Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం.. తొలి తెలుగు చరిత్రకారుడు ఏకామ్రనాథుడు
పద్మనాయకులు తాము శివ దేవతాపారాయణులమని చెప్పుకున్నారు. ఒకటో అనపోతానాయకుడు శైవమతాభిమాని. ఆయన ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వార మండపాన్ని కట్టించాడు. అనేక శివాలయాలను నిర్మించాడు. కానీ రెండోసింగభూపాలుడి కాలం నుంచి వైష్ణవ మత ప్రాధాన్యం పెరిగింది. వేదాంత దేశికులు వైష్ణవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. వైష్ణవం వడగల్, తెంగల్ అనే శాఖలుగా చీలిపోయింది.
కాకతీయానంతర యుగం
భాష–సాహిత్యం
దేవగిరి యాదవులు, కాకతీయులపై ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర సమయంలో ఉర్దూ భాష దక్కన్ ప్రాంతంలో ప్రవేశించింది. ఉర్దూ భాష ఈ ప్రాంతంలో దక్కనీ ఉర్దూగా మారింది.తెలంగాణ భాషా సాహిత్యాలపై తనదైన ముద్ర వేసింది. పద్మనాయకుల రాజ్యంలో సంస్కృతంతోపాటు, తెలుగు భాషా సాహిత్యాలు ఆదరణ పొందాయి. సర్వజ్ఞ సింగభూపాలుడు రచించిన సారంగధరచరిత్రను తొలి యక్షగానంగా భావించవచ్చు. ఇతణ్నే ఒకటో సింగ భూపాలుడిగా పిలుస్తారు. అతడి కుమారుడైన అనపోతానాయకుడు రాచకొండ రాజ్యాన్ని విస్తరించాడు. అన పోతానాయకుడు కవి పండిత పోషకుడు. ఇతడు ‘అభిరామ రాఘవమ’నే నాటకాన్ని రాశాడు.
విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. దీన్ని సంస్కృత లక్షణ గ్రంథాలైన ధ్వన్యాలోకం, కావ్య ప్రకాశంతో పోల్చవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణం తరహాలోనే ఈ గ్రంథంలోని శ్లోకాలు కూడా సింగ భూపాలుడి ప్రశంసతో ఉన్నాయి. ఈ గ్రంథం నాటి చారిత్రక విషయాలను తెలుపుతోంది. వీరభద్ర విజృంభణం(డిమం), కరుణాకందళం (అంకం) ఇతడి ఇతర రచనలు. విశ్వేశ్వరుడు.. అనపోతానాయకుడి, రెండో సింగ భూపాలుడి ఆస్థానాల్లోనూ స్థానం పొందాడు. అనపోతనాయకుడి మరో ఆస్థానకవి పశుపతి నాగనాథ కవి. ఇతడు విశ్వేశ్వరుడి శిష్యుడు. ఇతడు మదన విలాసం(సంస్కృతం), విష్ణుపురాణం అనే గ్రంథాలను రచించాడు. మదన విలాసంలో పద్మనాయకుల చరిత్ర విశేషాలు కనిపిస్తాయి. ధర్మపురికి చెందిన గొప్ప పండితుడు నరసింహసూరి. ఇతడు విద్యారణ్య స్వామి సమకాలికుడు. ఇతడు ప్రయోగపారిజాతం అనే స్మృతి గ్రంథాన్ని రచించాడు.
అనపోతానాయకుడి కుమారుడైన రెండో సింగ భూపాలుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి. ఇతడికి సంగీతం, నాటకం, నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. విశ్వేశ్వరుడు, నాగనాథుడు, బొమ్మకంటి అప్పయాచార్యుడు, శాకల్య మల్ల భట్టు తదితర కవి పండితులను పోషించాడు. రెండో సింగభూపాలుడు రసార్ణవ సుధాకరమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇతడి మరో ప్రసిద్ధ గ్రంథం సంగీత సుధాకరం. కందర్ప సంభవం అనే డిమం (నాటక భేదం)ను, కువలయావళి అనే నాటికను ఇతడు రచించాడు.
రాచకొండకు చెందిన మరో కవి మాధవ భూపాలుడు(రావుమాదానీడు). ఇతడు రామాయణానికి రాఘవీయ వ్యాఖ్య రాశాడు. ఇతడే 1376లో శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర బృహత్ శిలా మండపం కట్టించాడు. మాయిభట్టు దీనికి శాసనం రాశాడు. ఈ శాసన కావ్యంలో 28 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మాధవ నాయకుడి శౌర్య పరాక్రమాలను వర్ణించారు. మాధవ భూపాలుడి భార్య నాగాంబిక. ఈమె ఒక తటాకాన్ని నిర్మించింది. దాని కోసం 1429లో నాగారం శాసనాన్ని వేయించింది. ఈ శాసన రచయిత శంభునాథ కవి.
పద్మనాయకులతో సంబంధం లేకపోయినా ఈ యుగానికి చెందినవాడు కందనామాత్యుడు. ఇతడు సబ్బినాడు(కరీంనగర్, వరంగల్) పాలకుడైన ముప్ప భూపాలుడి మంత్రి. పద్మపురాణం, భాగవత దశమ స్కంధాలను మడికి సింగన, కందనామాత్యుడికి అంకితమిచ్చాడు.కందనామ్యాతుడు రచించిన నీతితారావళి ద్వారా ఆ కాలం నాటి వ్యక్తుల ప్రవర్తనను తెలుసుకోవచ్చు. మడికి సింగన రచించిన ‘సకలనీతి సమ్మతం’ తెలుగులో తొలి సంకలన గ్రంథం. కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది కవులపేర్లు ఈ గ్రంథం ద్వారా తెలుస్తున్నాయి. 21 గ్రంథాల నుంచి లోక, రాజనీతులను సంపుటీకరించిన గ్రంథమిది. ఇతడు పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం, జ్ఞానవాసిష్ట రామాయణం తదితర రచనలు చేశాడు.
తొలి కవయిత్రి గంగాదేవి
ఈ యుగానికి చెందిన తొలి కవయిత్రి గంగాదేవి. కాకతీయుల ఆడపడచు అయిన గంగాదేవి విజయనగర రాజైన బుక్కరాయల కోడలు. కంపరాయల భార్య. ఈమె సంస్కృతంలో ‘మధురావిజయ’మనే కావ్యాన్ని రచించింది. నాగేంద్రకవి తొలి శతకాల్లో ఒకటిగా పేర్కొనదగిన రమాధీశ్వర శతకాన్ని రచించాడు. ఇతడు భువనగిరికి చెందినవాడు. కవి భల్లటుడు గణమంజరి, పదమంజరి, శూద్రక రాజ చరిత్ర, భేతాళ పంచవింశతి, విక్రమార్క చరిత్ర (తెలుగు) అనే కావ్యాలను రాశాడు.
పోతన కొంత కాలం మూడో సింగభూపాలుడి ఆస్థానంలో ఉన్నాడు. పోతనను ఒంటిమిట్ట నుంచి ఓరుగల్లు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. దేశీఛందస్సును పాల్కురికి ప్రవేశపెట్టాడు. పోతన దీన్ని స్వీకరించలేదు. కానీ దేశీ కవిత్వంలోని సరళత్వం ఇతడి కవిత్వంలో కనిపిస్తుంది. పోతన భోగీనీ దండకంలో నాటి రాజుల భోగలాలసత్వాన్ని వర్ణించాడు. ఇతడు రాజాశ్రయాన్ని తిరస్కరించి ప్రత్యామ్నాయ సంస్కృతికి పట్టం కట్టాడు. మూడో సర్వజ్ఞ సింగభూపాలుడు స్వయంగా గొప్ప పండితుడు. వెలుగోటి వంశావళిలో పేర్కొన్న శ్రీనాథుడి పద్యం ద్వారా ఈ విషయం తెలుస్తోంది. మల్లినాథసూరి మెదక్ జిల్లా కొలిచెలిమకు చెందినవాడు. ఇతడు రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధకు వ్యాఖ్యానాలు రాశాడు. మల్లినాథసూరి తమ్ముడైన పెద్దిభట్టు సంస్కృతంలో గొప్ప పండితుడు. పెద్దిభట్టు కుమారుడైన కొలిచెలిమ కుమారస్వామి సోమపీథి(సోమయాజి) కూడా గొప్ప వ్యాఖ్యాత. ఇతడు ప్రతాపరుద్రీయానికి రత్నాపణం అనే వ్యాఖ్యానం రాశాడు. రాచకొండకు చెందిన బొమ్మకంటి హరిహరుడు అనర్గరాఘవానికి వ్యాఖ్య రాశాడు.
చదవండి: Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం... రాజధానిని రాచకొండకు మార్చింది...
నాథ సంప్రదాయం
రాచకొండ మంత్రుల వంశానికి చెందిన గౌరన ఈ యుగానికి చెందిన మరో గొప్పకవి. పాల్కురికి ‘ద్విపద’ను స్వీకరించి హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్రలను రచించాడు. ఇతడు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా నాథ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. అది తెలంగాణ, రాయలసీమల్లో విశేష ప్రాచుర్యం పొందింది. నాథ సంప్రదాయం విగ్రహారాధన, కులతత్త్వాన్ని నిరసించింది. దేవరకొండకు చెందిన సూరన తొలి కల్పిత కావ్యమైన ధనాభిరామాన్ని రచించాడు. గౌరన కుమారుడైన భైరవకవి తెలంగాణలో బంధకవిత్వ ప్రక్రియకు ఆద్యుడు. ఇతడు శ్రీ రంగమహాత్మ్యం, రత్నపరీక్ష, కవి గజాంకుశం (ఛందోగ్రంథం)ను రచించాడు.
అనంతామాత్యుడు భోజరాజీయ కావ్యం, ఛందోదర్పణం, రసాభరణం అనే గ్రంథాలను రచించాడు. ఏర్చూరి సింగన భాగవత షష్ఠమస్కం«ధాన్ని రాశాడు. ఇతడు నల్లగొండ జిల్లాలోని ఏరూర్చుకు చెందినవాడు. ఇతడి మరో రచన కువలయాశ్వ చరిత్ర. బొప్పరాజు గంగన పంచమస్కంధను రచించాడు.
రేచర్ల రెడ్డి వంశస్థుల రాజధాని పిల్లలమర్రి. ఇది పిన వీరభద్రుడి జన్మస్థలం. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకున్న మహాకవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఇతడు అవతారదర్పణం, నారదీయ పురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాససారం, శృంగార శాకుంతలం, జైమినీ భారతం అనే గ్రంథాలను రచించాడు. ప్రబంధాల్లో కనిపించే అనేక వర్ణనలకు, పద్యాల ఎత్తుగడలకూ ఒరవడి సృష్టించిన మార్గదర్శి పినవీరభద్రుడు.
కొలని గణపతి దేవుడు శివయోగసారం, మనోబోధ రచించాడు. కాకతీయ సామ్రాజ్య చరిత్రలో కొన్ని ఘట్టాలకు శివయోగసారం ఆధారం. భాగవతంలోని షష్ట, ఏకాదశ, ద్వాదశ స్కంధాలను పోతన అనువదించలేదు. వీటిని హరిభట్టు అనువదించాడు. రతి రహస్యం, వరాహపురాణం, మత్స్యపురాణం, నారసింహపురాణం ఇతడి ఇతర రచనలు. త్రిలోకభేది సకల ధర్మసారం రాశాడు. ఇతడు గౌరన మనవడు. రాజుల మొప్పు కోసం కవులు.. అవధానం, సమస్య పూరణం, గర్భ, గోప్య, బంధ, అక్షరచ్యుత, మాత్రాచ్యుత, ఏక, ద్విసంధాదారణ ప్రక్రియలను అనుసరించడం ఈ కాలం నుంచే మొదలైంది.
చదవండి: Telangana History for Competitive Exams: బహమనీ రాజ్యస్థాపనకు సహాయం చేసిందెవరు?
ఏకామ్రనాథుడు
కాకతీయ రాజుల చరిత్ర, వంశావళి, వారి పూర్వీకుల క్రమాభివృద్ధి తదితరాలను తెలిపేందుకు ఏకామ్రనాథుడు ప్రయత్నించాడు. ఇతడు తొలి తెలుగు చరిత్రకారుడు. ఓరుగల్లుకు చెందిన ఇతడు ప్రతాపరుద్ర చరిత్రం, ద్వాత్రింశత్సాలభంజికల కథలు అనే గ్రంథాలను రచించాడని తెలుస్తోంది. ప్రతాపరుద్ర చరిత్రం తెలుగులో తొలి వచన రచన. తొలి చారిత్రక గ్రంథం. కాకతీయుల వివరాలతో పాటు నాటి మతాలు, మత వైషమ్యాలు, సంప్రదాయాలు, సాంఘిక ఆచారాలు, సంప్రదాయాలను ఇందులో పేర్కొన్నారు. ప్రతాపరుద్రుడి దినచర్య, వ్యక్తిత్వాన్ని గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. ఓరుగల్లు సమీపంలోని వివిధ వర్ణాల, వృత్తుల వారి సంఖ్య తదితర విషయాలను ఈ గ్రంథం తెలుపుతోంది. ప్రతాపరుద్ర చరిత్రం ఆనాటి సాంఘిక చరిత్ర.
కొరవి గోపరాజు
పాల్కురికి రచనల తర్వాత తెలంగాణ సాంఘిక జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన కావ్యం ‘సింహాసన ద్వాత్రింశిక’. దీని రచయిత కొరవి గోపరాజు. ఇతడు నిజామాబాద్ జిల్లా వేముగల్లు (భీమగల్లు)కు చెందినవాడు. ఇతడి పూర్వీకులు రాచకొండలో మంత్రులుగా పనిచేశారు. సింహాసన ద్వాత్రింశికకు విక్రమార్క చరిత్ర అనే సంస్కృత కావ్యం మూలం. కానీ గోపరాజు అనేక కల్పనలు చేసి దీన్ని స్వతంత్ర కావ్యంగా రూపొందించాడు. అందుకే ఈ గ్రంథంలో నాటి సాంఘిక జీవితాన్ని చిత్రించడం సాధ్యమైంది. గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో పేద, ధనిక తారతమ్యాలను చక్కగా వర్ణించాడు. మనసు లోతుల్ని విశ్లేషించిన తొలి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తగా ఫ్రాయిడ్‌ను పేర్కొంటారు. కానీ శతాబ్దాల ముందే కొరవి గోపరాజు మనసు లోతుల్ని, కలల్ని విశ్లేషించాడు. సింహాసన ద్వాత్రింశిక తెలంగాణ గొప్ప కావ్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
పిడుపర్తి కవులు పాల్కురికి మార్గంలో శైవ సాహిత్యాన్ని విరివిగా రాశారు. ఓరుగల్లుకు చెందిన పిడుపర్తి ఒకటో బసవకవి పిల్లనైనారుకథ, బ్రహ్మాత్తర ఖండంతోపాటు గురుదీక్షాబోధను రచించాడు. ఇతడి పెద తండ్రి కుమారుడైన పిడుపర్తి నిమ్మనాథుడు ‘నిజ లింగ చిక్కయ్య కథ’ అనే యక్షగానాన్ని రచించాడు. రెండో సోమనాథుడు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్రను పద్య ప్రబంధంగా రచించాడు. ఇతడు ఒకటో బసవకవి కుమారుడు. ఇతడే ‘ప్రభులింగలీలలు’ అనే ద్విపద కావ్యాన్ని కూడా రచించాడు. పిడుపర్తి రెండో బసవ కవి దీన్నే పద్యకావ్యంగా కూర్చాడు. ఇతడు ఒకటో బసవకవి మనవడు.
చదవండి: Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం
మత పరిస్థితులు
ఈ యుగంలో శైవమత ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వైష్ణవ మతం కూడా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు మతాల మధ్య వివాదాలు తలెత్తేవి. పద్మనాయకుల ఆస్థానంలోని శాకల్య భట్టు, పరాశర భట్టు మధ్య జరిగిన వివాదమే అందుకు నిదర్శనం. పద్మనాయకులు తాము శివ దేవతాపారాయణులమని చెప్పుకున్నారు. ఒకటో అనపోతానాయకుడు శైవమతాభిమాని. ఆయన ఉమామహేశ్వరం వద్ద శ్రీశైల ఉత్తర ద్వార మండపాన్ని నిర్మించాడు. అనేక శివాలయాలు, శ్రీ పర్వత శిఖరానికి సోపానాలు నిర్మించాడు. తొలి పద్మనాయకులు శైవమతాన్ని ఆదరించారు. కానీ రెండో సింగభూపాలుడి కాలం నుంచి వైష్ణవ మత ప్రాధాన్యం పెరిగింది. రెండో అనపోతానాయకుడు రామాలయం నిర్మించాడు. రావు మాదానీడు రాఘవీయ వ్యాఖ్య రాశాడు, శ్రీ రంగనాథుడికి దానాలిచ్చాడు. మూడో సింగ భూపాలుడు బెల్లంకొండ, తిరుపతి శాసనాలు వేయించాడు. వసంత నాయకుడు కంజీవర శాసనాన్ని, ధర్మానాయకుడు శాయంపేట శాసనాన్ని వేయించాడు. ఇవన్నీ వైష్ణవ మత ఉన్నతిని సూచిస్తున్నాయి.
వేదాంత దేశికులు వైష్ణవ మత వ్యాప్తికి తోడ్పడ్డారు. వీరు సుభాషిత నీతి, తత్త్వ సందేశ, రహస్య సందేశ గ్రంథాలను రచించారు. వైష్ణవం వడగల్, తెంగల్ అనే శాఖలుగా చీలిపోయింది. వేదాంత దేశికులు వడగల్ శాఖను ప్రచారం చేశారు. ఈ శాఖకు చెందిన వారు వైదిక ఆచార వ్యవహారాలను పాటించేవారు. ఈ శాఖ తెలంగాణ అంతటా వ్యాపించింది. మత ప్రచారం కోసం మఠాలను నిర్మించేవారు. వైదిక, పురాణ దేవతలతోపాటు కట్టమైసమ్మ, రేణుక, ముత్యాలమ్మ, మైసమ్మ, మారెమ్మ, ఏకవీర దేవతలకు కూడా ఆలయాలు నిర్మించేవారు. యక్షగానాలు, భాగోతుల ప్రాచుర్యం కూడా వైష్ణవ మత వ్యాప్తిని సూచిస్తున్నాయి. బహమనీ సుల్తాన్‌లు మత అసహనాన్ని ప్రదర్శించారు. హుమాయూన్ జలీం షా పిల్లలమర్రి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. బహమనీ సుల్తాన్ల చర్యలకు మత కారణాలే కాక రాజకీయ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. వీరి దాడుల నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి లక్షలాది మంది ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీన్నిబట్టి తెలుగు ప్రజల ఇస్లామీకరణ ఈ కాలం నుంచే మొదలైందని తెలుస్తోంది.
వాస్తు, శిల్పకళ
పద్మనాయకులు కాకతీయుల శిల్పకళను అనుసరించారు. వీరి నిర్మాణాల్లో రాచకొండ, దేవరకొండ దుర్గాలు ప్రముఖమైనవి.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత
చదవండి: Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?