Skip to main content

Kakatiyas (History) Notes for Groups: ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

Kakatiyas Notes for Group 1, 2 Exams
Kakatiyas Notes for Group 1, 2 Exams

క్రీ.శ.1262లో పూర్తి రాజ్యభారాన్ని స్వీకరించిన రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని సుమారు మూడు దశాబ్దాలపాటు పరిపాలించింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో.. తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా రుద్రమదేవి వీరనారిగా, పరిపాలనాదక్షురాలిగా చరిత్రలో నిలిచింది.

గణపతిదేవుడు(క్రీ.శ.1199–1262)

దక్షిణ భారతదేశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో గణపతిదేవుడు ఒకరు. యాదవ రాజుల చెర నుంచి విడుదలైన గణపతిదేవుడు క్రీ.శ.1199 నుంచి రాజ్యపాలన చేశాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశ పరిస్థితులు రాజ్య విస్తరణకు అనుకూలంగా ఉన్నాయి. తీరాంధ్రలో గోదావరికి దక్షిణంగా ఉన్న ప్రాంతం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. దీంతో గణపతిదేవుడు తీరాంధ్రపై దండెత్తాడు. రెండో రాజేంద్ర చోళుడి కుమారుడైన పృథ్వీశ్వరుడితో యుద్ధం చేశాడు.
క్రీ.శ.1201లో బెజవాడను ఆక్రమించిన కాకతీయ సైన్యం దివి ద్వీపాన్ని ముట్టడించింది. కానీ గణపతిదేవుడు ఆ ద్వీపాన్ని అయ్యవంశ రాజైన అయ్య పినచోడుకు తిరిగి ఇచ్చివేశాడు. అతడి కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడాడు. బావమరిదైన జాయపుడికి తన కొలువులో గజసాహిణి అనే పదవిని ఇచ్చాడు. ఈ యుద్ధంతో గోదావరి నుంచి పెన్నా నది వరకు ఉన్న వెలనాటి చోళుల రాజ్యం కాకతీయుల హస్తగతమైంది. నెల్లూరు తెలుగు చోళులతో కాకతీయులకు స్నేహం ఉండేది. ఇది కాకతీయ రాజ్య విస్తరణకు తోడ్పడింది. పృథ్వీశ్వరుడిపై యుద్ధంలో గణపతిదేవుడికి చోడ తిక్కన సహాయం చేశాడు. దీనికి ప్రతిఫలంగా గణపతిదేవుడు నెల్లూరుపై దండెత్తాడు. తమ్ముసిద్ధిని ఓడించి చోడ తిక్కనకు సింహాసనం కట్టబెట్టాడు. ఈ యుద్ధాల వల్ల నెల్లూరు తెలుగు చోళుల రాజ్యంపై కాకతీయుల ఆధిపత్యం ఏర్పడింది.

చ‌ద‌వండి: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

కళింగ దండయాత్ర

పృథ్వీశ్వరుడిపై విజయం సాధించిన గణపతిదేవుడు కళింగ దండయాత్రను ప్రారంభించాడు. ఈ దండయాత్ర చేసిన వారిలో రేచర్ల రాజనాయకుడు, ఏరువ తెలుగు చోడ భీముడు ముఖ్యులు. ఉదయగిరి ఆక్రమణ తర్వాత కాకతీయ సైన్యం బస్తర్‌లో ప్రవేశించి చక్రకోటను జయించింది. తర్వాత గోదావరిని దాటి ద్రాక్షారామం చేరింది. కళింగ దండయాత్రతో కాకతీయ సైన్యం ప్రతిష్ట పెరిగింది. కానీ శాశ్వత ప్రయోజనం చేకూరలేదు. కాకతీయుల చేతిలో ఓడిన గాంగ సైన్యం కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది.
కమ్మనాడును పరిపాలిస్తున్న కొణిదెన చోళులు గణపతిదేవుణ్ని ఎదిరించి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తెలుగు చోళరాజు కుమారుడైన ఓబిలిసిద్ధి ‘పొత్తపి’ని పరిపాలించేవాడు. కమ్మనాడును జయించాలని గణపతిదేవుడు ఇతణ్ని ఆజ్ఞాపించాడు. ఓబిలిసిద్ధి కొణిదెన చోళులతోపాటు అద్దంకి చక్రనారాయణ వంశ రాజులనూ ఓడించాడు. దీంతో గణపతిదేవుడు ఓబిలిసిద్ధిని కమ్మనాడుకు పాలకుడిగా నియమించాడు. గోదావరి మండలం కాకతీయుల వశమైంది. గణపతిదేవుడు జీవించి ఉన్నంత కాలం కళింగులు మళ్లీ యుద్ధం మాట ఎత్తలేదు. 
క్రీ.శ.1248లో నెల్లూరుని పాలించే చోడ తిక్కన మరణించాడు. ఇతడి కుమారుడైన రెండో మనుమసిద్ధి(వీరగండ గోపాలుడు),అతడి దాయాది విజయగండ గోపాలుడి మధ్య రాజ్యం కోసం తగాదా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండో మనుమసిద్ధి గణపతిదేవుడి సహాయం కోరాడు. మహాకవి తిక్కన సోమయాజితో రాయబారం పంపాడు. 
దీంతో గణపతిదేవుడు సామంతభోజుని నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు. గణపతి దేవుడు స్వయంగా నెల్లూరు వెళ్లి మనుమసిద్ధిని సింహాసనంపై అధిష్టింపజేశాడు. ఆ తర్వాత కాకతీయ సైన్యం ద్రావిడ మండలంలో ప్రవేశించింది. పళైయూరు(తంజావూరు జిల్లా) యుద్ధంలో విజయగండ గోపాలుడిని, కర్ణాటక సైన్యాన్ని ఓడించింది. ఈ విజయాలతో కాకతీయ సామ్రాజ్యం దక్షిణదేశంలో కాంచీపురం వరకు విస్తరించింది.
క్రీ.శ.1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధం మినహా తన జీవిత కాలంలో గణపతిదేవుడు అపజయం పొందలేదు. క్రీ.శ.1199 నుంచి క్రీ.శ.1262 వరకు అఖిలాంధ్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసి రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు.గణపతిదేవుడికి ఇద్దరు కూతుళ్లు రుద్రమదేవి, గణపాంబ. రుద్రమదేవి గణపతి దేవుడి కూతురని కొలనుపాక, పానగల్లు శాసనాలు తెలుపుతున్నాయి. గణపతి దేవుడు రాజకీయ చతురతతో రుద్రమదేవిని తూర్పు చాళుక్య వంశ రాజు వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు. గణపాంబను కోట వంశ రాజైన బేతనకిచ్చి వివాహం చేశాడు.

చ‌ద‌వండి: TS History Practice Test

రుద్రమదేవి (క్రీ.శ.1262–1289)

గణపతిదేవుడు రుద్రమదేవిని క్రీ.శ.1259లోనే రాజప్రతినిధిగా నియమించినప్పటికీ.. క్రీ.శ.1262లో పూర్తి రాజ్య భారాన్ని అప్పగించాడు. అయితే క్రీ.శ.1269లో గణపతిదేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి కాకతీయ రాజ్య కిరీటాన్ని ధరించింది. గణపతి దేవుడు రుద్రమాంబను రాణిని చేయడం నచ్చని కొంత మంది సామంత రాజులు, రాజబంధువులు ఆమెపై తిరుగుబాటు చేశారు. రుద్రమాంబ సవతి సోదరులైన హరిహర దేవుడు, మురారి దేవుడు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రుద్రమాంబ వారిని ఓడించి, మరణ శిక్ష విధించినట్లు ‘ప్రతాపరుద్ర చరిత్ర’ ద్వారా తెలుస్తోంది. కాయస్థరాజులైన జన్నిగదేవుడు, త్రిపురారి, వెలమనాయకుడైన ప్రసాదిత్యుడు, మల్యాల గుండియ నాయకుడు తదితరుల మద్దతుతో రుద్రమదేవి సింహాసనం దక్కించుకుంది. కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు జరిగిన సమయంలో కళింగరాజు మొదటి నరసింహుడు గోదావరి మండలంపై దండెత్తి చాలా ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనంతరం అతడి కుమారుడు గజపతి మొదటి వీరభానుదేవుడు ఒడ్డాది మత్స్యదేవుడితో కలిసి వేంగిపై దండెత్తాడు. పోతినాయకుడు, పోలినాయకుడు అనే సేనానుల నాయకత్వంలో రుద్రమదేవి ఈ దండయాత్రను ఎదుర్కొంది. గోదావరి తీరంలో జరిగిన భీకర యుద్ధంలో కళింగులను ఓడించిన కాకతీయ సేనానులు గజపతి మత్తమాతంగ సింహ,ఒడ్డియ రాయమర్థన బిరుదులు పొందారు. 
తర్వాతి కాలంలో యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడించాడు. రుద్రమదేవి అతడితో భీకరంగా పోరాడింది. మహాదేవుడికి చెందిన మూడు లక్షల సేవణ కాల్బలాన్ని, ఒక లక్ష అశ్విక దళాన్ని నాశనం చేసింది. మహాదేవుడు ఓడిపోయి పారిపోగా రుద్రమాంబ అతణ్ని దేవగిరి వరకు వెంటాడింది. యాదవ మహాదేవుడు కోటి సువర్ణాలను నష్టపరిహారంగా ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఈ సొమ్మును రుద్రమాంబ తన సేనానులకు పంచిపెట్టింది. రుద్రమదేవి దేవగిరి వద్ద విజయస్తంభం నాటిందని ‘ప్రతాపరుద్ర చరిత్ర’ గ్రంథం ద్వారా తెలుస్తోంది. అయితే ‘హేమాద్రి వ్రతఖండం’ మాత్రం రుద్రమదేవిని మహాదేవుడు ఓడించాడని తెలుపుతోంది. కానీ ‘ప్రతాపరుద్రచరిత్ర’ కథనంలో యుద్ధంలో చనిపోయిన సేవణుల సైనిక సంఖ్య మినహా మిగతావన్నీ నిజాలేనని శాసనాలు, నాణేలు బలపరుస్తున్నాయి. నల్గొండ జిల్లా పానుగల్లులోని ఛాయా సోమనాథుడికి భూమిని దానం చేసిన సారంగపాణి దేవుడు రుద్రమదేవి సామంతుడు. ఇతడు యాదవ మహాదేవుని పినతండ్రి. ఇతడు సామంతుడు కావడం మహాదేవుని ఓటమిని సూచిస్తోంది. బీదర్‌ ప్రాంతాన్ని రుద్రమ కాకతీయ రాజ్యంలో చేర్చుకోవడం కూడా ఆమె విజయాన్నీ, మహాదేవుడి ఓటమినీ సూచిస్తోంది. 
కడప మార్జవాడి రాజ్యంలో కాయస్థ జన్నిగదేవుడి తర్వాత అతని పెద్ద కుమారుడు త్రిపురారిదేవుడు, తర్వాత అతడి తమ్ముడు అంబదేవుడు కాకతీయుల సామంతులుగా పాలించారు. క్రీ.శ.1272లో రాజ్యానికొచ్చిన కాయస్థ అంబదేవుడు రుద్రమదేవిని ఎదిరించి స్వతంత్ర కాయస్థ రాజ్య నిర్మాణానికి పూనుకున్నాడు. రుద్రమదేవి మల్లికార్జున సేనాని నాయకత్వంలో సైన్యాన్ని నడిపింది. ఈ యుద్ధంలో రుద్రమ జయించిందనీ, మరణించిందనీ భిన్న కథనాలున్నాయి. రుద్రమదేవి క్రీ.శ.1289లో మరణించినట్లు నకిరేకల్‌ సమీపంలోని చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని చెప్పొచ్చు.

చ‌ద‌వండి: శాతవాహనుల రాజకీయ చరిత్ర

ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1289–1323)

రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు. వారు.. ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. పెద్ద కుమార్తె ముమ్మడమ్మ మహాదేవుడి భార్య. వీరి కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతడి కాలంలో కాకతీయుల అధికారం ఉచ్ఛస్థితికి చేరి, ఓ వెలుగు వెలిగి అస్తమించింది.

రుద్రమదేవి కాలం నుంచే స్వతంత్రించిన అంబదేవుడు, అతడి కొడుకు రెండో త్రిపురారి లు ప్రతాపరుద్రుడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దీన్ని సహించని ప్రతాపరుద్రుడు నాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి సైన్యాన్ని పటిష్టం చేసి అంబదేవుడిపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. ఇది ఊహించిన అంబదేవుడు దక్షిణాన పాండ్యరాజులతో, ఉత్తరాన సేపుణుల(దేవగిరి యాదవులు)తో పొత్తు పెట్టుకున్నాడు. ప్రతాపరుద్రుడు క్రీ.శ.1291లో అంబదేవుని రాజధాని త్రిపురాంతకంపై ప్రచండ సైన్యాన్ని పంపాడు. కొలని సోమనమంత్రి కుమారుడు మనుమగన్నయ, ఇందులూరి పెదగన్నయమంత్రి కుమారుడు అన్నయదేవులు ఈ సైన్యానికి నాయకత్వం వహించారు. వీరు అంబదేవుణ్ని ఓడించి ములికినాడు వరకు తరిమికొట్టి కాయస్థ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపారు. అంబదేవుణ్ని ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు నెల్లూరుపై రెండుసార్లు దండెత్తాడు. నెల్లూరురాజు రాజగండగోపాలుడికి మద్దతునిచ్చిన పాండ్యులను ఓడించాడు. రుద్రమదేవి చివరి కాలంలో కాకతీయులు కృష్ణానది దక్షిణాన ప్రాభవాన్ని కోల్పోగా, ప్రతాపరుద్రుడు దాన్ని తిరిగి నిలబెట్టాడు. ప్రతాపరుద్రుడి మూడో దండయాత్ర అంబదేవుడికి మద్దతు నిలిచిన దేవగిరి యాదవరాజులపై జరిగింది. మనమగండగోపాలుడు, వర్ధమానపుర(మహబూబ్‌నగర్‌ జిల్లా) పాలకుడైన గోన విఠలుల నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది. గోనవిఠలుడు కృష్ణా, తుంగభద్ర ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుంచి వశం చేసుకున్నాడు.

డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Indian History Practice Test

మాదిరి ప్రశ్నలు

1. గణపతిదేవుడు మొదటగా ఎవరిపై దండెత్తాడు?
    1) రాజేంద్రచోళుడిపై 2) అయ్య పినచోళుడిపై
    3) పృథ్వీశ్వరుడిపై    4) చోడతిక్కనపై
2. ఎవరి కాలంలో వెలనాటి చోళ రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది?
    1) ప్రతాపరుద్రుడు    2) రుద్రమదేవి 
    3) గణపతిదేవుడు    4) రుద్రదేవుడు 
3. గణపతిదేవుడి దగ్గరకి తిక్కన సోమయాజిని రాయబారిగా పంపిన రాజు?
    1) రక్కనగంగ    2) విజయ గండగోపాలుడు
    3) చోడతిక్కన   4) రెండో మనుమసిద్ధి 
4. నెల్లూరు మనుమసిద్ధికి సహాయంగా గణపతిదేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు?
    1) సామంతభోజుడు    2) జాయప్ప
    3) రేచర్ల బేతిరెడ్డి       4) ఓబిలిసి 
5. గణపతిదేవుడు అపజయం పొందిన ఏకైన యుద్ధం?
    1) కడప        2) కాంచీపురం
    3) ముత్తుకూరు    4) పళైయూరు 
6. ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
    1) క్రీ.శ.1262    2) క్రీ.శ.1263 
    3) క్రీ.శ.1261    4) క్రీ.శ.1264
7. రుద్రమదేవి గణపతిదేవుడి కుమార్తె అని మొదట పేర్కొన్నవారు?
    1) నరహరి కవి     2) మార్కోపోలో 
    3) గంగాధర కవి   4) శేషాద్రి రమణ కవులు 
8. రుద్రమదేవిని వివాహం చేసుకున్న వీరభద్రుడు ఏ వంశ రాజు?
    1) కోటవంశ     2) తూర్పు చాళుక్య 
    3) యాదవ        4) వెలనాటి చోళ
9. రుద్రమదేవి క్రీ.శ.1259లో రాజ్యపాలనకు వచ్చి, ఏ సంవత్సరంలో రాజ్య కిరీటాన్ని ధరించింది?
    1) క్రీ.శ.1265    2) క్రీ.శ.1266 
    3) క్రీ.శ.1269    4) క్రీ.శ.1267 
10. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసినవారు?
    1) గణపతిదేవుడు    2) ప్రతాపరుద్రుడు 
    3) రుద్రమదేవి    4) రుద్రదేవుడు
11. కాకతీయుల రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చింది?
    1) ప్రతాపరుద్రుడు    2) రుద్రమదేవి     3) గణపతిదేవుడు    4) రుద్రదేవుడు 
12. ఏ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు గజపతిమత్త మాతంగ సింహ,  ఒడ్డియ రాయమర్దన అనే బిరుదులను పొందారు?
    1) వేంగి    2) కళింగ    3) నెల్లూరు     4) కడప

సమాధానాలు:
1) 3    2) 3    3) 4    4) 1   
5) 3    6) 2    7) 4    8) 2    
9) 3    10) 1    11) 3    12) 2 

​​​​​​​

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

టీఎస్‌పీఎస్సీ బిట్ బ్యాంక్

టీఎస్‌పీఎస్సీ గైడెన్స్

టీఎస్‌పీఎస్సీ సిలబస్

టీఎస్‌పీఎస్సీ ప్రివియస్‌ పేపర్స్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ క్లాస్

టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 11 May 2022 06:24PM

Photo Stories