Skip to main content

విశ్లేషణాత్మక అధ్యయనమే విజయమంత్రం!

Bavitha‘డాక్టర్’ కెరీర్‌ను అందుకొని.. ఆపై సమాజంలో సమున్నత గౌరవం పొందాలన్నది ఎందరో విద్యార్థుల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. అత్యుత్తమ మార్కులతో దీన్ని విజయవంతంగా పూర్తిచేసి.. ఆపై ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి వైద్యంతో పాటు మరెన్నో రంగాల్లో సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్, ఎంసెట్ వృక్షశాస్త్రంలో అత్యధిక మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్రణాళిక..

ఎంసెట్
ఎంసెట్ (మెడిసిన్) రాయాలనుకునే విద్యార్థులు ప్రిపరేషన్‌కు ముందు కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం (Exam Pattern), ప్రశ్న రకాలు, మాదిరి ప్రశ్నలు లేదా ప్రీవియస్ పరీక్షల ప్రశ్నలు, పరీక్షకు నిర్దేశించిన సమయం, పరీక్ష తేదీ, ఏ పాఠ్యపుస్తకాలను చదవాలి? ఎంత సమయం కేటాయించాలి? వెయిటేజీ విధానం ఏమైనా ఉందా? తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • సిలబస్: ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియెట్ సిలబస్.
  • పరీక్ష విధానం: బహుళైచ్ఛిక సమాధానాలు. నెగిటివ్ మార్కులుండవు.
  • ప్రశ్నల రకాలు: బహుళైచ్ఛిక (Multiple Choice), బహుళ సమాధాన ప్రశ్నలు (Multiple Answers), జత పర్చడం (Match the following), నిశ్చిత వ్యాఖ్య (Assertion & Reasoning).
  • మాదిరి ప్రశ్నలు: ఈ ఏడాది వృక్షశాస్త్రం సిలబస్‌లో మార్పులు బాగా జరిగాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లలోని ప్రశ్నలు అంతగా ఉపయోగపడవు. అయితే వాటిద్వారా ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన పెంపొందించుకోవచ్చు.
  • పాఠ్యపుస్తకాలు:తెలుగు అకాడమీ పుస్తకాలను చదవాలి.
  • వెయిటేజీ: ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం, ఎంసెట్‌కు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. ర్యాంకు నిర్ధరణకు వరుసగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ప్రాధాన్యత ఇస్తారు.
  • పరీక్షకు సిద్ధంకావడానికి లెక్చరర్ సహాయం తీసుకోవాలి. సీనియర్ విద్యార్థులు, ర్యాంక్ సాధించిన వారి సలహాలను పాటించాలి.
  • ఎంసెట్ ప్రశ్నపత్రంలో 1 నుంచి 40 వరకు ప్రశ్నలు వృక్షశాస్త్రానికి సంబంధించి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల కంటే ముందు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ఉత్తమం.
సిలబస్ మారిన తర్వాత తొలిసారిగా ఎంసెట్-2014 జరగబోతోంది. వృక్షశాస్త్రానికి సంబంధించి వివిధ యూనిట్ల నుంచి ఈ కింది విధంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

ఇంటర్ ఫస్టియర్:
యూనిట్ ప్రశ్నల సంఖ్య
1. జీవ ప్రపంచంలో వైవిధ్యం 3 లేదా 4
2. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం 6
3. మొక్కల్లో ప్రత్యుత్పత్తి 3
4. మొక్కల సిస్టమాటిక్స్ 2 లేదా 3
5. కణం- నిర్మాణం, విధులు 2
6. మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం 2
7. వృక్ష ఆవరణ శాస్త్రం 2
  • పాఠ్యపుస్తకాల్లోని సమాచారాన్ని క్షుణ్నంగా చదివిన తర్వాత మాదిరి ప్రశ్నపత్రానికి సమాధానాలు రాయడం ద్వారా ప్రిపరేషన్ పూర్తవుతుంది.
  • ఇంటర్మీడియెట్ రెగ్యులర్ విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌లోని యూనిట్ 1- జీవ ప్రపంచంలో వైవిధ్యం, యూనిట్ 4- మొక్కల సిస్టమాటిక్స్‌లను కలిపి చదివితే తేలిగ్గా ఉంటుంది. యూనిట్ 1 నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి కాబట్టి దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ యూనిట్లో కొన్ని విషయాలపై పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల అర్థం చేసుకోవడం కంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్ సహాయాన్ని తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది.
  • యూనిట్ 4 విషయంలో మొక్కల కుటుంబాల గురించి అవగాహన కంటే వాటికి సంబంధించిన అంశాలను చదివి గుర్తుంచుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • యూనిట్ 2- మొక్కల నిర్మాణాత్మక సంవిధానం, స్వరూప శాస్త్రం చాలా సులభంగా ఉండే పాఠ్యాంశం. దీన్ని చదివేందుకు తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
  • యూనిట్ 3 (మొక్కల్లో ప్రత్యుత్పత్తి)పై అవగాహన పెంపొందించుకోవడం చాలా అవసరం. అందువల్ల ఇందులోని అంశాలను ఒకటికి రెండుసార్లు బాగా చదవాలి.
సెకండియర్:
యూనిట్ ప్రశ్నల సంఖ్య
1. వృక్ష శరీర ధర్మశాస్త్రం 6 లేదా 8
2. సూక్ష్మజీవ శాస్త్రం 2
3. జన్యుశాస్త్రం 2
4. అణుజీవ శాస్త్రం 3
5. జీవ సాంకేతిక శాస్త్రం 2 లేదా 3
6. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మ జీవులు 3 లేదా 4
ఇంటర్ సెకండియర్ వృక్షశాస్త్రం పాఠ్యాంశాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఏ విషయంపైనా పూర్తిగా వివరణ లేకపోవడం వల్ల విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక పాఠంలో కిరణజన్య సంయోగక్రియలో గ్లూకోజ్ ఏర్పడుతుంది అని ఉంటుంది. మరో పాఠం శ్వాసక్రియలో ‘కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన సుక్రోజ్’ అని ఉంటుంది. వాస్తవానికి మొక్కల్లో గ్లూకోజ్ ఏర్పడదు.
  • యూనిట్ 1లో ఆరు పాఠ్యాంశాలుంటాయి. ఒక్కో అంశం నుంచి ఒక్కో ప్రశ్న ఎంసెట్‌లో వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఈ యూనిట్‌ను వీలైనన్ని ఎక్కువసార్లు చదవాలి.
  • యూనిట్ 4లోని క్లిష్టమైన పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు లెక్చరర్ సహాయం తప్పనిసరి. DNA నిర్మాణానికి సంబంధించి సమస్యలు ఇచ్చే అవకాశముంది. అందువల్ల వీలైనన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
  • యూనిట్ 2, యూనిట్ 4లను కలిపి చదివితే ప్రయోజనం ఉంటుంది. ఈ యూనిట్ల నుంచి ఐదారు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. సూక్ష్మజీవుల పేర్లు, మొక్కల వంగడాల పేర్లు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎంసెట్‌కు రెండు రోజుల ముందు వీటిని రివిజన్ చేస్తే ఫలితం ఉంటుంది.
లాంగ్‌టర్మ్ విద్యార్థులకు:
గత సిలబస్‌తో పోలిస్తే ప్రస్తుత సిలబస్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి లాంగ్‌టర్మ్ విద్యార్థులు కొంత ఎక్కువ కష్టపడక తప్పదు. గత సిలబస్‌తో పోలిస్తే మొదటి సంవత్సరం యూనిట్ 1 పూర్తిగా భిన్నమైంది. అందువల్ల దీనిపై ఎక్కువ శ్రద్ధచూపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పుస్తకాలను చదవకూడదు. సెకండియర్ నుంచి వచ్చే ప్రశ్నలకు లాంగ్‌టర్మ్ విద్యార్థులు ఎక్కువగా యూనిట్ 4 (అణుజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి.
  • వృక్షశాస్త్రంలో ఎక్కువగా చేసే తప్పుల్లో తెలియక తప్పుచేసినవి మూడు శాతం ఉంటే, తెలిసి కూడా తప్పుచేసినవి 10 శాతం ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
  • లాంగ్‌టర్మ్ విద్యార్థులు మొదటి సంవత్సరం యూనిట్ 1లోని రెండో పాఠం (జీవశాస్త్ర వర్గీకరణ), ద్వితీయ సంవత్సరం యూనిట్ 2 (సూక్ష్మజీవ శాస్త్రం), యూనిట్ 6 (మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు)లతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఇలా చేస్తే సమయం చాలా ఆదా అవుతుంది.
ఇంటర్ పరీక్షలు
Bavitha
ఫస్టియర్ బోటనీ:

ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో బోటనీలో ఎక్కువ మార్కులు సాధించాలంటే తొలుత సిలబస్‌లోని పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందించుకొని తర్వాత విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ప్రధానం. ప్రశ్నపత్రానికి అనుగుణంగా పాఠ్యాంశాలపై దృష్టిసారించాలి.

ప్రశ్నపత్రంపై అవగాహన:
పేపర్ మొత్తం 76 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇందులో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఏలో 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్ సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండింటికి సమాధానం రాయాలి.

పాఠ్యాంశాలు- వెయిటేజ్:
యూనిట్ 1:
జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు)
యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు)
యూనిట్ 3: మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు)
యూనిట్ 4: ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు)
యూనిట్ 5: కణ నిర్మాణం, విధులు (14 మార్కులు)
యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు)
యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు)
  • 2, 3, 6 యూనిట్‌ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి.
  • ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మొదటి నుంచి చేతిరాతను మెరుగుపరచుకోవాలి.
సెకండియర్ బోటనీ:
ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి మొదటి సంవత్సర వార్షిక పరీక్షల అనుభవాన్ని విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మంచి మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది.
  • మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ పాఠ్యాంశాలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అందువల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను చదివిన తర్వాత ప్రతి పాఠం చివర ఉన్న ప్రశ్నలకు పరీక్షలకు అవసరమయ్యే విధంగా సమాధానాలు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో లెక్చరర్‌ను సంప్రదించి, అతని సలహాలను పాటించడం చాలా ముఖ్యం.
వెయిటేజీకి తగ్గట్టు సన్నద్ధం:
యూనిట్ 1:
మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు)
యూనిట్ 2: సూక్ష్మజీవ శాస్త్రం (6 మార్కులు)
యూనిట్ 3: జన్యుశాస్త్రం (6 మార్కులు)
యూనిట్ 4: అణు జీవశాస్త్రం (8 మార్కులు)
యూనిట్ 5: బయోటెక్నాలజీ (16 మార్కులు)
యూనిట్ 6: ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)
  • 1, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. 1, 2, 3, 4, 5 యూనిట్ల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి.
  • మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.
Bavitha
Published date : 21 Nov 2013 06:02PM

Photo Stories