Skip to main content

NEET UG Exam 2024 Mass Copying Issue : నీట్ 2024..ఒకే ప‌రీక్ష‌ సెంటర్‌లో 6 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌..ఎలా..? ఎన్‌టీఏ ఇచ్చిన క్లారిటీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌రీక్ష‌ల్లో నీట్ టాప్ ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా ఈ ప‌రీక్ష‌కు ల‌క్ష‌ల మంది పోటీప‌డుతుంటారు. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా మే 5న జరిగిన నీట్‌ ఎంట్రన్స్‌లో పలుచోట్ల గోల్‌మాల్‌ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
NEET UG Exam 2024 Mass Copying Issue

పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌ జరిగినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనేక కార్పొరేట్‌ కాలేజీలు కూడా కాపీయింగ్‌ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున కాపీయింగ్‌ జరిగిందని పేర్కొంటున్నాయి. కొన్ని కాలేజీల్లో ఒకే విధమైన టాప్‌ మార్కులు పలువురికి రావడంపట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నీట్ యూజీ 2024 ప‌రీక్ష జ‌రిగిన‌ అవకతవకలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ మేరకు ఈమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

Priyanka Gandhi demand NEET UG re exam news

దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. తొలుత నీట్‌ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె... ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మరోవైపు నీట్‌ ఫలితాల వెల్లడి తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


నీట్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలపై అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థుల గోడును ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది. నీట్‌ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పదేపదే మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. దర్యాప్తు చేపట్టి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందా.. లేదా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

ఎన్‌టీఏ ఇచ్చిన క్లారిటీ ఇదే..

NTA

మరోవైపు నీట్‌ పరీక్ష పేపర్‌ లీకైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. అలాగే దీనిపై విద్యార్థులు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. దీనిపై వ‌చ్చిన‌ ప్రచారం తప్పుడు ప్ర‌చారం అని ఎన్‌టీఏ కొట్టి పారేసింది. మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ సమయానికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలైపోయిందని.. అందువల్ల ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని క్లారిటీ ఇచ్చింది.

ఇక్కడే మొదలైన అనుమానాలు..
ప్రతిసారీ తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులు వచ్చేవి. కానీ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈసారి టాప్‌ ర్యాంకులు పెద్దగా రాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా నీట్‌లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉండగా ఈసారి 67 మంది ఉన్నారు. ఇంత మందికి నూరు శాతం మార్కులు రావడంపట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్‌లో ఒకే రూమ్‌లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మందికి 720 మార్కులు రావడంపై విమర్శలు వస్తున్నాయి. ఇదేమీ  యాదృచ్ఛికం కాదని అంటున్నారు. ఏదో గోల్‌మాల్‌ జరిగిందని అంటున్నారు.  

ఇలా మార్కులు ఎలా వ‌చ్చాయ్‌.. ?
గతేడాది దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షకు 20.38 లక్షల మంది హాజరవగా ఈసారి 23.33 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది 11.45 లక్షల మంది అర్హత సాధించగా ఈసారి 13.16 లక్షల మంది అర్హత సాధించడం విశేషం. తెలంగాణ నుంచి గతేడాది 72,842 మంది నీట్‌ రాయగా 42,654 మంది అర్హత సాధించారు. ఈసారి 77,849 మంది పరీక్ష రాస్తే 47,371 మంది అర్హత సాధించారు. తెలంగాణలో ఈసారి ఎవరికీ 720కి 720 మార్కులు రాలేదు. ఇక కొందరికి 720 మార్కులకుగాను 717, 718, 719 వంటి మార్కులు వచ్చాయి. కానీ ఈ పద్ధతిలో రావడం సాధ్యం కానేకాదు.

➤ NEET UG-2024 Rank Wise College Details : NEET UG-2024లో ఏ ర్యాంక్.. ఏ కాలేజీలో సీటు వ‌స్తుందంటే..?

ఉదాహరణకు ఒక విద్యార్థి 720 మార్కులకు పరీక్ష రాస్తే అందులో ఒక ప్రశ్న తప్పయితే ఐదు మైనస్‌ మార్కులు పడతాయి. అంటే ఆ విద్యార్థికి 715 మార్కులే వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న రాయకుంటే 4 మార్కులు తగ్గి 716 మార్కులు వస్తాయి. కానీ 717, 718, 719 మార్కులు ఎలా వస్తాయని పలు కార్పొరేట్‌ కాలేజీల అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మార్కులు వచ్చినట్లు తాము గుర్తించలేదని.. ఉత్తరాది రాష్ట్రాల్లో వెలుగు చూశాయంటున్నారు. కొన్ని పత్రికల ప్రకటనల్లోనూ వాటిని చూసినట్లు చెబుతున్నారు. 

720కి 717, 718, 719... ఇలా సాధ్యంకాని మార్కులు ఏ పరిస్థితుల్లోనూ రాకూడదని అంటున్న నేపథ్యంలో ఎన్‌టీఏ గ్రేస్‌ మార్కులు కలిపిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు గ్రేస్‌ మార్కులు కలిపారని అంటున్నారు. కానీ ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. కాబట్టి ఇది ఏ మేరకు వాస్తవమనేది తెలియదు. ఇలా కలిపితే తెలుగు రాష్ట్రాల నీట్‌ విద్యార్థులకు కూడా కలపాలి కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులందరినీ చెక్‌ చేశామని, ఎక్కడా తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్‌ మార్కులు కలవలేదంటున్నారు. కాపీయింగ్, గ్రేస్‌ మార్కుల ప్రచారంపై కొందరు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

Published date : 07 Jun 2024 08:53PM

Photo Stories