NEET Exam Controversy: మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాలంటూ డిమాండ్!
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (National Eligibility-cum-Entrance Test)పరీక్ష మేఘాలయాలో వివాదాన్ని రేకెత్తిస్తుంది. పరీక్ష నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని, దీంతో పారదర్శకంగా మరోసారి పరీక్షను నిర్వహించాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 5న నీట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పరీక్షను నిర్వహించారు. మేఘాలయా,జోవాయిలోని సెయింట్ మేరీ మజారెల్లో గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రం విషయంలో గందరగోళం నెలకొంది.
మరోసారి నీట్ నిర్వహించాలంటూ డిమాండ్
ఆ పరీక్ష కేంద్రంలో దాదాపు 400 మంది విద్యార్థులు నీట్‌కు హాజరయ్యారు. అయితే స్టూడెంట్స్ అందరికి ఒకే ప్రశ్న పత్రం కాకుండా MNO, QRST అని లేబుల్ ఉన్న రెండు సెట్ల ప్రశ్న పత్రాలను ఇచ్చారు. దీంతో ఇన్విజిలేటర్లు, విద్యార్థుల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడి చాలా సమయం వృథా అయ్యిందని, ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాలంటూ స్టూడెంట్ యూనియన్ ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో ఈ విషయం గురించి చర్చిస్తామని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా హామీ ఇచ్చారు.