Skip to main content

Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం

telangana history study material  for Competitive Exams
telangana history study material for Competitive Exams

కాకతీయ యుగ విశేషాలు
భాషాసాహిత్యాలు 

కాకతీయులు తెలుగుభాషను ఆదరించడం మొదటి ప్రోలరాజు తర్వాతే మొదలైంది. అప్పటి వరకు ఉన్న శాసనాలు కన్నడం, సంస్కృత భాషల్లో ఉన్నాయి. రెండో బేతరాజు తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించాడు. కానీ నన్నయకు ముందే వృత్త పద్యాలు వాడిన తొలి తెలుగు శాసనం ఇటీవలే బయల్పడింది. అది విరియాల కామసాని వేయించిన గూడూరి శాసనం(క్రీ.శ 1000). ఈ యుగంలో కనిపించే ప్రసిద్ధ శాసన కవులు అచింతేంద్రయతి, వెల్లంకి గంగాధర మంత్రి, నాగదేవకవి, బ్రహ్మశివకవి, మల్లపురాజు, కవిచక్రవర్తి, అభినవ మయూర సూరి, రెండో∙ఈశ్వర భట్టోపాధ్యాయుడు. కాకతీయుల కాలం తెలంగాణ సాహిత్యంలో స్వర్ణయుగం. కాకతీయులతో సంబంధం లేకపోయినా ఈ యుగంలో కనిపించే తొలి ప్రముఖ కవి వేములవాడ భీమకవి.

Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం

ఆదికవి పాల్కురికి

తెలుగులో తొలిసారి స్వతంత్ర రచన చేసిన పాల్కురికి సోమనాథుడు(1160–1240) తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. పాల్కురికి కంటే ముందే రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ కాలంలోనే భువనగిరి ప్రాంతానికి చెందిన నరహరి (సరస్వతీ తీర్థముని) మమ్మటుని కావ్యప్రకాశానికి బాల చిత్తానురంజనమనే వ్యాఖ్యానాన్ని, స్మృతి దర్పణం, తర్క రత్నాకరం అనే గ్రంథాలను రచించాడు.
జాయపసేనాని పాల్కురికి తర్వాతి కాలానికి చెందిన కవి. ఇతడు గణపతిదేవుడి బావమరిది. ఇతడు నృత్త రత్నావళి గ్రంథంలో భరతుడి మార్గ నృత్యంతో పాటు ఆనాటి దేశీ నృత్యం గురించి వివరించాడు. చిందు, పేరణి, ప్రేంఖణ, వికటం, కందుక, బహురూప కోల్లాట, ఖాండిక మొదలైన దేశీ నృత్యరీతుల వివరణలు నాటి తెలంగాణ నృత్య, నాట్యరీతుల్ని తెలుపుతున్నాయి. చక్రపాణి రంగనాథుడు పాల్కురికి శిష్యుడు. ఇతడు శివభక్తి దీపిక, గిరిజాధినాయక శతకం లాంటి రచనల్లో పాల్కురికి మార్గాన్ని అనుసరించాడు. విశ్వేశ్వర దేశికుడు (శివదేవుడు) గణపతిదేవుడి  దీక్షాగురువు. రుద్రమదేవి పాలనను, ప్రతాపరుద్రుడి యువరాజత్వాన్ని ప్రశంసించిన ఈ విద్వత్కవి శివతత్త్వ రసాయనం అనే గ్రంథాన్ని రచించాడు. పాల్కురికి తర్వాత పేర్కొనదగిన గొప్పకవి కృష్ణమాచార్యులు(1268–1323). తెలుగులో తొలి వచనాలైన ‘సింహగిరి వచనాలు’ రచించాడు. కృష్ణమాచా ర్యులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవాడు. ఇతణ్ని తెలంగాణలో తొలి వైష్ణవ కవిగా భావించవచ్చు. కొలని రుద్రదేవుడు(రుద్రుడు) ఓరుగల్లు నివాసి. ఇతడు ‘రాజరుద్రీయం’ను రచించాడు. ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేశాడు.

Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?

కవిపోషకుడు.. ప్రతాపరుద్రుడు

విద్యానాథుడు, విశ్వనాథుడు, శాకల్యమల్లన, శరభాంకుడు, శివదేవయ్య లాంటి పేరొందిన కవి పండితులు ప్రతాపరుద్రుడి ఆశ్రయం పొందారు. గుండయభట్టు అనే విద్వాంసుడు, సకల శాస్త్రవేత్త వీరభల్లట దేశికుడు, నరసింహుడు, మహాభారతాన్ని నాటక రూపంలో రచించిన గంగాధరకవి, జినేంద్ర కల్యాణాభ్యుదయాన్ని రచించిన అప్పయార్య తదితరులు కూడా ప్రతాపరుద్రుడి ఆస్థానంలోని వారే. సంస్కృత, కన్నడ భాషల్లో అనేక గ్రంథాలు రచించిన రుద్రభట్టు, కేయూరబాహుచరిత్ర రచయిత మంచన కూడా ప్రతాపరుద్రుడి ఆదరణ పొందారు. ప్రతాపరుద్రుడు పండిత పోషకుడే కాకుండా స్వయంగా కవి. సంస్కృతంలో యయాతి చరిత్ర, ఉషారాగోదయం అనే నాటకాల్ని రచించాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుడి శాస్త్ర, సంగీత ప్రావీణ్యాన్ని ప్రశంసించాడు. తొలి పురాణ అనువాదకర్త, మహాకవి మారన ఈ యుగం వాడే. ఆయన మార్కండేయ పురాణాన్ని అనువదించి ప్రతాపరుద్రుడి  సేనాని గన్నయ నాయకుడికి అంకితమిచ్చాడు.  స్వతంత్రంగా తెలుగులో రచించిన మొదటి మహాపురాణం మార్కండేయ పురాణం. మారన పురాణానికి కావ్యత్వాన్ని కల్పించి తర్వాతి కావ్య ప్రబంధ కవులకు మార్గదర్శకుడయ్యాడు.  ఇతడి మరో రచన హరిశ్చంద్రోపాఖ్యానం.
సంస్కృతంలో అలంకార గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందిన మొదటి తెలుగు వ్యక్తి విద్యానాథుడు. ఇతడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఇతడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని నాట్యశాస్త్రం, ధ్వన్యాలోకం లాంటి కావ్య శాస్త్రగ్రంథాల వరుసలో పేర్కొనవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణాన్నే రామరాజభూషణుడు నరస భూపాలీయంగా అనువదించాడు. విద్యానాథుడు ఈ గ్రంథంలో కావ్య, నాటక లక్షణాలను తెలపడంతో పాటు తాను చెప్పిన లక్షణాలకు ఉదాహరణగా ప్రతాపరుద్ర కల్యాణం అనే నాటకం రచించాడు. ఓరుగల్లుకు చెందిన మరో కవి అగస్త్యుడు (1289–1325). ఇతడు బాలభారతం, నలకీర్తి కౌముది, శ్రీకృష్ణచరిత, అగస్త్య నిఘంటువు మొదలైన సంస్కృత రచనలు చేశాడు. ప్రతాపరుద్రుడి మంత్రి శరభాంకుడు మంచి కవి. ఇతడు శరభాంక లింగ శతకాన్ని రచించాడు. ఓరుగల్లు కోట తోరణ ద్వారం మీద లిఖించిన శ్లోకాన్ని బట్టి బుక్చాయ కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలను నరసింహుడు అనే కవి రచించాడని తెలుస్తోంది. ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథ సూరి తండ్రి కపర్థి మెదక్‌ జిల్లా కొలిచెలిమ నివాసి. ఈయన గొప్ప భాష్యకారుడు. ‘ఆపస్తంబ శ్రోతసూత్ర భాష్యం’ లాంటి రచనలు చేశాడు. మరో కవి విశ్వనాథుడు సౌగంధికాపహరణమ్‌ అనే సంస్కృత వ్యాయోగం(నాటక ప్రక్రియ) రచించాడు.

TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?

గోన బుద్ధారెడ్డి

కాకతీయుల కాలంలో పేరొందిన మరో కవి గోన బుద్ధారెడ్డి. వర్ధమానపురం పాలకుడైన గోన గన్నయ్యరెడ్డి సోదరుడైన విఠలుని కుమారుడే బుద్ధారెడ్డి. ఇతడు రచించిన రామాయణం రంగనాథ రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. పాల్కురికి రచనలు శైవ మత ప్రచారానికి దోహదం చేస్తే రంగనాథ రామాయణం వైష్ణవ మతాన్ని జనంలోకి తీసుకెళ్లింది. గోన బుద్ధారెడ్డి కుమారులైన కాచభూపతి, విట్టల రాజులు తండ్రి కోరిక మేరకు ఉత్తర రామాయణాన్ని రచించారు. వీరు తెలుగులో తొలి జంట కవులు. ఉత్తర రామాయణంలో తిక్కన పూర్తి చేయలేకపోయిన భాగాలను ఇందులో చేర్చారు. తిక్కన సంక్షిప్తంగా రాసిన కొన్ని భాగాలను విపులీకరించారు. గోన బుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబిక తెలుగు సాహిత్యంలో తొలి కవయిత్రి. ఓరుగల్లుకు చెందిన గణపనారాధ్యుడు సర్వశాస్త్రాన్ని ద్విపదగా రాశాడు. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పని చేసిన శివదేవయ్య మంచి కవి. ఇతడు శివదేవధీమణిశతకం, పురుషార్థసారం రచించాడు.

చ‌ద‌వండి: TS History Practice Test

ఓరుగల్లు వర్ణన

తెలుగులో చంపువుగా వచ్చిన మొదటి రామాయణం భాస్కర రామాయణం. ప్రతాపరుద్రుడి ఆస్థానానికి చెందిన హుళక్కి భాస్కరుడు, అతడి కుమారుడైన మల్లికార్జున భట్టు, శిష్యుడైన రుద్రదేవుడు భాస్కర రామయణాన్ని రచించారు. అయ్యాలార్యుడు దీన్ని పూర్తి చేశాడు. రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామంలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. ఈయన సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామాన్ని అనుసరించే క్రీడాభిరామం (వినుకొండ వల్లభరాయలు) వచ్చింది. త్రిపురాంతకోదాహరణం, మదనవిజయం, చంద్రతారావళి, అంబికా శతకం మొదలైనవి త్రిపురాంతకుడి ఇతర రచనలు. పాల్కురికి రచనల తర్వాత తెలంగాణ (ఓరుగల్లు పట్టణ) జీవితాన్ని విస్తృతంగా వర్ణించిన గ్రంథమిదే. అప్పయాచార్యుడు అనే జైనకవి 1310లో జినేంద్రకల్యాణాభ్యుదయం అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. ఇతడు ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లులో నివసించాడు. దీన్ని బట్టి కాకతీయులు శైవులైనా పరమత సహనం పాటించారని, జైన సాహిత్యం కూడా మనుగడలో ఉందని అర్థమవుతోంది. విజయనగర  సామ్రాజ్య స్థాపనకు ప్రేరకుడైన మహామంత్రి విద్యారణ్యస్వామి ధర్మపురిలో పుట్టి పెరిగి, కంచిలో విద్యాభ్యాసం చేశాడు. సంగీతసారమనే సంగీతశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. 

sunkireddy narayanareddy డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత

మత పరిస్థితులు

కాకతీయుల కాలం నాటికి తెలంగాణలో బౌద్ధమత ప్రభావం నామమాత్రంగా ఉండేది. కానీ జైనమతం ప్రబలంగా ఉండేది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జైన మతాన్ని వీర శైవులు క్షీణింపజేశారు. వీరు జైన మతంలోని వర్ణ రాహిత్యాన్ని తమ ముఖ్య సిద్ధాంతంగా గ్రహించారు. రాజులకు శైవ దీక్షనిచ్చి వారి గురువులుగా, మంత్రులుగా, దండనాథులుగా జైనమత నిర్మూలనకు ప్రయత్నించారు. వీరశైవానికి పోటీగా వీర వైష్ణవం విజృంభించింది.  క్రీ.శ.1200 నాటికి జైనం క్షీణించింది. దాని స్థానాన్ని శైవం ఆక్రమించింది. చివరకు శైవ,  వైష్ణవ మతాలు రెండే మిగిలాయి. 

Telangana History For Groups Exams: పానగల్లు శాసనాన్ని వేయించింది ఎవ‌రు?

బౌద్ధం

ఆంధ్రదేశంలో 10, 11 శతాబ్దాల్లోనే ప్రాభవాన్ని కోల్పోయిన బౌద్ధం కాకతీయుల కాలంలో మరింతగా కనుమరుగైంది. ఈ కాలానికి చెందిన శాసనాల్లో చాలా అరుదుగా బౌద్ధ మత ప్రసక్తి కనిపిస్తుంది. కాలక్రమంలో బౌద్ధం హిందూ మతంలో కలిసిపోయింది.

జైనం

కాకతీయ సామ్రాజ్యంలో బౌద్ధం ముందే క్షీణించినా జైనమతం మనుగడ సాగించింది. మొదటి బేతరాజు జైనమతావలంబి. హనుమకొండలోని పద్మాక్షి అనే జైన దేవాలయం ముందున్న శాసనాన్ని బట్టి మొదటి ప్రోలరాజు జైనమతాభిమానిగా తెలుస్తోంది. ఇతడి భార్య మైలమదేవి, మంత్రి బేతకు ప్రగ్గడ  కూడా జైన మతాన్ని అవలంబించారు. మెదక్‌ జిల్లాలోని జోగిపేట జైనమత కేంద్రంగా ఉండేది. హనుమకొండలో సిద్దేశ్వరాలయం అనే జైన దేవాలయం కూడా ఉంది. వీటిని బట్టి తొలి కాకతీయులు జైన మతస్థులని తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయార్య ‘జినేంద్ర కల్యాణాభ్యుదయం’ను రచించాడు. దీన్నిబట్టి కాకతీయుల పాలన అంతమయ్యే వరకు తెలంగాణలో జైనం కొనసాగిందని తెలుస్తోంది. రాజుల పోషణ, ప్రజల ఆదరణ లభించకపోవడంతో జైనం క్రమంగా క్షీణించింది.

శైవం

శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలికం, ఆరాధ్యశైవం, వీరశైవం అనే శాఖలుండేవి. వీటిలో పాశుపత శాఖ మాత్రమే రాజులు, ప్రజల ఆదరణ పొందింది. రెండో బేతరాజు మొదట జైనాన్ని ఆచరించినప్పటికీ, కాలాముఖ శైవానికి చెందిన రామేశ్వర పండితుడికి ఒక గ్రామాన్ని దానమివ్వడాన్ని బట్టి శైవుడిగా మారాడని చెప్పవచ్చు. రామేశ్వర పండితుడు రెండో బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలాముఖ శైవదీక్షనిచ్చాడు. దీన్ని బట్టి రెండో బేతరాజు కాలం నుంచి కాకతీయులు శైవమతాన్ని అవలంబించారని తెలుస్తోంది. అలంపురం ముఖ్య కాలాముఖ శైవ కేంద్రం. పన్నెండో శతాబ్దాంతం వరకు కాలాముఖ శైవం విస్తరించింది. గణపతిదేవుడి కాలం నుంచి పాశుపత శైవం ఆదరణ పొందింది. వీరశైవం కర్ణాటకలో ఉన్నంత ఉచ్ఛస్థితిలో ఆంధ్ర దేశంలో లేదు. కానీ పాల్కురికి బసవపురాణాన్ని బట్టి తెలంగాణలోనూ ఆదరణ పొందిందని చెప్పవచ్చు. గద్వాల సమీపంలోని పూడూరు గ్రామంలో ఆలయం వెలుపల నగ్న జైన విగ్రహాలు ఉండటాన్ని బట్టి, వేములవాడలో జైనాలయాన్ని శివాలయంగా మార్చి జైన విగ్రహాలను ఆలయం బయట ఉంచడాన్ని బట్టి జైనాన్ని క్షీణింపజేసి వీరశైవం మనుగడలోకి వచ్చిందని తెలుస్తోంది. గోళకి మఠాల స్థాపన కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. కాకతీయ రాజులు, రేచర్లరెడ్లు తదితరులు నిర్మించిన అనేక శివాలయాలను బట్టి శైవం విస్తృత ఆదరణ పొందినట్లు స్పష్టమవుతోంది.

History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

వైష్ణవం

కాకతీయుల కాలంలో ప్రజాదరణ పొందిన మరో మతం వైష్ణవం. కాకతీయులు శైవులైనప్పటికీ వారి సామంతులు చాలామంది వైష్ణవులు. కాకతీయులు కూడా కొంతవరకు వైష్ణవాన్ని ఆదరించారు. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయం(వేయిస్తంభాలగుడి)లో వాసుదేవుణ్ని ప్రతిష్టించాడు. అతడి మంత్రి గంగాధరుడు కేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. గణపతిదేవుడి సోదరి మైలాంబ కృష్ణుడికి ఆలయాన్నినిర్మించింది. ప్రతాపరుద్రుడి భార్య లక్ష్మీదేవి రామనాథ దేవుడికి కానుకలు సమర్పించింది. ఇవన్నీ కాకతీయులు వైష్ణవాన్ని కూడా ఆదరించారనేందుకు నిదర్శనా లు. ఈ కాలంలో ధర్మపురి ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం. ఇన్ని మతాలున్నా కాకతీయుల కాలంలో మత సామరస్యం ఉండేదనడానికి మల్లిరెడ్డి బెక్కల్లు శాసనం నిదర్శనం. కర్ణాటకలో జరిగిన తరహాలో ఇక్కడ వీరశైవ, వైష్ణవ మతాల మ«ధ్య, వాటికీ ఇతర మతాల మధ్య మత యుద్ధాలు జరగకపోవడానికి కాకతీయుల మతసామరస్యమే కారణం. 

గ్రామదేవతారాధన

వైష్ణవ, శైవ దేవతలతోపాటు చరిత్ర పూర్వయుగం నుంచి సంప్రదాయంగా వస్తున్న గ్రామదేవతలు, గ్రామ శక్తులను కూడా ప్రజలు ఆరాధించేవారు. ఏకవీర (రేణుక/ఎల్లమ్మ) మైలారు దేవుడు, భైరవుడు, వీరభద్రుడు, మూసానమ్మ, కాకతమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోతురాజు మొదలైన గ్రామదేవతలు పూజలు అందుకునేవారు. బవనీలు (బైండ్లవాళ్లు), మాదిగ స్త్రీలు  రెండు రోజులపాటు ఎల్లమ్మ కథ చెప్పేవారు.

చ‌ద‌వండిIndian History Practice Test

Published date : 28 Jun 2022 06:55PM

Photo Stories