NEET PG Medical Seats Issue 2023 : నీట్‌తో ఫలితం సున్నా.. కటాఫ్ మార్క్ సున్న.. ఇంకెందుకు నీట్..?
దీంతో నీట్‌ను రద్దు చేయాలన్న నినాదం తమిళనాట మళ్లీ తెరమీదకు వచ్చింది. పీజీ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్క్ సున్న అని జాతీయ వైద్య విద్యా కమిటీ ప్రకటించడాన్ని తమిళ పార్టీలు అస్త్రంగా చేసుకున్నాయి. నీట్‌ను రద్దు చేయాలని నేతలు పట్టుబట్టారు.
ఆది నుంచి నీట్‌కు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా పీజీ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కుల వ్యవహారంలో కేంద్ర వైద్య విద్యా కమిటీ చేసిన ప్రకటనను అస్త్రంగా చేసుకున్నారు. కటాఫ్ మార్కు సున్నాకు తగ్గించినట్టు, సున్న మార్కులు సాధించినా పీజీలో చేరవచ్చు అని తాజాగా వెలువడ్డ ప్రకటనను తమిళ పార్టీలు తీవ్రంగా పరిగణించాయి. నీట్ ఓ మోసపూరిత పరీక్ష అని, దీనిని రద్దు చేయాలని పట్టుబడుతూ నినాదాన్ని అందుకున్నారు.
ఈ వ్యవహారంపై సీఎం స్టాలిన్ స్పందిస్తూ.. నీట్ ఫలితం సున్న అన్నది ఇప్పటికైనా కేంద్రం గ్రహించినట్లుంద విమర్శించారు. కేవలం శిక్షణ కేంద్రాల కోసమే కేంద్రం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరీక్ష కారణంగా ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేస్తూ, ఇకనైనా ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ పేర్కొంటూ, నీట్ వ్యవహారంలో కేంద్రం అతి పెద్ద కుట్ర చేస్తున్నట్టు తాజాప్రకటన స్పష్టం చేసిందని ధ్వజమెత్తారు. పీఎంకే నేత అన్బుమణి రాందాసు స్పందిస్తూ, నీట్ కటాఫ్ మార్కు సున్నగా నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కోట్లు ఉన్న వారికే అర్హత అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ.. ఇది మోస పూరిత పరీక్ష అని, ఇకనైనా అందరూ కలిసి కట్టుగా ఈ పరీక్షను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కేంద్రం తాజాగా..
తాజాగా నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్‌కు సీట్ల ఎంపికలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రౌండ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను సున్నాగా పేర్కొంది. అన్ని కేటగిరీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో కొన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని వైద్య విద్య నిపుణులు తెలిపారు. పారాక్లినికల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్త్రీ సహా పలు పీజీ కోర్సుల సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. ఈ ఏడాది మొదటి రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత మూడో రౌండ్‌కు సీట్లు భారీగా మిగిలాయని తెలిపారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్‌కు 13 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎంసీసీ తెలిపింది.
ఈ కారణంగానే..
కటాఫ్ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. ఇప్పటికే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మాత్రం మార్చుకోవచ్చని సూచించింది. అర్హత పర్సంటైల్‌ను తగ్గించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామంది.
అర్హత పరీక్షల మార్కులను సున్నాకు..
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులను 291గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257, దివ్యాంగులకు 274గా పేర్కొని మొదటి రెండు రౌండ్‌లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. తాజాగా అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు (నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పొందినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.