Skip to main content

శాతవాహనుల రాజకీయ చరిత్ర

శాతవాహనుల కంటే ముందే ‘దక్కన్’ను వివిధ రాజులు పరిపాలించారు.విదర్భలో గోబద లేదా గోబధ రాజు ఉన్నట్లు పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ అజయ్‌మిత్ర శాస్త్రి పేర్కొన్నారు. కోటిలింగాలలో కంవాయ, సమగోప, నరన తదితర రాజుల నాణేలు లభ్యమయ్యాయి. పైఠాన్ లేదా ప్రతిష్టానపురాన్ని సూర్యమిత్ర, భూమిపుత్ర, సత్యభద్ర అనే రాజులు పరిపాలించారు. సూర్యపుత్రుని నాణేలపై శాతకర్ణి తన గుర్తును ముద్రించాడు. సాతానికోట (కర్నూలు)లో శక్తికుమారుని నాణేలు లభ్యమయ్యాయి. ఇతడి కాలంలోనే అశోకుడు కర్నూలులోని ‘ఎర్రగుడి’ ప్రాంతంలో శాసనం వేయించినట్లు తెలుస్తోంది.

శాతవాహనుల పాలన రాచరికం. రాజ్యాధికారం వంశ పారంపర్యంగా తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించేది. మౌర్యుల కాలంలో రాజును మానవ మాత్రుడిగానే భావించేవారు. కానీ శాతవాహనుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడనే భావన ఏర్పడింది. దక్షిణాపథంలోని రాజులు బిరుదులు ధరించడం శాతవాహనులతోనే ఆరంభమైంది. భూదానాలు చేసిన తొలి భారతీయ రాజులు కూడా వీరే.

‘మత్స్యపురాణం’లో శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం ఈ వంశంలోని రాజులు...

శ్రీ‌ముఖుడు
ఇతడినే చిముఖుడు, సిముఖుడిగా పేర్కొంటారు. ఇతడే శాతవాహన వంశ స్థాపకుడు. ఇతడి నాణేలు విదర్భలోని అకోలా, పుణేలోని శన్నార్, అహ్మద్‌నగర్‌లోని నేవసలో లభించాయి. వీటి ద్వారా ఇతడు ‘మౌర్యులకు సామంతుడి’గా ఉన్నట్లు తెలుస్తోంది. (మౌర్యులు భారతదేశంలో గొప్ప రాజులు. వీరిలో అశోకుడు చాలా ప్రసిద్ధుడు. ఉత్తర భారతదేశంలో ‘నంద వంశం’ తర్వాత మౌర్యులు రాజ్యానికి వచ్చారు. మౌర్యుల జన్మస్థలం పింప్రవనం. వీరి సామంతులే శాతవాహనులు.)

సామంతులు అంటే..
1. వీరికి స్వయం నిర్ణయాధికారాలు ఉండవు.
2. సొంతంగా నాణేలు ముద్రించుకోలేరు. తమకు తాముగా సార్వభౌమాధికారులుగా ప్రకటించుకోలేరు.
3. వీరు ‘అశ్వమేథ యాగాలు’ చేయకూడదు.

పైన పేర్కొన్న లక్షణాలున్న రాజ్యపాలకులను సామంతులుగా పేర్కొంటారు. విదర్భ, పుణే, అహ్మద్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో శాతవాహనుల నాణేలు లభించాయి. ఇవన్నీ మహారాష్ర్టలో ఉండటం వల్ల వీరి తొలి రాజధాని ‘పైఠాన్’ లేదా ‘ప్రతిష్ఠానపురం’ అని శ్రీనివాస అయ్యర్ పేర్కొన్నారు.
తెలంగాణలోని కోటిలింగాల, సంగారెడ్డి, పటాన్‌చెరు, కొండాపూర్ మొదలైన ప్రదేశాల్లో వీరి నాణేలు లభించాయి. కాబట్టి వీరి తొలి రాజధాని ‘కోటి లింగాల’ అని బార్నేట్, వి.ఎ. స్మిత్ మొదలైన చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. శ్రీముఖుడు ‘33 ఏళ్లు’ రాజ్యపాలన చేసినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇతడు తెలంగాణలోని ‘కోటిలింగాల’ రాజధానిగా రాజ్యాన్ని పాలించాడు. ఇతడి పాలన చివర్లో రాజ్యంలో తిరుగుబాట్లు జరిగాయి. దీంతో రాజ్యాన్ని ఉత్తర దిశగా విస్తరించడానికి రాజధానిని ‘కోటిలింగాల’ నుంచి మహారాష్ర్టలోని ‘జున్నార్’కు మార్చాడని అజయ్ మిత్ర అభిప్రాయం. నానాఘాట్ శాసనం శ్రీముఖుడిని ‘రాయనిముఖ శాతవాహనో సిరిమతో’గా అభివర్ణించింది. శ్రీముఖుడు జైన మతస్థుడు.

కృష్ణుడు (కన్హుడు)
శ్రీముఖుని తర్వాత అతడి సోదరుడైన కృష్ణుడు సింహాసనం అధిష్టించాడు. మత్స్య, వాయు, బ్రహ్మాండ పురాణాల్లో ఇతడు 18 ఏళ్లు రాజ్యపాలన చేసినట్లు పేర్కొన్నారు. నాసిక్‌లో లభ్యమైన బ్రాహ్మి శాసనంలో కృష్ణుడిని సమణమహామాత (శ్రమణ మహామాత్ర)గా పేర్కొన్నారు. శ్రమణుల (బౌద్ధ భిక్షువులు) బాగోగులు చూడటానికి కృష్ణుడు నియమించిన మహామాత్రుడు (ఉన్నతాధికారి) గుహను తొలిపించాడు.
కృష్ణుడు తన అన్న మీద గౌరవంతో ఆయన పేరు మీద శాతవాహన వంశాన్ని ప్రారంభించాడు. కృష్ణుడు భాగవత మతాన్ని దక్కన్‌లో విస్తరించినప్పటికీ, బౌద్ధాన్ని కూడా ఆదరించాడు. (భాగవత మతాన్ని ఉత్తర భారతదేశంలో వాసుదేవుడు స్థాపించాడు. ఈ మతస్థులు శ్రీకృష్ణుడిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు)

మొదటి శాతకర్ణి
పురాణాల్లో ఇతణ్ని ‘మల్లకర్ణి’గా పేర్కొన్నారు. ఇతడు పదేళ్లు పరిపాలించాడు. శాతవాహన ‘నిజమైన స్థాపకుడు’ ఇతడే. ఈయన పూర్వీకులైన శ్రీముఖుడు, కృష్ణుడు మౌర్యులకు సామంతులు. కానీ మొదటి శాతకర్ణి తనకు తానుగా ‘సార్వభౌముడి’గా ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. అశ్వమేథ యాగాలు నిర్వహించాడు. మౌర్య వంశ చివరి రాజైన బృహద్రదుణ్ని అతడి సేనాని పుష్యంగ మిత్రుడు హతమార్చి ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు. మౌర్యుల పతనంతో శాతకర్ణి స్వతంత్రుడిగా ప్రకటించుకునేందుకు అవకాశం లభించింది. మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణకు ‘మరాఠీ త్రణకైయిరో కుమార్తె ‘దేవి నాగానిక’ను వివాహమాడి తెలంగాణతో పాటు మహారాష్ర్టను పాలించాడు. ‘కళింగాధిపతి’ అయిన మహామేఘవాహన ఖారవేలుడు శాతకర్ణి రాజ్యంపైకి పెద్ద సంఖ్యలో త్రివిధ దళాలను పంపాడు. ‘కణ్ణబెణ్ణ’ నది వరకు ఇతడి సైన్యాలు వెళ్లగలిగాయి. విదర్భలో ప్రవహించే కణ్ణబెణ్ణ నదినే ప్రాచీన మరాఠా సాహిత్యంలో ‘గోదావరి నది’గా పేర్కొన్నారు. నాగ్‌పూర్‌కి ఈశాన్యంలో వెణ్ణ (చెణ్ణ), వైన్‌గంగా నదితో కలిసి ప్రవహిస్తోంది. ఈ రెండు నదులను కలిపి కణ్ణబెణ్ణ అని పిలిచేవారు. భిక్షురాజుగా ప్రసిద్ధి చెందిన ఖారవేలుడు రాజ్యపాలన చేపట్టిన రెండో ఏట శాతవాహన రాజ్యంతో యుద్ధం చేశాడు.
అసిక నగరం (నాగ్‌పూర్ జిల్లాలోని ఆడం సమీపంలో అసిక జనపద ముద్రిక ఒకటి లభించింది) వరకు ఇతడి సైన్యాలు విజృంభించాయని నానాఘాట్ శాసనం ద్వారా తెలుస్తోంది.
ఖారవేలుడు తన సైన్యంతో నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిని దాటాడు. ‘పితుండా’ (గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు) నగరాన్ని ధ్వంసం చేసి గాడిదలతో దున్నించాడు.
మొదటి శాతకర్ణి సూర్యమిత్రుని నాణేలపై తన ముద్రను వేయించాడు. సూర్యమిత్రుని రాజ్యాలైన మహారాష్ర్ట, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌తో పాటు ‘విదిశ’ ప్రాంతాలను కూడా శాతకర్ణి ఆక్రమించుకున్నాడు. మొదటి శాతకర్ణి మరణించిన తర్వాత అతడి భార్య నాగానిక (నాగవరదాయిని) నానాఘాట్ శాసనం వేయించింది. ఈ శాసనంలో మొదటి శాతకర్ణిని ‘ఏకవీర’గా పేర్కొన్నారు.

వేదసిరి
వేదసిరి మొదటి శాతకర్ణి కుమారుడు. ఇతడు నానాఘాట్ శాసనంలో తన పూర్వీకులైన శ్రీముఖుడు, కన్హుడి ప్రతిమలను చెక్కించాడు. ఈ శాసనంలో తన సోదరులైన కుమార భాయ, కుమార హకుసిరి, కుమార శాతవాహన ప్రతిమలను కూడా వేదసిరి చెక్కించాడు. తన కుటుంబానికి సహకరించిన త్రణకైయిరో, ఇతర బంధువుల బొమ్మలను కూడా వేదసిరి చెక్కించాడు. ఇతడి తర్వాత వరుసగా.. .పూర్ణోత్సంగ, స్కందస్తంభి, రెండో శాతకర్ణి రాజ్యాన్ని పాలించారు. తర్వాత లంబోదర (క్రీ.పూ. 78-60), అప్పిలక రాజ్యాధికారాన్ని చేపట్టారు.

రెండో శాతకర్ణి (క్రీ.పూ.134-78)
ఇతడు దాదాపు 56 ఏళ్లు రాజ్యాన్ని పాలించాడు. ఇతడు కళింగ, పాటలీపుత్ర రాజ్యాలను జయించాడని ఆనందుడు అనే కవి పేర్కొన్నాడు.

అప్పిలక (క్రీ.పూ. 60-44)
మధ్యప్రదేశ్‌లోని భిలాస్‌పూర్‌లో ఇతడి నాణేలు లభించాయి. మేఘస్వాతి (క్రీ.పూ.44-30), స్వాతి (క్రీ.పూ.30-12), స్కంద స్వాతి (క్రీ.పూ.12-5) కొద్ది కాలం పాటు రాజ్యాన్ని పాలించారు. వీరి తర్వాత మృగేంద్రుడు క్రీ.పూ. 5-2 మధ్య కాలంలో రాజ్యాన్ని పాలించాడు.

కుంతల శాతకర్ణి (క్రీ.పూ. 2 - క్రీ.శ. 5)
ఇతడు మహారాష్ర్టలోని దక్షిణ ప్రాంతాలను, కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాలను జయించాడు. ఈ రెండు రాజ్యాలను కలిపి ‘కుంతల’ దేశమనే పేరుతో పాలించాడు. అందువల్ల ఇతడికి కుంతల శాతకర్ణి అనే పేరు వచ్చింది. వాత్సాయనుడి కామశాస్త్రం, యశోధరుడి జయమంగళం గ్రంథాల్లో ఇతడి ప్రస్తావన ఉంది. వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు. మలయవతి రాణిని శృంగారంలోని ‘కర్తిర’ అనే రతి క్రీడలో కుంతల శాతకర్ణి చంపినట్లు వాత్సాయనుడు చెప్పాడు. (కామశాస్త్రాన్ని దాదాపు ‘58’ భాషల్లోకి అనువదించారు).
కుంతల శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చిన వారు వరుసగా...
1. స్వాతి కర్ణుడు:
ఇతడు క్రీ.శ.5-6 మధ్య పాలించాడు.
2. పులోమావి -1(క్రీ.శ.6-41): ఉత్తర భారతదేశంలోని మగధపై దాడిచేసి కణ్వ వంశస్థుడైన సుశర్మ రాజును హతమార్చాడు.
3. గౌర విష్ణుడు: ఇతడు క్రీ.శ. 41 -66 మధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత ‘హాలుడు’ రాజ్యానికి వచ్చాడు.

హాలుడు (క్రీ.శ. 66-71)
ఇతడు 17వ రాజు. హాలుడి పాలనా కాలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇతడు ఒకే సంవత్సరం పరిపాలించాడని తెలుస్తుండగా, ఆరేళ్లు రాజ్యపాలన చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. హాలుడు ‘గాథాసప్తశతి’ (సప్తసాయి)ని రచించాడు. ‘మహారాష్ర్ట ప్రాకృతం’లో ఉన్న ఈ గ్రంథం 700 గ్రామీణ శృంగార కథల సమాహారం. హాలుడికి ‘కవి వత్సలుడు’ బిరుదు ఉంది. ఇతడి కాలంలో కర్ణాటకలోని కళ్యాణి రేవు పట్టణం వద్ద విదేశీ పడవలకు రక్షణ లేకుండా పోయిందని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని ఒక గ్రీకు నావికుడు రచించినట్లు చెబుతున్నారు.
హాలుని ఆస్థానంలోని ప్రసిద్ధ కవులు:
1. గుణాఢ్యుడు:
ఇతడు ‘బృహత్‌కథ’ గ్రంథాన్ని ‘పైశాచిక’ ప్రాకృతంలో రచించాడు. ఇతడు తొలి తెలంగాణ కవి.
2. శర్వ వర్మ: ‘కాతంత్య్ర వ్యాకరణం’ గ్రంథకర్త. సులభపద్ధతిలో సంస్కృతం నేర్చుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఇతడి తర్వాత మాండూలకుడు, పురీంద్రసేనుడు, సుందర స్వాతికర్ణి, చకోర స్వాతికర్ణి, శివ స్వాతికర్ణి వరుసగా రాజ్యానికి వచ్చారు.

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 110-134)
ఇతడు 23వ రాజు. గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చిన సమయం కచ్చితంగా తెలియదు. ఇతడు నహపాణుడిని ఓడించి క్షహారాట వంశాన్ని నిర్మూలించాడు. ‘జోగల్‌తంబి’ లో దొరికిన రూపాణుని వెండి నాణేలు, నాసిక్, కార్గే, జున్నార్ శాసనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరఠ్వాడి ప్రాంతం కూడా గౌతమీపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నట్లు ‘బోర్ధన్’ తవ్వకాల్లో దొరికిన ‘రాగి’ నాణేల ద్వారా తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనాన్ని అధిష్టించే సమయానికే కర్ణాటక, విదర్భ, దక్షిణ మహారాష్ర్ట శాతవాహన రాజ్యంలో భాగంగా ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలు...
1. అసిక లేదా అస్మక (తెలంగాణ)
2. ములక (మహారాష్ర్ట)
3. సౌరాష్ర్ట (గుజరాత్)
4. అపరాంత (కొంకణ్)
5. అనూప (విదర్భ)
6. నేతగిరి (శ్రీ పర్వతం)
7. నీలిగిరి (తమిళనాడు)
8. మహేంద్రగిరి (ఒడిశా)
గౌతమీపుత్ర శాతకర్ణికి ‘త్రిసముద్రతోయ పీతవాహన’, ‘దక్షిణాపథపతి’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఇందులో గౌతమీపుత్ర శాతకర్ణిని ‘శాతవాహనకుల యశ ప్రతిష్టాపనాకర’గా అభివర్ణించారు (గౌతమీపుత్ర శాతకర్ణి మరణించిన 19 ఏళ్ల తర్వాత ఈ శాసనాన్ని చెక్కించారు). ‘ఏక బ్రాహ్మణ’, ‘క్షత్రీయదర్పమాణ’ అనేవి ఇతడి ఇతర బిరుదులు. బెణకటకం నగరాన్ని నిర్మించి బెణగటక స్వామిగా ప్రసిద్ధి చెందాడు.

వాసిష్టిపుత్ర పులోమావి
ఇతడు 24వ రాజు. గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. 28 ఏళ్లు (క్రీ.శ.134-162) పరిపాలించాడు. తన బొమ్మలతో కూడిన వెండి నాణేలను ముద్రించాడు. ఇతడికి ‘దక్షిణాపథేశ్వరుడు’ బిరుదు ఉంది. నాసిక్ ప్రాంతంలో గోవర్ధన, పైఠాన్ నగరాలను నిర్మించాడు. ‘నవనగర స్వామి’ అనే బిరుదు పొందాడు. మహాక్షాత్రపరాజైన ‘చేష్టనుడు’ ఇతడి సమకాలీనుడు.

వాసిష్టిపుత్ర శాతకర్ణి
ఇతడు 25వ రాజు, పులోమావి సోదరుడు. మహాక్షాత్రపుడైన రుద్రదాముని అల్లుడు (సంస్కృతంలో శాసనాలు ముద్రించిన తొలి భారతీయ రాజు రుద్రదమనుడు). ఇతడు ‘కన్హేరి’ శాసనాన్ని సంస్కృతంలో వేయించాడు. (శాతవాహనుల కాలంలో వచ్చిన శాసనాలన్నీ ప్రాకృతంలోనే ఉన్నాయి. కానీ ‘కన్హేరి’ శాసనం మాత్రమే సంస్కృతంలో ఉంది)

వాసిష్టిపుత్ర స్కంద శాతకర్ణి
ఇతడినే శివస్కందుడిగా పేర్కొంటారు. స్కంద శాతకర్ణి నాణేలపై ఏనుగు బొమ్మ, ఉజ్జయినీ గుర్తు, నంది పాదం, ఆరు శీర్షాలు ఉన్న కొండ గుర్తులు ఉన్నాయి.

యజ్ఞశ్రీ శాతకర్ణి
శాసనాల్లో, నాణేలపై ‘యజ్ఞ’ అని పేర్కొనడం వల్ల ఇతడికి యజ్ఞశ్రీ శాతకర్ణి అని పేరు వచ్చింది. ఎక్కువగా ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించాడు. నాణేలపై ఐదు ఓడలు ఉన్న గుర్తులు ఉండటం వల్ల రోమన్ సామ్రాజ్యంతో వర్తకం జరిగినట్లు భావిస్తున్నారు. ఇతడి నాణేలు గుజరాత్‌లోనూ లభించాయి. భారతీయ ఐన్‌స్టీన్‌గా పేరొందిన ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానానికి చెందినవాడు. ఇతడు నాగార్జునుడి కోసం శ్రీ పర్వతం (నాగార్జున కొండ)పై ఒక స్తూపం, చైత్యాన్ని నిర్మించాడు. గుజరాత్, మహారాష్ర్ట, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఇతడి రాజ్యంలో భాగంగా ఉండేవి. యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉంది.

విజయ శాతకర్ణి
ఇతడు శ్రీ పర్వతం అనే నగరాన్ని నిర్మించాడు. దీన్నే విజయపురిగా పిలుస్తారు. ఇదే తర్వాతి కాలంలో ఇక్ష్వాకుల రాజధానిగా మారింది.

చంద్ర శాతకర్ణి
పిఠాపురం వద్ద కొడవలిలో ఇతడి శాసనం లభించింది.

వాసిష్టిపుత్ర పులోమావి-3
ఇతడు శాతవాహనుల చివరి రాజు. కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పాలించాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇతడి శాసనాలు లభించాయి. ఇందులో మూడో పులోమావిని ‘రాణో శాతవాహనాం’గా పేర్కొన్నారు. ఇతడి మరో శాసనం బళ్లారిలోని మ్యాకదోనిలో లభించింది. ఈ శాసనంలో గ్రామపెద్ద గుల్మిక గురించి పేర్కొన్నారు. వాకాటక రాజు ప్రవరసేనుడు శాతవాహన రాజ్యంపై దాడి చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. నాగోపాధ్యాయుడి కుమారుడైన విధికుడి వివరాలున్నాయి. వాసిష్టిపుత్ర పులోమావి కాలం నాటి 453వ జాతక కథలో బుద్ధుడిని బ్రాహ్మణుడిగా.. 354వ జాతక కథలో అంటరాని కులంలో జన్మించినట్లు పేర్కొన్నారు.
యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాతి కాలంలో శకుల దండయాత్రలు అధికమయ్యాయి. వీరితో శాతవాహనులు నిరంతరం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. సామంతులైన అభీరులు, ఇక్ష్వాకులు, పల్లవుల తిరుగుబాట్లు, వారసత్వ యుద్ధాల వల్ల శాతవాహన సామ్రాజ్యం పతనమైంది. శ్రీ పర్వత విజయపురి పాలకుడు క్షాంతమూలుడు శాతవాహనుల సామంతుడు. ఇతడు క్రీ.శ. 223లో శాతవాహన చివరి రాజు మూడో పులోమావిని అంతం చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు.

శాతవాహనుల పరిపాలనా విధానం
‘శాతవాహనులు దక్షిణాపథాన రాజకీయ ఐక్యత సాధించారు. సుస్థిర పాలన నెలకొల్పారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సాంస్కృతిక సమన్వయం సాధించార’ని కె.ఎం. ఫణిక్కర్ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.
శాతవాహనులు మౌర్యుల వారసులు, పల్లవులకు మార్గదర్శకులు. రాచరికం వంశ పారం పర్యంగా తండ్రి నుంచి కుమారుడికి సంక్రమించేది. మౌర్యుల కాలంలో రాజును మానవ మాత్రుడిగానే భావించేవారు. శాతవాహనుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడనే భావన ఏర్పడింది. శాతవాహనుల యుగంలో దక్షిణాపథం లోని అన్ని రంగాలు ఆర్య నాగరికత వల్ల ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా పరిపాలన, సాంఘిక జీవన శైలి, ఆర్థిక, జీవన విధానాలు, మత, వేదాంత విషయాలు, సాహిత్యం, కళలు, సకల రంగాల్లో ఆర్యుల పద్ధతులను అనుసరించారు.
కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని ధర్మశాస్త్ర విధులను పాటించారు. రాజ్యాధికారం సాధారణంగా పెద్ద కుమారుడికే వారసత్వంగా సంక్రమించేది. రాజుల పేర్ల ముందు వారి తల్లుల పేర్లు ఉండేవి. గౌతమీపుత్ర శాతకర్ణిని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.
స్వతంత్ర రాజ్య స్థాపనకు గుర్తుగా అశ్వమేథ యాగం నిర్వహించారు. దక్షిణాపథంలో రాజులు బిరుదులు ధరించడం కూడా శాతవాహనులతోనే ఆరంభమైంది.
శాతవాహనుల సామ్రాజ్యంలో అనేక ప్రాంతాలు నేరుగా రాజోద్యోగుల పాలనలో ఉండేవి. కొన్ని ప్రాంతాలు మహారథులు, మహాభోజకులు అనే సామంతుల పాలనలో ఉండేవి. సామ్రాజ్యంలోని పెద్ద విభాగాలను ఆహారాలు (రాష్ట్రాలు) అని పిలిచేవారు. ప్రతి ఆహారానికి నిగమ సభ కేంద్రంగా ఉండేది. పాలనలో అమాత్యులనే ఉద్యోగులు రాజుకు సహకరించేవారు. వీరు మూడు రకాలు...

  • రాజామాత్యులు: వీరు రాజు సమక్షంలో పనిచేస్తూ అతడికి సలహా ఇస్తారు. వీరిని గవర్నర్లతో పోల్చవచ్చు.
  • అమాత్యులు: వీరు సామంతులు. నేరుగా ఆహారాలను పరిపాలిస్తారు.
  • మహామాత్యులు (అసిస్టెంట్ గవర్నర్లు): ప్రత్యేక కార్యాన్ని నిర్వహించడం కోసం వీరిని నియమించేవారు.

ఇతర ముఖ్య అధికారులు

  • అక్షపటాల: రాజు ఆజ్ఞలు అమలు చేసే అధికారులు.
  • రాజముఖ్య: దీన్నే మంత్రి పరిషత్ లేదా సలహా మండలి అంటారు. యుద్ధ సమయంలో, పరిపాలనలో రాజుకు ముఖ్య సలహా మండలిగా పనిచేస్తుంది. ఇందులో 12-15 మంది సభ్యులుగా ఉండేవారని తిష్యరష్మతి శాసనంలో పేర్కొన్నారు.

మ్యాకదోని శాసనంలో పేర్కొన్న అధికారులు

  • హిరణ్యకుడు: ఇతడినే హేరిణికుడు అనేవారు. ఇతడు కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించేవాడు.
  • నిబంధకారుడు: ఇతడు రాజు ఆజ్ఞలను నమోదు చేసేవాడు.
  • భాండాగారికుడు: వస్తు సంచయాన్ని పర్యవేక్షించే అధికారి.

శాతవాహనుల ఆర్థిక విధానం
శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ముఖ్య ఆదాయ వనరు భూమి శిస్తు. పండిన పంటలో 1/6వ వంతు లేదా 18 శాతం భూమి శిస్తు (దేవమేయ) విధించేవారు.
టాలమి రచించిన ‘గైడ్ టు జియోగ్రఫీ’, అజ్ఞాత రచయిత రాసిన ‘పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి’ గ్రంథాల్లో శాతవాహనుల వర్తక, వాణిజ్యాలను వివరించారు. ఈ గ్రంథాల్లో వాడిన పదజాలం..
1. రజువాహక: భూమి సర్వే చేసే అధికారి
2. రజకంబేట: భూస్వామి
3. నిష్టి: సేద్య బానిసలు
4. ఉదక యంత్రం: భూమిని దున్నేందుకు ఉపయోగించే సాధనం.
5. ఘటి యంత్రం: బావుల నుంచి నీటిని తోడేందుకు ఉపయోగించే సాధనం.

  • శాతవాహనులకు అనేక పట్టణాలు, తీరప్రాంతాలు ఉన్నాయని మెగస్తనీస్ తెలిపారు. అద్యాంతిక అనే వర్తక సంఘాలు ప్రముఖ పాత్ర వహించేవని ఇండికా గ్రంథంలో పేర్కొన్నారు.
  • ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం శాతవాహనులు 17 వృత్తి సంఘాలను నెలకొల్పారు. ధాన్యం వ్యాపారులను దంమ్నికులని, నూనె వ్యాపారులను తెలపికలని, స్వర్ణకారులను సుహానక అని పిలిచేవారు.
  • వృత్తి ఆధారిత ఉపకులాలు కూడా 17 వరకు ఉన్నాయని భట్టిప్రోలు శాసనంలో తెలిపారు. అందులో ముఖ్యమైనవి.
  1. హాలికులు: సేద్యం చేసే రైతులు
  2. వధకులు: వడ్రంగులు. వ్యవసాయానికి వాడే పరికరాలు చేసేవారు. వీరికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది.
  3. గధికులు: యోగాచార్యం గ్రంథంలో వీరి ప్రస్తావన ఉంది. ఔషధాలు తయారు చేసేవారు. వీరిని గ్రామాల్లో వైద్యులుగా గుర్తించేవారు. ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన మందులు తయారు చేసేవారు.
  4. కొలికులు: నేతపనివారు. వీరు నేసే వస్త్రాలను ‘రోమ్’కు చెందిన రాణులు అమితంగా ఇష్టపడేవారు.
  5. సేలవగదులు: వీరు శిల్పులు. శాతవాహన కాలంలో వీరికి మంచి గుర్తింపు ఉండేది. రసరత్నాకరం గ్రంథంలో వీరి వివరాలున్నాయి.
  • బౌద్ధుల వల్ల ఈ రాజ్యంలో నౌకాకేంద్రాలు అభివృద్ధి చెందాయని హోలెంట్ హోప్‌మెన్ జర్మన్ పండితుడు పేర్కొన్నాడు.

రాజులు - వారి బిరుదులు

మొదటి శాతకర్ణి

:

దక్షిణాపథపతి

యజ్ఞశ్రీ శాతకర్ణి

:

త్రి సముద్రాధిపతి

రెండో పులోమావి

:

దక్షిణాపథేశ్వరుడు

గౌతమీపుత్ర శాతకర్ణి

:

రామకేశవ

ఆర్థికాంశాలు

గుల్మిక

:

గ్రామ పెద్ద

రజవాహక

:

భూమిని సర్వే చేసే అధికారి

సోపార

:

ప్రాచీన ఓడరేవు

ఎగుమతులు

:

సుగంధ ద్రవ్యాలు

ఉషభదాతుడు

:

యాత్రికులకు, వ్యాపారులకు వసతి కల్పించేవాడు

కవులు - గ్రంథాలు

ఆర్యదేవుడు

:

చిత్తశుద్ధి

నాగార్జునుడు

:

దశభూమిక సూత్ర

ఆర్యమంజూశ్రీ

:

కల్ప సూత్రం

ఇతర అధికారిక పదజాలం
కటకం: సైన్యాగారం
స్కందావారం: సైనిక శిబిరం (హతిగుంఫా శాసనంలో ఈ పదం ఉంది)
గుల్మిక: గ్రామపెద్ద (మ్యాకదోని శాసనంలో ఉంది)
నిగమ సభ: పట్టణ పాలన (నానాఘాట్, భట్టిప్రోలు శాసనంలో ఉంది)
గ్రహాపతులు: నిగమసభలోని సభ్యులు (ఆదోని శాసనంలో ఉంది)
మహాతారక: గ్రామ ప్రభువు (గ్రామ పాలకుడు)
శ్రేణి లేదా గిల్ట్‌లు: బ్యాంకులు
సార్ధవాహనులు: వ్యాపార వర్గం
త్రప్పగ: విదేశీ నౌకలకు మార్గం చూపే నౌకలు.

శ్రేణులు - ప్రాధాన్యం
జున్నార్ శాసనాల్లో ‘ధమ్నక’, ‘కాసాకార’, ‘తెసకార’ శ్రేణుల గురించి పేర్కొన్నారు. గోవర్ధనలో ‘కాలీకసికాయ’ శ్రేణులుండేవి. నాసిక్ శాసనాల్లో ‘కులరిక’, ‘తెలపిషిక’, ‘ఒదయంత్రిక’ మొదలైన శ్రేణుల గురించి పేర్కొన్నారు. ప్రతి శ్రేణికి అధ్యక్షుడిగా శ్రేష్ఠి ఉండేవాడు. శ్రేణుల కార్యాలయాలు పురమందిరంలో లేదా నిగమసభలో ఉండేవి. ఉషవదత్తుడు శ్రేణుల్లో పెట్టిన పెట్టుబడులు ‘నిగమసభ’లో రిజిస్టర్ చేశారు.

బ్యాంకులు - రుణపరపతి విధానాలు
శాతవాహనుల కాలంలో వడ్డీకి అప్పులు ఇచ్చే పద్ధతి ఉండేది. స్పల్ప వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. అప్పుల మీద వడ్డీరేటు సాధారణంగా ఏడాదికి 12 శాతం ఉండేది. దీన్ని నెలకు ఒకసారి గణించే పద్ధతిలో నిర్ణయించేవారు. నాటి సంస్థలు, బ్యాంకులు ఈ విధానాన్ని అనుసరించాయని పశ్చిమ దక్కన్‌లో దొరికిన శాసనాలు ధ్రువపరుస్తున్నాయి. ఉషవదత్తుని నాసిక్ శాసనంలో గోవర్ధనలోని చేనేత పనివారి శ్రేణి రెండు డిపాజిట్లు స్వీకరించినట్లుగా పేర్కొన్నారు. అందులో మొదటిది నెలకు ఒక శాతం వడ్డీ రేటుతో 2,000 కార్షాపణలు, రెండోది నెలకు 3/4 శాతం వడ్డీ రేటు మీద 1,000 కార్షాపణలు ఉన్నాయి. మొదటి డిపాజిట్ మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని నాసిక్‌లోని గుహలో వర్షాకాలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న బౌద్ధ సన్యాసులకు ప్రతి ఒక్కరికి ఏడాదికి వస్త్రాలు ఖరీదు చేసేందుకుగాను 12 కార్షాపణులుగా ఖర్చు పెట్టడానికి నిర్దేశించారు. రెండో డిపాజిట్‌పై వచ్చే మొత్తాన్ని ఆ బౌద్ధ సన్యాసుల ఇతర అవసరాలకు కేటాయించారు.

సాంస్కృతిక విధానం

దక్కన్ పీఠభూమికి చెందిన పాతరాతి యుగం నిర్మాతలకు ఇనుము, వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం ఉందని వివిధ ఆధారాల ద్వారా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రాంతంలో కమ్మరి కొలిమి బయటపడింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఇనుప ఖనిజ నిక్షేపాలను శాతవాహనులు ఉపయోగించుకున్నట్లుగా ఆధారాలున్నాయి. రాతి యుగంలోనే ఇనుము పరిశ్రమ ఉన్నట్లుగా ఆయా ప్రాంతాల్లో ఆధారాలు లభించాయి. శాతవాహనులు బంగారాన్ని ఆభరణాల్లో మాత్రమే ఉపయోగించి ఉండవచ్చు. కుషాణులలా వీరు బంగారు నాణేలను ముద్రించలేదు. వీరు ప్రధానంగా సీసంతో చేసిన నాణేలను ముద్రించారు. ఇవి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించాయి. వీరు రాగి, కంచు నాణేలను కూడా ముద్రించారు.
ప్లీని (క్రీ.శ. మొదటి శతాబ్దంలో వచ్చిన గ్రీకు యాత్రికుడు) కథనం ప్రకారం ఆంధ్ర సామ్రాజ్యం లక్ష మంది కాల్బలం, రెండువేల గుర్రాలు, వెయ్యి ఏనుగులను కలిగిన సైన్యాన్ని పోషించేది. దీని వెనుక పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజానీకం ఉండేదని, వారు పెద్ద సైన్యాన్ని పోషించగలిగే అదనపు ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారని ఊహించవచ్చు.
కరీంనగర్ జిల్లాలోని పెద్ద బంకూరులో క్రీ.పూ. 200-క్రీ.శ. 200 మధ్యకాలంలో కాల్చిన ఇటుకలు, ఇంటి పైకప్పుల్లో సమతలంగా ఉన్న పెంకులను వినియోగించినట్లు ఆధారాలున్నాయి. ఈ ప్రాంతంలో మురుగునీటిని సంబంధిత గుంటల్లోకి తీసుకువెళ్లే మూతమూసిన కాలువలు కూడా బయటపడ్డాయి. ఆంధ్రప్రాంతంలో 30 కోటలు కలిగిన పట్టణాలు, అసంఖ్యాక గ్రామాలు ఉన్నట్లుగా మెగస్తనీస్ పేర్కొన్నాడు. రెండో, మూడో శతాబ్దాలకు చెందిన అనేక పట్టణాల వివరాలు కూడా శాసనాలు, తవ్వకాల ద్వారా తెలుస్తోంది.
యజ్ఞశ్రీ శాతకర్ణి చేనేత పనివారి శ్రేణికి 1,000 కార్షాపణలు, వడ్రంగి పనివారి శ్రేణికి 2,000 కార్షాపణలు, నూనె గానుగ పనివారి శ్రేణికి 5,000 కార్షాపణాలు డిపాజిట్ చేసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది.

 

మత విధానాలు
దేవతలు, ఆరాధ్య వృక్ష జంతుగణాలు, వైదిక క్రతువుల వివరాలు క్రీ.శ.2వ శతాబ్ది నాటి బౌద్ధమత వికాసం గురించి తెలుపుతున్నాయి. నాగానిక వేయించిన శాసనంలో తనను తాను ‘దీఖవ్రత యజ్ఞసుంద’, ‘యజ్ఞహుత ధూపన సుగంధాయ’గా వర్ణించుకుంది. అదేవిధంగా గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనంలో రాజర్షి వధువు (వైదిక మతానుయాయ అయిన రాజుకు ధర్మపత్ని)గా ప్రకటించుకుంది. నానాఘాట్ శాసనం ప్రారంభంలో ఇంద్ర, ధర్మ, లోకపాలక, సంకర్షణ, వాసుదేవులను, సూర్య, చంద్రులను స్తుతించే అంశాలున్నాయి. శాతకర్ణి కుమారుల్లో ఒకరికి వేదసిరి అనే పేరుండటం, తర్వాతి రాజులకు యజ్ఞశ్రీ తదితర పేర్లు ఉండటం లాంటివి వైదిక మతం పట్ల శాతవాహనుల గౌరవ, ఆదరణలను సూచిస్తున్నాయి. రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను గృహాల్లో చిత్రపటాలుగా అలంకరించుకున్నట్లు అధారాలు లభించాయి. గాథాసప్తశతిలో కృష్ణలీలలను వర్ణిస్తూ రాసిన కొన్ని కథలు పౌరాణికం, ఇతిహాసం, మతానికి ఉన్న ప్రజాదరణ గురించి తెలుపుతున్నాయి. ఉషవదత్తుని శాసనాలు కూడా అతడి వైదిక మతాభిమానం; బ్రాహ్మణ పోషణ; ప్రభాస, పుష్కర మొదలైన తీర్థ్ధయాత్రల సందర్శన గురించి వివరిస్తున్నాయి.
జైనమతం: శాతవాహన వంశ స్థాపకుడైన సిముకుడు జైన మతాన్ని ఆదరించేవాడని అనేక ప్రాచీన జైన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తర్వాత కాలంలో రెండో శాతకర్ణి జైనమతాచార్యుడైన కొండ కుందాచార్యుని ఆగ్రహానికి గురయ్యాడనీ, జైనాచార్యుడు శాతవాహనుల అధికారాన్ని నిర్మూలించడానికి భారతదేశానికి శకులను ఆహ్వానించాడని కొన్ని జైన గ్రంథాల్లో పేర్కొన్నారు.
బౌద్ధమతం: భద్రయానీయ శాఖకు చెందిన బౌద్ధులకు గౌతమీ బాలశ్రీ నాసిక్‌లో గుహాలయాన్ని తొలిపించింది. క్షత్రియుడైన ఉషవదత్తుడు నాసిక్ వద్ద కొన్ని గుహలను తొలిపించి వాటి నిర్వహణ కోసం వేలాదిగా కార్షాపణాలను దానం చేశాడు. మహా సాంఘికుల్లోని చైత్యాక, శైల, పూర్వశైల, అపరశైల శాఖలు కూడా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రజాదరణ పొందాయి. నాటి హీనయాన బౌద్ధం లేదా మహాథేరవాదం కూడా తెలంగాణలో నేటికీ కొనసాగుతూనే ఉంది. వీరికి, సాంఘికవాదులకు మధ్య వీరిద్దరినీ సమీకరించే దృష్టితో బహుతృతీయ అనే మరోశాఖ కూడా తెలంగాణ బౌద్ధుల్లో కనిపిస్తుంది.

శిల్పకళ - సేవలు
గుడిమల్లం (చిత్తూరు జిల్లా)లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో బయటపడిన దేవాలయ శిథిలాలు శాతవాహన యుగానికి చెందినవే అనే అభిప్రాయం ఉంది. బౌద్ధశిల్పాలకు బుద్ధుని జీవితంలోని పంచ కల్యాణాలు, బుద్ధ జాతక కథలు, సామాన్య జీవిత దృశ్యాలు కథా వస్తువులు. కృష్ణాలోయలోని స్తూపాల్లో చాలావాటికి నాలుగు దిక్కుల్లో వేదికలు, వాటిపై విదేశీ ‘ఆయక స్తంభాలు’ ఉండేవి. ఇవి పంచ కల్యాణాలను (బుద్ధుని జననం, మహాభినిష్ర్కమణ, సంబోధి, ధర్మచక్ర పరివర్తనం, మహా పరినిర్యాణం) సూచిస్తాయి.
విహారం: వర్షాకాలంలో బౌద్ధ బిక్షువుల నివాసానికి ఉద్దేశించినవి విహారాలు.
చైత్యం: పూజా వస్తువుగా చైత్యం లేదా బుద్ధ విగ్రహం ఉండి నిత్యార్చనకు ఉపయోగించే ఆలయమే చైత్యగృహం లేదా చైత్యాలయం.
సంఘారామం: ఒకే ఆవరణలో మూడు, నాలుగు విహారాలుండి, అధ్యయనానికి అనుకూలమైనది సంఘారామం.

చిత్ర కళలు
అజంతా 10వ గుహలోని ‘శ్వేతగజ జాతక’ చిత్రం శాతవాహన యుగానిదే. నాటి ప్రజలు రామాయణ భాగవతాది పురాణ గాథలను ఇళ్ల గోడలపై చిత్రించుకునే వారని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది.

సాహిత్య సేవ
శాతవాహన రాజులు సాహిత్య ప్రియులు. వీరి రాజ్యభాష ప్రాకృతం. ప్రాకృత భాషా వికాసానికి వీరు చాలా కృషి చేశారు. కుంతల శాతకర్ణి అంతఃపురంలో ప్రాకృతభాషను ఉపయోగించినట్లు రాజశేఖరుడు తన ‘కావ్య మీమాంస’లో పేర్కొన్నాడు. హాలుడు సంకలితపరిచిన ‘గాథాసప్తశతి’ ద్వారా నాటి సామాన్య ప్రజలు కూడా ప్రాకృత భాషలో కవితలు చెప్పగలిగేవారని, కేవలం రాజాదరణ వల్లే కాకుండా ప్రజాదరణ వల్ల కూడా సాహిత్య వికాసం జరిగిందని తెలుస్తోంది. శక-క్షత్రువుల శాసనాలు చాలావరకు సంస్కృత భాషలో ఉన్నాయి. యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన ద్వైభాషిక నాణేలపై ప్రాకృతం కాకుండా ఉన్న మరో భాష తెలుగేనని డి.సి. సర్కార్ నిర్ణయించారు. ఆచార్య నాగార్జునుడు (భారతదేశ ఐన్‌స్టీన్) రచించిన సుహృల్లేఖ (స్నేహితునికి లేఖ) గ్రంథాన్ని నాటి పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చి, విద్యార్థులతో కంఠస్థం చేయించేవారని ఇత్సింగ్ రచనల ద్వారా తెలుస్తోంది.
ఆర్యమంజూశ్రీ రాసిన ‘కల్పసూత్రం’, గుణాఢ్యుడి ‘బృహత్కత’, శర్వవర్మ రాసిన ‘కాతంత్ర వ్యాకరణం’, ఆర్యదేవుడు రాసిన ‘చిత్తశుద్ధి’ మొదలైనవి శాతవాహనుల కాలంనాటి ప్రముఖ గ్రంథాలు.

మాదిరి ప్రశ్నలు

  1. గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి కిందివాటిలో సరికాని అంశం ఏది?
    ఎ) క్షహారాట వంశం నిర్మూలించడం
    బి) మాతృ సంజ్ఞలు పాటించడం
    సి) జోగల్‌తంబిలో ఇతడి నాణేలులభించలేదు
    డి) దక్షిణా సముద్రాధిపతిగా ప్రసిద్ధి
    1) ఎ మాత్రమే
    2) బి, సి మాత్రమే
    3) బి, డి మాత్రమే
    4) సి, డి మాత్రమే
    సమాధానం: 4
  2. శాతవాహనుల కాలంనాటి స్త్రీలకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
    1) రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు
    2) మత విషయాల్లో జోక్యం చేసుకునేవారు
    3) దాతృత్వం, దాన ధర్మాలు, సంక్షేమ విషయాల్లో కీలకంగా వ్యవహరించేవారు
    4) పైవన్నీ
    సమాధానం: 4
  3. బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లు ఉన్న మాందాతా శిల్పం ఎక్కడుంది?
    1) నాగార్జున కొండ
    2) ఏలేశ్వరం
    3) జగ్గయ్యపేట
    4) చేజెర్ల
    సమాధానం: 3
  4. కిందివాటిలో సరికాని జత ఏది?
    1) పూర్వ శైలి - అమరావతి
    2) అపరశైలి - శ్రీ పర్వతం
    3) ఉత్తర శైలి - గుడివాడ
    4) రాజగిరిక - గుంటుపల్లి
    సమాధానం: 3
  5. శాతవాహన నిజమైన రాజ్య స్థాపకుడు?
    1) సిముఖుడు
    2) గౌతమీపుత్ర శాతకర్ణి
    3) మొదటి శాతకర్ణి
    4) యజ్ఞశ్రీ శాతకర్ణి
    సమాధానం: 3
  6. శాతవాహనుల కాలంలో శాసనాలన్నింటిని ఏ భాషలో ముద్రించారు?
    1) పాళీ
    2) ప్రాకృతం
    3) సంస్కృతం
    4) పైవన్నీ
    స‌మాధానం: 2
  7. హాలుడు రాసిన ‘గాథాసప్తశతి’లో వాస్తవం కాని అంశమేది?
    ఎ) ప్రాకృత భాషలో 700 గ్రామీణ శృంగార కథలు వివరించాడు
    బి) ఈ కథలలో ‘కుబేరుడు’ ప్రధాన నాయకుడు
    సి) 700 కథల్లో నరవాహణుడి కథ చాలా ప్రసిద్ధి
    డి) శివుడి శ్లోకంతో ప్రారంభించి గౌరీ స్తోత్రంతో గ్రంథం ముగుస్తుంది
    1) ఎ, డి మాత్రమే
    2) ఎ, బి, సి మాత్రమే
    3) ఎ, బి, డి మాత్రమే
    4) సి మాత్రమే
    స‌మాధానం: 4
  8. నాగార్జునుడికి సంబంధించిన గ్రంథం ఏది?
    1) శూన్యసప్తశతి
    2) రతిశాస్త్రం
    3) మణిమంగళం
    4) పైవన్నీ
    స‌మాధానం: 4
  9. నాగార్జునుడి ‘సుహృల్లేఖ’ గ్రంథాన్ని నాటి కాలంలో పాఠ్యాంశాలలో పొందుపర్చారని చెప్పిన చైనా యాత్రికుడు?
    1) హుయాన్‌త్సాంగ్
    2) ఫాహియాన్
    3) ఇత్సింగ్
    4) పైవారందరూ
    స‌మాధానం: 3
  10. తూర్పు తీరంలో ప్రసిద్ధ ఓడ రేవు కానిది?
    1) అరికమేడు
    2) సోపార
    3) కోరంగి
    4) ఘంటసాల
    స‌మాధానం: 2
Published date : 02 Sep 2015 05:42PM

Photo Stories