Skip to main content

MBBS Convenor Seats: ఇన్ని లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ సీటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధిక ర్యాంకులు వచ్చిన వారికి కూడా ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కుతున్నాయి.
MBBS Convenor seat with 3 lakh rank  MBBS convener quota seats announcement at Kaloji Narayana Rao Health University   Kaloji Narayana Rao University second round of MBBS counseling results

కన్వీనర్‌ కోటా రెండోవిడత కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన వారి వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించింది. ఈసారి బీసీ ఏ కేటగిరీలో గరిష్టంగా 3.35 లక్షల నీట్‌ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో కన్వీనర్‌ కోటా సీటు లభించింది. ఇంత పెద్ద ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని కాళోజీ వర్గాలు వెల్లడించాయి.

ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి మరో ప్రైవేట్‌ కాలేజీలోని కన్వీనర్‌ కోటా సీటు లభించింది. ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది. బీసీ బీలో 2.27 లక్షలు, బీసీ సీలో 3.14 లక్షలు, బీసీ డీలో 2.13 లక్షలు, బీసీ ఈలో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి సీట్లు లభించాయి. ఇక ఓపెన్‌ కేటగిరీలో 1.94 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది.

చదవండి: Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి

ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో గరిష్టంగా 1.74 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రావడం గమనార్హం. మొదటి విడత కౌన్సెలింగ్‌తో పోలిస్తే, రెండో విడత కౌన్సెలింగ్‌లో అధిక ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సీట్లు లభించడం విశేషం. మొదటి విడతలో సీట్లు పొందిన అనేక మంది విద్యార్థులు జాతీయస్థాయిలోనూ ఎయిమ్స్‌ వంటి మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించడంతో వాటిల్లో చేరి ఉండొచ్చని అంచనా. దీంతో చాలా వరకు గరిష్ట ర్యాంకులకు రెండో విడతలో సీట్లు లభించాయి.  

సీట్ల భర్తీ ఇలా.... 

రాష్ట్రంలో 60 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో  5,653 కన్వీనర్‌ సీట్లు ఉండగా, మొదటి విడతలో 4,282 మందికి కన్వీనర్‌ కోటా సీట్లు కేటాయించారు. అందులో చేరగా మిగిలిన సీట్లకు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో కేటాయించని దివ్యాంగులు తదితర సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో కేటాయించారు. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తుండటం, ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలు అదనంగా రావడం... వాటిల్లో 400 ఎంబీబీఎస్‌ సీట్లు పెరగడంతో విద్యార్థులకు అవకాశాలు మరింత పెరిగాయి. దీంతో అధిక ర్యాంకు సాధించిన విద్యార్థులూ ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రభుత్వకాలేజీల్లోని అన్ని సీట్లు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లల్లో 15 శాతం అఖిల భారత కోటా కింద భర్తీ చేస్తారు. వాటిల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. రెండో విడత జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరు రోజులపాటు చేరేందుకు అవకాశం కల్పించారు.

మొదటి విడతలో సీట్లు పొందినవారు కూడా తాము చేరిన కాలేజీ కంటే మరో మంచి కాలేజీలో సీట్ల కోసం ప్రయత్నించారు. దీంతో రెండో విడతలోనూ చాలామంది ఇతర కాలేజీల్లో సీట్లు పొందారు. దీంతో వారు మొదటి విడత సీటు పొందిన కాలేజీలో చేరినందున అక్కడ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి సమయం అవసరమైనందున రెండో విడత ఎక్కువ రోజులు చేరేందుకు అవకాశం కల్పించినట్టు కాళోజీ వర్గాలు తెలిపాయి. అనంతరం సీట్లు మిగిలితే మూడు, నాలుగో విడత కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తారు.   

Published date : 08 Oct 2024 11:56AM

Photo Stories