Skip to main content

రిక్షాపుల్లర్ కుటుంబం నుంచి ఐఐటీ జేఈఈ విజేతగా -ఈర్లపల్లి రాజు, ఐఐటీ-జేఈఈ విజేత

తండ్రి రిక్షా పుల్లర్. తల్లి కూలీ.  అలాంటి కుటుంబంలో పుట్టిన ఆ యువకుడికి ఐఐటీలో చదివి ఇంజనీర్ కావాలనే స్వప్నం. పదో తరగతిలో 551మార్కులు రావడంతో ఓ ఐఏఎస్ అధికారి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చేర్పించారు. అంతవరకు సాఫీగానే సాగినా.. పుస్తకాలకు రెండు వేలు కూడా వెచ్చించలేని స్థితిలో చదువు మానేయాలనుకుని.. మళ్లీ లక్ష్యం గుర్తొచ్చి స్నేహితుల పుస్తకాలతో చదువుకుని.. ఐఐటీలో 1387 ర్యాంకు సాధించిన ఈర్లపల్లి రాజు విజయగాథ..

ఆలోచనలకు పేదరికం తెలియదు కదా:
మా స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలమైనా హైదరాబాద్‌లోనే నివాసం. అయిదు నుంచి పదో తరగతి వరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లో చదివాను. కా నీ ఈ క్రమంలో ప్రతి దశలో పేదరికం వెక్కిరిస్తూనే ఉం ది. ఈ దుస్థితి ఒకానొకదశలో ఆత్మ విశ్వాసాన్ని చంపేసింది. కానీ సమాజం ఎన్నో పాఠాలు నేర్పింది. నాలాగే ఎందరో పేదవిద్యార్థులు చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారనిపించింది. అందుకే పట్టుదలతో చదువు కొనసాగించా.
రూ.2 వేలు కట్టలేక  కన్నీళ్లొచ్చాయి:
ఉచితంగా ఇంటర్లో సీటొచ్చిందనే ఆనందం ఎన్నాళ్లోలేదు. అక్కడ మధ్యమధ్యలో అడ్మిషన్, ట్యూషన్ ఫీజులు కట్టడం తప్పనిసరి. వాటిని కట్టడం స్థాయికి మించిన పని. ఒక్కోసారి ఎవరో ఒకరు ఆదుకునేవారు.

ఐఐటీ ఫీజు ఎలా కట్టాలనేదే బాధంతా...
చిన్నప్పటినుంచీ లెక్కలు, ఫార్ములాలు అంటే ఇష్టం.      ఐఐటీలో ర్యాంకు రాకపోతే పేదరికం కారణంగా        నా కెరీర్ ఇక్కడితో ముగిసిపోతుందనే భయం          అనుక్షణం వెన్నాడేది. అందుకే జీవన్మరణ సమస్యగా భావించి రోజుకు 11గంటలకుపైగా కష్టపడి చదివా. ఇటీవల ఐఐటీ-జేఈఈ ఫలితాల్లో 97 మార్కులు సాధించడంతో ఎస్సీ కేటగిరీలో 1387వ ర్యాంకు వచ్చింది. ఏదో ఒక ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలనేదే నా లక్ష్యం. ఐఐటీలో సీటు వచ్చిన ఆనందం కంటే చేరాక ఫీజు ఎలా కట్టాలి? అనే ఆందోళనే నన్ను వేధిస్తోంది.

కూలీగా మారతాననే భయంతో ప్రిపరేషన్...
ఇంటర్‌లో 937మార్కులు సాధించాను. ఐఐటీలో సీటు రాకుంటే చదువు ఆపి ఏదోక ఉపాధి చూసుకోవాల్సిందే. కానీ పోరాటంలో ఓడిపోకూడదనుకున్నా. ఆ పట్టుదలతోనే మంచిర్యాంకు వస్తే ఉచిత సీటు వస్తుందనే నమ్మకం పెరిగింది. ఎప్పటికప్పుడు సందేహాలు నెరవేర్చుకున్నా. పాతప్రశ్నపత్రాలను ఒకటికిరెండుసార్లు ప్రాక్టీస్‌చేసేవాడిని. ఇంటర్ టెక్ట్స్‌బుక్స్‌ను లోతుగా విశ్లేషణాత్మకంగా చదివి మంచి ర్యాంకు సాధించాను. బీటెక్ తర్వాత ఉన్నత చదువులు చదవడమో, లేదంటే బోధన రంగంలో స్థిరపడటమో చేస్తాను.

పేదరికం శాపం కాదని గుర్తిస్తే చాలు:
పేదరికం శాపంకాదు. చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుతున్నా ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువులు మానేసి తమ కలలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. ప్రతిభ ఉంటే పేదరికాన్ని అధిగమించడం కష్టం కాదు. ఐఐటీ-జేఈఈలో కేవలం ధనవంతుల పిల్లలే రాణించగలరనుకుంటే పొరపాటే. సబ్జెక్టుపై పట్టు, లోతైన విశ్లేషణతో లెస్సన్స్‌ను అర్థం చేసుకోగల నేర్పు ఉంటే ఐఐటీలో మంచి ర్యాంకు సాధించడం సులువే. కోచింగ్ లేకున్నా కేవలం ప్రామాణిక పుస్తకాలు చదివితే కోరుకున్న ర్యాంకు సాధించడం కష్టంకాదు.

Published date : 21 Jun 2012 07:56PM

Photo Stories