Skip to main content

పోటీ పరీక్ష అనే భావనను వదిలేస్తే మంచి ర్యాంకు వస్తుంది..

                                          పీయూష్ ఆర్య జేఈఈ(మెయిన్) ఫస్ట్ ర్యాంకర్
స్కూల్లో, కాలేజీలో ఏ రోజు చెప్పిన పాఠాలను ఆ రోజే క్షుణ్నంగా చదువుకొనే లక్షణం, సొంతంగా నోట్స్ రాసుకొనే అలవాటు, ఫిజిక్స్, మ్యాథ్స్‌లపై ఇష్టం.. తనను జేఈఈ(మెయిన్)లో విజేతగా నిలిపాయి అంటున్నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం భిలాయ్ విద్యార్థి పీయూష్ ఆర్య. బలపం పట్టినప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన పీయూష్ ఆర్య జేఈఈ (మెయిన్)లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. సివిల్స్‌పై గురిపెట్టిన ఈ ప్రతిభా సంపన్నుడు ఐఐటీ-ముంబయిలో కంప్యూటర్ సైన్సులో చేరతానని చెబుతున్నాడు. తర్వాత అంతిమ లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు. తన సక్సెస్ సీక్రెట్‌ను ‘సాక్షి-భవిత’తో ఇలా పంచుకున్నాడు...

ఊహించని ఫస్ట్ ర్యాంకు:
చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేవాణ్ని. అయితే ఫస్ట్‌ర్యాంకు వస్తుందని ఊహించలేదు. టాప్ 50లో ఉంటాననుకున్న నాకు ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. దీంతో నా లక్ష్యాన్ని సాధించగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది.

మాది పల్లెటూరే:
మాది కూడా పల్లెటూరే. మా తాత వ్యవసాయం చేసేవారు. మా నాన్న ఉద్యోగరీత్యా భిలాయ్‌లో స్థిరపడ్డారు. నాన్న బి.ఆర్.ఆర్య ఎన్‌టీపీసీలో డిప్యూటీ మేనేజర్. అమ్మ పుష్పాదేవి గృహిణి. అన్నయ్య ముల్కిత్ ఆర్య ఐఐటీ-ముంబయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అమ్మానాన్నలిద్దరికీ చదువంటే ఇష్టం. అందుకే ఖాళీ సమయం దొరికితే ఏవో కొత్త విషయాలు చెప్పేవారు. అవి మాలో విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంచాయి. భిలాయ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివా. టెన్త్‌లో 100 శాతం, ఇంటర్‌లో 95.4 శాతం మార్కులు తెచ్చుకున్నా.

సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా:
స్కూల్ స్థాయి నుంచి నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ప్రపంచం ఫిజిక్స్ ఆధారంగానే నడుస్తుందనేది నా నమ్మకం. మ్యాథమెటిక్స్ కూడా ఇష్టమే. ఈ రెండు సబ్జెక్టుల గురించి ఎక్కువగా తెలుసుకొనేందుకు లైబ్రరీలో దొరికిన పుస్తకాలన్నీ చదివేవాణ్ని. కొత్త అంశం కనిపిస్తే రాసుకునేవాణ్ని. చాలామంది పరీక్షలప్పుడు కదా! రాయడం.. అని చేతిరాతను నిర్లక్ష్యం చేస్తారు. ఎంతబాగా చదివినా.. సాధన లేకపోతే పరీక్షలో మార్కులు తగ్గుతాయి. సబ్జెక్టుల విషయంలో కూడా సొంత ప్రిపరేషన్ ఉండేది. క్లాసులో టీచర్ పాఠాలు చెప్పాక.. టెక్ట్స్‌బుక్స్ చూసి సొంతంగా నోట్సు రాసేవాణ్ని.

ఏ రోజు పాఠాలు ఆ రోజే:
చదివింది ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కావడంతో తప్పనిసరిగా క్లాసులకు వెళ్లాల్సిందే. దీంతో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు జేఈఈ కోచింగ్‌కు వెళ్లేవాణ్ని. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను మూడు భాగాలుగా విభజించి ప్రతి క్లాసునూ గంటన్నర సేపు నిర్వహించేవారు. సీబీఎస్‌ఈ సిలబస్ కావడం.ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం వల్ల జేఈఈ, ఇంటర్ పరీక్షలకు ఒకేసారి చదవడం ఇబ్బంది అనిపించలేదు.

లైబ్రరీలో గడిపేవాణ్ని:
జాతీయస్థాయి పరీక్షల్లో చాలా పోటీ ఉంటుందనే సంగతి తెలుసు. దాన్ని ఎదుర్కొనేందుకు సబ్జెక్టుపై మరింత పట్టుకోసం లైబ్రరీకి వెళ్లేవాణ్ని. సైన్సుకు సంబంధించిన ఏ పోటీ పరీక్ష నిర్వహించినా పాల్గొనేవాణ్ని. గెలిచినా, ఓడినా అక్కడ కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్నది నా అభిప్రాయం.

ప్రోత్సాహమే కొండంత బలం:
ఇప్పటికే అన్నయ్య ఐఐటీలో చదువుతున్నాడు. నాలోనూ అదే ఆత్మవిశ్వాసం ఉండడంతో అమ్మానాన్న చాలా ప్రోత్సహించేవారు. గ్రాండ్‌టెస్టులో మార్కులు తగ్గితే కారణాలను గుర్తించి సరిచేసుకోమని సూచించేవారు. కాలేజీలో కూడా అదే ప్రోత్సాహం లభించేది. మొదట్నుంచీ నన్ను గమనిస్తుండడం వల్ల కొన్ని టెస్టుల్లో వెనుకబడినా నిరుత్సాహపరిచేవారు కాదు.

పొరపాట్లతో తగ్గిన మార్కులు:
జేఈఈ(మెయిన్)లో మ్యాథ్స్ 98, ఫిజిక్స్ 101, కెమిస్ట్రీ 80 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్ ఇష్టమైన సబ్జెక్టు కావడంతో ప్రశ్నలు ఎలా ఇచ్చినా సమాధానం ఇవ్వగలిగా. కొన్ని సమాధానాలు తెలిసినా మార్కింగ్ చేయడంలో పొరపాట్ల కారణంగా మార్కులు తగ్గాయి. ఐఐటీ-ముంబయిలో కంప్యూటర్ సైన్సులో చేరతా. బీటెక్ పూర్తవగానే సివిల్స్‌పై దృష్టి పెడతా.

భయాన్ని వదిలేస్తే ర్యాంకు మీదే:
పోటీ పరీక్ష అనే భావనను వదిలేస్తే మంచి ర్యాంకు వస్తుంది. లేకపోతే పరీక్ష హాలులో మనసులో ఉన్న భయం తెలిసిన ప్రశ్నలను మరచిపోయేలా చేస్తుంది. కాలేజీలో ఇచ్చే మెటీరియల్‌తోపాటు లైబ్రరీలో దొరికే పుస్తకాలను చదివి.. రీజనింగ్ ఎబిలిటీని పెంచుకోవాలి. మ్యాథ్స్ రోజూ సాధన చేయాలి. కాలేజీలో పెట్టే గ్రాండ్ టెస్టులను మిస్సవ్వొద్దు. గ్రాండ్ టెస్టులు ఎన్ని రాస్తే ర్యాంకుకు అంత దగ్గరైనట్లు. నేను మెటీరియల్‌తోపాటు మ్యాథ్స్ ఆర్.డి.శర్మ, ఫిజిక్స్ హెస్.సి.వర్మ పుస్తకాలు చదివాను.
Published date : 11 Jul 2013 12:56PM

Photo Stories