Skip to main content

Telangana History For Groups Exams: పానగల్లు శాసనాన్ని వేయించింది ఎవ‌రు?

telangana history preparation tips and guidance for groups
telangana history preparation tips and guidance for groups

రేచర్ల రెడ్డి వంశీయులు, రేచర్ల పద్మనాయకులు, చెరకు రెడ్డి వంశీయులు, కాయస్థులు, మల్యాల, విరియాల, బాణ వంశీయులు, కందూరి చోడులు, నతవాడి, వెన్గొండ వంశీయులు, పొలవాస పాలకులు, నాగ వంశీయులు, యాదవ రాజులు, వైదుంబులు, వావిలాల, త్యాగి, కోట, ఇందులూరి, గోన వంశీయులు కాకతీయ సామంత మాండలికుల్లో ముఖ్యులు. వీరిలో తెలంగాణ భూభాగంతో సంబంధంఉన్నవారి గురించి తెలుసుకుందాం.

రేచర్ల రెడ్డి వంశం (1051–1289)

ఈ వంశీయులు కాకతీయుల వద్ద సేనాపతులుగా, సామంతులుగా, మంత్రులుగా పనిచేశారు. ఈ వంశంలోని ఒక శాఖ నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు, పిల్లలమర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం, తాలువాయి, బూరుగుగడ్డ, సిరికొండ, చిలుకూరు ప్రాంతాలను పాలించింది. మరో శాఖ వరంగల్‌ జిల్లాలోని ఎలకుర్తి,ములుగు,నర్సంపేట, మాచాపూర్‌తో పాటు కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌ తాలూకాలోని ప్రాంతాలను పరిపాలించింది. ఈ ప్రాంతాల్లో వీరు 30 శాసనాలు వేయించారు. 15 దేవాలయాలు నిర్మించారు. విద్యాపీఠాలు, మఠాలు నెలకొల్పారు. ఆమనగల్లు, పిల్లలమర్రి, ఉండ్రుకొండ, ఉర్లుగొండ, ఎలకుర్తి దుర్గాలను నిర్మించారు. రామప్ప చెరువు, నామ సముద్రం మొదలైన 22 చెరువులు, కాలువలను తవ్వించారు.

చ‌ద‌వండి: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

రేచర్ల బమ్మసేనాని

రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ సామ్రాజ్య సంరక్షణ భారం వహించి, కాకతీయుల శత్రువులకు సింహస్వప్నంగా మారారు. అనేక యుద్ధాల్లో విజయం సాధించిన రేచర్ల రెడ్డి వంశీయులు కాకతీయ రాజుల అభిమానాన్ని చూరగొన్నారు. రేచర్ల రెడ్డి వంశ మూల పురుషుడు రేచర్ల బమ్మ(బ్రహ్మ)సేనాని. ఇతడినే బమ్మిరెడ్డి(1035–1055) అని పిలుస్తారు. ఇతడు కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్‌ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. బమ్మిరెడ్డి తర్వాత అతడి కుమారుడు లేదా మనువడిగా భావిస్తున్న ముచ్చ సేనాని మొదటి ప్రోలరాజు(1052–1076) వద్ద చమూపతిగా పనిచేశాడు. ముచ్చసేనాని కూడా కాకతీయ రాజ్య విస్తరణలో తోడ్పడ్డాడు. వేములవాడ చాళుక్య రాజైన భద్రగుణ్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించడంలో ఇతడు ముఖ్య భూమిక పోషించాడు. ఇతడి కొడుకు ఒకటో కాట సేనాని రెండో బేతరాజు(1076–1108) వద్ద సేనానిగా పనిచేశాడు. కాట సేనాని కుమారుడైన కామ చమూపతి రెండో ప్రోలరాజు(1116–1157)కు చమూపతి అయ్యాడు. 

తొలి రాజు రెండో కాట చమూపతి

కాకతీయులు, కందూరి చోడులు, పొలవాస రాజులు, గోవింద దండ నాయకులు తెలంగాణలో కళ్యాణి చాళుక్య సామంతులుగా పనిచేశారు. అనంతర కాలంలో కాకతీయుల విజృంభణను సహించని ఈ ఇతర సామంతులను ఓడించి లొంగదీసుకోవడంలో రెండో ప్రోలరాజుకు కామ చమూపతి సహాయం చేశాడు. పొలవాస రాజైన గుండన(మంథెన)ను సంహరించడం ముఖ్య సంఘటనగా చెప్పవచ్చు. ఇతడికి రెండో కాట చమూపతి, పిల్లలమర్రి బేతిరెడ్డి, నామిరెడ్డి అనే ముగ్గురు కుమారులు, వల్లసాని అనే కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడైన రెండో కాట చమూపతి రుద్రదేవుడి దండ నాయకుడు అయ్యాడు. రుద్రదేవుడు సింహాసనం అధిష్టించే నాటికి కాలచురి బిజ్జలుని ప్రోత్సాహంతో.. పొలవాస మేడరాజు, నగునూరు(కరీంనగర్‌ జిల్లా) దొమ్మరాజు కాకతీయ రాజ్యం మీద దండెత్తారు. రుద్రదేవుడు వీరిని ఓడించాడు. ఈ యుద్ధాల్లో తోడ్పడిన రెండో కాట చమూపతికి మహాసామంతాధిపత్యం ఇచ్చి ఎలకుర్తి రాజధానిగా నర్సంపేట, మాచాపూర్, ములుగు ప్రాంతాలను పరిపాలించేందుకు నియమించాడు. ఈ విధంగా రేచర్ల రెడ్డి వంశంలో రెండో కాట చమూపతి మొదటి రాజయ్యాడు. 
ఇతడి రెండో తమ్ముడు బేతిరెడ్డి రుద్రదేవుడి సేనాని అయ్యాడు. ఈ లోగా తెలంగాణలో కాకతీయ ప్రత్యర్థులైన కందూరు చోడులు (ఉదయన చోడుడు, భీమ గోకర్ణులు) రాజ్య విస్తరణకు ప్రయత్నించారు. రుద్రదేవుడు వీరిని ఓడించి సామంతులుగా చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లో తోడ్పడిన బేతిరెడ్డిని ఆమనగంటి రాజ్యానికి సామంతుడిగా నియమించాడు. ఆమనగల్లు, పిల్లలమర్రి, నాగులపాడు, మిర్యాలగూడ, సోమవరం ప్రాంతాలు ఇతడి రాజ్యంలో ఉన్నాయి. బేతిరెడ్డి పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించి రాజధానిని అక్కడికి మార్చాడు. రుద్రదేవుడు తెలంగాణ ప్రాంత విజయాల తర్వాత తీరాంధ్ర మీద దండెత్తాడు. ఈ యుద్ధాల్లో బేతిరెడ్డి తమ్ముడు నామిరెడ్డి, రెండో కాట చమూపతి కుమారుడైన రెండో ముచ్చ సేనాని తోడ్పడ్డారు. రుద్రదేవుడి మరణానంతరం బేతిరెడ్డి ఆమనగంటి రాజ్యాన్ని నామిరెడ్డికి అప్పగించాడు. ఆ విధంగా వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు ఆమనగంటి పురవరేశ్వర, శౌర్య సౌపర్ణ మొదలైన బిరుదులు ధరించారు. దీన్ని బట్టి వీళ్లు ఒకరి తర్వాత మరొకరు ఆమనగల్లును పాలించినట్లు తెలుస్తోంది. బేతిరెడ్డి భార్య ఎర్రక్క సాని, నామిరెడ్డి పిల్లలమర్రిలో ఎరకేశ్వర, కాచేశ్వర, కామేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించారు.

చ‌ద‌వండి: Kakatiyas (History) Notes for Groups: ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

రేచర్ల రుద్రారెడ్డి

రెండో కాటసేనాని(కాటచమూపతి) రెండో కుమారుడైన రుద్ర సేనాని(రుద్రారెడ్డి) రేచర్ల రెడ్డి వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడు రుద్రదేవుడి కాలంలో సేనాపతిగా చేరాడు. ఇతడి వంశం గురించి గోలకొండ పత్రికలో ఆసక్తికర చర్చ జరిగింది. కంభపాటి అప్పన్న శాస్త్రి ఇతడిని రేచర్ల రెడ్డి వంశీయుడిగా పేర్కొనగా, రుద్ర సేనాని వెలమ వీరుడని శేషాద్రి రమణ కవులు(మారుపేరుతో కూడా) తెలిపారు. రుద్ర సేనాని మంత్రి అయిన రాజెనాయకుడి ద్రాక్షారామ శాసనంలోని ‘గుణినఃశ్రీ రుద్రరెడ్డి ప్రభో’ అనే భాగం, సోమవరం, ఉప్పరపల్లి శాసనాలు రుద్ర సేనాని రేచర్ల రెడ్డి వంశీయుడే అని తెలుపుతున్నాయి.
దేవగిరి యాదవ రాజులతో చేసిన యుద్ధంలో రుద్రదేవుడు(1195) మరణానంతరం, మహాదేవుడి కాలంలో, యాదవులతో జరిగిన యుద్ధంలో మహాదేవుడు మరణించి గణపతి దేవుడు యాదవ రాజుల బందీగా ఉన్న సమయంలో... ఈ మూడు సందర్భాల్లో కాకతీయ రాజ్యంలో సంక్షోభం తలెత్తింది. ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళ పృథ్వీశ్వరుడు, కులోత్తుంగ చోళుడు కాకతీయ రాజ్య భూభాగాలను ఆక్రమించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రేచర్ల రుద్రారెడ్డి వీరిని ఓడించి, ఆంతరంగిక శత్రువులను అణచివేశాడు. కాకతీయ సింహాసనాన్ని గణపతి దేవుడికి అప్పగించి ‘కాకతి రాజ్య భార ధౌరేయు’డిగా ‘కాకతి రాజ్య సమర్థుడు’గా పేరొందాడు. గణపతి దేవుడి(1199–1259) కాలంలో ప్రధాని అయ్యాడు. రుద్రారెడ్డి కుమారులైన లోక సేనాని, పెద్ద గణపతి, నాలుగో కాటసేనాని; మనుమలు గణపతి, వసాయిత చమూనాథ; మునిమనుమడు వీరవసాయితలు కాకతీయ సేవకులుగా ఎలకుర్తి ప్రాంతాన్ని పాలించారు. బేతిరెడ్డి రెండో కుమారుడు లోకిరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఊట్కూరుæ ప్రాంతాన్ని పాలించాడు.

చ‌ద‌వండి: TS History Practice Test

రుద్రమదేవికి బాసటగా

నామిరెడ్డి కుమారులైన కాట్రెడ్డి, నామిరెడ్డి మేనల్లుడైన చెవిరెడ్డి(బేతాళ రెడ్డి, బేతాళ నాయకుడు), గణపతిదేవుడి వద్ద సేనానులుగా పనిచేశారు. ఆ సమయంలో ఆమనగంటి లేదా పిల్లలమర్రి రాజ్యాన్ని నామిరెడ్డి కుమారులే పరిపాలించారు. గణపతిదేవుడి మరణం తర్వాత చెవిరెడ్డి కుమారులైన ప్రసాదిత్య, రుద్రనాయుడు రుద్రమదేవికి బాసటగా నిలిచారు. నామిరెడ్డి మనుమలు.. గణిపిరెడ్డి, మర్రెడ్డి (కామిరెడ్డి కుమారులు), నామయ, కామయ, మల్లయ (కాట్రెడ్డి కుమారులు) వేయించిన నాగులపాటి శాసనాల్లో వీరికి ఎలాంటి బిరుదులు ఉన్నట్లు తెలపలేదు. దీన్నిబట్టి వీరికి రాజ్యం లేదని భావించవచ్చు. ఆ తర్వాత రేచర్ల రెడ్డి వంశం ప్రశస్తిలోకి రాలేదు. చెవిరెడ్డి వంశీయులే వైష్ణవ మతం స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి వెలమలై రేచర్ల పద్మనాయకులు అయ్యారని భావించవచ్చు. ఈ తెగకు చెందిన వారే వెంకటగిరి సంస్థానాధిపతులని, ఇతర ప్రాంతాల పాలకులని తెలుస్తోంది. ఈ కాలంలో పిల్లలమర్రి పినవీరన పూర్వీకులైన హరిహరార్యుడు, ఇవటూరి సోమన, మంచి రాజకవి, ప్రదిక్షణం మహాదేవ మంచి, సోమదేవ మంత్రి మొదలైన కవి పండితులు ఉండేవారు. ఈ కాలం నాటి పిల్లలమర్రి దేవాలయంలోని చిత్రాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవి.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

మాదిరి ప్రశ్నలు

 

చ‌ద‌వండి: History Notes for Group 1, 2: రాష్ట్రకూట వంశానికి చెందిన వారే కాకతీయులు!

 

Published date : 18 May 2022 06:41PM

Photo Stories