Skip to main content

మెరుగైన మార్కులకు మార్గాలు.. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ప్రిపరేషన్ ప్లాన్

Bavithaఇంజనీర్, సైంటిస్ట్.. ఇలా రకరకాల ఆశలు, ఆశయాలు. వీటిని నెరవేర్చుకునేందుకు ఇంటర్ ఎంపీసీ తొలి సోపానం! దీన్ని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి, కోరుకున్న కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఎంసెట్, జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ఎంపీసీ సెకండియర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధనకు ప్రిపరేషన్ ప్రణాళిక..

ఇంటర్ సెకండియర్ ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ముఖ్యమైనవి. మార్కుల పరంగా చూస్తే మ్యాథమెటిక్స్‌కు 150 మార్కులు, ఫిజిక్స్‌కు 60 మార్కులు, కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఇప్పటి వరకు ఒకవైపు అకడమిక్ పరీక్షలకు సిద్ధమవుతూ, మరోవైపు ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమై ఉంటారు. ఇప్పటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై పూర్తిగా దృష్టిసారించాలి. విద్యార్థులు మ్యాథ్‌‌స, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్న లక్ష్యంతో చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

కీలకం- సెకండియర్:
మొదటి ఏడాదితో పోలిస్తే ద్వితీయ సంవత్సరం కీలకమైనది. విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వీలైనన్ని మోడల్ టెస్ట్‌లు రాయడంతో పాటు గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఉంది. అడ్వాన్స్‌డ్‌కి టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. విద్యార్థులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి.

చాప్టర్లను వదిలేయొద్దు:
సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతోనో లేదంటే సరైన టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్లో కొన్ని చాప్టర్లను చదవకుండా వదిలేస్తుంటారు. అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ ఫస్టియర్‌లో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న సెకండియర్ టాపిక్స్‌ను చదవాలి.

కచ్చితత్వానికి ప్రాధాన్యం:
సెకండియర్ ఎంపీసీలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు కచ్చితత్వం, సమయ పాలనకు ప్రాధాన్యమివ్వాలి. ఆయా కళాశాలల లెక్చరర్లను సంప్రదించి, గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన చాప్టర్లను గుర్తించాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, లెక్చరర్ నోట్స్ నుంచి చదవాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన సినాప్సిస్‌ను చదవడం, అన్ని రకాల సమస్యల్ని సాధించడం అనే లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలి.

అకాడమీ అసలైన అస్త్రం:
పరీక్షలకు చాలా కొద్ది సమయమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఐదారు పుస్తకాలను పోగేసుకొని చదవకుండా అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కి పరిమితమై వాటిలోని అంశాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్‌ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్‌ను చదవడం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తిచేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

కాన్సెప్టుల పట్టు పట్టాలి!
రోజులో కాలేజీ సమయాన్ని మినహాయించి ఒక విద్యార్థి ఆరు గంటలు చదువుకు కేటాయిస్తే అందులో మూడు గంటలు మ్యాథమెటిక్స్, గంటన్నర ఫిజిక్స్, గంటన్నర కెమిస్ట్రీకి కేటాయించాలి. పోటీ పరీక్షల్లో బేసిక్ కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ప్రతి అంశానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ పాయింట్స్‌ను ప్రత్యేకంగా నోట్సు రూపంలో రాసుకొని, నిర్దిష్ట సమస్య సాధనలో వాటి అప్లికేషన్స్‌ను గుర్తించాలి.

మ్యాథమెటిక్స్
Bavitha మ్యాథ్స్ 2-ఏ పేపర్‌కు 75 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో ఏడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఏడు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు పది ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్‌‌స 2-బీ పేపర్ కూడా ఇలాగే ఉంటుంది.

2-ఎలో ముఖ్యమైన చాప్టర్లు:
ద్విపద సిద్ధాంతం,
సంకీర్ణ సంఖ్యలు, De Moivre's సిద్ధాంతం.
స్టాటిస్టిక్స్.
సంభావ్యత.
ద్విపద సిద్ధాంతం చాప్టర్‌లో లఘు సమాధాన ప్రశ్నలలో మధ్య పదం కనుగొనడం, గరిష్ట పదం, స్థిర పదం, పదాల సంఖ్య తదితరాలపై దృష్టిసారించాలి.
ద్విపద సిద్ధాంతం అధ్యాయంలోని కొన్ని సమస్యలు సంక్లిష్టంగా ఉంటాయిగానీ, ఎక్కువ మార్కులు ఈ చాప్టర్‌కు కేటాయించారు కాబట్టి ప్రాక్టీస్‌కు అధిక సమయం వెచ్చించాలి.
సంభావ్యతలోని రెండు అధ్యాయాలు సిద్ధాంతపరంగానే కాకుండా మార్కుల పరంగా కూడా ముఖ్యమైనవి. సంభావ్యత సంకలన సిద్ధాంతం, ఇచ్చిన పట్టిక నుంచి స్థిర విలువ, మధ్యమం, విస్తృతి కనుగొనుట చాలా ముఖ్యమైనవి.
ప్రస్తారాలు, సంయోగాలు చాప్టర్ కష్టమైనదైనా, ఐపీఈకి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ చాప్టర్‌లో 4 మార్కులు, 2 మార్కుల ప్రశ్నలు మాత్రమే వస్తాయి.
థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, పాక్షిక భిన్నాలు, సాంఖ్యక శాస్త్రం.. మిగిలిన చాప్టర్లతో పోలిస్తే తేలికైనవి.

మ్యాథ్స్ 2-బి:
మ్యాథ్స్ 2-బీలో నిరూపక జ్యామితి, కలన గణితం రెండు విభాగాలూ ముఖ్యమైనవి. సిద్ధాంతాల పరంగా నిరూపక జ్యామితి ప్రధానమైనది అయితే కలన గణితం సూత్రాలు, వాటి అనువర్తనాల పరంగా ముఖ్యమైనది.
వృత్తాలు (22 మార్కులు).
నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు (33 మార్కులు).
అవకలన సమీకరణాలు (13 మార్కులు).
నిరూపక రేఖా జ్యామితిలో వృత్తాలు, శాంఖవాలు సిద్ధాంతపరమైనవి. వృత్తాలు అధ్యాయనాన్ని సమగ్రంగా చదివితే, శాంఖవాలు అధ్యాయం సగం అర్థమైనట్లే. వీటిలో భావనలు, విశ్లేషణలు, సంకేతాలు, సూత్రాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
2-బిలో వచ్చే ప్రశ్నలు దాదాపు నేరుగా, ఎలాంటి తికమకలు లేకుండా వస్తాయి.

ఫిజిక్స్
Bavitha సెకండియర్ ఫిజిక్స్ పేపర్ 60 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.
 1. సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డాప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది.
 2. మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
 3. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
ముఖ్యమైన యూనిట్లు:
వేవ్ మోషన్
కరెంట్ ఎలక్ట్రిసిటీ
న్యూక్లియర్ ఫిజిక్స్
ఎలక్ట్రో మాగ్నటిక్స్
రే ఆప్టిక్స్
సెమీ కండక్టర్ డివెసైస్

కెమిస్ట్రీ
Bavitha
 1. సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి.
 2. విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి.
 3. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. దీర్ఘ సమాధాన ప్రశ్నలు (8 మార్కులు) చాలా వరకు రెండు చాప్టర్ల నుంచి కలిపి (4 + 4) అడుగుతున్నారు.
 4. కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
ముఖ్యమైన చాప్టర్లు:
సాలిడ్ స్టేట్
సొల్యూషన్స్
ఎలక్ట్రో కెమిస్ట్రీ
సర్ఫేస్ కెమిస్ట్రీ
మెటలర్జీ
పి-బ్లాక్ ఎలిమెంట్స్
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్
కోఆర్డినేట్ కాంపౌండ్స్
ఆర్గానిక్ కాంపౌండ్స్

టిప్స్
 1. కనీసం రెండు ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి.
 2. పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 3. ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి.
 4. ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
 5. ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
 6. ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
 7. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి.
 8. విద్యార్థులు తప్పనిసరిగా మొదటి నుంచి దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు ఉదాహరణలపైనా దృష్టిసారించాలి.
 9. పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
 10. అతి విశ్వాసం అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
Published date : 23 Jan 2014 04:57PM

Photo Stories