Skip to main content

జేఈఈ మెయిన్స్ 2018 టాపర్స్ మనోగతాలు

జేఈఈ మెయిన్.. జాతీయ స్థాయిలో పది లక్షల మందికిపైగా విద్యార్థులు పోటీ పడ్డ పరీక్ష. పరీక్ష ముగిసాక విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ క్లిష్టంగా ఉందని.. టైమ్ టేకింగ్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 30 ప్రకటించిన ఫలితాల్లోనూ ఇదే ప్రతిబింబించింది. ఇంత క్లిష్టంగా జరిగిన పరీక్షలో మొత్తం 360 మార్కులకు ఏకంగా 350 మార్కులు సాధించి మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు భోగి సూరజ్ కృష్ణ, హేమంత్ కుమార్. ఈ ఇద్దరు విజేతల విజయ ప్రస్థానం వారి మాటల్లోనే...

ఇంజనీరింగ్ లక్ష్యంతో ఇష్టపడి చదివా - సూరజ్ కృష్ణ
మా స్వస్థలం శ్రీకాకుళం. నాన్న హరికృష్ణ వృత్తిరీత్యా వ్యాపారం. అమ్మ నీరజ రాణి, గృహిణి. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విజయవాడలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదివాను. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అమ్మానాన్న... నేను, చెల్లెలు బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నారు. అందుకోసం మంచి కోర్సులు చదవాలని తోడ్పాటునందించారు.

ఇంజనీరింగ్ చదవాలనే ఆలోచన..
చిన్నప్పటి నుంచి చదువులో ప్రథమ స్థానమే లభించేది. ఇంజనీరింగ్ చదవాలనే ఆలోచన మాత్రం విజయవాడకు వచ్చాకే మొదలైంది. అప్పటినుంచే ఆ దిశగా కృషి చేశాను. ఫలితంగానే ఇప్పుడు ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు లభించింది. టాప్ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. వాస్తవానికి పరీక్ష తర్వాత అధికారిక ‘కీ’ చూసుకున్నప్పుడే టాప్ ర్యాంక్ వస్తుందని లెక్చరర్లు భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి.

ఇష్టపడి చదివా..
ప్రిపరేషన్ పరంగా ఏ సబ్జెక్ట్‌ను కూడా కష్టంగా భావించలేదు. అన్ని సబ్జెక్టులను ఇష్టపడి చదివాను. ఏ సబ్జెక్ట్ కూడా ఇబ్బందిగా అనిపించలేదు. కష్టమైన అంశాలను నేర్చుకోవాలని మరింత కృషి చేశా. లెక్చరర్లు కూడా ఎంతో సహకరించారు. ప్రిపరేషన్ పరంగా నిర్దిష్టమైన సమయ ప్రణాళికను అనుసరిస్తూ ఆయా అంశాలను అభ్యసించడం కలిసొచ్చింది.
ఇంటర్మీడియెట్, జేఈఈ-మెయిన్ ప్రిపరేషన్‌కు మధ్య ఎలాంటి గందరగోళానికి గురికాలేదు. క్లాస్‌రూమ్ లెక్చర్స్, సెల్ఫ్ ప్రిపరేషన్ పరంగా ప్రతిరోజూ పది నుంచి పన్నెండు గంటల సమయం కేటాయించాను.

పూర్తిగా రివిజన్‌కే :
బోర్డ్ పరీక్షల తర్వాత పూర్తిగా జేఈఈ-మెయిన్ అంశాల రివిజన్‌కే అధిక సమయం కేటాయించాను. మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు, కాలేజ్‌లో నిర్వహించే వీక్లీ టెస్ట్‌లకు హాజరై.. ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై అవగాహన పెంచుకున్నాను. షార్ట్‌కట్ మెథడ్స్ కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. నిర్దిష్ట సమయంలో సమాధానాలు రాసే నైపుణ్యం లభించింది.

క్లిష్టంగా అనిపించలేదు :
జేఈఈ-మెయిన్ పరీక్ష రాసేటప్పుడు ఏ సబ్జెక్ట్ విషయంలోనూ క్లిష్టంగా భావించలేదు. కారణం.. అప్పటికే నిర్దిష్టమైన ప్రణాళికతో చదవడం, అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్యువల్ ప్రిపరేషన్ సాగించడంతో అందుబాటులో ఉన్న సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలిగా.

అడ్వాన్స్‌డ్‌కు ఆన్‌లైన్ :
జేఈఈ-మెయిన్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు వచ్చినా.. ప్రస్తుతం నా దృష్టంతా జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌పైనే ఉంది. అందుకే మెయిన్ ముగిసిన నాటి నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షలో రాణించేందుకు ఆన్‌లైన్ విధానంపై బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను.

ప్రాక్టీస్.. అప్లికేషన్ అప్రోచ్ :
జేఈఈ ఔత్సాహిక విద్యార్థులు.. విజయం సాధించాలంటే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా చదివే ప్రతి అంశాన్ని అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అప్పుడే పరీక్షలో ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైనా సమాధానం రాయగల సంసిద్ధత లభిస్తుంది. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకుతో ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరడమే నా లక్ష్యం. ఉన్నత విద్య, భవిష్యత్తు పరంగా ఇంకా ఎలాంటి ఆలోచన లేదు

అకడెమిక్ ప్రొఫైల్..
  • పదో తరగతి: 9.7 జీపీఏ.
  • ఇంటర్మీడియెట్: 976 మార్కులు.
  • 2016లో కేవైపీవై స్కాలర్‌షిప్‌కు ఎంపిక.
  • హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ నిర్వహించే సైన్స్ ఒలింపియాడ్(2016)లో విజయం
.
ఒత్తిడి వదులుకుంటేనే విజయం : హేమంత్ కుమార్
Edu news నా విద్యాభ్యాసం ఢిల్లీలో మొదలైంది. నాన్న నాగరాజు కేంద్ర ప్రభుత్వంలో పీడబ్ల్యుడీ ఉద్యోగి. దాంతో నా ప్రాథమిక విద్యకు ఢిల్లీలో పునాది పడింది. ఒకటో తరగతి వరకు ఢిల్లీలోనే చదువుకున్నాను. ఆ తర్వాత నాన్న వైజాగ్‌కు బదిలీ కావడంతో రెండో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విశాఖపట్నంలో చదువు కొనసాగింది. వాస్తవానికి ఈ మధ్యలో నాన్నకు ఉద్యోగరీత్యా బదిలీలు జరిగినప్పటికీ.. నా చదువుకు అంతరాయం కలగకూడదని మా కుటుంబం విశాఖపట్నంలోనే నివాసముంది.

పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ :
పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివాను. ప్రస్తుత విజయంలో అది కూడా ఎంతో దోహదపడింది. సీబీఎస్‌ఈ కరిక్యులంలో ఉండే విధానం వల్ల సబ్జెక్ట్‌లపై మరింత అవగాహన వచ్చింది. ఇంజనీరింగ్‌లో చేరాలనే లక్ష్యం ప్రత్యేకంగా నిర్దేశించుకున్నది కాదు. మొదటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే ఎంతో ఆసక్తి. ఎలాంటి లెక్కలనైనా సులువుగా సమాధానాలు రాబట్టగలిగేవాడిని. మ్యాథమెటిక్స్ పునాదిగా మంచి కెరీర్ అవకాశాలు లభించే కోర్సు ఇంజనీరింగ్ అని నాన్న చెప్పారు. దీంతో ఇంటర్మీడియెట్‌లో చేరాక ఇంజనీరింగ్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. అందుకు అవసరమైన జేఈఈపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాను.

నిరంతర ప్రాక్టీస్ :
జేఈఈ మెయిన్ ప్రిపరేషన్ పరంగా నిరంతరం ప్రాక్టీస్ చేశాను. ఇది మిగతా సబ్జెక్ట్‌లపైనా సానుకూల ఫలితం చూపింది. ముఖ్యంగా ఫిజిక్స్‌లో న్యూమరికల్ అప్రోచ్‌తో ఉండే అంశాల విషయంలో మ్యాథమెటిక్స్‌లో నాకున్న పరిజ్ఞానం ఎంతో కలిసొచ్చింది. ప్రతి రోజు క్లాస్ రూమ్ లెక్చర్స్, సెల్ఫ్ ప్రిపరేషన్ రెండింటికీ కలిపి పది గంటలు తక్కువ కాకుండా.. ప్రిపరేషన్ సాగించాను. వీక్లీ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరవుతూ.. ఆయా అంశాలపై మరింత నైపుణ్యం పొందే విధంగా ప్రిపరేషన్ సాగించాను.

టెన్షన్ లేకుండా.. పరీక్షకు
జేఈఈ-మెయిన్ పరీక్షకు ఎలాంటి టెన్షన్ లేకుండా వెళ్లాను. వాస్తవానికి ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. అయితే అన్ని విధాలుగా ప్రిపరేషన్ సాగించడం, టైమ్ మేనేజ్‌మెంట్ మెళకువలు తెలుసుకోవడంతో.. మూడు గంటల సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగాను. ఫలితంగానే అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు వచ్చింది.

'గురి' అడ్వాన్స్‌డ్‌పైనే..
ప్రస్తుతం నా గురి అంతా త్వరలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపైనే ఉంది. ఇందుకోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా. అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌లో జరగనున్నప్పటికీ.. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆన్‌లైన్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తున్నాను. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ఐఐటీ-ముంబై లేదా ఢిల్లీ క్యాంపస్‌లలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరడమే తొలి లక్ష్యం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్‌కు హాజరై ఐఏఎస్ సాధించాలనేది భవిష్యత్తు లక్ష్యం.

అకడెమిక్ ప్రొఫైల్..
  • సీబీఎస్‌ఈ పదో తరగతిలో 10/10 జీపీఏ.
  • ఇంటర్మీడియెట్‌లో 970 మార్కులు.
  • ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్-2018లో స్వర్ణ పతకం. 2017లో కాంస్య పతకం.
  • కేవైపీవై-2017 స్కాలర్‌షిప్‌కు ఎంపిక
  • విట్ ఎంట్రన్స్‌లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు.
Published date : 03 May 2018 11:58AM

Photo Stories