Skip to main content

ఐఐటీ బాంబేలో చేరతా -ఐఐటీ జేఈఈ 2012 4వ ర్యాంకర్ నిశాంత్

* బట్టీపడితే ర్యాంకులు రావు
* మ్యాథ్స్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించా
ప్రఖ్యాత ఐఐటీలో బీటెక్ చేసి గొప్ప ఇంజనీర్ కావాలని చిన్నప్పటి నుంచీ లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకే పదోతరగతి నుంచే ఈ పరీక్ష విధానంపై అవగాహన పెంచుకున్నా. ఫలితాల్లో టాప్ ట్వంటీలో ఒకడిగా నిలుస్తాననుకున్నా. కానీ జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయాలనుకుంటున్నాను. మా సోదరి కూడా అక్కడే చదువుతున్నారు. పరీక్షకు ముందు నుంచే సబ్జెక్టుపై పట్టుసాధించాను. మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్టు కావడంతో బాగా పట్టుపెంచుకున్నా. రోజుకు 10 గంటలకుపైగా చదివేవాడిని. సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని సాధ్యమైనన్ని మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే.. ఐఐటీ-జేఈఈ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించడం పెద్ద కష్టంకాదంటున్నారు మే 18న విడుదలైన ఐఐటీ ఫలితాల్లో ఆలిండియా 4వ ర్యాంకు సాధించిన ఆర్.నిశాంత్.. ఆయనతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ..

4వ ర్యాంకు ఊహించారా?
పరీక్షకు ముందు ప్రిపరేషన్ బాగా చేశాను. పైగా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇష్టమైన సబ్జెక్టులు కావడంతో మంచి స్కోర్ చేస్తాననుకున్నా. పరీక్ష రాసిన తర్వాత టాప్ 20లో ఏదొక ర్యాంకు వస్తుందనుకున్నా. కాని ఆలిండియా 4వ ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉంది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం ఇది. ఈ ర్యాంకు ద్వారా ప్రఖ్యాత ఐఐటీలో చదవాలనే నా కల సాకారమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

మీ విద్యా, కుటుంబ నేపథ్యం?
మాది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి. నాన్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్. అమ్మ హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగి. సోదరి ఐఐటీ బాంబేలో నానో టెక్నాలజీలో డ్యూయల్ డిగ్రీ చదువుతున్నారు. 1 నుంచి 6 వరకు వరంగల్‌లో చదివాను. ఆ తర్వాత 6 నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలోనే చదువుతున్నా. పదోతరగతిలో మొత్తం 557 మార్కులు వచ్చాయి. ఇంటర్‌లో 934 మార్కులు సాధించాను.

ఇంటర్ చదువుతూనే.. ఐఐటీలో మంచి ర్యాంకు కోసం ప్రిపరేషన్ ఎలా చేశారు?
ఇంట్లో తల్లిదండ్రులు నన్ను ఐఐటీలో చేర్పించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. చివరకు నాకు కూడా మ్యాథ్స్ అంటే ఇష్టం కావడంతో పదోతరగతి నుంచే ఐఐటీపై అవగాహన పెంచుకోవడం ప్రారంభించాను. అందుకే పదోతరగతి నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై పట్టుసాధించే దిశగా నిత్యం ప్రాక్టీస్ చేసేవాడిని. ఇంటర్లో చేరాక సబ్జెక్టులతోపాటు ఐఐటీ-జేఈఈకి కలిపి రోజకు 8గంటల చొప్పున చదివేవాడిని. సెకండ్ ఇయర్ కీలకం కాబట్టి రోజుకు 10గంటలకుపైగానే చదవడం మొదలుపెట్టాను. ప్రిపరేషన్‌లో ఎక్కడా వెనుకబడిపోకుండా ఉండేందుకు ముందు ఫస్ట్‌ఇయర్‌లో పూర్తిగా మ్యాథ్స్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించా. దీనివలన మ్యాథ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం రాయగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బేసిక్‌ బుక్స్‌పై ఎక్కువ ఆధారపడ్డా. కెమిస్ట్రీ సబ్జెక్టు అంతా ఫార్ములాలు ఉండడంతో కొంచెం కష్టంగా అనిపించినా.. ఈ సబ్జెక్టులో ప్రీవియస్ పేపర్లు, ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేశాను.

మొత్తం మార్కులెన్నొచ్చాయి? పరీక్ష విధానం ఎలా ఉంది?
నా హాల్‌టిక్కెట్ నెంబరు 6034338. మొత్తం 373 మార్కులు సాధించాను. మ్యాథ్స్‌లో 132, ఫిజిక్స్‌లో 120, కెమిస్ట్రీలో 121 చొప్పున వచ్చాయి. మొదటి నుంచీ మ్యాథ్స్‌పై పట్టు ఉండడంతో పరీక్ష సమయంలో పెద్దగా ఇబ్బంది ఎదరుకాలేదు. అదేవిధంగా ఫిజిక్స్‌లో టెక్ట్స్‌బుక్స్ ఎక్కువ స్కోరింగ్‌కు ఉపయోగపడ్డాయి. కెమిస్ట్రీ విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సబ్జెక్టు మామూలుగానే కొంచెం కష్టం. అందుకే ప్రిపరేషన్ సమయంలో ఎక్కువ సమయం దీనిపైనే కేంద్రీకరించా. అయినాసరే పరీక్ష హాల్లోకి వెళ్లగానే ఊహించిన ప్రశ్నలు పెద్దగా ఎదురుకాలేదు. దీంతో కొంచెం ఇబ్బందిపడ్డా. అంతకుముందు టెస్ట్‌పేపర్లు చదవడం కొంచెం ఉపయోగపడింది.

భవిష్యత్తు లక్ష్యం?
ఐఐటీ బాంబేలో చదవాలనుకున్నా. ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏ బ్రాంచ్‌లో చేరాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మ్యాథ్స్‌కు సంబంధించిన కోర్సులో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.

ఐఐటీ-జేఈఈతో పాటు ఇతర పరీక్షలేమైనా రాశారా?
విట్ ప్రవేశపరీక్ష రాశాను. 55వ ర్యాంకు వచ్చింది. అదేవిధంగా ఏఐఈఈఈ, ఎంసెట్‌కూడా రాశాను. ఫలితాలు రావలసి ఉంది.

కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడింది?
ఇంటర్‌తోపాటు ఐఐటీ ప్రిపరేషన్ పెద్ద కాదు. కాలేజీలో చేరాక అధ్యాపకులు మమ్మల్ని అనుక్షణం గైడ్ చేసేవారు. ఇంటర్‌కన్నా ఐఐటీ లక్ష్యం ముఖ్యమని సూచించేవారు. దాంతో ఇంటర్‌కన్నా ఐఐటీనే పెద్ద లక్ష్యంగా భావించి ప్రిపరేషన్ సాగించేవాడిని. కాలేజీలో బోధనతోపాటు కోచింగ్ చాలా ఉపయోగపడింది. ఐఐటీకున్న పోటీ మొదలు, పరీక్ష విధానం, ప్రశ్నలు అడిగే లోతు వరకు అడుగడుగునా మా కాలేజ్ లెక్చరర్లు సహకరించేవారు. సబ్జెక్టులో ఏవైనా సందేహాలుంటే తక్షణమే అడిగేలా ప్రోత్సహించేవారు. దీనివల్ల క్లాస్‌రూం పాఠాల్లో సందేహాలుంటే.. వెంటనే నివృత్తి చేసుకోవడం ద్వారా పాఠాలపై బాగా అవగాహన పెరిగి పట్టుసాధించడానికి ఉపయోగపడింది.

ఐఐటీ ప్రిపరేషన్‌కు ఎలాంటి పుస్తకాలు చదివారు?
కెమిస్ట్రీకి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి. వీటిని చదవడం వలన మంచి స్కోరింగ్ సాధించగలిగాను. మ్యాథ్స్‌కి లెక్చర్ నోట్స్ ఫాలో అయ్యాను. ఫిజిక్స్‌కు హెచ్‌పీ వర్మ పుస్తకాలు చదివాను.

భవిష్యత్తులో ఐఐటీ రాయాలనుకునే విద్యార్థులకు సలహా?
కేవలం బట్టీపడితే మంచి ర్యాంకు వస్తుందనుకోవడం సరికాదు. సబ్జెక్టును అర్థం చేసుకుని కాన్సెప్ట్యువల్‌గా చదవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ప్రశ్నలు ఎలా అడిగినా సమాధానాలు గుర్తించగలం. ముందు నుంచే ఫస్ట్‌ర్యాంకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని చదివితే ఒత్తిడిని ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ర్యాంకు సాధన అనికాకుండా అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ చేస్తే ఆశించిన ర్యాంకు దక్కించుకోవడం పెద్ద సమస్య కాదు. ఐఐటీ రాయాలనునుకునే విద్యార్థులకు మ్యాథ్స్‌పై ఆసక్తి అవసరం. ఏదో ఇంట్లో బలవంతంపెట్టారని ఐఐటీకి ప్రిపేరైతే మంచి ర్యాంకు సాధించడం సాధ్యంకాదు. ఇష్టపడి చదివితే ర్యాంకులు వాటంతటవే వస్తాయి.
Published date : 18 May 2012 08:29PM

Photo Stories