Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం
కాకతీయ వాస్తు, శిల్ప రీతికి తలమానికం రామప్ప దేవాలయం. ఈ దేవాలయంలోని నందికి ఒక ప్రత్యేకత ఉంది. వీక్షకులు ఏ వైపు నుంచి చూసినా అది వారివైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఓరుగల్లు కోటలోని నిర్మాణాలు కాకతీయుల కాలంనాటి వాస్తు, శిల్ప కౌశలాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ కోటను ఏకశిల చుట్టూ నిర్మించారు.
కాకతీయ యుగ విశేషాలు
పన్నులు
కాకతీయుల కాలంలో స్థూలంగా అయిదు రకాల పన్నులుండేవి. అవి: 1. భూమి పన్ను, 2. పారిశ్రామిక, ఆస్తి పన్నులు, 3. వృత్తి పన్నులు, 4. వ్యాపార పన్నులు, 5. ఇతర పన్నులు.
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. వర్తకం,పరిశ్రమలు, వృత్తులపై విధించే పన్నులు రెండో ఆదాయ మార్గం. పశుగ్రాసానికి పనికి వచ్చే పచ్చికబయళ్లపై వసూలు చేసే పన్ను, అడవుల కలపపై వేసే పన్ను మూడో ఆదాయ మార్గంగా ఉండేది. వర్తక సరకులు, ఎగుమతి దిగుమతులు, తయారైన వస్తువుల మీద వేసే పన్నును ‘సుంకం’గా పేర్కొనేవారు. సాధారణంగా సుంకాలు వసూలు చేసే అధికారం వర్తక శ్రేణులకు ఇచ్చేవారు.
Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
న్యాయ పాలన
సామాన్యమైన వివాదాలన్నింటినీ గ్రామ సభల్లో గ్రామ ప్రభువులు పరిష్కరించేవారు. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ‘తలారి’ అనే గ్రామోద్యోగి చూసేవాడు. రాజే అంతిమ న్యాయ నిర్ణేత. యాజ్ఞవల్క్య స్మృతి లాంటి ప్రాచీన స్మృతి గ్రంథాల్లో పేర్కొన్న సూత్రాలను అనుసరించి ధర్మాసనాలు ఏర్పరిచేవారు. ఒకరిద్దరు రాజాధికారులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సభల్లో న్యాయ సమస్యలు పరిష్కారమయ్యేవి. వీరిని ‘మహాజనులు’గా పేర్కొనేవారు. సమస్య పరిష్కారమైన వెంటనే సభ రద్దయ్యేది. ప్రస్తుతం గ్రామ పెద్దల మాదిరిగా ఈ మహాజనులు పనిచేసేవారు. తెగల్లో వివాదాలను ‘సమయాలే’ పరిష్కరించేవి.
సైనిక వ్యవస్థ
కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు విభాగాలు ఉండేవి. కాకతీయ చక్రవర్తులు సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించేవారు. వీరి రాజ్యంలో స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలు ఉన్నట్లు తెలుస్తోంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానుగల్లు కోటలు శత్రు దుర్భేద్యమైనవిగా పేరు పొందాయి.
TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?
ఆర్థిక పరిస్థితులు
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరి సంపదలతో విలసిల్లినట్లు అమీర్ ఖుస్రూ, అబ్దుల్లా వాసఫ్, మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికుల రచనల ద్వారా తెలుస్తోంది.
వ్యవసాయం: తెలంగాణా ప్రాంతంలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడానికి కాకతీయులు ఎనలేని కృషి చేశారు. వీరు చెరువులు నిర్మించి నీటి పారుదలపై శ్రద్ధ వహించారు. రెండో బేతరాజు సెట్టి సముద్రం, కెరె సముద్రం, కేసరి సముద్రం చెరువులను నిర్మించాడు. గణపతిదేవుడు రాజ్యం నలుమూలలా అనేక చెరువులు నిర్మించాడు. గణపతిదేవుడి సేనాని రేచర్లరుద్రుడు 17,258 ఎకరాలకు సాగు నీరు అందించేవిధంగా పాకాల చెరువును నిర్మించాడు. దీని విస్తీర్ణం 12 చ.కి.మీ. రామప్ప చెరువును నిర్మించింది కూడా ఇతడే. రేచర్ల రెడ్లు 35 నీటి వనరులను ఏర్పాటు చేశారు. కాటచమూపతి కాట సముద్రం; చౌడ చమూపతి చౌడ సముద్రం; నామిరెడ్డి సబ్బి సముద్రం, గౌర సముద్రం, కోమటి చెరువు; ఎరకసాని ఎరక సముద్రం నిర్మించారు. వీటితో పాటు చింతల సముద్రం, నామా సముద్రం కూడా ఉండేవి. చెరువుల నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులకు దినసరి వేతనాలు చెల్లించేవారు. చెరువులతో పాటు ఊట కాలువలను కూడా నిర్మించారు. మూసీ నది నుంచి సాగే మూసెటి కాలువ; ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ; కూచినేని కాలువ, రావిపాటు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉటుంకాలువ, చింతల కాలువల గురించి పిల్లలమర్రి శాసనాల్లో పేర్కొన్నారు. ఏతం, మోటలతో కూడా వ్యవసాయం చేసేవారు. కొత్తగా పొలాలను సాగు చేయడానికి కాకతీయ రాజులు కృషి చేశారు. ప్రతాపరుద్రుడి కాలంలో అడవులను నరికేసి విశాల భూభాగాలను సాగులోకి తీసుకువచ్చారు. నేటి రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ప్రతాపరుద్రుడి కాలంలో రూపొందినవేనని ఆ గ్రామ కైఫీయతుల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలోని మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ భాగం కాకతీయుల కాలంలోనే ఏర్పడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గ్రామం, చెరువును నిర్మించడం నాడు పుణ్యకార్యంగా భావించేవారు. గ్రామాలను ఏర్పరచడానికి అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. చాలా మంది కాకతీయ రాజులు, రాణులు అటవీ, బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా చేశారు. వీరి పేరు మీద అనేక గ్రామాలు ఏర్పడ్డాయి. గణపవరం, ఘన్‌పూర్, మహాదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం, కుందవరం మొదలైనవన్నీ వీటికి ఉదాహరణ. భూమిపై ప్రాథమిక స్వామ్యం రాజుది, ద్వితీయ స్వామ్యం వ్యక్తిది.
రైతులు వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు,నీలిమందు,ఆముదాలు, నువ్వులు, పెసలు, కందులు, చెరకు, నూనెగింజలు, ఆవాలు, సజ్జలు, మినుములు, ఉలవలు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి తదితర పంటలు పండించేవారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం తయారైనట్లు సాహిత్యం ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో కొబ్బరి, చెరకు, మామిడి, జామ, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. సాధారణంగా ప్రతి గ్రామంలో బెల్లం, నూనె గానుగలు ఉండేవి. పశు సంపద పుష్కలంగా ఉండేది.
పరిశ్రమలు: నాడు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఉండేవి. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో ఇరవైకి పైగా వస్త్రాల గురించి పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, ముఖమల్ వస్త్రాలు నేసేవారు. ఏకామ్రనాథుడు ఓరుగల్లులో చిత్తరువులు రాసే ఇళ్లు్ల 1500 వరకు ఉండేవని పేర్కొన్నాడు. నాడు చిత్రకళకు మంచి ఆదరణ ఉండేది. పాల్కురికి ‘బసవపురాణం’లో యాభై రకాల దుస్తుల పేర్లను ప్రస్తావించాడు. కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్నని వస్త్రాలు నేసేవారని, అవి సాలెపురుగు జాలె మాదిరిగా ఉండేవని మార్కోపోలో ప్రశంసించాడు. వీటి ఆధారంగా ఆ కాలంలో పద్మశాలీలకు మంచి నైపుణ్యం ఉండేదని తెలుస్తోంది. పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణనను పరిశీలిస్తే నాటి వడ్రంగుల పని నైపుణ్యం అర్థమవుతుంది. పంచలోహాలతో వివిధ రకాల వస్తువులను తయారు చేసేవారు. నిర్మల్‌లో తయారైన కత్తులకు డమాస్కస్‌లోనూ మంచి ఆదరణ ఉండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో రాశారు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలను గ్రామాల్లోనే తయారు చేసేవారు. పానగల్లు, చండూరులో దేవాలయాల్లో ఉపయోగించే కంచు గంటలు, పళ్లాలు, పాత్రలను రూపొందించేవారు.
వర్తక–వాణిజ్యం: శాతవాహనుల తర్వాత క్రమంగా క్షీణించిన దేశీయ, విదేశీ వాణిజ్యాన్ని కాకతీయులు పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. ఆ తర్వాత తెలంగాణలో మంథెన, అలంపురం, జడ్చర్ల, మగతల, పేరూరు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. పలనాటి సీమ నుంచి వాడపల్లి, నకిరెకల్, పిల్లలమర్రి మీదుగా వ్యాపారులు వరంగల్ వచ్చేవారు. బళ్లారి–చిత్తూరు,రాయచూరు–కొలనుపాక, బీదరు–కొలనుపాక, కల్యాణి–కొలనుపాక–అనుమకొండ, బీదరు–పటాన్‌చెరువు–వరంగల్ మొదలైనవి ముఖ్యమైన వాణిజ్య మార్గాలుగా ఉండేవి.
కాకతీయుల పాలనలో తెలంగాణలో వర్తక శ్రేణుల నిర్మాణంలో గుర్తించదగిన మార్పు వచ్చింది. ఆ కాలంలో వ్యాపారం బలిజలకు, వైశ్యులకే పరిమితం కాలేదు. రెడ్లు, నాయుళ్లు, బోయలు, దాసర్లు, తెలికలు, పద్మశాలీలు, వ్యవసాయదారుల లాంటి ఉత్పత్తిదారులు, కమ్మరి, కంసాలి, మేదరి లాంటి వృత్తి కులాల వారు వ్యాపారంలోకి వచ్చారు. వివిధ వృత్తికారులు,ఉత్పత్తిదారులు సొంత సమయాలను ఏర్పరచుకొని తమ కులవృత్తులతో పాటు వ్యాపారాలను నిర్వహించుకునేవారు.వీరిలో కొంత మంది కేవలం తమ ఉత్పత్తులనే అమ్ముకునేవారు. అందువల్ల ఇంతమంది వ్యాపారంలోకి వచ్చినప్పటికీ ప్రధానంగా వ్యాపారం వైశ్యుల చేతిలోనే ఉండేది. గోధుమ, పెసలు, వడ్లు, జొన్నలు, ఉప్పు, నూనె, నెయ్యి, మిరియాలు, ఆవాలు, తేనె, తగరం, రాగి, కర్పూరం, కస్తూరి, పట్టు, రత్నాలు, ముత్యాలు, పూసలు, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం, నూలు, దుంపలు మొదలైన ఉత్పత్తుల వ్యాపారం జరిగేది.
విదేశీ వాణిజ్యం: కాకతీయుల కాలంలో ‘మోటుపల్లి’ విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధమైన రేవు పట్టణంగా గుర్తింపు పొందింది. చాళుక్య, చోళ రాజుల కారణంగా దెబ్బతిన్న విదేశీ వ్యాపారాన్ని గణపతిదేవుడు ఈ రేవు పట్టణం ద్వారా పునరుద్ధరించాడు. దీని ద్వారా ఇండోనేషియా, జావా, సుమత్రా, జపాన్, మలయా, బర్మాతో వ్యాపారం చేసేవారు. మార్కోపోలో ఈ రేవు పట్టణాన్ని సందర్శించాడు. ఇక్కడి నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో వజ్రాలు, పట్టుతో తయారయ్యే సన్నని వస్త్రాలు ముఖ్యమైనవని అతడు పేర్కొన్నాడు. కాకతీయుల నాణేలు ఎక్కువగా లభించలేదు. కానీ శాసనాలు, సాహిత్యంలో నాణేల ప్రస్తావన ఉండేది.
Telangana History for Group 1 & 2: కాకతీయ సామ్రాజ్యం... రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
సాంఘిక పరిస్థితులు
కాకతీయుల కాలంనాటి సంఘంలో ప్రధానంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ఉండేవి. ప్రతి కులంలో అనేక ఉపకులాలు ఏర్పడ్డాయి. ఏకామ్రనాథుడు ‘ప్రతాపచరిత్ర’లో, వినుకొండ వల్లభరాయుడు ‘క్రీడాభిరామం’లో కాకతీయుల కాలంనాటి వివిధ వృత్తుల గురించి ప్రస్తావించారు. కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, అక్కలవారు (ఆగసాల), సాలెవారు, మంగలులు, కుమ్మరివారు, బోయవారు, రుంజులు, పిచ్చుకుంట్లు, పంబల, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లను శాసనాల్లోనూ పేర్కొన్నారు.
హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ, వైష్ణవ మతాలు ఆవిర్భవించాయి. కుల నిర్మూలన కోసం పుట్టిన వీటి ద్వారా సంఘంలో కొత్త కులాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా శైవుల్లో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్లు మొదలైన కులాలు ఏర్పడ్డాయి. వైష్ణవుల్లో నంబులు, సాతానులు, దాసర్లు మొదలైన కులాలు ఆవిర్భవించాయి. ‘అష్టాదశ కులాలు’ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి.
కాకతీయుల కాలంలో బాల్యవివాహాలు జరిగాయి. అనులోమ, ప్రతిలోమ వివాహ పద్ధతులు ఉండేవి. రుద్రమదేవి కుమార్తె రుయ్యమను బ్రాహ్మణ మంత్రి ఇందులూరి అన్నయ్య దేవుడు పెళ్లి చేసుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయినప్పటికీ కుల నిర్మూలన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాకతీయుల కాలంలో వెలమలు సంఘ సంస్కర్తలుగా, రెడ్లు పూర్వాచార పరాయణులుగా ఉన్నట్లు తెలుస్తోంది. నాడు రాజకీయంగా ప్రాబల్యం వహించిన రెడ్లు, వెలమల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. ఈ కాలంలో అష్టాదశ వర్ణాల్లో అగ్రవర్ణమైన బ్రాహ్మణ వర్గానికి చెందినవారు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు. రాజకీయాధికారం చతుర్థ వర్ణ పరమైంది. క్షత్రియ వంశాలు నామామాత్రంగా అధికారంలో ఉండేవి.
కాకతీయుల కాలంనాటి సాంఘిక జీవితానికి సంబంధించిన ఒక ప్రధాన లక్షణం కుల సంఘాలు. వీటిని ‘సమయములు’ అనేవారు. నగరాలు, గ్రామాలు పేటలుగా విభజించి ఉండేవి. అక్కలవాడ, భోగంవీధి, వెలిపాళె, మేదరవాడ, మోహరినాడు మొదలైనవి ఇలాంటివే. పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. బసవ పురాణం ఆధారంగా ఆనాటికే వెట్టి వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు పాత్ర, గొండ్లి, పేరణి, కోలాటం, గొబ్బిళ్లు, గుర్రం, భంజళి మొదలైన క్రీడలతో వినోదం పొందేవారు.
Telangana History For Groups Exams: పానగల్లు శాసనాన్ని వేయించింది ఎవరు?
వాస్తు, శిల్ప కళ
కాకతీయ రాజులు, వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవాలయాలను నిర్మించారు. దేవాలయ నిర్మాణంలో కాకతీయులు పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు. వీరు త్రికూటాలయాలను ఇదే పద్ధతిలో నిర్మించారు. బేతిరెడ్డి భార్య ఎరకేశ్వరాలయం నిర్మించారు. నామిరెడ్డి పిల్లలమర్రిలో కాటేశ్వర, కాచేశ్వర, నామేశ్వర ఆలయాలను నిర్మించాడు. పాలంపేట, పిల్లలమర్రి, పానగల్లు, హన్మకొండలో ఉన్న ఆలయాలను త్రికూట పద్ధతిలోనే నిర్మించారు.
నంది విగ్రహాలు కాకతీయ శిల్ప ప్రాభవానికి నిదర్శనాలు. కాకతీయ శిల్పం చాళుక్యుల శిల్పం కంటే నిగ్గు తేలి ఉంది. ఇది కొంత ప్రాంతీయ లక్షణాలను సంతరించుకొని ఉంటుంది. దేశీయ నృత్య రీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాట్యగత్తెల కోలాట దృశ్యాలు కూడా కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉన్నాయి.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత
మాదిరి ప్రశ్నలు
1. ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశాల భూభాగాలు సాగులోకి వచ్చాయి?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 2
2. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయని కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది?
1) బేతరాజు
2) ప్రోలరాజు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 3
3. కాకతీయ రాజ్యంలో శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు?
1) మెగస్తనీస్
2) ప్లీని
3) మార్కోపోలో
4) నికోలో కాంటి
- View Answer
- సమాధానం: 3
4. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు రాసిన విదేశీ యాత్రికుడు?
1) టాలెమి
2) మార్కోపోలో
3) ప్లీని
4) కొలంబస్
- View Answer
- సమాధానం: 2