Skip to main content

విశ్లేషణాత్మకంగా చదవడమే విజయ రహస్యం!

Bavitha ‘డాక్టర్’ అనే మూడక్షరాల ముత్యాలను పేరు ముందు అలంకరించుకొని, సమాజంలో సమున్నత గౌరవం పొందాలని ఎందరో విద్యార్థులు కలలు కంటారు. ఆ కలల్ని నిజం చేసుకొనేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. అత్యుత్తమ మార్కులతో దీన్ని విజయవంతంగా పూర్తిచేసి వైద్యంతో పాటు మరెన్నో రంగాల్లో సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఇంటర్ సెకండియర్ బైపీసీ పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న సలహాలు..

జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఈ సంవత్సరం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాల్లో పలు మార్పులు చేశారు.

బోటనీ
ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి సంవత్సర వార్షిక పరీక్షల అనుభవాన్ని విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది.
  • మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ పాఠ్యాంశాలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్‌ను సంప్రదించి, అతని సలహాలను పాటించడం చాలా ముఖ్యం.

వెయిటేజీకి తగ్గట్టు సన్నద్ధం:
విద్యార్థులు వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సిద్ధంకావాలి.
యూనిట్ 1: మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు).
యూనిట్ 2: సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు).
యూనిట్ 3: జన్యుశాస్త్రం (6 మార్కులు).
యూనిట్ 4: అణు జీవశాస్త్రం (8 మార్కులు).
యూనిట్ 5: బయోటెక్నాలజీ (16 మార్కులు).
యూనిట్ 6: ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)
  • 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి.
  • మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.
-బి. రాజేంద్ర,సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

జువాలజీ
జంతుశాస్త్ర పాఠ్యాంశాల్లోనూ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు వీటిని అర్థం చేసుకొని పరీక్షలకు సిద్ధమవాలి.

జంతుశాస్త్ర పాఠ్య ప్రణాళిక:
  • యూనిట్ 1: మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం-1. ఇందులో జీర్ణక్రియ, శ్వాసక్రియ అంశాలను చేర్చారు.
  • యూనిట్ 2: శరీర ద్రవాలు-ప్రసరణ; విసర్జన అంశాలను చేర్చారు.
  • యూనిట్ 3: కండర, అస్థిపంజర వ్యవస్థ; నాడీ నియంత్రణ, సమన్వయం.
  • యూనిట్ 4: అంతస్స్రావక వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ.
  • యూనిట్ 5: మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ.
  • యూనిట్ 6: జన్యుశాస్త్రం.
  • యూనిట్ 7: జీవ పరిణామం.
  • యూనిట్ 8: అనువర్తిత జీవశాస్త్రం.
  • పాఠ్యాంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలంటే తొలుత ఆయా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.

ప్రశ్నపత్రంపై అవగాహన:
విద్యార్థులు మొత్తం 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఏలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్-సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. రెండింటికి సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం దాదాపు ఇంటర్‌బోర్డు మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.

పాఠ్యాంశాలు-వెయిటేజీ: యూనిట్ 1: 8 మార్కులు; యూనిట్ 2: 10 మార్కులు; యూనిట్ 3: 8 మార్కులు; యూనిట్ 4: 10 మార్కులు; యూనిట్ 5: 12 మార్కులు; యూనిట్ 6: 12 మార్కులు; యూనిట్ 7: 8 మార్కులు; యూనిట్ 8: 8 మార్కులు.

పిపరేషన్ వ్యూహం:
  • 2, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ ప్రశ్నల్లో పటాలు కీలకంగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు వీలైనన్ని సార్లు పటాలను సాధన చేయాలి. రంగు పెన్సిళ్లు ఉపయోగించి పటాలను గీస్తే భాగాలను స్పష్టంగా గుర్తించేందుకు అవకాశముంటుంది.
  • ప్రతి యూనిట్‌లోనూ అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను స్పష్టంగా నేర్చుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించేందుకు ఈ విభాగం చాలా ముఖ్యం.
  • ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన పారిభాషిక పదకోశాన్ని సాధన చేయాలి. దీనివల్ల వివిధ విషయాలపై విద్యార్థులకు స్పష్టత ఏర్పడుతుంది.
  • పాఠ్యపుస్తకాల్లో నేరుగా సమాధానాలు లేని ప్రశ్నలకు అధ్యాపకులను సంప్రదించి సమాధానాలు రాసుకోవాలి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సాధన చేయాలి.
  • కళాశాలలో ఏ రోజు విన్న పాఠాన్ని ఆ రోజే ఇంటి దగ్గర సమీక్షించుకోవాలి.
  • తోటి విద్యార్థులతో క్లిష్టమైన పాఠ్యాంశాలపై చర్చించడం వల్ల పరోక్షంగా పునశ్చరణకు వీలవుతుంది.
-కె. శ్రీనివాసులు,శ్రీచైతన్య విద్యాసంస్థలు.

ఫిజిక్స్
Bavitha ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్‌కు 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.

  • సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డాప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది. విద్యార్థులు స్థిర, అనుదైర్ఘ్య తరంగాల ధర్మాలు, వాటి భేదాలను నేర్చుకోవాలి.
  • మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
  • వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
విద్యార్థులు కనీసం ప్రతి చాప్టర్‌కు కేటాయించాల్సిన సమయం:
వేవ్ మోషన్ 4 గంటలు
కరెంట్ ఎలక్ట్రిసిటీ 6 గంటలు
న్యూక్లియర్ ఫిజిక్స్ 3 గంటలు
ఎలక్ట్రో మాగ్నటిక్ 4 గంటలు
రే ఆప్టిక్స్ 4 గంటలు
సెమీ కండక్టర్ డివెసైస్ 6 గంటలు


కెమిస్ట్రీ
Bavitha సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి.

  • విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.
  • కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
ముఖ్యమైన చాప్టర్లు- చదవాల్సిన కనీస సమయం:
సాలిడ్ స్టేట్ 6 గంటలు
సొల్యూషన్స్ 4 గంటలు
ఎలక్ట్రో కెమిస్ట్రీ 4 గంటలు
సర్ఫేస్ కెమిస్ట్రీ 3 గంటలు
మెటలర్జీ 8 గంటలు
పి-బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ 8 గంటలు
కోఆర్డినేట్ కాంపౌండ్స్ 4 గంటలు
పాలిమర్స్ 4 గంటలు
బయో మాలిక్యూల్స్ 3 గంటలు
ఆర్గానిక్ కాంపౌండ్స్ 12 గంటలు

గెలుపు సూత్రాలు:
  • పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి.
  • ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
  • ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి.
  • విద్యార్థులు తప్పనిసరిగా మొదటి నుంచి దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు బహుళైచ్ఛిక ప్రశ్నలపైనా దృష్టిసారించాలి.
  • ఎంసెట్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
  • పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
  • అతి విశ్వాసం అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.

-ఎం.ఎన్.రావు,శ్రీ చైతన్య విద్యా సంస్థలు.
Published date : 12 Sep 2013 03:06PM

Photo Stories