96.2 శాతం

ఐఐటీ ర్యాంక్

259

ఎంసెట్ ర్యాంక్

12

బీటెక్

7.88 సీజీపీఏ (ఇప్పటి వరకు)

Published date : 22 Jan 2016 11:30AM

Photo Stories