Skip to main content

UPSC IFoS Preparation Tips: ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌.. పరీక్ష విధానం, విజయం సాధించేందుకు మార్గాలు..

UPSC IFoS Preparation Tips and Exam Pattern
UPSC IFoS Preparation Tips and Exam Pattern

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌.. సంక్షిప్తంగా ఐఎఫ్‌ఎస్‌. అఖిల భారత సర్వీసుల్లో.. అత్యంత ఆదరణ కలిగిన సర్వీసు! సైన్స్, బీటెక్‌ ఉత్తీర్ణులు పోటీ పడే పరీక్ష! ఐఎఫ్‌ఎస్‌ హోదాతో..అటవీ శాఖలో.. డివిజినల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది! అందుకే.. ఈ పరీక్షకు ఏటా లక్షన్నర మందికిపైగా పోటీ పడుతుంటారు. మూడు దశల ఎంపిక ప్రక్రియలో.. సత్తా చాటితే.. ఉన్నత హోదాతోపాటు ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. తొలి దశ ప్రిలిమ్స్‌ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ.. నవంబర్‌ 20 నుంచి మెయిన్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్ష విధానం, విజయం సాధించేందుకు మార్గాలు.. 

  • ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమ్స్‌లో 1980 మంది ఉత్తీర్ణత
  • నవంబర్‌ 20 నుంచి పది రోజుల పాటు మెయిన్‌ పరీక్షలు
  • ఆల్‌ ఇండియా సర్వీసుల్లో కీలకమైన సర్వీస్‌గా ఐఎఫ్‌ఎస్‌
  • అకడమిక్, సమకాలీన సమ్మేళనంగా విజయం సాధించే అవకాశం

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌–2022కు సంబంధించి 151 పోస్ట్‌లతో యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తొలి దశ ప్రిలిమ్స్‌లో 1980 మంది అర్హత సాధించారు. రెండో దశ మెయిన్‌లోనూ సత్తా చాటితే.. చివరి దశగా పేర్కొనే పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. మెయిన్‌ పరీక్షలు నవంబర్‌ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి.

మెయిన్‌లో ఆరు పేపర్లు

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు మొత్తంగా ఆరు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ వివరాలు.. 

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
పేపర్‌–1 జనరల్‌ ఇంగ్లిష్‌ 300
పేపర్‌–2 జనరల్‌ నాలెడ్జ్‌ 300
పేపర్‌–3 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1) పేపర్‌–1 200
పేపర్‌–4 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(1)పేపర్‌–2 200
పేపర్‌–5 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–3 200
పేపర్‌–6 ఆప్షనల్‌ సబ్జెక్ట్‌(2)పేపర్‌–4 200
  • అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవాలి. ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో దానిలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఆప్షనల్స్‌ ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు ఆ జాబితాలోని సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • అంతేకాకుండా ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ కాంబినేషన్లను అనుమతించరు.

ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ల వివరాలు

అగ్రికల్చర్‌; అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; బోటనీ; కెమిస్ట్రీ; కెమికల్‌ ఇంజనీరింగ్‌; సివిల్‌ ఇంజనీరింగ్‌; ఫారెస్ట్రీ; జియాలజీ; మ్యాథమెటిక్స్‌; మెకానికల్‌ ఇంజనీరింగ్‌; ఫిజిక్స్‌; స్టాటిస్టిక్స్‌; జువాలజీ.

Competitive Exams Preparation Tips: కోచింగ్‌ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్‌!

ఈ సబ్జెక్ట్‌ల జోడి కుదరదు

  • అగ్రికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ వెటర్నరీ సైన్స్‌; –అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్రీ; –కెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌; –మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌.
  • ఇంజనీరింగ్‌ అభ్యర్థులు.. ఏదైనా ఒక ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌నే ఆప్షనల్‌గా ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఆప్షనల్‌గా.. వేరే విభాగాల్లోని సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి.

అకడమిక్‌+సమకాలీనం

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో విజయం సాధించాలంటే.. అకడమిక్, సమకాలీన అంశాల సమ్మేళనంగా ప్రిపరేషన్‌ సాగించాలి. అకడమిక్‌గా బ్యాచిలర్, పీజీ స్థాయిలో తాము చదివిన స్పెషలైజేషన్లపై పూర్తి పట్టు సాధించాలి. అదే విధంగా వాటిని సమకాలీన పరిస్థితులతో అన్వయం చేసుకునే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

రెండు ఆప్షనల్స్‌.. ప్రత్యేకంగా

  • ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థులు పరీక్ష విధానంలో భాగంగా రెండు ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి నాలుగు పేపర్లకు హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే.. ఆప్షనల్‌ పేపర్లకు అధిక వెయిటేజీ ఉందనే విషయం స్పష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లపై పట్టు సాధించే విధంగా నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యంలోని సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్‌ పూర్తిగా కొత్త సబ్జెక్ట్‌. ఎందుకంటే.. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా తీసుకోకూడదనే నిబంధన ఉంది. 
  • ఉదాహరణకు.. అగ్రికల్చర్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే వీలు లేదు. అదే విధంగా బీటెక్‌ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్‌ నేపథ్యం సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం లేదు. అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్‌ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో మెయిన్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి.

Competitive Exams Preparation Tips: జనరల్ ఎస్సేకు ఇలా సన్నద్ధమైతే.. కొలువు కొట్టడం సులువే!

అప్లికేషన్‌ దృక్పథం

ప్రిపరేషన్‌ సమయంలో అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్‌కు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్‌పై పట్టు సాధిస్తూనే.. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ.. వాటికి సబ్జెక్ట్‌ నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యం సాధిస్తూ ముందుకు సాగాలి. 

  • తమ అకడమిక్‌ నేపథ్యం ఉన్న సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంచుకున్న అభ్యర్థులు..బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్‌ వంటి వాటిపై అవగాహన పొందుతూనే.. వాటిని ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో అభ్యసనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

షార్ట్‌ కట్‌ మెథడ్స్‌

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు తాము చదివే అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్‌ రూపంలో షార్ట్‌కట్‌ మెథడ్‌లో సొంత నోట్స్‌ రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్ట్‌లలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. రివిజన్‌ పరంగా సమయం ఆదా అవుతుంది.

Civils Prelims Study Material

జనరల్‌ నాలెడ్జ్‌.. ఇలా

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌లో అభ్యర్థులు జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌పై బాగా దృష్టిపెట్టాలి. ఈ పేపర్‌లో హిస్టరీ,పాలిటీ,ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్‌ సబ్జెక్ట్‌లు మొదలు కాంటెంపరరీ ఇష్యూస్‌ వరకూ.. అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకుంటూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.

జనరల్‌ ఇంగ్లిష్‌

జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌ రీడింగ్, వొకాబ్యులరీ తదితర నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అదే విధంగా ప్రెసిస్‌ రైటింగ్‌పైనా పట్టు సాధించాలి.ఇందుకోసం పోటీ పరీక్షలకు నిర్దేశించిన ప్రామాణిక ఇంగ్లిష్‌ పుస్తకాలను, అదే విధంగా ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది.

రైటింగ్‌ ప్రాక్టీస్‌

ప్రిపరేషన్‌ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం.. రైటింగ్‌ ప్రాక్టీస్‌. ఇది పరీక్ష రోజు మెరుగైన ప్రదర్శనకు దోహదం చేస్తుంది. అభ్యర్థులు ప్రతి రోజు ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక టాపిక్‌ను చదవడం పూర్తి చేశాక.. ఆ టాపిక్‌పై ‘ప్రశ్న– సమాధానం’ కోణంలో స్వయంగా రాసి సరిచూసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా తాము సదరు సబ్జెక్ట్, టాపిక్‌ పరంగా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునే వీలు లభిస్తుంది. అదే విధంగా తాము ఇంకా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపైనా అవగాహన ఏర్పడుతుంది.

ప్రతి సబ్జెక్ట్‌కు కేటాయించేలా

అభ్యర్థులు ప్రిపరేషన్‌ పరంగా అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైం ప్లాన్‌ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం కేటాయించుకుని.. ఆ గడువు లోపు దాన్ని పూర్తి చేసి.. వెంటనే మరో సబ్జెక్ట్‌వైపు దృష్టిపెట్టాలి. ఇలా.. అక్టోబర్‌ చివరి వారం నాటికి సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన సమయం రివిజన్‌కు కేటాయించాలి.

Latest General Essays

సివిల్స్‌ + ఐఎఫ్‌ఎస్‌.. ఇలా

  • ఐఎఫ్‌ఎస్‌ అభ్యర్థుల్లో అధిక శాతం మంది సివిల్‌ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్‌ మెయిన్స్‌కు సైతం అర్హత సాధించిన అభ్యర్థులు.. తమ తొలి లక్ష్యమైన ఐఎఫ్‌ఎస్‌పైనే దృష్టి పెట్టాలనేది నిపుణుల అభిప్రాయం. 
  • రెండు పరీక్షలకు ఒకే ఆఫ్షనల్‌ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. 
  • ఈ ఏడాది సివిల్స్‌–మెయిన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 16 నుంచి, ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌ పరీక్షలు నవంబర్‌ 20 నుంచి మొదలు కానున్నాయి. దీంతో అభ్యర్థులు ముందుగా సివిల్స్‌ మెయిన్స్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రెండు పరీక్షల ప్రిపరేషన్‌ను సమన్వయం చేసుకునేలా సమయ పాలన పాటించాలి.
  • ఐఎఫ్‌ఎస్‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు.. ఆ సబ్జెక్ట్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్‌లో అదనంగా ఉండే జీఎస్‌ పేపర్లకు సమయం సరిపోకపోయినా ఆందోళన చెందకుండా ప్రిపరేషన్‌ సాగించాలి.

సైన్స్‌ నేపథ్యం

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న సైన్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మరింత ప్రత్యేకంగా అడుగులు వేయాలి. వాస్తవానికి సైన్స్‌ బ్యాచిలర్‌ డిగ్రీనే కాకుండా.. బీటెక్‌లోని పలు బ్రాంచ్‌ల వారికి ఐఎఫ్‌ఎస్‌కు అర్హత కల్పిస్తున్నారు. సక్సెస్‌ రేట్‌ కోణంలో ఇంజనీరింగ్‌ అభ్యర్థులు కొంత ముందంజలో నిలుస్తున్నట్లు గత ఫలితాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సైన్స్‌ విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన చెందకుండా.. ప్రత్యేక వ్యూహం అనుసరిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సైన్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్ట్స్‌లో కాన్సెప్ట్స్‌ నుంచి కాంటెంపరరీ ఇష్యూస్‌ వరకూ.. నైపుణ్యాలు పెంచుకుంటే సక్సెస్‌ సాధ్యమే. ఇంజనీరింగ్‌ విద్యార్థులు సైతం ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్‌ నేపథ్యమైన ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటున్నా.. మరో ఆప్షనల్‌ విషయంలో ఎక్కువగా సైన్స్‌పై దృష్టి పెడుతున్నారు. కాబట్టి సైన్స్, మ్యాథ్స్‌ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు.

ఐఎఫ్‌ఎస్‌ మెయిన్‌–2022 ముఖ్యాంశాలు

  • నవంబర్‌ 20 నుంచి పది రోజుల పాటు పరీక్షలు
  • ఆరు పేపర్లుగా మెయిన్‌ ఎగ్జామినేషన్‌
  • మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా చివరి దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in

Civils Prelims Video Classes

Published date : 11 Jul 2022 04:52PM

Photo Stories