Skip to main content

సీఏ ఇంటర్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ర్యాంకర్ల సూచనలు, సలహాలు...

చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) ఇంటర్.. సీఏలోని మూడు దశలలో రెండో దశ. సీఏ ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా సీఏ తుది దశ ఫైనల్‌కు నమోదు చేసుకునే అర్హత లభిస్తుంది.
అంతేకాకుండా సీఏ ఇంటర్ అర్హతతో ఉద్యోగావకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఇంతటి కీలకమైన ఇంటర్ దశలో విజయం సాధించాలంటే.. ఆసక్తితోపాటు సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలంటున్నారు.. ఇటీవల విడుదలైన సీఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకులు సొంతం చేసుకున్న అఖితా కౌతాల్, గుంటి సునీల్. ఈ నేపథ్యంలో.. సీఏ ఇంటర్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించేందుకు ఆల్ ఇండియా ర్యాంకర్ల సూచనలు, సలహాలు...

సమయ పాలన, సానుకూల దృక్పథం :

మాది కర్ణాటక రాష్ట్రంలోని సింధనూర్ అనే ప్రాంతం. నాన్న రైతు. సీఏ ఇంటర్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాలంటే.. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. అవి.. సమయ పాలన, సానుకూల దృక్పథం, హార్డ్ వర్క్. చాలామంది విద్యార్థులు ఇంటర్‌లోని గ్రూప్‌లు, సబ్జెక్ట్‌ల పరంగా.. తొలి ప్రయత్నంలో విజయం సాధించడం కష్టమని భావిస్తారు. కానీ మొదటి రోజు నుంచే నిర్దిష్ట సమయ పాలన పాటిస్తూ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తే.. తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించొచ్చు. నేను సీఏ కోర్సును లక్ష్యంగా చేసుకొని ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌ను ఎంచుకున్నాను. ఆ తర్వాత మాస్టర్‌మైండ్స్‌లో సీఏ కోర్సులో చేరాను. మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 19వ ర్యాంకుతో ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాను. ఇప్పుడు ఇంటర్‌లోనూ 18వ ర్యాంకు లభించింది.
  • {పతిరోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని.. ప్రతిరోజూ ఒక టాపిక్ తప్పనిసరిగా పూర్తిచేసుకునేలా చదవాలి. ముందు నుంచే నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి. బట్టీ విధానానికి బదులు కాన్సెప్ట్‌లపై అవగాహన, బేసిక్స్‌పై పట్టు పెంచుకునే విధంగా చదివితే పరీక్షలో ఎలాంటి ప్రశ్న ఎదురైనా సులభంగా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. వీకెండ్ పరీక్షలు రాయడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడం ఎంతో ముఖ్యం.
  • సొంతంగా ప్రిపరేషన్ సాగించే విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ ఆధారంగా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ, కాస్టింగ్ సబ్జెక్ట్‌లలో అవగాహనకు ప్రాక్టీస్ ఎంతో ముఖ్యం.
- అఖితా కౌతాల్, సీఏ ఇంటర్ ఆల్ ఇండియా 18వ ర్యాంకు

క్లిష్టమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం :
మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. నాన్న రమేష్ కిరాణ దుకాణం నడుపుతుంటారు. సీఏ ఇంటర్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఏమంత కష్టం కాదు. అయితే నిర్దిష్ట ప్రణాళికతో చదవడం ముఖ్యం. పదోతరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్ చదివిన వారైనా.. లక్ష్యంపై స్పష్టతతో అడుగులు వేస్తే సీఏ ఇంటర్‌లో మొదటి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకోవచ్చు.
  • ఇంటర్ ఎంపీసీ తర్వాత సీఏ ఫౌండేషన్ కోర్సుకు హాజరయ్యాను. ఆ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 46వ ర్యాంకు వచ్చింది. ఇప్పుడు సీఏ ఇంటర్‌లో 35వ ర్యాంకు లభించింది. ముందుగానే నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం.. ఎప్పటికప్పుడు చదివిన సబ్జెక్ట్స్‌ను రివిజన్ చేసుకోవడం.. అన్ని చాప్టర్స్‌ను చదవడం వల్లే ఆల్ ఇండియా ర్యాంకు వచ్చింది.
  • మనకు కష్టంగా అనిపించే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. సందేహాలను నిరంతరం నివృత్తి చేసుకోవాలి. ప్రిపరేషన్ సమయంలోనే ముఖ్యమైన అంశాలతో నోట్స్ రూపొందించుకుంటే.. పరీక్ష ముందు రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్‌లో భాగంగా సిలబస్ వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరుపై అవగాహన పెంచుకోవాలి. ప్రామాణిక మెటీరియల్‌ను ఎంచుకొని.. దానికే పరిమితం అవ్వాలి. ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు, మూడు పుస్తకాలు చదవడం వల్ల గందరగోళానికి గురయ్యే ఆస్కారముంది. ఇలా ప్రిపరేషన్ తొలిరోజు నుంచే పక్కా ప్రణాళికతో చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు.
- గుంటి సునీల్, సీఏ ఇంటర్ ఆల్ ఇండియా 35వ ర్యాంకు

పునశ్చరణ ఎంతో కీలకం :
సీఏ ఇంటర్ పరీక్షల్లో విజయానికి పునశ్చరణ, నిర్దిష్ట ప్రణాళికను అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇన్‌స్టిట్యూట్ బోధనకే పరిమితం కాకుండా.. రివిజన్ టెస్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిపరేషన్ సమయంలో ఒక అంశాన్ని చదివేటప్పుడు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాక్టీస్ మాన్యువల్స్, ప్రీవియస్ పేపర్స్, రివిజన్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకుని చదవాలి. మొత్తం ఎనిమిది సబ్జెక్ట్‌లు ఉండే సీఏ ఇంటర్‌లో కనీసం నాలుగు సబ్జెక్ట్‌లపై ఎక్కువ దృష్టిసారిస్తే.. వాటిలో అధిక మార్కులు సొంతం చేసుకోవడం ద్వారా అగ్రిగేట్ మార్కుల పరంగా ఉత్తీర్ణత సాధించే వీలుంటుంది.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, మాస్టర్‌మైండ్స్
Published date : 05 Mar 2020 03:41PM

Photo Stories