Skip to main content

NEET 2021: ఈ నిబంధనలు తప్పనిసరి..

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య కోర్సు(యూజీ)ల్లో ప్రవేశాలకు సంబంధించి నీట్‌–21కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సెప్టెంబ‌ర్ 12వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కేటాయించింది. కోవిడ్‌ నేపథ్యంలో గతేడాది 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్‌’కు హాజరు కాగా... ప్రస్తుతం హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి వ‌ద్దు..
ఆదివారం జరిగే నీట్‌కు ఎన్‌టీఏ కఠిన నిబంధనలు విధించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. అలాగే అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. 

నిబంధనలివే.. 
►నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. సదరు విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి.  
►అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. తక్కువ ఎత్తు ఉండే చెప్పులు మాత్రమే వేసుకోవాలి. 
►వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్‌ బ్యాగులు వంటివి తీసుకురావొద్దు.  
►పెన్సిల్, కాలిక్యులేటర్, స్కేల్, రైటింగ్‌ ప్యాడ్‌ వంటివి కూడా అనుమతించరు. 
►మొబైల్‌ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, హెల్త్‌బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావొద్దు. 
►అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దు. 
►అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. 
►హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్‌ అండ్‌ పేపర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.  
►మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.  
►అభ్యర్థులు కనీసం ఒక గంట ముందే పరీక్షాకేంద్రానికి రావాలి.  
►కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కూడా చేయనున్నారు.

Published date : 12 Sep 2021 10:55AM

Photo Stories