JEE Mains 2022: 2వ విడత దరఖాస్తు గడువు తేదీ ఇదే..
మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తొలి సెషన్ ఫైనల్ కీని National Testing Agency జూలై 6న విడుదల చేసింది. తొలి సెషన్ పేపర్లలోని ప్రశ్నల స్థాయి ఒకింత క్లిష్టంగా, ఆధునికంగా (మోడరేట్) ఉండి విద్యార్థులను అయోమయానికి గురి చేశాయి. ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాలన్నీ ఇంచుమించు ఒకేలా.. సరైన సమాధానాలుగా స్ఫురించేలా ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడ్డారు. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగిటివ్ మార్కులను అమలు చేస్తున్న నేపథ్యంలో పొరపాటున తప్పుడు సమాధానామిచ్చే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండేవి కావు. ఇప్పుడు అన్ని విభాగాలకూ నెగిటివ్ మార్కులున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులకు మార్కుల స్కోరులో తగ్గుదల ఉందని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, కోచింగ్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
చదవండి:
సెకండ్ సెషన్‌పైనే అభ్యర్థుల దృష్టి
ఇలాంటి పరిస్థితుల కారణంగా మొదటి సెషన్‌లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్‌కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించింది. మొదటి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. తాజాగా బుధవారం ఎన్‌టీఏ మరో పబ్లిక్ నోటీస్‌ను విడుదల చేస్తూ జూలై 9వ తేదీవరకు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11.50 నిముషాల వరకు ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణను కొనసాగించవచ్చని సూచించింది. ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.