JEE Main 2022: తొలి దశ షెడ్యూల్ మార్పు
- ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు తొలి దశ
- ఇంటర్ థియరీ పరీక్షలపై ప్రభావం
- ఇప్పటికే పరీక్షలు ఒకసారి వాయిదా
- మరోసారి షెడ్యూల్ మారే అవకాశం
- నేడు విద్యా శాఖ సమావేశం
టెన్త్ పరీక్షల పైనా ప్రభావం!
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 తొలి దశ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏప్రిల్ 21కు వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో రావడంతో విద్యార్థుల విన్నపాల మేరకు మార్పులు చేస్తున్నట్లు ఎన్‌టీఏ వివరించింది. మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన నగరాల ఇంటిమేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ రెండోవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ వివరించింది.
Also read: Air India Board: ఎయిర్ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఇంటర్ పరీక్షలపై తర్జనభర్జన
జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్ మార్పు ప్రభావం ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలపై పడుతోంది. ఎన్‌టీఏ తొలుత మెయిన్ తొలి దశ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరిగే బోర్డు పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించేలా షెడ్యూల్ మార్చింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు వాయిదా వేయడంతో ఇంటర్మీడియట్ పరీక్షలు మళ్లీ గందరగోళంలో పడ్దాయి. జేఈఈ పరీక్షలు జరిగే ఏప్రిల్ 25న ఇంటర్ ఇంగ్లిష్ పేపర్, ఏప్రిల్ 29న మేథమెటిక్స్ పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజున వచ్చాయి. దీంతో ఇంటర్ పరీక్షలపై విద్యా శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించడానికి ఏప్రిల్ 21న ఫిజిక్సు పేపర్ రోజునే జేఈఈ పరీక్ష ఉంది. దీంతో పరీక్షలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల తేదీలపై సందిగ్థత ఏర్పడటంతో టెన్త్ పరీక్షలపైనా దాని ప్రభావం పడవచ్చని అధికారులు చెబుతున్నారు.