Skip to main content

కృషి ఉంటే.. టాపర్ అవ్వొచ్చు !

ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరేందుకు పట్టుదల, కృషి ఉంటే చాలు... కుటుంబ నేపథ్యంతో సంబంధం లేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలనా.. ప్రయివేటు స్కూలా అనేది అవసరం లేదని నిరూపించాడు మావూరి శివ కృష్ణ మనోహర్.
 2018 ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ఐదో ర్యాంకు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు.

నాన్న నాగేశ్వరరావు టైలర్, అమ్మ పద్మావతి గృహిణి. ఉండేది విశాఖపట్నం జిల్లా కొయ్యురు మండలం రాజేంద్రపాలెంలో! ఐదో తరగతి వరకు స్థానిక ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్నాను. ఆర్థిక స్థోమత లేనందున పదో తరగతి వరకు చదివించి.. ఏదో ఒక పనిలో చేర్పించాలని అమ్మానాన్న ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ, నేను పదో తరగతితో చదువు ఆపడం కాదు, పది మందిలో స్ఫూర్తినింపే స్థాయికి చేరాలనుకున్నాను. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాను.

కేవీపీవైకు ఎంపికయ్యా :
నేను ఐదో తరగతిలో జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష రాసి.. వైజాగ్‌లోని నవోదయ స్కూల్లో ప్రవేశించాను. ఇక్కడ ఐఐటీ ఓరియెంటేషన్ క్లాసులు లేకున్నా.. సబ్జెక్టులను సొంతంగా ఎలా చదవాలో నేర్పించేవారు. ఆ నైపుణ్యమే నాకు ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఉపయోగపడింది. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులకు ‘ఫార్య్చూన్ 40’ పేరిట ఫిట్జీ నిర్వహించిన జాతీయస్థాయి ఎంట్రెన్స్ టెస్టులో ప్రతిభ చూపా. దీంతో ఫీజులో పూర్తి రాయితీ లభించింది. కేవీపీవై స్కాలర్‌షిప్‌కు కూడా ఎంపికయ్యాను.

ఐఐటీ ఓరియెంటేషన్ లో..
టైం మేనేజ్‌మెంట్ లోపాలు, కెమిస్ట్రీలో కొన్ని తప్పులు దొర్లడంతో జేఈఈ మెయిన్‌లో ఆశించిన ర్యాంకు రాలేదు. ఆలిండియా 59వ ర్యాంకు వచ్చింది. చేసిన పొరపాట్లను జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌లో అధిగమించాను. ఎక్కువగా కెమిస్ట్రీపై దృష్టిపెట్టా. అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10 ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ, ఐదో ర్యాంకు రావడం ఆనందాన్నిచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో చేరాను. ఇక్కడ పరిశోధనలకు ప్రాధాన్యముంది. అందుకే ఆ దిశగా వెళ్లాలనుకుంటున్నా.
Published date : 13 Aug 2018 06:44PM

Photo Stories