Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానం అమలైంది. ఇది ఒక రకమైన జాగిర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. వీరు నిర్ణీత మొత్తంలో సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు..
కాకతీయుల సామంతులు
నతవాడి వంశం
నందిగామ, మధిర తాలూకాలు, మహబూబాబాద్, జనగామ తాలూకాలు నతవాడి రాజ్యపరిధిలో ఉండేవి.ఈ రాజ్యాన్ని నతవాడి వంశం పాలించింది. ఈ వంశీయులు మొదట కల్యాణీ చాళుక్యుల సామంతులుగా ఉండి తర్వాత కాకతీయుల సామంతులయ్యారు. ఈ వంశానికి ఆద్యుడు బేతరాజు. ఇతడు కాకతీయ రెండో ప్రోలరాజుకు తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇతడి కుమారుడైన దుర్గరాజు(1104–1157)కల్యాణీ చాళుక్య ఆరో విక్రమాదిత్యుడికి, మూడో సోమేశ్వరుడికి సామంతుడిగా పనిచేశాడు. దుర్గరాజు కుమారుడైన బుద్ధరాజును కాకతి రుద్రదేవుడు,మహాదేవుడు నతవాడి పాలకుడిగా నియమించారు. ఇతడి పెద్ద కుమారుడు రుద్రుడు. కాకతి మహాదేవుడు ఇతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. బుద్ధరాజు రెండో కుమారుడు వక్కడి మల్లరుద్రుడు. ఇతడు గణపతిదేవుడి సోదరి అయిన మైలాంబను వివాహం చేసుకున్నాడు. రుద్రమదేవి కాలం వరకు నతవాడి రాజులు కాకతీయ సామంతులుగా పనిచేశారు.
TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?
గోనవంశం
రుద్రదేవుడు కందూరి చోడులను పానుగల్లు, దేవరకొండ ప్రాంతాలకు పరిమితం చేసినందువల్ల వారు వర్ధమానపురాన్ని విడిచి వెళ్లారు. మళ్లీ రుద్రదేవుడే వర్ధమానపురం(కందూరినాటి) పాలకుడిగా గోన బుద్ధరాజు(రంగనాథ రామాయణ కర్త)ను నియమించి ఉంటాడని భావిస్తున్నారు. అతడి కుమారుడైన గోన గన్నారెడ్డి గణపతిదేవుడి వల్ల వర్ధమానపుర రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఇతడి తమ్ముడు విఠల నరేంద్రుడు. వీరిద్దరూ యాదవ రాజులు ఆక్రమించిన ఆదవాని, తుంబుళాలను జయించి రాయచూరు దుర్గాన్ని ఆక్రమించారు. విఠలుడు హాళువ, మాణువ రాజ్యాలను జయించాడు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రదేశాన్ని ఆక్రమించి దక్షిణాంధ్ర భూభాగాలను కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడు. గోన గన్నారెడ్డి సోదరి కుప్పాంబిక. ఆమె భర్త మల్యాల గుండ దండాధీశుడు. గోన గన్నారెడ్డి తర్వాత ఇతడు వర్ధమానపుర పాలకుడయ్యాడు. ఇతడు 1245–46లో వర్ధమానపుర శాసనం వేయించాడు. 1259లో బూదపూర శాసనం, 1272లో మరో శాసనం వేయించాడు. ఇతడి మరణానంతరం భార్య కుప్పాంబిక తన భర్త పేరు మీద 1276లో గుండేశ్వరాలయం నిర్మించి శాసనం వేయించింది. ఇందులో ఆమె చిన్న తమ్ముడు గోనబుద్ధయ, గోన విఠయ కుమారుడు గుండయ గురించి పేర్కొన్నారు.
వావిలాల వంశం
వీరు రెడ్డి వంశస్థులు. రుద్రమదేవి కాలంలో ఆమనగల్లు, వంగూరు విషయాల (సీమ) పాలకులుగా ఉన్నారు. చెరకు రెడ్లతో వీరికి వివాహ సంబంధాలు ఉన్నాయి.
కాయస్థ వంశం (1239–1304)
మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడిన కాయస్థ వంశస్థుల్లో ఆద్యుడు గంగయ సాహిణి (1239–1257). ఇతడు కాకతి గణపతిదేవ చక్రవర్తికి సామంతుడు, ఆప్తుడు, అశ్వసైన్యాధిపతి. ఇతడి సువిశాల రాజ్యంలో మార్జవాడి, పలనాడు, కడప మొదలైన ప్రాంతాలతో పాటు, నల్లగొండ జిల్లాలోని పానగల్లు కూడా ఉండేవి. ఇతడి రాజధాని కడప జిల్లా వల్లూరు. దేవగిరి యాదవ రాజు ఆజ్ఞ మేరకు అతడి సామంతుడైన దామోదరుడు కాకతీయ భూభాగాలను ఆక్రమించాడు. గణపతిదేవుడి ఆజ్ఞతో గంగయ సాహిణి దామోదరుణ్ని ఓడించాడు. దీంతో గణపతిదేవుడు అతడికి మహామండలేశ్వర పదవిని ఇచ్చాడు. గంగయ సాహిణి తర్వాత అతడి మేనల్లుడైన జన్నిగదేవుడు గణపతిదేవుడు, రుద్రమదేవి వద్ద సామంతుడిగా పనిచేశాడు. ఇతడి రాజ్యంలో నల్లగొండ మండలం అంతర్భాగంగా ఉండేది. ఇతడి సోదరుడు త్రిపురాంతకుడుకూడా సామంతుడే. తర్వాత ఇతడి సోదరుడు అంబదేవుడు(1275–1302)స్వతంత్రించి కాకతీయులకు శత్రువయ్యాడు. అంబదేవుడి రాజ్యంలో నల్లగొండ జిల్లాలోని కృష్ణానది ఉత్తర ప్రాంతాలు, దోర్నాల ఉండేవి. ఇతడి కుమారుడైన రెండో త్రిపురాంతకుడి కాలంలో ఈ రాజ్యం కాకతీయ రాజ్యంలో కలిసిపోయింది.
Telangana History for Group 1 & 2: కాకతీయ సామ్రాజ్యం... రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
సమ్మక్క సారక్క
పగిడిద్దరాజు, సమ్మక్క–సారక్కల తిరుగుబాటు వృత్తాంతానికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ శతాబ్దాల నుంచి వీరి గాథలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం.. గోదావరి తీర ప్రాంతమైన మేడారం పరగణాను కోయ తెగకు చెందిన పగిడిద్దరాజు పాలించేవాడు. ఇతడు ప్రతాపరుద్రుడి సామంతుడు. కరీంనగర్ రాజధానిగా పాలించే మరో కోయ రాజైన మేడరాజు తన కుమార్తె సమ్మక్కను పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. సారలమ్మ,నాగులమ్మ,జంపన్నలు వారి సంతానం. కొన్నాళ్లకు మేడారం పరగణాలో నాలుగేళ్లపాటు తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలు పన్నులు కట్టలేని దుస్థితి తలెత్తింది. దీంతో పగిడిద్దరాజు కూడా ప్రతాపరుద్రుడికి పన్నులు కట్టలేదు. దీన్ని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు మంత్రి యుగంధరుడి ఆధ్వర్యంలో అతడిపైకి పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపాడు. మేడారం సమీపంలోని సంపెంగవాగు వద్ద పగిడిద్దరాజు సైనికులు కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఆయుధ బలం, సంఖ్యాబలం ఉన్న కాకతీయ సైన్యాన్ని నిలువరించలేక పగిడిద్దరాజుతో సహా ఆయన బిడ్డలు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు వీరమరణం పొందారు. ఈ పరాజయాన్ని భరించలేక పగిడిద్దరాజు కుమారుడైన జంపన్న వాగులోకి దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగుకు జంపన్నవాగు అని పేరొచ్చింది. పగిడిద్దరాజు భార్య సమ్మక్క కాకతీయ సేనతో పోరాడుతుండగా, ఒక సైనికుడు దొంగచాటుగా వచ్చి బల్లెంతో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క ప్రస్తుతం జాతర జరుగుతున్న స్థలంలో నేలకొరిగింది.
లక్షలాది మంది పూజలందుకుంటున్న ఈ వీరుల గాథలు, కథనాల్లో చిన్న చిన్న తేడాలున్నాయి. కాకతీయులకు, ఆదివాసీలకు యుద్ధం జరగడానికి సహజవనరుల పంపకాల వివాదం కారణమని కొన్ని కథనాలు, కప్పం చెల్లించకపోవడం కారణమని ఇంకొన్ని కథనాలు చెబుతున్నాయి. వీరి నుంచి కాకతీయులు కప్పం వసూలు చేశారనడానికి ఆధారాల్లేవని చరిత్రకారులు తెలిపారు. కానీ ఎక్కువ కథలు అదే కారణమని చెబుతున్నాయి. కాకతీయులు రాష్ట్ర కూట వంశం వారు కాదని పులింద జాతికి చెందిన వారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈ యుద్ధానికి పుళింద, కోయజాతి వైరం కారణమా? కప్పమే కారణమా? అన్నది పరిశోధించి తేల్చాల్సి ఉంది.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత
కాకతీయ యుగ విశేషాలు
పాలనా విధానం: కాకతీయుల ప్రభుత్వం సంప్రదాయ రాచరికం. సాధారణంగా రాజ్యం తండ్రి నుంచి కుమారుడికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కుమార్తెకు కూడా ఆ హక్కు కల్పించడం కాకతీయ వంశంలోనే జరిగింది. సిద్ధాంత రీత్యా అధికారం అంతా రాజుదే. కానీ ఆచరణలో రాజ్యాధికారానికి కొన్ని పరిమితులు ఉండేవి. పాలనలో రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. వర్ణధర్మం, కులధర్మం, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు రాజుకైనా అనుల్లంఘనీయాలు. నాటి శాసనాల్లో చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు తరచుగా కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వాలని రుద్రదేవుడి నీతిసారం తెలుపుతోంది. కాకతీయులు ఆరోగ్యశాలలు, ప్రసూతి ఆసుపత్రులు, కళాశాలలు, మఠాలు, సత్రాలు, చలివేంద్రాలను నెలకొల్పారు.
History Notes for Group 1, 2: రాష్ట్రకూట వంశానికి చెందిన వారే కాకతీయులు!
కాకతీయుల మంత్రులలో అన్ని కులాలవారు ఉండేవారు. కాకతీయులు కులాన్ని బట్టికాక వ్యక్తుల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చారు. గణపతిదేవ చక్రవర్తికి రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల హేమాద్రిరెడ్డి ప్రధానులు. ప్రతాపరుద్రుడికి ముప్పిడి నాయకుడు మహా ప్రధాని. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకర విధానం అమలైంది. ఇది ఒక రకమైన జాగిర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు. నాయంకరులు దుర్గాధ్యక్షులు. వారి మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీత సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది నాయంకరులున్నారు. కాకతీయరాజ్య పతనం తర్వాత విజయనగర రాజులు నాయంకర విధానాన్ని అనుసరించారు. ఆంగ్లేయులు పాలన చేపట్టే వరకూ ఈ విధానం కొనసాగింది. కాకతీయులకు పూర్వీకులైన చోళులు, చాళుక్యులు కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలు పరిచారు. అందుకే మాండలికులు, నాయంకరులకు సైనిక విషయాలు మినహా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. వారిపై అధికారాన్ని రుద్దలేదు. అణచి ఉంచే పద్ధతిని విడిచిపెట్టారు. వీరు తమను మహామండలేశ్వరులుగానే భావించారు తప్ప, రాజాధిరాజుగా, చక్రవర్తిగా భావించలేదు. ఒక రకంగా ఇది ప్రజాస్వామిక భావన.
నాయంకరుల్లో తెలంగాణకు సంబంధించిన కొందరి వివరాలు: యాదవ విశ్వనాథుడు గణపతిదేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అక్షయ చంద్రదేవుడు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించాడు. సారంగపాణి దేవుడనే యాదవరాజు పానగల్లును పాలించాడు. సింద కుటుంబానికి చెందిన భైరవుడు రుద్రమ కాలంలో బీదర్ ప్రాంతాన్ని పాలించాడు. పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యాన్ని స్థలం, సీమ, వాడి, నాడు, పాడి, భూమి అనే ప్రాంతీయ విభాగాలుగా విభజించారు. 10 నుంచి 60 గ్రామాల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. కొన్ని స్థలాల సముదాయమే నాడు. ఉదాహరణ: అనుమకొండనాడు, కందూరునాడు, సబ్బినాడు, అయిజనాడు.
ఆయగార్లు
గ్రామపాలనను ఆయగార్లు నిర్వహించేవారు. గ్రామసేవ, రాజ్యసేవ చేసినందుకు పన్ను లేకుండా వీరు భూమిని పొందేవారు. ఆయం అంటే పొలం వైశాల్యం. సాధారణంగా ఆయగార్ల సంఖ్య పన్నెండు. వారు 1. కరణం, 2. రెడ్డి, 3. తలారి 4. పురోహితుడు, 5. కమ్మరి, 6. కంసాలి, 7. వడ్రంగి, 8. కుమ్మరి 9. చాకలి, 10. మంగలి, 11. వెట్టి, 12. చర్మకారుడు. వీరిలో మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు. మిగతా వారు గ్రామ సేవకులు. గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, పోరంబోకు భూమి, తోటభూమి, గడ్డిభూముల విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తుల లెక్కలు, దేవాలయ ఆస్తుల లెక్కలు మొదలైన దస్తరం నిర్వహణ కరణం బాధ్యత. కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా రాజ్యభాగం(పన్ను)ను వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేదా పెద కాపుది. గ్రామ రక్షణ బాధ్యత తలారిది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్థులను పట్టుకోవడం, అపహరించిన సొత్తుని తెచ్చి ఇవ్వడం అతడి విధి. అష్టాదశవర్ణాల వారికి సంఘాలుండేవి. వీటిని సమయాలనేవారు.
మాదిరి ప్రశ్నలు
1. రెండో బేతరాజు ఎవరి ద్వారా శైవమతాన్ని అవలంభించాడు?
1) రామేశ్వర పండితుడు
2) అప్పయాచార్యులు
3) పాల్కురికి సోమన
4) బసవేశ్వరుడు
- View Answer
- సమాధానం: 1
2. కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
1) కరణం
2) పురోహితుడు
3) రెడ్డి
4) తలారి
- View Answer
- సమాధానం: 4
3. కాకతీయుల కాలంలో స్థూలంగా ఉన్న పన్నుల సంఖ్య?
1) 5
2) 7
3) 6
4) 4
- View Answer
- సమాధానం: 1
4. సెట్టి, కేసరి సముద్రాలను తవ్వించిన కాకతీయ రాజు?
1) మొదటి బేతరాజు
2) రెండో బేతరాజు
3) రుద్రదేవుడు
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 2
5. పాకాల చెరువును తవ్వించింది?
1) రుద్రదేవుడు
2) జాయపసేనాని
3) రేచర్ల రుద్రుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 3
6. ‘రామప్పచెరువు’ను తవ్వించింది?
1) రేచర్ల రుద్రుడు
2) రుద్రదేవుడు
3) జాయపసేనాని
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1