TS New Medical Colleges MBBS Seats 2023 : ఈ మెడికల్ కాలేజీల్లో 85 శాతం సీట్లు వీరికే.. ఎందుకంటే..?
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా (15 శాతం) పోను మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు (85 శాతం) స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 72ను హైకోర్టు సమర్థించింది.
కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే చెందుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు జీవో 72ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఎలాంటి మెరిట్ లేదంటూ కొట్టివేసింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి.
85 శాతం స్థానిక విద్యార్థులకే..
ఈ మేరకు జూలై 3న జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు, 15 శాతం అన్‌రిజర్వుడుగా ఉండేవి. అన్‌రిజర్వుడులో తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్‌రిజర్వుడు అనేది ఉండదు. దీన్ని ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతోపాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.
ఆ సమయం ముగిసే వరకు..
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గతంలో విచారణ చేపట్టింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను పదేళ్లపాటు కొనసాగించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయం ముగిసే వరకు ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 15 శాతం కోటాను తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని చెప్పారు.
2,850 సీట్లలో..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. పునర్విభజన తర్వాత వచ్చిన 34 కాలేజీల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్ లేదు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కాదు’ అని వివరించారు.
ఈ కోటా మెడికల్ సీట్లపై..
తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్–2017లోని రూల్ 4(3)(ఏ)లో మార్పులు చేస్తూ జూలై 4న ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 75 సమర్థనీయమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కౌన్సెలింగ్‌లో గతంలో నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ)కు 1 శాతం రిజర్వేషన్ ఉండేది. ఈ జీవో కారణంగా ఎన్‌సీసీ (ఏ) ఉన్న వారికి రావాల్సిన 1 శాతం కోటా పోతోందని హైదరాబాద్‌కు చెందిన లోకాస్వీ సహా మరికొందరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పిటిషన్లను కొట్టివేసింది.
ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే..
వైద్య విద్యలో మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును శుభపరిణామంగా పేర్కొంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు వాటి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైందన్నారు. హైకోర్టు తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయన్నారు.
Tags
- MBBS seats
- Telangana New Medical Colleges MBBS Seats 2023
- telangana high court orders on new mbbs college seats
- new medical colleges in telangana 2023
- new private medical colleges in telangana 2023
- TS MBBS Seats
- TS MBBS Seat Allotment
- new medical colleges in telangana 2023-24
- category wise medical seats in telangana
- total medical seats in telangana 2023
- telangana local mbbs seats reservation
- telangana local mbbs seats reservation news