Jobs With Huge Salary: ఉద్యోగాల భర్తీ..నెలకు లక్షన్నరకు పైగా జీతం, ఎక్కడో తెలుసా?
హర్యానాకు చెందిన యువతకు ఇజ్రాయెల్‌లో అత్యధిక వేతనంలో కూడిన ఉద్యోగాలు లభించాయి. దీంతో 530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది. వీరిని హర్యానా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఇంతకుముందే వీరికి ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఇప్పుడు వీరంతా ఇజ్రాయెల్‌కు పయనమయ్యారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం మంగళవారం 530 మంది యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. దీనికి ముందు హర్యానా సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఈ యువకులతో మాట్లాడారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీగా పాల్గొన్న యువత
ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల భర్తీకి హర్యానా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో గత జనవరిలో రోహ్‌తక్‌లో ఆరు రోజుల పాటు జరిగిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మొత్తం 8,199 మంది యువకులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు ఇజ్రాయెల్ వెళ్లే ముందు హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ ఈ యువకులను అభినందించారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తలెత్తింది. దీంతో కార్మికులను తమ దేశానికి పంపాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇజ్రాయెల్‌లో 10 వేల మంది నిర్మాణ కార్మికుల అవసరం ఉంది. వీరికి నెలకు రూ.1,37,000 జీతం లభించనుంది. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.