NEET 2022: మధ్యస్తం నుంచి కఠినం
దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 95 శాతం మంది పరీక్ష రాసినట్లు National Testing Agency (NTA) వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వర్షాలు, వరదల కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈసారి NEET ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉందని నిపుణులు అంచనా వేశారు. గత రెండేళ్లలో కరోనా కారణంగా సులువుగా పేపర్ ఉండేది. ఆ రెండేళ్లతో పోలిస్తే కాస్తంత కఠినంగా ఉందని చాలా మంది విద్యార్థులు పేర్కొన్నారు. ముఖ్యంగా బోటనీ, జువాలజీల్లో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టిందని, దీంతో సమయం ఇక్కడే ఎక్కువ వృథా అయిందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. 20 నిమిషాల అదనపు సమయం కూడా సరిపోలేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. కెమిస్ట్రీలో 4–5 ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి సమాధానాలు రాసేవిగా ఉన్నాయని, ఫిజిక్స్‌లో ప్రశ్నలు సులువుగా, పేపర్ స్కోరింగ్‌గా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
గతేడాది ఎక్కువ మంది విద్యార్థులు 700కుపైగా మార్కులు సాధించగా ఈసారి ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు వివరించారు. వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం ప్రశ్నపత్రంలో కొత్తగా మ్యాచింగ్ ప్రశ్నలు, స్టేట్‌మెంట్ ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు 10–12 వరకు ఉన్నాయి. ఇలా ఇస్తారన్న సమాచారం కూడా విద్యార్థులకు లేకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సరైన సమాధానమే లేదు. బోటనీలో ఒక ప్రశ్నకు మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంది. ప్రశ్నలన్నీ కూడా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ పరిధి నుంచే వచ్చాయి.
చదవండి: NEET -SS 2021 : సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..
ఈసారి కటాఫ్ 125–130!
ఈసారి నీట్ ప్రశ్నపత్రం మధ్యస్థం నుంచి కఠినంగా ఉండటంతో గతం కంటే 10 మార్కుల వరకు కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉంది. 2020 NEETలో జనరల్ కటాఫ్ 147, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 113గా ఉండగా 2021 నీట్‌లో జనరల్ కటాఫ్ 138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 108గా ఉంది. కానీ ఈసారి జనరల్ కటాఫ్ 125–130 మధ్య, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కటాఫ్ 100 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు.
చదవండి: NEET-UG 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
ఆగిన ‘సమయం’తో 20 నిమిషాల నష్టం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో కొందరు NEET అభ్యర్థులకు 20 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం అందింది. కేంద్రంలోని రూమ్ నం.7లో గడియారం పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. పక్క గదిలోని ఇన్విజిలెటర్ వచ్చి చెప్పే వరకు ఈ విషయం తెలియకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో తమ సమయం వృథా అయిందని, పేపర్ ఆలస్యంగా ఇచ్చినా ముగింపు సమయానికే జవాబు పత్రాలు తీసుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలోని కేంద్రీయ విద్యాలయ పరీక్ష కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన బండారపు తేజస్విని అనే విద్యార్థిని పరీక్ష ప్రారంభానికి ముందే ఛాతి నొప్పితో స్పృహ కోల్పోయింది. ఆమె ను రూరల్ ఎస్సై శంకర్‌రావు తన వాహనంలో ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.