Skip to main content

సైంటిస్ట్...లేదంటే ఐఏఎస్ అవుతా - ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ టాపర్ సుబ్రహ్మణ్యం

ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆ తర్వాత సివిల్స్ రాయాలనుకుంటున్నా. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. పరీక్షకు రెండున్నర నెలల ముందునుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం ఎక్కువ స్కోర్ సాధించడానికి దోహదపడింది. కెమిస్ట్రీ సబ్జెక్టులో కొంత వెనుకబడినా.. ఆ తర్వాత అధ్యాపకుల సాయంతో సబ్జెక్టుపై పట్టు పెంచుకున్నా. విద్యార్థులెవరైనా సరే టాపర్‌గా నిలవాలంటే.. ముందు సబ్జెక్టులను అర్థం చేసుకుని చదవాలి. బట్టీపడితే పరీక్ష సమయంలో తికమకకుగురై తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయలేం. త్వరలో బిట్స్ పిలానీలో సీటు సాధించి ఇంజనీరింగ్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన టి.వి.జి. సుబ్రహ్మణ్యం మంగళవారం ప్రకటించిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 994 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు. ఆయనతో సాక్షి ఇంటర్వ్యూ...

స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఊహించారా?
ఫస్ట్‌ఇయర్ ఇంటర్‌లో 467 మార్కులు సాధించాను. దీంతో అదే ఊపుతో సెకండ్ ఇయర్‌కు ప్రిపేరయ్యాను. ఫస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఎక్కువ మార్కులు సాధిస్తే స్టేట్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉందనుకున్నా. అందుకే పట్టుదలగా చదివా. పరీక్ష రాశాక 993 వరకు మార్కులు వస్తాయని ఊహించా. కాని 994 మార్కులతో స్టేట్ ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల కష్టం నెరవేరినందుకు ఇంట్లో పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

ఫ్యామిలీ, విద్యా నేపథ్యం?
మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం విద్యాదర్‌నగర్ కాలనీ. నాన్న లెక్చరర్. అమ్మ టీచర్. ఒకటి నుంచి పదోతరగతి వరకు కొత్తగూడెంలోనే చదువుకున్నా. టెన్త్ సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివాను. 9.8 గ్రేడ్ పాయింట్స్ సాధించాను.

మొత్తం మార్కులు?
నా హాల్‌టిక్కెట్ నెంబరు 1219220981. సెకండ్ ఇయర్ సబ్జెక్టుల వారీగా ఇంగ్లిష్ 98, సంస్కృతం 99, మ్యాథ్స్ ఏ 75లో మ్యాథ్స్ బీలో 75, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60 చొప్పున మొత్తం 467మార్కులు వచ్చాయి.

సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ ఎలా?
కొత్తగూడెం కాలేజీలో లెక్చరర్లు ముందునుంచీ ప్రణాళికబద్ధంగా మాతో చదివించారు. ఎప్పటికప్పుడు సబ్జెకు పుర్తైనపుడు తిరిగి వారంలోపే సబ్జెక్టును రివిజన్ చేయించారు. దాంతో సబ్జెక్టుపై బాగా పట్టుదొరికింది. అంతేకాదు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో చాప్టర్లవారీగా రివ్యూలు, పునశ్చరణ దగ్గరుండి చేయించారు. మొదటినుంచీ కెమిస్ట్రీ సబ్జెక్టు కష్టంగా తోచింది. ఎప్పటికప్పుడు లెక్చరర్లను అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నా. అదేవిధంగా ఫస్ట్‌ఇయర్‌కు అన్ని సబ్జెక్టులకు టెక్ట్స్‌బుక్స్‌పై ఆధారపడ్డా. ఈసారి కూడా అన్ని సబ్జెక్టులకు పాఠ్యపుస్తకాలు చదివాను. దీనివలన పరీక్ష సమయంలో ఎలాంటి ప్రశ్న అడిగినా సమాధానం రాయగలిగాను. జనవరి నుంచి సీనియర్ ఇంటర్ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించా. అప్పటివరకు చదివిన సబ్జెక్టులను చాప్టర్ల వారీగా రివిజన్ చేసేవాడిని. ఎట్టిపరిస్థితుల్లోను తిరిగి కొత్త సబ్జెక్టులజోలికి వెళ్లలేదు. పరీక్షకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రోజుకు 14 గంటలు చదివా.

జీవిత లక్ష్యం?
ఇంజనీరింగ్ చేస్తాను. బీటెక్‌లో ఈఈఈ లేదంటే కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరతా. బిట్స్‌పిలానీ క్యాంపస్‌లో సీటు సాధించడం ప్రథమ కర్తవ్యం. బీటెక్ పూర్తయ్యాక సివిల్‌సర్వీసు పరీక్ష రాయాలనుకుంటున్నా. అయ్యేఎస్ అధికారి హోదాలో సామాజిక సేవ చేయాలనుకుంటున్నా. లేదంటే శాస్త్రవేత్తనవుతా.

హాబీలు?
క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం.

ఎక్కువ మార్కులు సాధించాలంటే?
ఇంటర్లో టాపర్‌గా నిలవాలనుకునేవారు జూనియర్ ఇంటర్ స్థాయి నుంచే ప్రిపరేషన్‌ను పక్కాప్రణాళిక ద్వారా ఆచరించాలి. ప్రధానంగా క్లాస్‌రూం భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత మేలు. ఇలాచేస్తే కనీసం 30శాతం సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. అదేవిధంగా తరగతిలో ఏదైనా చాప్టర్ పూర్తైవెంటనే ఇంట్లో కూర్చుని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. దానిద్వారా అసలు సబ్జెక్టులో మనం ఎక్కడున్నాం? అనే విషయం తెలుస్తుంది. తద్వారా తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షలు దగ్గరపడేకొద్దీ చదివిన విషయాన్ని ఒత్తిడి, ఆందోళనతో మర్చిపోతారు. అసలు పరీక్ష సమయంలో నేను రాయలగనా? అనే సందేహాం వదిలేస్తే కచ్చితంగా ఎక్కువ స్కోరింగ్ సాధించవచ్చు.
Published date : 24 Apr 2012 03:37PM

Photo Stories