IFS: పరీక్ష స్వరూపం, విజయానికి నిపుణుల సలహాలు...
ఐఎఫ్‌ఎస్‌కు పోటీపడుతున్న ప్రతిభావంతుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్–2021 ద్వారా మొత్తం 110 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి తొలి దశ ప్రిలిమ్స్‌లో 1,357 మంది అర్హత సాధించారు. వీరికి ఫిబ్రవరి 27 నుంచి పది రోజుల పాటు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మూడు దశలు ఇవే
- ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక ప్రక్రియలో మూడు దశలు..ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వూ్య ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌గానూ పేర్కొంటున్నారు. అంటే.. ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులు.. సివిల్స్ ప్రిలిమ్స్ రాసి అందులో ఉత్తీర్ణత ఆధారంగా ఐఎఫ్‌ఎస్ మెయిన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
- మెయిన్ ఎగ్జామినేషన్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మలి దశలో 300 మార్కులకు ఇంటర్వూ్య నిర్వహించి.. తుది జాబితా విడుదల చేస్తారు. పేర్కొన్న ఖాళీలకు అనుగుణంగా 1:2 లేదా 1:2.5 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వూ్యకు ఎంపిక చేస్తారు.
మెయిన్ ఇలా
ఐఎఫ్‌ఎస్ మెయిన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు రాయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు..
పేపర్ |
సబ్జెక్ట్ |
మార్కులు |
పేపర్–1 |
జనరల్ ఇంగ్లిష్ |
300 |
పేపర్–2 |
జనరల్ నాలెడ్జ్ |
300 |
పేపర్–3 |
ఆప్షనల్ సబ్జెక్ట్(1)పేపర్–1 |
200 |
పేపర్–4 |
ఆప్షనల్ సబ్జెక్ట్(1)పేపర్–2 |
200 |
పేపర్–5 |
ఆప్షనల్ సబ్జెక్ట్(2)పేపర్–3 |
200 |
పేపర్–6 |
ఆప్షనల్ సబ్జెక్ట్(2)పేపర్–4 |
200 |
అభ్యర్థులు ఏవైనా రెండు సబ్జెక్ట్‌లను ఆప్షనల్ సబ్జెక్ట్‌లుగా ఎంపిక చేసుకోవాలి.ఇలా ఎంపిక చేసుకున్న రెండు సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లలో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఆప్షనల్ సబ్జెక్ట్‌ల ఎంపికకు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్ట్‌లను పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిలోంచే ఆప్షనల్ సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్‌ల ఎంపిక విషయంలో కొన్ని సబ్జెక్ట్‌ల కాంబినేషన్లను అనుమతించరు.
విజయం సాధించండిలా
ఐఎఫ్‌ఎస్ మెయిన్ ఎగ్జామ్ తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 27, 2022 నుంచి పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. అంటే..అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం రెండు నెలలు మాత్రమే. ఈ సమయంలో పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండో ఆప్షనల్‌పై ప్రత్యేక శ్రద్ధ
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు రెండో ఆప్షనల్ సబ్జెక్ట్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులంతా.. ఒక ఆప్షనల్‌ను తమ అకడెమిక్ సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్ పూర్తిగా కొత్త సబ్జెక్ట్. ఈ రెండో ఆఫ్షనల్‌పై ప్రస్తుత సమయంలో ఎక్కువగా ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
అప్లికేషన్ ఓరియెంటేషన్
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్ట్‌కు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్‌పై పట్టు సాధిస్తూనే.. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ.. వాటికి సబ్జెక్ట్ నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యం సాధిస్తూ ముందుకు సాగాలి.
ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్
బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్ వంటి వాటిపై అవగాహన పొందుతూనే.. వాటిని ప్రాక్టికల్ అప్రోచ్‌తో అభ్యసనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు తాము చదివే అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్ రూపంలో షార్ట్‌కట్ మెథడ్‌లో సొంత నోట్స్‌లో రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ,కెమికల్ ఇంజనీరింగ్,జువాలజీ, బోటనీ సబ్జెక్ట్‌లలో ఇది ఎంతో ఉపకరిస్తుంది. రివిజన్ పరంగా సమయం కూడా ఆదా అవుతుంది.
జీకే.. జనరల్‌గా
ఐఎఫ్‌ఎస్ మెయిన్‌లో అభ్యర్థులు అధికంగా దృష్టి పెట్టాల్సిన పేపర్.. జనరల్ నాలెడ్జ్. ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ మొదలు సమకాలీన పరిణామాల వరకూ.. అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
జనరల్ ఇంగ్లిష్
జనరల్ ఇంగ్లిష్‌కు సంబంధించి ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, ప్యాసేజ్ రీడింగ్, వొకాబ్యులరీ తదితర నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అదే విధంగా ప్రెసిస్ రైటింగ్‌పైనా పట్టు సాధించాలి. ఇందుకోసం కాంపిటీటివ్ పరీక్షలకు నిర్దేశించిన ప్రామాణిక ఇంగ్లిష్ పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ న్యూస్ పేపర్లను అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది.
రైటింగ్ ప్రాక్టీస్
ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం.. రైటింగ్ ప్రాక్టీస్. ఇది పరీక్ష రోజు మెరుగైన ప్రదర్శనకు దోహదం చేస్తుంది. అభ్యర్థులు ప్రతి రోజు ఒక సబ్జెక్ట్‌కు సంబంధించిన ఏదైనా టాపిక్‌ను చదవడం పూర్తి చేశాక.. ఆ టాపిక్‌ను ‘ప్రశ్న– సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషణ రాసే లక్షణం అలవర్చుకోవాలి. ఫలితంగా తాము సదరు సబ్జెక్ట్, టాపిక్ పరంగా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునే వీలు లభిస్తుంది. అదే విధంగా తాము మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపైనా అవగాహన ఏర్పడుతుంది.
అన్ని సబ్జెక్ట్‌లకు సమయం
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్ట్‌లకు సమయం కేటాయించేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. ఆ సమయంలోపు నిర్దేశిత టాపిక్ పూర్తి చేసి.. వెంటనే మరో సబ్జెక్ట్‌వైపు దృష్టి పెట్టాలి. ఇలా.. జనవరి చివరి వారం నాటికి సబ్జెక్ట్ ప్రిపరేషన్ పూర్తి చేసుకొని.. ఆ తర్వాత రివిజన్‌కు సమయం కేటాయించే విధంగా వ్యవహరించాలి.
సైన్స్ నేపథ్యం
సైన్స్ విద్యార్థులు, ఇంజనీరింగ్ అభ్యర్థులతో పోల్చుకొని ఆందోళన చెందకుండా.. ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌లో కాన్సెప్ట్స్ నుంచి కాంటెంపరరీ ఇష్యూస్ వరకూ.. అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం ఒక ఆప్షనల్‌ను తమ అకడెమిక్ నేపథ్యమైన ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల నుంచి ఎంపిక చేసుకుంటున్నా.. మరో ఆప్షనల్ ఎక్కువగా సైన్స్ నుంచే ఎంచుకుంటున్నారు. కాబట్టి సైన్స్, మ్యాథ్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు.
ఐఎఫ్‌ఎస్ మెయిన్–ముఖ్య సమాచారం
- ఫిబ్రవరి 27, 2022 నుంచి పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.
- ఐఎఫ్‌ఎస్ మెయిన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటుంది.
- జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌తోపాటు రెండు ఆప్షనల్ సబ్జెక్ట్‌లలో నాలుగు పేపర్లు రాయాల్సి ఉంటుంది.
- వెబ్‌సైట్: https://upsconline.nic.in
ప్రాక్టీస్ ప్రధానం
ఐఎఫ్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు మెయిన్ పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌తోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఫలితంగా పరీక్ష రోజు అనుసరించాల్సిన తీరుపై అవగాహన ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు బలాలు, బలహీనతలు తెలుసుకుంటూ.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహాన్ని మార్చుకోవాలి.
–శశిధర్ రెడ్డి, ఐఎఫ్‌ఎస్–2019 విజేత