Skip to main content

పట్టు కోసం.. ప్రాక్టీస్ చేయాల్సిందే!

Bavitha ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశించిన విద్యార్థులు తొలుత కొంత గందరగోళానికి గురవుతారు. కొత్త సబ్జెక్టులు, కొత్త బోధనా విధానం, మూల్యాంకనం, లక్ష్యాలు.. ఇలా భిన్నమైన వాతావరణం ఎదురవుతుంది. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వింటూ, ప్రణాళిక ప్రకారం చదువుతూ క్రమశిక్షణతో మెలిగితే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు సబ్జెక్టు నిపుణులు...

జువాలజీ
వైద్య వృత్తిలో కెరీర్‌ను సుస్థిరం చేసుకునే క్రమంలో విద్యార్థులు ఇంటర్ బైపీసీలో చేరతారు. వీరు పబ్లిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు సమాంతరంగా చదవాల్సి ఉంటుంది. ఒత్తిడి అనే పదాన్ని దరిచేరనీయకుండా, అధ్యాపకుల సూచనలతో ఒక ప్రణాళిక ప్రకారం చదివితే మంచి మార్కులు వస్తాయి.

పాఠ్యాంశాలు:
  • మొదటి యూనిట్-‘జీవ ప్రపంచ వైవిధ్యం’లో జీవు లు మౌలిక లక్షణాలు, జంతుశాస్త్రం పరిధి, శాఖలు, వర్గీకరణలను వివరించారు. రాజ్యం ఏనిమేలియా వర్గీకరణ, జీవ వైవిధ్యం గురించి విశదీకరించారు.
  • రెండో యూనిట్‌లో జంతు దేహ నిర్మాణం; 3, 4 యూనిట్లలో అకశేరుక వర్గాలు, కార్డేటా వర్గీకరణను వివరించారు.
  • 5వ యూనిట్‌లో ప్రొటొజోవా గమనం, ప్రత్యుత్పత్తి గురించి తెలపగా, 6వ యూనిట్‌లో ‘మానవ సంక్షేమంలో జీవశాస్త్రం’ గురించిన అంశాలను చేర్చారు.
  • 7వ యూనిట్‌లో పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక) నమూనాను, 8వ యూనిట్‌లో జీవావరణం, పర్యావరణం గురించి తెలిపారు.
యూనిట్ల వారీగా ప్రాధాన్యం:
మొదటి యూనిట్ నుంచి ఒక అతి స్వల్ప సమాధాన ప్రశ్న, ఒక స్వల్ప సమాధాన ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రెండో యూనిట్ నుంచి మూడు అతి స్వల్ప సమాధాన, ఒక స్వల్ప సమాధాన ప్రశ్నలు రావొచ్చు.
  • మూడు, నాలుగు యూనిట్‌ల నుంచి రెండు అతి స్వల్ప, రెండు స్వల్ప సమాధాన ప్రశ్నలు; 5వ యూనిట్ నుంచి 2 అతి స్వల్ప, ఒక స్వల్ప సమాధాన ప్రశ్నలు; 6వ యూనిట్ నుంచి ఒక అతి స్వల్ప, ఒక స్వల్ప, ఒక దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • 7వ యూనిట్ నుంచి ఒక స్వల్ప సమాధాన, ఒక దీర్ఘసమాధాన ప్రశ్నలు; చివరి యూనిట్ నుంచి ఒక్కో స్థాయి నుంచి ఒక్కో ప్రశ్న రావొచ్చు.
ప్రిపరేషన్ విధానం:
  • విద్యార్థులు పటాలపై ఎక్కువ దృష్టిసారించాలి. హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ ప్రశ్నల్లో చాలా వాటిలో పటాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందువల్ల పటాలను వీలైనన్ని ఎక్కువ సార్లు సాధన చేసి, భాగాలను గుర్తుంచుకోవాలి.
  • పాఠ్యాంశాల గురించి తోటి విద్యార్థులతో చర్చించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పరోక్షంగా పునశ్చరణ జరుగుతుంది.
  • ప్రతి యూనిట్‌లోనూ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని రాయటాన్ని అలవర్చుకోవాలి. స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలను సమయ పాలన పాటిస్తూ అభ్యసించాలి.
  • ప్రతి యూనిట్ పారిభాషిక పదకోశంలోని పదాల నిర్వచనాలను అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే అతి స్వల్ప సమాధాన పశ్నలకు సరైన సమాధానాలు రాయడానికి, ఎంసెట్ వంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది.
  • ఒకే రకమైన సమాధానాన్ని వివరణాత్మకంగా, క్లుప్తం గా రాయగలిగే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
  • తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటిలోని అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. వివిధ సాంకేతిక పదాలను, సారాంశాలను వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి.
  • కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేరుగా పాఠ్యపుస్తకాల్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అధ్యాపకులను సంప్రదించాలి.
-కె.శ్రీనివాసులు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు.

ఫిజిక్స్
ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉన్నందున, ఇంటర్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. అకాడమీ పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాల వెనుక ఉన్న ప్రశ్నలకు సమాధానాలను అభ్యాసం చేస్తే ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం మార్కులు సాధించవచ్చు. ముఖ్యంగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేలా పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలి. ఇంటర్ పాఠ్యాంశాలను మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. అవి..
  1. యాంత్రిక శాస్త్రం
  2. ద్రవ్య ధర్మాలు
  3. ఉష్ణం.
ఇంటర్మీడియెట్:
  • పని, శక్తి, సామర్థ్యం; కణాల వ్యవస్థలు- భ్రమణ గమనం, సరళహరాత్మక చలనం; ఉష్ణ వ్యాకోచాలు; ఉష్ణగతిక శాస్త్రాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
  • సరళహరాత్మక చలనం, సమతలంలో చలనం, గమన సూత్రాలు, గురుత్వాకర్షణ, ఘన పదార్థ యాంత్రిక ధర్మాలు, ఉష్ణగతిక శాస్త్రం, అణుచలన సిద్ధాంతం పాఠ్యాంశాల నుంచి స్వల్ప సమాధాన ప్రశ్నలు రావొచ్చు.
  • భౌతిక ప్రపంచం, ప్రమాణాలు-కొలతలు, సమతలంలో వస్తువుల చలనం, భ్రమణ చలనం, ప్రవాహుల యాంత్రిక ధర్మాల నుంచి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు రావొచ్చు.
  • సంఖ్యాత్మక ప్రశ్నలు 8 నుంచి 10 మార్కుల వరకు ఉండొచ్చు. వంద శాతం మార్కులు తెచ్చుకోవాలంటే కచ్చితంగా వివిధ పాఠ్యాంశాల్లోని సమస్యలను అభ్యాసం చేయాలి.
ఎంసెట్:
ఎంసెట్‌లో అంశాల వారీగా ప్రాధాన్యత ఈ కింది విధంగా ఉండొచ్చు.
పాఠ్యాంశం ప్రధాన్యత శాతం ప్రశ్నల సంఖ్య
గతిశాస్త్రం 30 శాతం 12
ద్రవ్య ధర్మాలు 10 శాతం 4
ఉష్ణం 10 శాతం 4
  • ప్రతి అధ్యాయాన్నీ ఉప భాగాలుగా విభజించి, అంశాల వారీగా నోట్సు తయారు చేసుకోవాలి. ఉదాహరణకు సరళహరాత్మక చలనా న్ని ఇలా విభజించొచ్చు. ఎ) క్షితిజ సమాంతర చలనం బి) స్వేచ్ఛగా కిందకుపడే వస్తువు సి) నిలువుగా పైకి విసిరిన వస్తువు డి) వివిధ వక్రాలు. ఇలా ప్రతి అధ్యాయాన్నీ విభజించుకొని, అందుబాటులోని సమయానికి అనుగుణంగా పునశ్చరణ చేసుకోవాలి.
ముఖ్యమైన అంశాలు:
ప్రతి అధ్యాయంలోని ముఖ్యమైన సైద్ధాంతిక అంశాలు, ఫార్ములాలతో నోట్సు రూపొందించుకోవాలి. దీనివల్ల పునశ్చరణ తేలికవుతుంది. ప్రమాణాలు, కొలతలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. వీటిలో ఒకే మితి ఫార్ములా గల భౌతిక రాశులతో పట్టికలు తయారు చేసుకోవాలి. సదిశలపై భావనలు వేర్వేరు పాఠ్యాంశాలలో ఉన్నప్పటికీ, వాటినన్నింటినీ ఒకేసారి నేర్చుకుంటే మంచిది. సమతలంలో చలనం భాగంలో సమాంతర, వాలుతలాలపై ప్రక్షేపకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమాంతర, వాలు తలాలపై ఘర్షణకు సంబంధించిన ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
  • గురుత్వాకర్షణలో శక్తి నిత్యత్వ సూత్రాన్ని ఉపయోగించి కక్ష్యావేగం, పలాయన వేగాల పై సమస్యలను సాధించడం అభ్యసించాలి.
  • మిగిలిన పాఠ్యాంశాలతో పోల్చితే ద్రవ్య ధర్మాలు, ఉష్ణం పాఠ్యాంశాలు తేలిగ్గా ఉంటాయి కాబట్టి వీటిపై పూర్తిస్థాయి పట్టు దొరికేలా సాధన చేయాలి.
  • గమన నియమాలు, సరళహరాత్మక చలనం వంటి అంశాలను నేర్చుకుంటే ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. కాబట్టి వీటిలోని ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి.
  • ప్రథమ సంవత్సరంలోని అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవడం వల్ల ద్వితీయ సంవత్సరంలోని అంశాలను తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. అకాడమీ ఇంటర్ పాఠ్యాంశాలతో పాటు ఎంసెట్ ప్రశ్నల నిధిని అభ్యసించాలి.
-పి.కనక సుందర రావు,
శ్రీ గాయత్రి విద్యా సంస్థలు.

బోటనీ
  • బయాలజీ విద్యార్థులు చాలా సమాచారాన్ని చదివి, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బోటనీకి సంబంధించి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చదవటం చాలా ప్రధానం. విద్యార్థులు పుస్తకంలోని పాఠ్యాంశాల వరుస క్రమాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అధ్యయనం చేయాలి.
పశ్నపత్రంపై అవగాహన:
పేపర్ మొత్తం 76 మార్కులకు ఉంటుంది. 60 మార్కులకు సమాధానాలు రాయాలి. ఇందులో మూడు విభాగాలుంటాయి. సెక్షన్-ఏలో 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్ సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండింటికి సమాధానం రాయాలి.

పాఠ్యాంశాలు-వెయిటేజీ:
యూనిట్ 1:
జీవ ప్రపంచంలో వైవిధ్యం (14 మార్కులు)
యూనిట్ 2: మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- స్వరూపశాస్త్రం (12 మార్కులు)
యూనిట్ 3: మొక్కల్లో ప్రత్యుత్పత్తి (12 మార్కులు)
యూనిట్ 4: ప్లాంట్ సిస్టమాటిక్స్ (6 మార్కులు)
యూనిట్ 5: కణ నిర్మాణం, విధులు (14 మార్కులు)
యూనిట్ 6: మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం (12 మార్కులు)
యూనిట్ 7: వృక్ష ఆవరణ శాస్త్రం (6 మార్కులు)
  • 2, 3, 6 యూనిట్‌ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్న లు వచ్చే అవకాశముంది. అందువల్ల వీటిపై ఎ క్కువ దృష్టిపెట్టాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చిత్రపటాలను వేగంగా గీయటం నేర్చుకోవాలి.
  • ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సమాధానాల్లో ముఖ్యాంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
-బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

కెమిస్ట్రీ
పాఠ్యాంశాలు:
పరమాణు నిర్మాణం; ఆవర్తన పట్టిక; రసాయన బంధం; స్టాకియోమెట్రీ; వాయు స్థితి; హైడ్రోజన్, దాని సమ్మేళనాలు; సమతాస్థితి; థర్మోడైనమిక్స్; ఎస్-బ్లాకు మూలకాలు; 3-ఎ, 4-ఎ గ్రూపు మూలకాలు; కర్బన రసాయన శాస్త్రం; పర్యావరణ రసాయన శాస్త్రం. ఈ పాఠ్యాంశాలను స్థూలంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు.
  1. భౌతిక రసాయన శాస్త్రం (ఫిజికల్ కెమిస్ట్రీ): పరమాణు నిర్మాణం; సమతాస్థితి, వాయుస్థితి, థర్మోడైనమిక్స్, స్టాకియోమెట్రీ వంటి పాఠ్యాంశాలు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ పాఠ్యాంశాలు ఏ విధమైన పరీక్షకైనా చాలా ముఖ్యమైనవి. ఇచ్చిన సమస్యకు అనుగుణంగా సూత్రాలను అన్వయించుకోవడంపై విద్యార్థులు ఎక్కువగా దృష్టికేంద్రీకరించాలి. ఆ సూత్రాలను క్రమపద్ధతిలో రాసుకొని, సంబంధిత సమస్యలను సాధిస్తుంటే భౌతిక రసాయన శాస్త్రంలోని అంశాలపై పట్టు చిక్కుతుంది. ఇంటర్మీడియెట్ పరీక్షలో మొదటి మూడు పాఠ్యాంశాల నుంచి కచ్చితంగా ఎనిమిది మార్కుల ప్రశ్నలు రెండు వస్తాయి.
  2. కర్బన రసాయన శాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ): కర్బన రసాయన శాస్త్రంలోని అంశాలు చాలా కష్టమని భావిస్తుంటారు. కానీ, క్రమపద్ధతిలో పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తే, ఎంతో సులువుగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారు రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించడానికి కారణం వారికి ఆర్గానిక్ కెమిస్ట్రీపై పట్టు చిక్కడమే! కెమికల్ బాండ్ పాఠ్యాంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు సులువుగా అర్థమవుతాయి. ఐసోమెరిజం, ఆల్కీనులు, ఆల్కైనులు, బెంజీన్, కార్బోనైల్ కాంపౌండ్స్, ఫినాల్ వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి.
మూలక రసాయన శాస్త్రం (ఇనార్గానిక్):
పీరియాడిక్ టేబుల్, స్టాకియోమెట్రీ వంటి అంశాలను క్షుణ్నంగా నేర్చుకుంటే మూలక రసాయన శాస్త్రం పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయి. రసాయన చర్యలను ప్రాక్టీస్ చేయాలి. వీటిని బట్టీపట్టకుండా రియాక్టంట్స్ ఏవి? ప్రొడక్ట్స్ ఏవి?అనే విషయాలను అర్థం చేసుకుంటూ సాధన చేయాలి. ఈ విషయంలో ఖ్ఛఛీౌ్ఠ చర్యలను సంతులనం (బ్యాలెన్స్) చేసే సామర్థ్యం ఎంతో ఉపయోగపడుతుంది.
-పి.విజయ్‌కిశోర్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
Published date : 25 Jul 2014 03:45PM

Photo Stories