JEE Mains 2022: ప్రాథమిక కీ తారుమారు
సెషన్ల వారీగా ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాధానాల కీలను తన వెబ్‌సైట్లో పొందుపరచింది. వీటితో తమ సమాధానాలను పరిశీలించుకున్న విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెషన్లకు సంబంధించిన ప్రాథమిక కీలు తారుమారు కావడమే ఇందుకు కారణం.
JEE Mains తొలిసెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన సంగతి తెలిసిందే. వీటికి దేశవ్యాప్తంగా 9లక్షల మంది వరకు హాజరయ్యారు. ఇక ఈ ప్రాథమిక కీలలో జూన్ 29న జరిగిన రెండు సెషన్లకు సంబంధించిన ప్రశ్నల సమాధానాలు తారుమారయ్యాయి. మేథమెటిక్స్, ఫిజిక్స్ ప్రశ్నల కీ సరిగ్గా ఉండగా కెమిస్ట్రీ సమాధానాలు తారుమారయ్యాయి. ఉదయం పరీక్షకు సంబంధించిన కీని మధ్యాహ్నం సెషన్ ప్రశ్నలకు, మధ్యాహ్నం ప్రశ్నల కీని ఉదయం సెషన్ ప్రశ్నలకు ఎన్టీఏ ప్రకటించడంవల్లే వారు గందరగోళానికి గురయ్యారు. ఈ రెండు సెషన్లలో పరీక్షలు రాసిన వేలాది మంది అభ్యర్థుల మార్కులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో అనుకున్న విధంగా మార్కులు వచ్చినా కెమిస్ట్రీలో పూర్తిగా మైనస్ మార్కులుండటంతో వారు కంగుతిన్నారు. తాము రాసిన అనేక ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నట్లు కనిపించడంతో నిరాశలో మునిగిపోయారు. పైగా ప్రతి తప్పుడు సమాధానానికి మూడోవంతు మార్కులు మైనస్ అయ్యే నిబంధన ఉండడంతో వారికి వచ్చిన మార్కులు మైనస్‌లో పడ్డాయి. తాము సరైన సమాధానాలు రాసినా ఇలాఎలా అయ్యిందో అర్థంకాక విద్యార్థులు తమ అధ్యాపకులకు పరిస్థితిని చెప్పుకున్నారు. పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా తమ విద్యార్థుల పరిస్థితి చూసి అవాక్కయ్యారు. దీంతో ఆయా సంస్థలు విద్యార్థుల వారీగా వారి లాగిన్ నుంచి NTAకు అభ్యంతరాలు తెలియచేశాయి. చివరకు ఆదివారం సాయంత్రానికి కీలను సరిచేస్తూ ఎన్టీఏ కొత్త కీలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. తొలిసెషన్ తుది కీని ఈనెల 5న విడుదలచేసే అవకాశముంది.
చదవండి: JEE - JEE Main Guidance | JEE Main Syllabus | JEE Main Model papers | JEE Main Previous Papers
గత ఏడాది మాదిరిగానే కటాఫ్
మరోవైపు.. జేఈఈ మెయిన్స్‌తొలిసెషన్ పరీక్షల్లోని ప్రశ్నల తీరును పరిశీలించిన నిపుణులు ఈ ఏడాది కూడా కటాఫ్ మార్కులు 2021లో మాదిరిగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈనెలలో రెండో సెషన్ పరీక్షలు పూర్తయిన అనంతరం కటాఫ్ మార్కులు, ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించనుంది. ఇక తొలిసెషన్ తీరును పరిశీలించిన ఆయా కోచింగ్ సెంటర్ల నిపుణులు.. ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలను అనుసరించి తర్ఫీదు పొందిన వారికి అధిక మార్కులు వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఈసారి ప్రశ్నలు, వాటి సమాధానాల తీరు విద్యార్థులను తీవ్ర గందరగోళపరిచే విధంగా ఉన్నాయని వివరించారు. చాలా ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు సమాధానాలు ఇంచుమించు ఒకేమాదిరిగా ఉండడంతో ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్‌ను బాగా అవగాహన చేసుకుని ఎక్కువ ప్రాక్టీసు చేసిన వారు సులభంగా సమాధానాలను గుర్తించగలిగారని వారు తెలిపారు. కానీ, ఇంటర్మీడియెట్ పరీక్షలను, ఎంసెట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తర్ఫీదు పొందిన వారికి మాత్రం మెయిన్స్ పరీక్షలు చాలా కష్టమనిపించాయని ప్రముఖ విద్యాసంస్థ అకడమిక్ హెడ్ మురళీరావు పేర్కొన్నారు.