Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం... రాజధానిని రాచకొండకు మార్చింది...
అనపోతనాయకుడు తన రాజధానిని ఆమనగంటి నుంచి రాచకొండకు మార్చాడు. రాచకొండ దుర్గానికి రాజాద్రి, రాజగిరి, రాజా చలమనే పేర్లున్నాయి. దట్టమైన అడవులు, పర్వత పంక్తుల మధ్య ఉన్నఈ దుర్గం అభేద్యం. అక్కడి శాసనాల్ని బట్టి 1365కి ముందే రాజధానిని మార్చినట్లు తెలుస్తోంది. రాజధానిని పటిష్టం చేసుకున్న తర్వాత అనపోతనాయకుడు 1368లో ఓరుగల్లును ముట్టడించాడు. అనుమకొండ సమీపంలోని భీమవరం వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అతడు కాపయనాయకుడిని సంహరించాడు.
కాకతీయానంతర యుగం
పద్మనాయకులు
ప్రసాదిత్య నాయకుడి కుమారుడు వెన్నమనాయకుడు ప్రతాపరుద్రుడి సేనానిగా ప్రసిద్ధుడు. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై చేసిన దండయాత్రను తిప్పికొట్టిన వారిలో ఇతడు ప్రముఖుడు. వెన్నమ నాయకుడి కుమారుడు ఎరదాచానాయకుడు, సబ్బినాయకుడి కుమారుడు(ప్రసాదిత్య నాయకుడి మనవడు) నలదాచానాయకుడు కూడా ప్రతాపరుద్రుడి సేనానులే. కాకతీయులకు పాండ్య రాజుల (1316)తో, హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో ఎరదాచానాయకుడు కీలక పాత్ర పోషించాడు. ప్రతాపరుద్రుడు ఇతడి పరాక్రమానికి మెచ్చి పంచ పాండ్యదళ విభాళ, పాండ్య గజకేసరి అనే బిరుదులిచ్చాడు.
ఎరదాచానాయకుడికి ముగ్గురు కుమారులు. వారు ఒకటో సింగమనాయకుడు, వెన్నమనాయకుడు, ఏచమనాయకుడు. నలదాచానేనికి మాధవనాయకుడు, దామానేడు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో సింగమనాయకుడు (1326–1361) ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపాడు. కంపిలి రాజ్యంతో జరిగిన యుద్ధం (1320)లో కూడా విజయం సాధించి ప్రతాపరుద్రుడి ప్రశంసకు పాత్రుడయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ల దాడిలో ప్రతాపరుద్రుడు బందీ అయ్యాక మహ్మద్ బిన్ తుగ్లక్ మాలిక్‌ను ఓరుగల్లు పాలకుడిగా నియమించాడు. ముసునూరి ప్రోలయ నాయకుడు, సింగమనాయకుడు, వేమారెడ్డి ముస్లింలను ఎదిరించి స్వతంత్ర రాజ్యస్థాపనకు పూనుకున్నారు. ముసునూరి ప్రోలయనాయకుడు తీరాంధ్ర నుంచి తురుష్కులను వెళ్లగొట్టాడు. ఇతడి తర్వాత పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు రాజయ్యాడు. కాపయనాయకుడి నాయకత్వంలో సింగమనాయకుడు, వేమారెడ్డి తదితరులు ఏకమై 1336లో ఓరుగల్లును ఆక్రమించారు. కాపయ ఓరుగల్లు పాలకుడయ్యాడు. సింగమనాయకుడు వారసత్వంగా వచ్చిన ఆమనగల్లు రాజ్యంలో స్వతంత్రించాడు. అంతేగాక ఈ సమయంలో సింగమనాయకుడు తన కుమారులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రాంతాన్ని,కృష్ణా,తుంగభద్ర మధ్య ప్రాంతాన్ని జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు.
Telangana History for Competitive Exams: బహమనీ రాజ్యస్థాపనకు సహాయం చేసిందెవరు?
రెడ్డి, వెలమ రాజ్యాల వైరం
చక్రవర్తి కావాలనుకున్న కాపయనాయకుడు సింగమనీడు పాలిస్తున్న ఆమనగంటి రాజ్యాన్ని ఆక్రమించి తన ప్రతినిధిగా ఎరబోతు లెంకను నియమించాడు. కాపయ ఆక్రమించిన ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాన్ని సింగమనీడు 1360 ప్రాంతంలో తిరిగి జయించాడు. ఈ చర్యకు ఆగ్రహించిన కాపయ సామంతులు, స్నేహితులైన క్షత్రియులు సింగమనేని బావమరిదైన చింతపల్లి సింగమ నాయుడిని ఓరుగల్లు మండలంలోని జల్లపల్లి కోటలో బంధించారు. సింగమనీడు ఈ కోటను ముట్టడించాడు. క్షత్రియులు సంధి పేరుతో తంబళ్ల బ్రహ్మజీని రాయబారిగా పంపి సింగమను హత్య చేయించారు. అతడి కుమారులు అనపోతానాయకుడు, మాదానాయుడు రాజులై జల్లిపల్లి, ఇనుగుర్తి కోటలను ముట్టడించి క్షత్రియులను చంపి పగతీర్చుకున్నారు. కొందరు క్షత్రియులు హుజూరాబాద్, మొలంగూరు కోటల్లో దాచుకున్నారు. కరీంనగర్ జిల్లా మొలంగూరు సమీపంలోని చెంజర్ల వద్ద దాక్కొన్న సోమవంశ క్షత్రియులనందరినీ 1361లో సంహరించారు.
ఈ సమయంలో కాపయ ప్రోత్సాహంతో క్షత్రియులకు సహాయంగా వచ్చిన రెడ్డి రాజులను మాదానాయకుడు, నాగానేడు చేజెర్ల, మొగళ్లూరు ప్రాంతం నుంచి తరిమి వేశారు. శ్రీశైలం ప్రాంతమంతటినీ జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. తర్వాత రెడ్డి రాజ్యభాగమైన ధరణికోటను ముట్టడించి అనపోతారెడ్డిని ఓడించారు. ఈ యుద్ధం 1361లో చెంజర్ల యుద్ధం తర్వాత జరిగింది. ఈ యుద్ధంతో మొదలైన రెడ్డి, వెలమ రాజ్యాల వైరం ఈ రాజ్యాల పతనం దాకా కొనసాగింది. క్షత్రియుల్లో కొందరు భువనగిరి ప్రాంతం చేరి అనపోతనాయకుడి శత్రువులను కలుపుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. అనపోతానాయకుడు భువనగిరి సమీపంలో మూసీనది తీరంలో ఇంద్య్రాల వద్ద వీరిని జయించాడు. ఈ యుద్ధం కూడా 1361లోనే జరిగింది. భువనగిరి కోట అనపోతనాయకుడి వశమైంది.
Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం
పద్మనాయకుల పైచేయి
ఈ విజయాల అనంతరం అనపోతనాయకుడు రాజధానిని ఆమనగంటి నుంచి రాచకొండకు మార్చాడు. రాచకొండ దుర్గానికి రాజాద్రి, రాజగిరి, రాజా చలమనే పేర్లున్నాయి. దట్టమైన అడవులు, పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. అక్కడి శాసనాల్ని బట్టి 1365కి ముందే రాజధానిని మార్చినట్లు తెలుస్తోంది. రాజధానిని పటిష్టం చేసుకున్న తర్వాత అనపోతనాయకుడు 1368లో ఓరుగల్లును ముట్టడించాడు. అనుమకొండ సమీపంలోని భీమవరం వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అతడు కాపయనాయకుడిని సంహరించాడు. ఇరు రాజ్యాల ఆధిపత్య పోరే ఈ యుద్ధానికి కారణం. ఆంధ్ర దేశాధీశ్వరులమని ఇరువురూ చెప్పుకోవడం అందుకు నిదర్శనం. ఈ యుద్ధం 1369లో ముగిసింది. ఓరుగల్లు ప్రాంతం పద్మనాయకుల వశమైంది. ముసునూరి వంశం అంతమైంది. ఓరుగల్లు, భువనగిరి, సింగవరం మొదలైన ప్రాంతాలను అనపోతానాయకుడు స్వాధీనం చేసుకున్నాడు.
ఓరుగల్లు స్వాధీనమయ్యాక ఆంధ్రదేశమంతటినీ జయించాలనే ఉద్దేశంతో అనపోతా నాయకుడు కళింగ మీద దండెత్తాడు. వీర నరసింహదేవుడు యుద్ధంలో ఓడిపోయి తన కుమార్తె కనక లక్ష్మీదేవిని అనపోతనాయకుడి మనవడైన రెండో అనపోతనకిచ్చి సంధి చేసుకున్నాడు. ఇది 1380కి ముందు జరిగింది. అప్పటికి పద్మనాయక రాజ్యానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్యం సరిహద్దులు. అంటే తెలంగాణ ప్రాంతమంతా పద్మనాయకుల పాలనలోకి వచ్చింది. అప్పటి నుంచి ఒక శతాబ్దం వరకూ పద్మనాయకుల చరిత్రే తెలంగాణ చరిత్ర అని చరిత్రకారులు చెప్పిన మాట వాస్తవం.
Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం
దాయాదుల పాలన
పై విజయాలు పూర్తయ్యాక రాజ్యవిస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దేవరకొండ ప్రాంతానికి తన సోదరుడైన మాదానాయకుడిని అధిపతిగా నియమించాడు. అప్పట్నుంచి రాచకొండ రాజ్యంలోని దక్షిణభాగాన్ని మాదానాయకుడి సంతతి పరిపాలించింది. రెండు రాజ్యకేంద్రాలు ఏర్పడినప్పటికీ ఇరు కుటుంబాల మధ్య ఎన్నడూ పొరపొచ్చాలు రాకపోవడం చరిత్రలో అరుదైన అంశం. అనపోతానాయకుడి కుమారులు రెండో సింగభూపాలుడు, ధర్మానాయకుడు. మాదానాయకుడి కుమారుడు వేదగిరి నాయకుడు.
అనపోతానాయకుడి తర్వాత రెండో సింగభూపాలుడు 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించాడు. అదే సంవత్సరం దేవరకొండలో పెదవేదగిరి నాయకుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడి రాజ్య ఆరంభకాలంలో విజయనగరరాజు రెండో హరిహరరాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండ (మహబూబ్‌నగర్)పై దండెత్తాడు. సింగ భూపాలుడు విజయనగర సైన్యాలను ఓడించాడు. తాను యువరాజుగా ఉన్నప్పుడే కల్యాణి (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించిన అనుభవం ఈ యుద్ధంలో ఉపయోగపడింది. ఈ యుద్ధం తర్వాత సింగ భూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్లి గోదావరి జిల్లాలోని బెండపూడి, వేములకొండ ప్రాంతాల్ని జయించి 1387లో సింహాచల క్షేత్రంలో శాసనం వేయించాడు.
1397లో రెండో బుక్కరాయలు పాత పగతో మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ తాలూకాలోని పానుగల్లు కోటను రెండు సంవత్సరాల యుద్ధానంతరం స్వాధీనం చేసుకున్నాడు. ఈ సమయంలోనే రెండో బుక్కరాయలు దేవరకొండ మీద దండెత్తగా, పెద వేదగిరినాయకుడు తన కుమారుడైన మూడో మాదానీడును పంపి ఓడించాడు. ఇతడు విజయనగర సైన్యాధ్యక్షుడైన గుండదండాధీశుడిని సంహరించి ఓరుగల్లును ఆక్రమించాడని వెలుగోటి వంశావళి తెలుపుతోంది. రెండో సింగభూపాలుడికి ఆరుగురు కుమారులు. వారిలో పెద్దవాడైన రెండో అనపోతానాయకుడు (1400–1420), సింగభూపాలుడి అనంతరం రాజ్యానికి వచ్చాడు. అధికారం చేపట్టగానే మెదక్ దుర్గాన్ని ఆక్రమించిన విజయనగర సైన్యాలను తరిమేశాడు.
Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
విజయనగర రాజులతో మైత్రి
రెండో హరిహరరాయల మరణానంతరం వారసుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొండవీటి రెడ్డి రాజ్యంలో కుమారగిరి రెడ్డి పెద కోమటి వేమారెడ్డి మధ్య వైరం మొదలైంది. ఇదే అదనుగా భావించిన అనపోతానాయుడు విజయనగర రాజ్యంపై దండెత్తి చెన్నపట్నం వరకు ఉన్న భూభాగాలను ఆక్రమించాడు. కొండవీటి రెడ్ల ఆధీనంలోని వాడపల్లి, చిలుకూరు, వేదాద్రులను జయించాడు. దీంతో కొండవీటి రాజులు, బహమనీ ఫిరోజ్ షాలు ఒక్కటయ్యారు. దీంతో అనపోతానాయకుడు విజయనగర రాజులతో మైత్రి చేసి, వారి సాయంతో పానగల్లు (మహబూబ్‌నగర్) మీద దాడిచేసిన ఫిరోజ్‌షా సైన్యాలను ఓడించి తమ పూర్వరాజ్య భాగమైన పానగల్లును వశపరచుకున్నాడు.
ఇదే సమయంలో కొండవీటి రాజు పెద కోమటి వేమారెడ్డి దేవరకొండ రాజ్యంపై దండెత్తి పినవేదగిరిని సంహరించాడు. దీంతో అనపోతానాయుడు విజయనగర రాజుల సహాయంతో కొండవీడును ముట్టడించి వేమారెడ్డిని సంహరించాడు. కొండవీడు రాజ్యాన్ని పద్మనాయకులు, విజయనగరాధీశులు, గజపతులు ఆక్రమించారు (మిగిలిన కొద్ది భాగాన్ని పాలించిన రాచవేమారెడ్డితో కొండవీటి రాజ్యం అంతరించింది.) పద్మనాయకుల ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన గొప్ప పరాక్రమవంతుడు అనపోతానాయుడు. ఇతడు విజయనగర రాజులతో మైత్రి చేసినందువల్ల బహమనీయులు శత్రుభావం పెంచుకున్నారు. అందువల్ల పద్మనాయక రాజ్యానికి ముప్పు తలెత్తింది.
రెండో అనపోతానాయుడి తర్వాత అతడి కుమారులు చిన్న వారు కావడం వల్ల అతడి చిన్నతమ్ముడు రావు మాదానాయుడు రాజయ్యాడు. దేవరకొండ రాజ్యంలో అంతకు ముందే పెదవేదగిరి మూడో మనవడూ, మూడో మాదానీ చిన్న కుమారుడూ అయిన లింగమనీడు రాజ్యానికొచ్చాడు. బహమనీ ఫిరోజ్‌షా కుమారుడు అహ్మద్‌షా పానగల్లు యుద్ధంలో జరిగిన అవమానానికి ప్రతీకారంగా విజయనగరంపై దండెత్తాడు. విజయనగర రాజులతో మైత్రి ఉండటం వల్ల మాదానీడు,లింగమనీడు విజయనగరం పక్షాన యుద్ధం చేశారు. ఇరు సైన్యాల ధాటికి తట్టుకోలేక అహ్మద్‌షా లొంగిపోయి 1422లో విజయనగరంతో సంధి చేసుకున్నాడు.
ఈ యుద్ధంలో మాదానీడు విజయనగర పక్షం వహించడం వల్ల బహనీయులు (అహ్మద్ షా) పద్మనాయకులపై పగ పెంచుకున్నారు. తమ ఇరువురి మధ్య జరిగిన సంధి వల్ల విజయనగర రాజులు పద్మనాయకులకు దూరమయ్యారు. దీంతో పద్మనాయకుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇదే అదనుగా అహ్మద్‌షా ఓరుగల్లు మీద దాడి చేశాడు. మూడో సింగభూపాలుడు తన పినతండ్రి రావు మాదానీడు, లింగమనేనిల సహాయంతో అజిమ్‌ఖాన్‌లాంటి సర్దారులను ఓడించి 1425లో ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నాడు. రెండో అనపోతానేని కుమారుడైన సింగభూపాలుడు సింహాసనాన్ని అధిష్టించాడు. సింగమనాయకుడు పదేళ్లపాటు ఏ ఇబ్బంది లేకుండా రాజ్యాన్ని పాలించాడు. ఇతడు పోతనను, శ్రీనాథుడిని ఆదరించి కవి పండిత పోషకుడిగా పేరొందాడు.
TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?
బహమనీల దాడి
మాళవ, గుజరాత్ దేశాలతో పోరాడుతున్న అహ్మద్‌షా వారితో సంధి చేసుకొని తిరిగి ఓరుగల్లుపై దండెత్తాడు. కళాపోషకుడైన సింగమనాయకుడు సహజంగానే యుద్ధ విముఖుడు కాబట్టి అహ్మద్‌షాను ఎదుర్కొనకుండానే సంధి చేసుకొని భువనగిరిని వదులుకున్నాడు. పైకి సంధికి అంగీకరించిన అహ్మద్‌షా భువనగిరిలో సంజర్‌ఖాన్‌ను నియమించి వెళ్లాడు. కానీ తెలంగాణ మొత్తాన్నీ జయించమని సంజర్‌ఖాన్‌ను ఆదేశించాడు. సంజర్‌ఖాన్ 1436లో ఓరుగల్లును ఆక్రమించాడు. దేవరకొండ మినహా తెలంగాణ అంతా బహమనీయుల వశమైంది. బహమనీ రాకుమారుడు దాసూర్‌ఖాన్ రాచకొండ ప్రతినిధి అయ్యాడు. ఆ తర్వాత సింగమనాయకుడి చరిత్ర, పద్మనాయక చరిత్ర లింగమనీడు చరిత్రతో కలిసిపోయింది. 1420లో దేవరకొండ శాఖలో రాజ్యానికొచ్చిన లింగమనీడు పద్మనాయక రాజుల్లో మరో గొప్ప పరాక్రమవంతుడు లింగమనీడు ఏకధాటిగా 32 దుర్గాలను జయించడం అందుకు నిదర్శనం. ఇతడు సింగమనాయకుడితో కలిసి అహ్మద్‌షా ఆక్రమించిన ఓరుగల్లును 1425లో జయించాడు.తర్వాత 1428నాటికి తూర్పు దండయాత్రల్లో అల్లయ వేమారెడ్డిని,వీరభద్రారెడ్డిని ఓడించి రాజమండ్రి,సింహాచలాన్ని జయించాడు.
తర్వాత వేములకొండ, మామిడాల, సప్తమాడియాలు, ఆవంచ, గంగవరాలను ఆక్రమించాడు. ఈ సమయంలోనే కళింగ గంగరాజైన నాలుగో భానుదేవుణ్ణి తొలగించి కపిలేశ్వర గజపతి కళింగ సింహాసనాన్ని అధిష్టించాడు. అధికారంలోకి రాగానే రెడ్డి రాజ్యభాగాల్లో ప్రవేశించాడు. ఈ ఆక్రమణను, లింగమనీడు విజృంభణనూ సహించని విజయనగర దేవరాయలు తెలుంగ రాయలను సింహాచలంపైకి పంపాడు. దీంతో గజపతులు, లింగమనీడు వెనక్కి మరలాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వీరిద్దరూ చేయికలపడానికి దారితీసింది. అలా కపిలేశ్వర గజపతి సహాయంతో లింగమనీడు మెదట కొండవీడు ప్రాంతాలను జయించాడు. శ్రీశైలాన్ని ఆక్రమించాడు.
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత
Telangana History for Group 1 & 2: కాకతీయ సామ్రాజ్యం... రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?