Skip to main content

IFS Mains Preparation Strategy: ఈ 11 టిప్స్ ఫాలో అయితే విజయం మీదే!

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌).. సివిల్‌ సర్వీసెస్‌ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సర్వీస్‌గా గుర్తింపు! ఇది సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీ పడే పరీక్ష! ఇందులో విజయం సాధిస్తే.. అటవీ శాఖలో ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించే అద్భుత అవకాశం లభిస్తుంది! ఇంతటి కీలకమైన సర్వీసులోకి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి యూపీఎస్‌సీ ప్రతి ఏటా నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది! ఐఎఫ్‌ఎస్‌–2023కు సంబంధించి ఎంపిక ప్రక్రియలో రెండో దశ.. మెయిన్‌ పరీక్షలు నవంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్ష విధానం, విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం..
IFS Mains Preparation Strategy
  • నవంబర్‌ 26 నుంచి ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్షలు
  • పూర్తి డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షల నిర్వహణ
  • సబ్జెక్ట్, సమకాలీన పరిజ్ఞానంతో మెయిన్‌లో విజయం
  • రివిజన్, రైటింగ్‌ ప్రాక్టీస్‌పై దృష్టిపెట్టాలంటున్న నిపుణులు

సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ నేపథ్యం ఉండి సివిల్స్‌కు పోటీ పడే అభ్యర్థుల్లో అధిక శాతం మంది ఐఎఫ్‌ఎస్‌కు కూడా సిద్ధమవుతుంటారు. కారణం.. ఈ సర్వీసుకు ఉన్న ప్రాధాన్యం, లభించే హోదాలే! ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే. పరీక్షల క్లిష్టత కూడా సివిల్స్‌ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్‌ సాగించాలి అంటున్నారు నిపుణులు. 

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

మెయిన్స్‌కు 1958 మంది
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి..ప్రిలిమ్స్, మెయిన్, పర్సనాలిటీ టెస్ట్‌. తాజాగా ఐఎఫ్‌ఎస్‌–2023కు సంబంధించి మొత్తం 150 పోస్ట్‌ల భర్తీకి తొలిదశగా నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షలో 1958 మంది మెయిన్‌కు అర్హత సాధించారు. వీరికి నవంబర్‌ 26 నుంచి మెయిన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 

ఆరు పేపర్లు
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌.. పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు.. మొత్తంగా ఆరు పేపర్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్‌ 1– జనరల్‌ ఇంగ్లిష్‌ 300 మార్కులకు, పేపర్‌ 2– జనరల్‌ నాలెడ్జ్‌ 300 మార్కులకు ఉంటాయి. వీటితోపాటు అభ్యర్థులు ఎంచుకునే రెండు ఆఫ్షనల్‌ సబ్జెక్టులకు సంబంధించి పేపర్‌ 3, పేపర్‌ 4, పేపర్‌ 5, పేపర్‌ 6.. ఒక్కో పేపర్‌ 200 మార్కులకు చొప్పున నిర్వహిస్తారు. ఇలా మొత్తం 1400 మార్కులకు మెయిన్‌ పరీక్ష ఉంటుంది.

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక 
ఆప్షనల్స్‌కు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. అగ్రికల్చర్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటరినరీ సైన్స్‌; బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీలను ఆఫ్షనల్‌ సబ్జెక్టులుగా పేర్కొన్నారు. వీటిలో అగ్రికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటరినరీ సైన్స్‌; అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌; సబ్జెక్ట్‌ కాంబినేషన్లను ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌గా ఎంచుకునే వీలు లేదు. బీటెక్‌/బీఈ అభ్యర్థులు ఇంజనీరింగ్‌కు సంబంధించి ఒక సబ్జెక్ట్‌నే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఆప్షనల్‌గా వేరే విభాగాల్లోని సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.

చ‌ద‌వండి: Civil Service Exam Preparation Tips: ప్రిలిమ్స్‌పై.. పట్టు సాధించేలా!

సబ్జెక్ట్, సమకాలీనం
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్షలో మెరుగైన మార్కుల కోసం అభ్యర్థులు అకడమిక్‌ సబ్జెక్ట్‌లు, సమకాలీన అంశాల సమ్మేళంగా ప్రిపరేషన్‌ సాగించాలి. అకడమిక్‌గా బ్యాచిలర్, పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్లపై పట్టు సాధించాలి. అంతేకాకుండా వాటిని సమకాలీన పరిణామాలతో అన్వయించే నైపుణ్యం పెంచుకోవాలి.

సెకండ్‌ ఆప్షనల్‌.. స్పెషల్‌ కేర్‌
రెండు ఆప్షనల్స్‌లో.. అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకుంటున్నారు. రెండో ఆప్షనల్‌గా కొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్‌ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. 
అకడమిక్‌ నేపథ్యం ఉన్న ఆప్షనల్‌ ప్రిపరేషన్‌ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. తొలుత బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్‌ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. వీటిని ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి.

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

అప్లికేషన్‌ అప్రోచ్‌
మెయిన్‌ ప్రిపరేషన్‌లో అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్‌కు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ.. వాటికి సబ్జెక్ట్‌ నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యం సాధించాలి.

షార్ట్‌ కట్‌ మెథడ్స్‌
చదువుతున్న అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్, షార్ట్‌కట్‌ విధానంలో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్ట్‌లలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. సొంత నోట్స్‌తో పరీక్షకు ముందు రివిజన్‌ పరంగా సమయం ఆదా అవుతుంది.

జనరల్‌ నాలెడ్జ్‌.. ఇలా
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో అభ్యర్థులు బాగా దృష్టి పె­ట్టాల్సిన పేపర్‌.. జనరల్‌ నాలెడ్జ్‌. ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్‌ సబ్జెక్ట్‌లు మొదలు కాంటెంపరరీ ఇష్యూస్‌ వరకూ.. అనేక అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి దీంతోపాటు తాజా పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌
జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్, వొకాబ్యులరీ తదితర నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అదే విధంగా ప్రెసిస్‌ రైటింగ్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం పోటీ పరీక్షలకు నిర్దేశించిన ప్రామాణిక ఇంగ్లిష్‌ పుస్తకాలను, అదే విధంగా ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. 

సమ ప్రాధాన్యం
ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ అభ్యర్థులు.. అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైం ప్లాన్‌ రూపొందించుకోవాలి. రోజుకు కనీసం పది గంటలు ప్రిపరేషన్‌ కోసం కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం కేటాయించుకుని.. ఆ సమయంలోపు దాన్ని పూర్తి చేసి.. వెంటనే మరో సబ్జెక్ట్‌వైపు దృష్టి పెట్టాలి. 

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

రైటింగ్‌.. కీలకం
పరీక్షలో మెరుగైన ప్రదర్శనకు దోహదం చేసే టెక్నిక్‌.. రైటింగ్‌ ప్రాక్టీస్‌. అభ్యర్థులు ప్రతి రోజు ఒక సబ్జెక్ట్‌కు సంబంధించిన టాపిక్‌ను చదవడం పూర్తి చేశాక.. ఆ టాపిక్‌ను ‘ప్రశ్న – సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషణ రాసే లక్షణం అలవర్చుకోవాలి. ఫలితంగా తాము సదరు సబ్జెక్ట్, టాపిక్‌ పరంగా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునే వీలు లభిస్తుంది. అదే విధంగా తాము మెరుగు పరచుకోవాల్సిన నైపుణ్యాలపైనా అవగాహన ఏర్పడుతుంది. 

సైన్స్‌ నేపథ్యం
మెయిన్‌లో ఉత్తమ స్కోర్‌ కోసం సైన్స్‌ అభ్యర్థులు మరింత ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ సాగించాలి. సైన్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌లో కాన్సెప్ట్స్‌ నుంచి కాంటెంపరరీ ఇష్యూస్‌ వరకూ.. నైపుణ్యాలు పెంచుకుంటేనే విజయావకాశాలు మెరుగవుతాయి. ఇంజనీరింగ్‌ అభ్యర్థులు సైతం ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యమైన ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకుంటున్నా.. మరో ఆప్షనల్‌ విషయంలో ఎక్కువగా సైన్స్‌పై దృష్టి పెడుతున్నారు. 

చ‌ద‌వండి: Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!

Published date : 25 Oct 2023 06:12PM

Photo Stories