IT Companies: కంపెనీలన్నీ కుమ్మక్కు... ఐటీ ఉద్యోగులకు ఇకపై కష్టకాలమే..!
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఒకే తాటిపై నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరం క్యూ1 ఫలితాల తరువాత అందరిని కార్యాలయాలకు రప్పించడానికి కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఇవీ చదవండి: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు గడ్డురోజులే... రానున్న రెండేళ్లలో ప్రోగ్రామర్ల ఉద్యోగాలకే ఎసరు..!
క్యూ1 ఫలితాల అనంతరం అందరూ ఆఫీసులకు రావాలని ఉద్యోగస్తులకు సమాచారం అందజేస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తున్నారు. టీసీఎస్‌లో 55 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులకు వస్తున్నారు. విప్రో, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి.
మొత్తం మీద దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను రప్పించడానికి కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఇంటికే పరిమితమై పనిచేసుకుంటున్న ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.
చదవండి: Open-Source AI: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్ సోర్స్ ఏఐ
ఇప్పటికే హైబ్రిడ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు సోమ, బుధ, శుక్ర వారాల్లో తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని ఉద్యోగులకు స్పష్టం చేశాయి. వరుసగా మూడు రోజులు వచ్చి మిగిలిన రోజులు వర్క్ ఫ్రం హోం చేస్తామని ఉద్యోగులు రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్ఆర్ నుంచి స్పందన ఉండట్లేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.