Skip to main content

ఫస్ట్ ఎంపీసీ - ప్రిపరేషన్ ప్రణాళిక

కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్- కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో ఇంజనీర్‌గా సుస్థిర వృత్తి జీవితాన్ని లక్ష్యంగా నిర్దేశించుకొన్నవారు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీలో చేరుతారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో చదవాలి. లేదంటే ప్రస్తుత తీవ్ర పోటీ ప్రపంచంలో ఐఐటీ, నిట్‌ల వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీటు పొందటం కష్టం. ఈ క్రమంలో మొదటి ఏడాది ఎంపీసీ విద్యార్థులను విజయ పథంలో నడిపించేందుకు సబ్జెక్టు నిపుణులు అందిస్తున్న సూచనలు...
Bavitha అప్లికేషన్ కోణంలో అధ్యయనం
 • ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలతో పాటు ఇంటర్ పూర్తయ్యాక రాసే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం సిద్ధమవాలి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. రోజూ తప్పనిసరిగా కాలేజీకి వెళ్లాలి. లెక్చరర్లు చెప్పిన ముఖ్యమైన కాన్సెప్టులు, సమస్యల సాధనకు ఉపయోగపడే షార్ట్‌కట్స్, టిప్స్‌ను నోట్ చేసుకోవాలి.
 • తరగతిలో చెప్పిన అంశాలకు సంబంధించి ఏ రోజుకు ఆరోజు కానెప్టులు, బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ఆ తర్వాత అప్లికేషన్ కోణంలో అధ్యయనం చేయాలి. అది పూర్తయ్యాక ఎంసెట్, జేఈఈ స్థాయిలో చదవాలి.
 • చదువుతున్నప్పుడు తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు కాలేజీ స్టడీ అవర్స్‌లో లెక్చరర్లను అడిగి నివృత్తి చేసుకోవాలి.

ఐపీఈ + ప్రవేశ పరీక్షలు
 • ఇంటర్‌తో పాటు జాతీయ స్థాయి పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, బిట్‌శాట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకోవాలి. దశల వారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
 • మ్యాథమెటిక్స్‌లో కాన్సెప్టులు, బేసిక్స్ బాగా ఉన్న సరళరేఖలు, అవకలనాలు, సదిశా బీజగణితం, త్రిమితీయ జ్యామితి, త్రికోణమితి అంశాలు ముఖ్యమైనవి.
 • కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కర్బన శాస్త్రం; ఫిజిక్స్‌లో గతిశాస్త్రం, ఉష్ణం చాప్టర్లపై ఎక్కువ దృష్టిసారించాలి. ఈ చాప్టర్లకు సంబంధించి తరగతులు జరుగుతున్నప్పుడు ఒకటికి రెండుసార్లు కాన్సెప్టులను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఆయా ప్రవేశ పరీక్షల స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి.

మొదటి ఏడాదిపై అశ్రద్ధ వద్దు
 • అవగాహన, సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల కొందరు విద్యార్థులు మొదటి సంవత్సరంలోని కొన్ని చాప్టర్లను ఆబ్జెక్టివ్ పరంగా ప్రిపరేషన్‌ను వదిలేస్తారు. ఇది మంచిది కాదు. ఇలాంటి వారు సెకండియర్‌లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్టియర్‌లోని చాలా అంశాలపై ఆధారపడి సెకండియర్‌లోని అంశాలుంటాయి.
 • సెకండియర్‌లో ఐపీఈ ప్రిపరేషన్, ప్రాక్టికల్స్, రికార్డులు రాయటం, మొదటి ఏడాది చాప్టర్లను రివిజన్ చేయటం వంటివన్నీ ఉంటాయి. అందువల్ల మొదటి ఏడాదిలో అన్ని చాప్టర్లను ఆబ్జెక్టివ్ స్థాయి వరకు ప్రిపేరవ్వాలి.
 • కాలేజీ తరగతులు పూర్తయ్యాక కేవలం ఇంటర్‌కు చదువుతున్నవారు కనీసం మూడు గంటలు; ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షలకు కూడా సిద్ధమవుతున్నవారు కనీసం 5 గంటలు చదవాలి. అవసరాన్ని బట్టి సబ్జెక్టుల వారీగా సమయం కేటాయించాలి.

మ్యాథమెటిక్స్
 • మూడు సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ అత్యంత ప్రధానమైంది. ఇది అధిక మార్కులు తెచ్చుకునేందుకు వీలున్న సబ్జెక్టు. చాలా ప్రైవేటు కళాశాలల్లో అక్టోబర్, నవంబరు నాటికి ఐపీఈ సిలబస్, ఆబ్జెక్టివ్ కోచింగ్ పూర్తవుతుంది. నవంబరు చివరి వరకు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌కు 80 శాతం సమయాన్ని కేటాయించాలి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఆబ్జెక్టివ్‌కు 30 శాతం, ఐపీఈకి 70 శాతం సమయం కేటాయించాలి.
 • తెలుగు అకాడమీ పుస్తకాల్లోని అన్ని సమస్యల సాధనను ప్రాక్టీస్ చేయాలి. దీర్ఘ, స్వల్ప, అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను ప్రాక్టీస్ చేశాక, ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధించాలి. దీనివల్ల ఇంటర్‌తో పాటు ప్రవేశపరీక్షల్లో అధిక స్కోర్ సాధించేందుకు వీలవుతుంది.
 • మ్యాథ్స్ 1-ఏలో ప్రమేయాలు, వెక్టార్ ఆల్జీబ్రాలోని అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు, మ్యాథ్స్ 1-బీలోని లిమిట్స్, ప్లేన్స్, స్ట్రెయిట్ లైన్స్‌లోని అన్ని అతిస్వల్ప సమాధాన ప్రశ్నలను సాధిస్తే ఒక్కో పేపర్‌లో 75/75 మార్కులు తెచ్చుకోవటం సులభం.

ముఖ్యమైన చాప్టర్లు
మ్యాథ్స్ 1-ఎ
 • మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్
 • వెక్టార్ ఆల్జీబ్రా
 • ఫంక్షన్స్
 • ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్
 • మ్యాథమెటికల్ ఇండక్షన్
 • ట్రాన్స్‌ఫర్మేషన్

మ్యాథ్స్ 1-బి
 • సరళరేఖలు
 • సరళయుగ్మాలు
 • దిక్ కొసైన్, దిక్ నిష్పత్తులు
 • అవకలనాలు
 • స్పర్శ-అభిలంబరేఖలు

ఫిజిక్స్
దీర్ఘ సమాధాన ప్రశ్నల కోణంలో ముఖ్యమైన చాప్టర్లు
 • వెక్టార్స్
 • గతిశాస్త్రం
 • సింపుల్ హార్మోనిక్ మోషన్
 • వర్క్, పవర్, ఎనర్జీ
 • కినెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్
 • వెక్టార్స్‌లో ఉండే భౌతిక సిద్ధాంతాలను ఔపోసన పడితే ఆ చాప్టర్‌పై పట్టు చిక్కుతుంది.
 • రొటేటరీ మోషన్‌లో పాజిటివ్ వెక్టార్స్, ఫోర్స్‌వెక్టార్‌లోని సమస్యలను గుర్తించి, సాధన చేయాలి. గ్రావిటేషన్‌లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ముఖ్యమైనది.
 • సింపుల్ హార్మోనిక్ మోషన్‌లో వేగం, త్వరణం, గరిష్ట-కనిష్ట వేగాల మధ్య సంబంధాలు, వాటి అనువర్తిత సమస్యలు ముఖ్యమైనవి.
 • సర్ఫేస్ టెన్షన్‌లో నిత్యజీవితంలో తలతన్యత, కేపలారిటీ ఉపయోగాలు, యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, సర్ఫేస్ టెన్షన్-ఎనర్జీల మధ్య సంబంధం ముఖ్యమైనవి.
 • ఎలాస్టిసిటీలో తక్కువ ఉప అంశాలున్నాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. స్ట్రెస్, స్ట్రెయిన్, Poisson's ratioలకు సంబంధించిన సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
 • థర్మోడైనమిక్స్‌లో zeroth law of thermodynamics, ప్రిన్సిపుల్ ఆఫ్ కెలోరీమెట్రీ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
 • అన్ని యూనిట్లలోని డెరివేషన్స్, సిద్ధాంతాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రక్షేపకాల పరావలయ పథం, పనిశక్తి సిద్ధాంతం, శక్తిద్రవ్యవేగ నిత్యత్వ సూత్రాలు, పలాయన వేగం ముఖ్యమైన డెరివేషన్స్.
 • స్వల్ప సమాధాన ప్రశ్నలకు తెలుగు అకాడమీలోని అన్ని ప్రశ్నలను సాధించాలి. బిందు లబ్ధం, వజ్ర లబ్ధం, లఘులోలకం, కోణీయ ద్రవ్యవేగం, గరుకువాలు బల్ల, స్ప్రింగ్ లోలకం అనువర్తనాలు ముఖ్యమైనవి.

కెమిస్ట్రీ
 • కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. బోర్న్ హేబర్ సైకిల్, హైడ్రోజన్ స్పెక్ట్రా, పీరియాడిక్ ప్రాపర్టీస్, ఎసిటిలీన్, ఇథిలీన్ ప్రిపరేషన్-ధర్మాలు ముఖ్యమైనవి.
 • ఫిజికల్ కెమిస్ట్రీలో ఆమ్లాలు, క్షారాలు, రసాయనిక చర్య, సమతాస్థితి, ఎనర్జటిక్స్ ముఖ్యమైనవి. ఈ చాప్టర్లలోని సమస్యలు కూడా ముఖ్యమైనవి.
 • అన్నింటికంటే కెమిస్ట్రీలో ఎక్కువ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలో ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకొని, ఎక్కువసార్లు చదవాలి.
 • కెమిస్ట్రీలో చాలా వరకు థియరీ చాప్టర్లు ఉంటాయి కాబట్టి అకాడమీ అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
 • ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్‌ను చాలాసార్లు రాయటం ద్వారా ప్రాక్టీస్ చేయాలి. నేమ్డ్ రియాక్షన్స్ ప్రాక్టీస్ చేయటం ముఖ్యం.

ముఖ్యమైన చాప్టర్లు
 • కెమికల్ బాండింగ్
 • అటామిక్ స్ట్రక్చర్
 • పీరియాడిక్ టేబుల్
 • ఆర్గానిక్ కెమిస్ట్రీ
 • కెమికల్ కైనటిక్స్

గెలుపు మార్గాలు
 • పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన చాప్టర్లను,కాన్సెప్టులను గుర్తించి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
 • తొలుత అన్ని చాప్టర్ల ముఖ్య భావనలను ఒక చోట రాసుకుని బాగా చదవాలి.
 • గుర్తించిన కాన్సెప్ట్‌లను నిర్వచించడం.. విశ్లేషించడం.. అనువర్తించడం విధానంలో చదవాలి.
 • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం అత్యంత ప్రధానమైనవి.
 • ప్రతి సబ్జెక్టుకు ఓ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు.
 • ప్రతి చాప్టర్‌కు సంబంధించి క్లాస్ నోట్స్, ముఖ్యమైన పాయింట్లు, షార్ట్‌కట్స్‌ని రాసుకొని, ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి.
 • కళాశాలలో ప్రతి పాఠాన్ని ఏకాగ్రతతో వినడంతోపాటు ఇంటిదగ్గర సంబంధిత పాఠాన్ని సమీక్షించుకోవాలి.
 • పాఠ్యపుస్తకాన్ని చదువుతున్నప్పుడు ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇది చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
 • అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి.
Bavitha
Published date : 18 Sep 2015 05:49PM

Photo Stories