Skip to main content

ద్వారకాతిరుమల టు ఐఐటీ: పృథ్వితేజ్‌

  • 2011 ఐఐటీ- జేఈఈ లో మొదటి ర్యాంకు సాధించిన పృథ్వితేజ్‌
  • 4.85 లక్షల మంది రాసిన పరీక్షలో తెలుగు విద్యార్థి సత్తా
ఇంజనీరింగ్‌ విద్యకు దేశంలో పెట్టింది పేరు ఐఐటీలు. ఈ ప్రతిష్టాత్మక ఇన్ట్సిట్యూట్స్‌లో ప్రవేశం మాటలు కాదు. సీటు రావాలంటే ఎంతో శ్రమించాలి. అసలే జాతీయస్థాయి పోటీ..పరిమిత సీట్లు.. పైగా మెరికల్లాంటి విద్యార్థులంతా ఐఐటీల్లో సీటు కోసం తీవ్రస్థాయిలో పోటీపడతారు. అలాంటి అత్యున్నత పరీక్షల్లో జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలవడమంటే సాధారణ విషయం కాదు. కాని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఓ తెలుగు విద్యార్థి. ఆయనే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన ఇమ్మడి పృథ్వితేజ్‌. 2011 ఐఐటీ అడ్మిషన్‌ టెస్ట్‌లో 4.85 లక్షల మంది రాసిన పరీక్షలో జాతీయస్థాయిలో మొదటిర్యాంకు సాధించి తెలుగువారి సత్తాచాటాడు. ఫృథ్వితేజ్‌ సక్సెస్‌ స్టోరీ ఐఐటీ యాస్పెరెంట్స్‌ కోసం..

ఐఐటీ జేఈఈలో ఫస్ట్‌ర్యాంకు అంటే మాటలుకాదు. కాని ఎలా సాధించగలిగారు?
ఇంటర్‌లోకి అడుగుపెడుతూనే భవిష్యత్తులో నేనేం కావాలో ఆలోచించుకున్నాను. ఇంజనీరింగ్‌ కెరీర్‌ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుందని భావించా. అందుకనే ఫస్ట్‌ ఇయర్‌ నుంచే ఐఐటీలో సీటు సాధించాలని పట్టుదలగా నిర్ణయించుకున్నాను. ఇంట్లో అమ్మానాన్న నా నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. లక్ష్యం సాధించడానికి అవసరమైనవిధంగా వెన్నంటి నిలిచారు. దాంతో ఇంటర్‌ చదువుతూనే ఓ ప్రైవేటు విద్యాసంస్థలో రెండేళ్లపాటు ఐఐటీ కోచింగ్‌ తీసుకున్నాను. ముఖ్యంగా ఐఐటీ అడ్మిషన్లకు పోటీ తీవ్రంగా ఉంటుంది. సాదాసీదాగా ప్రిపేరైతే విజయం సాధించడం కష్టం. దాంతో ౧౪ నెలలపాటు శ్రమించి సిలబస్‌ మొత్తం చదివాను. లాజికల్‌గా ప్రతి సబ్జెక్టును ట్రీట్‌ చేస్తూ సబ్జెక్టుపై పట్టుసాధించాను. అంతేకాదు ఐఐటీ ఎంట్రన్స్‌కు ఆరు నెలల సమయం ఉండగానే రివిజన్‌ మొదలుపెట్టాను. ఈవిధంగా ప్రణాళిక ప్రకారం చదవడంతో అనుకున్న లక్ష్యం సాధించగలిగాను.

ఐఐటీలో జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలుస్తారని ఊహించారా?
లేదు. ఏదో ఒక ఐఐటీలో సీటు లభిస్తే చాలనుకున్నా. కాని కష్టపడి ప్రణాళికబద్ధంగా చదవడంతో అనుకున్నదానికన్నా మంచి మార్కులు వచ్చాయి. దాంతో జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు సాధ్యమైంది. అసలు ఫలితాలు వచ్చాక దేశంలో మొదటిర్యాంకు వచ్చిందన్న సంతోషం చాలాకాలం పాటు నాలో ఉత్తేజాన్ని నింపింది. జాతీయస్థాయిలో.. అదీ ఐఐటీ ప్రవేశపరీక్షల్లో మొదటిర్యాంకు నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి.

ఐఐటీ-జేఈఈ అడ్మిషన్‌ టెస్ట్‌లో మొత్తం ఎన్ని మార్కులొచ్చాయి?
మ్యాథ్స్‌లో 160 మార్కులకు 154, ఫిజిక్స్‌లో 148, కెమిస్ట్రీలో 138 చొప్పున మార్కులు లభించాయి. మొత్తం 480 మార్కులకుగాను 440 మార్కులు సాధించాను. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో జాగ్రత్తగా చదివితే ఎక్కువస్కోరింగ్‌ సాధ్యమవుతుందని భావించి అందుకు అనుగుణంగా వీటిపై ఎక్కువ శ్రద్ధపెట్టడంతో స్కోరింగ్‌ ఎక్కువ లభించింది.

ప్లస్‌టూ తర్వాత కెరీర్లో ఎన్నో మార్గాలున్నా...ఐఐటీనే ఎందుకు ఎంచుకున్నారు?
ఇంజనీరింగ్‌ అంటే.. మొదటినుంచీ ఆసక్తి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే ఐఐటీకి ప్రిపేరయ్యా. నేషనల్‌ ఫస్ట్‌ర్యాంకు రావడంతో ఐఐటీ, ముంబైలో సీటు వచ్చింది. అక్కడ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లో ప్రస్తుతం ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నా.

మీ విద్యా, కుటుంబ నేపథ్యం వివరిస్తారా?
మాది పశ్చిమగోదావరి జిల్లా. సెవెన్త్‌ నుంచి టెన్త్‌ వరకు కృష్ణాజిల్లా గుడివాడలో చదువుకున్నా. ఇంటర్‌ విజయవాడలోని ఓ పైవేటు ఇన్‌స్టిట్యూషన్‌లో పూర్తిచేశాను. నాన్న జ్యుయలరీ వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పటినుంచి నేను చదువులో ముందుండడానికి మా నాన్న ఎంతో కృషిచేశారు. అడుగడుగునా ప్రోత్సహించారు. నా జీవిత లక్ష్యానికి సరిపడే సరైనదారిని ఎంచుకునేలా మంచి సలహాలు ఇచ్చారు. నాన్న వల్లనే ఈ సక్సెస్‌ సాధ్యమైంది.

మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది? టైం మేనేజ్‌మెంట్‌ కోసం ఏం చేశారు?
ఐఐటీ-జేఈఈ ప్రిపరేషన్‌ ఎంత బాగా చేసినా.. రివిజన్‌ సరిగా చేయకపోతే కష్టమే. అదేవిధంగా ఎగ్జామ్‌హాల్లో టైంమేనేజ్‌మెంట్‌ సరిగ్గా చేయలేకపోతే చదివిందంతా వృథా అవుతుంది. దాంతో సమయం సరిపోక చదివినవాటికి సైతం సమాధానాలు ఇవ్వలేం. అందుకే ప్రిపరేషన్‌ దగ్గర నుంచి పరీక్షరాసే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షహాల్లో ముందు సులువైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కష్టమైనవాటికి చివర్లో సమాధానాలు గుర్తించవచ్చు. కనీస స్కోరింగ్‌కు గ్యారంటీ ఉంటుంది. బాగా చదువుకుని వెళ్లిన తర్వాత ఎగ్జామ్‌ పేపర్‌ టఫ్‌గా ఉందని భయపడకూడదు. అలాచేస్తే మిగిలిన సబ్జెక్టును ఆ క్షణానికి మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే పరీక్షసమయంలో సింపుల్‌ క్వశ్చన్స్‌కు ఆన్సర్స్‌చేశాను. ఆ తర్వాత మిగిలినవాటికి సమాధానాలు గుర్తించడంతో సమయం ఎక్కడా వృథాకాలేదు.

ఐఐటీ ప్రిపరేషన్‌కు ఏఏ పుస్తకాలు చదివారు?
ప్రిపరేషన్‌లో సరైన బుక్స్‌ ఎంచుకోవడం విజయానికి తొలిమెట్టు. దీన్ని గమనించి పుస్తకాల ఎంపికలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఫిజిక్స్‌కోసం హెచ్‌.సి.వర్మ ఎర్‌డోవ్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుకు సీబీఎస్‌ఈ టెక్స్‌బుక్స్‌, మ్యాథ్స్‌కు తెలుగుఅకాడమీ పుస్తకాలతోపాటు కాలేజ్‌ ఇచ్చిన మెటీరియల్‌ బాగా యూజైంది.

ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్‌ ఎడ్యుకేషన్‌ ఎలా ఉంది?
ఐఐటీ అడ్మిషన్‌ టెస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకు వచ్చిన సంతోషం ఒకెతె్తైతే.. ఐఐటీ, ముంబైలో చదవడం ఇంకో అద్భుతం. ఇక్కడ ఎడ్యుకేషన్‌ సిస్టం రీసెర్చ్‌ ఓరియంటెడ్‌. అప్పటివరకు కేవలం పుస్తకాలు చదివే నేను.. ఐఐటీ ముంబైలో అడుగుపెట్టగానే వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టుంది. ఇక్కడ స్టడీస్‌ జీవితంలో కొత్త లక్ష్యాలు నిర్ణయించుకునేలా చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఐఐటీ ముంబైలో చేరగానే నా ఆశయాలకు అనుగుణంగా నన్ను నేను మల్చుకున్నాను. కెరీర్‌పరంగా డెవలప్‌ కావడానికి ఐఐటీల్లో మంచి స్కొప్‌ ఉంటుంది. అంతేకాదు.. ఇక్కడ ప్రొఫెసర్లపై ఆధారపడి నేర్చుకునేదానికన్నా.. సొంతంగా నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. మనకు ప్రయోగాలు చేయడంలో ఆసక్తి ఉంటే ఫస్ట్‌ఇయర్‌ నుంచే వాటిలో పాల్గొనే స్వేచ్చ, అవకాశం పుష్కలం.

జీవిత లక్ష్యం?
ఐఐటీలో చదువుపూర్తయ్యాక సివిల్స్‌ రాయాలనుకుంటున్నా. ఈ రంగంలో నేరుగా ప్రజలకు సేవ చేయవచ్చు. కష్టపడి ఫస్ట్‌ర్యాంకర్‌గా నిలిచిన నేను.. ఇంజనీరింగ్‌లో కెరీర్‌ కొనసాగించకుండా సివిల్స్‌వైపు ఎందుకు మళ్లారని మీరు అడగవచ్చు. కాని ఇంజనీరింగ్‌ చేసి సివిల్స్‌లోకి వెళ్లి సక్సెస్‌ అయినవారు చాలామందే ఉన్నారు. ఒకరకంగా వారుకూడా నాకు స్ఫూర్తి.

ఐఐటీ ప్రవేశపరీక్షల్లో సక్సెస్‌ కావాలంటే కోచింగ్‌ తప్పనిసరా?
ఐఐటీ అడ్మిషన్‌ టెస్ట్‌లో క్వాలిఫై కావాలంటే.. ప్రత్యేకంగా కోచింగ్‌ అవసరం లేదు. సొంతంగానే చదువుకోవచ్చు. మంచి ర్యాంకు రావాలన్నా.. .తీవ్రంగా ఉండే పోటీలో నెగ్గుకురావాలనుకున్నా కచ్చితంగా కోచింగ్‌ ఉంటేనే అనుకున్నది సాధ్యమవుతుంది.

ఐఐటీ-జేఈఈ టెస్ట్‌కు ప్రిపరేయ్యే విద్యార్థులకు మీ సలహా?
ఐఐటీలో మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే.. జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా చదవాలి. సబ్జెక్టులను కాన్సెప్ట్యువల్‌గా చదవాలి. ఎట్టిపరిస్థితుల్లోను బట్టీపట్టకూడదు. అలాచేస్తే పరీక్ష టైంలో ప్రశ్న మార్చి అడిగితే సమాధానం తెలిసినాసరే.. ప్రశ్నఅర్థం చేసుకోలేక తికమకకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంతముందుగానే ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. పరీక్ష దగ్గరపడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఒత్తిడికి, ఆందోళనకు గురికాకూడదు.
Published date : 01 Mar 2012 12:37PM

Photo Stories