Skip to main content

Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం.. విద్యారణ్యుడి ప్రేరణతో విజయనగర రాజ్యస్థాపన

telangana history study material after Kakatiyas for Competitive Exams
telangana history study material after Kakatiyas for Competitive Exams

పద్మనాయకులు ఒక శతాబ్దం పాటు తెలంగాణను దాటకుండాబహమనీలకు అడ్డుగా నిలిచారు. వీరి పతనం తర్వాతే మిగతాతెలుగు ప్రాంతం కూడా బహమనీల వశమైంది. దక్షిణ భారతదేశంలోని చాలా భూ భాగాలకు ముస్లిం రాజుల ప్రవేశానికి మార్గం సుగమమైంది. పద్మనాయకుల చివరి దశలోనూ, అనంతరం కొంతకాలం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు గజపతుల ఆధిపత్యంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. బహమనీ చివరి పాలకుడైన మహమూద్‌షా 1518లో మరణించాడు. దీంతో బహమనీల రాజ్య భాగాల్లో ఒకటైన గోలకొండ పాలకుడు కులీ కుతుబ్‌ ఉల్‌ముల్క్‌ స్వాతంత్య్రం ప్రకటించుకొని కుతుబ్‌షాహీ వంశాన్ని స్థాపించాడు.

కాకతీయానంతర యుగం
పద్మనాయకులు

పద్మనాయక పాలకుల్లో గొప్ప పరాక్రమవంతుడైన లింగమనీడు విజయనగర రాజ్య భాగాలైన కర్నూలు, నెల్లూరు సహా పరిసర దుర్గాలను ఆక్రమించాడు. చివరగా 1437లో కంచిని ఆక్రమించాడు. దీనికి సింగమనాయకుడు తోడ్పడ్డాడు. లింగమనీడు ఈ యుద్ధాల్లో మునిగి ఉన్న సమయంలో అతడి రాజ్య ఉత్తర భాగాన్ని బహమనీయులు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బహమనీల మధ్య అంతఃకలహాలు మొదలయ్యాయి. అహ్మద్‌షా అనంతరం ‘రెండో అహ్మద్‌షా’గా పిలిచే అల్లావుద్దీన్‌ (1436–1458) బహమనీ రాజయ్యాడు. ఇతడి సోదరుడైన మహమ్మద్‌ఖాన్‌ తిరుగుబాటు చేసి రాయచూర్, షోరాపూర్, బీజాపూర్‌ దుర్గాలను ఆక్రమించి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లాలోని బాలకొండ సామంతుడైన సికిందర్‌ఖాన్‌ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఇతడు మహమ్మద్‌ఖాన్‌తో కలిసి సబ్బి రాష్ట్రం (కరీంనగర్‌), భువనగిరి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. 
సింగమనాయకుడు 1444లో కపిలేశ్వర గజపతి సహాయంతో రాచకొండ రాజ్యాన్ని తిరిగి ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. రెండో అహ్మద్‌షా అనంతరం హుమాయూన్‌ రాజ్యానికి వచ్చిన సందర్భంలో (1457) సికిందర్‌ఖాన్‌ చేసిన తిరుగుబాటును ఆసరాగా చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి జయించడానికి పద్మనాయకులు ప్రయత్నించారు. హుమాయూన్‌ సికిందర్‌ఖాన్‌ను సంహరించి, దేవరకొండపైకి నిజాం–ఉల్‌– ముల్క్, ఖ్వాజీ జహాన్‌ అనే సేనానులను పంపించి, తాను ఓరుగల్లుపై దండెత్తాడు. కపిలేశ్వర గజపతి కూమారుడైన హంవీరుడి సహాయంతో సింగమనాయకుడు వారిని ఓడించాడు. ఇతడు ఖమ్మం, భువనగిరి, ఓరుగల్లును జయించాడు. ఆ తర్వాత సింగమనాయకుడి తమ్ముడు ధర్మానాయకుడు ఓరుగల్లు పాలకుడైనట్లు 1462–64 నాటి శాయంపేట శాసనం ఆధారంగా తెలుస్తోంది. నిజాంషా (1461–63) కాలంలోనూ బహమనీలు తెలంగాణను జయించడానికి మళ్లీ ప్రయత్నించారు. గజపతుల సహాయంతో పద్మనాయకులు వారిని ఓడించారు.
1468లో కపిలేశ్వర గజపతి మరణించిన తర్వాత అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తమ గజపతి మధ్య వారసత్వ పోరు మొదలైంది. దీనివల్ల పద్మనాయకులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. తనకు సహాయం చేస్తే తెలంగాణను జయించి స్వాధీనం చేస్తానని హంవీరుడు మూడో మహమ్మద్‌షా (1463 –1482)కు కబురు పంపాడు. ఇదే అదనుగా సుల్తాన్‌ తెలంగాణను ఆక్రమించడానికి నిజాం–ఉల్‌–ముల్క్‌ బహ్రీని పంపాడు. ఈ సమయంలో పద్మనాయకులు అటు గజపతులతో, ఇటు బహమనీలతో పోరాడాల్సి వచ్చింది. 1475 నాటికి తెలంగాణ ప్రాంతమంతా బహమనీల వశమైంది. పద్మనాయకుల రాజ్యం అంతరించింది. పద్మనాయకులు విజయనగర రాజుల కొలువులో చేరారు. ఈ కాలంలో విజయనగర పాలకులు, గజపతులు, బహమనీల సామ్రాజ్య దాహంతో తెలంగాణ తల్లడిల్లింది. 1481 నాటికి నిజాం–ఉల్‌–ముల్క్‌ బహ్రీ, ఆజంఖాన్‌ తెలంగాణలో బహమనీల రాజప్రతినిధులయ్యారు. సింగమనాయకుడు, లింగమనీడు అనంతరం లింగమనీడు కుమారుడు దేవరకొండకు నామమాత్ర పాలకుడిగా మిగిలాడు. ఆ తర్వాత వీరి వంశం దేవరకొండను 16వ శతాబ్దం చివరి వరకు పాలించినట్లు తెలుస్తోంది. లింగమనీడు కళింగ, విజయనగర రాజ్యాలపై దండయాత్రలు చేసిన సందర్భంలో అతడి వెంట వెళ్లిన కొంతమంది పద్మనాయకులు ఆ తర్వాతి కాలంలో బొబ్బిలి, పిఠాపురం, వెంకటగిరి, పాల్వంచ సంస్థాలను స్థాపించినట్లుగా తెలుస్తోంది. విజయనగర రాజ్య ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి తెలంగాణకు వచ్చి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాన్ని స్థాపించినట్లు భావిస్తున్నారు.

Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం... రాజధానిని రాచకొండకు మార్చింది...

కళింగ గాంగులు

ఈ వంశ పాలకులు నేటి ఒడిశాలోని బరంపురం తదితర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలను సుమారు క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు పాలించారు. కాకతీయుల కాలంలో వీరితో యుద్ధాలు జరిగాయి. కాకతి గణపతి దేవుడు వీరి పాలనలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. రుద్రమదేవి కూడా గోదావరి నది వరకు జయించారు. కళింగ గాంగ రాజైన నాలుగో వీరనరసింహ దేవుడి కాలంలో (1378–1424) రేచర్ల పద్మనాయక అనపోతనాయకుడు కళింగను ముట్టడించాడు. వీర నరసింహదేవుడు ఓటమి పాలై తన కూతురును అనపోత నాయకుడి మనవడైన కుమార అనపోత నాయకుడికి ఇచ్చి సంధి చేసుకున్నాడు. నాలుగో భానుదేవుడి (1424–1434)తో ఈ వంశం అంతరించింది.

Telangana History for Competitive Exams: బహమనీ రాజ్యస్థాపనకు సహాయం చేసిందెవరు?

విజయనగర రాజ్యం

కాకతీయుల అనంతరం ముసునూరు, పద్మనాయక, రెడ్డి రాజ్యాలతోపాటు స్థాపించిన మరో రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఈ రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు ఓరుగల్లుకు చెందినవారు. ధర్మపురికి చెందిన విద్యారణ్య స్వామి వీరికి ప్రేరకుడు. కంపరాయల భార్య గంగాదేవి కూడా తెలంగాణ ఆడబిడ్డే. పిల్లలమర్రి పినవీరభద్రుడు కొన్నేళ్లు విజయనగర రాజుల ఆశ్రయం పొందాడు. అలంపురం లాంటి ప్రాంతాలు స్వల్పకాలం వీరి ఆధిపత్యంలో ఉన్నాయి. వీరి రాజ్యమంతా కృష్ణానది దక్షిణానికే పరిమితం.

Telangana History for Competitive Exams: కాకతీయుల కాలం సాహిత్యానికి స్వర్ణయుగం

సంగమ వంశం (1333–1485)

హరిహరరాయులు (1336–1356), బుక్కరాయలు (1356–1377) సంగమ వంశానికి చెందినవారు. వీరు కాకతి ప్రతాపరుద్రుడి భాండాగారికులుగా ఉన్నట్లు కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయుల పతనానంతరం వీరు ఆనెగొంది ప్రభువైన జంబుకేశ్వరుడి వద్ద మంత్రులుగా చేరారు. ఢిల్లీ సైన్యం 1334లో ఆనెగొందిని ముట్టడించి వీరిద్దరినీ బంధీలుగా తీసుకెళ్లి ముస్లింలుగా మార్చి కొంతకాలం తర్వాత మళ్లీ ఆనెగొందికి పాలకులుగా పంపించారని, విద్యారణ్యుడి ప్రేరణతో వీరు స్వమతంలోకి మారి 1336 ప్రాంతంలో విజయనగర రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తోంది.
హరిహరరాయల కాలంలో తెలంగాణలో కొంత భాగాన్ని ముసునూరి వంశం పాలించింది. బుక్కరాయల కాలంలో రేచర్ల పద్మనాయకులు తెలంగాణకు అధిపతులయ్యారు. తర్వాత రెండో హరిహరరాయలు 1377 నుంచి 1404 వరకు పాలించాడు. ఇతడి ఆజ్ఞతో యువరాజైన రెండో బుక్కరాయలు రెండుసార్లు పద్మనాయకులపై దండెత్తాడు. కానీ విజయం సాధించలేదు. తండ్రి మరణానంతరం రాజైన రెండో బుక్కరాయలను తొలగించి విరూపాక్షుడు అధికారాన్ని చేపట్టాడు. రెండో బుక్కరాయలు తిరిగి అతడిని తొలగించి 1404 నుంచి 1406 వరకు పాలించాడు. ఇతడిని తొలగించి మొదటి దేవరాయలు (1406–1424), తర్వాత ప్రౌఢ దేవరాయలుగా పిలిచే రెండో దేవరాయలు (1406–1446) రాజులయ్యారు. ప్రౌఢ దేవరాయల కాలంలో రెడ్డి రాజ్యం సింహాచలం వరకు అతడికి సామంత రాజ్యంగా ఉంది. ఆ తర్వాత మల్లికార్జున రాయలు (1446–1465), రెండో విరూపాక్ష రాయలు (1465–1485) పాలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురం తదితర ప్రాంతాలు మల్లికార్జున రాయల ఆధీనంలో ఉండేవి. ఈ వంశ పాలకుల అసమర్థత వల్ల సామంత రాజైన సాళువ నరసింహరాయలు సింహాసనాన్ని ఆక్రమించాడు.

Telangana History for Groups: కలకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రాభవం

సాళువ వంశం (1486–1506)

సాళువ నరసింహరాయలు (1485–1490) తీరాంధ్రను కృష్ణానది వరకు జయించాడు. తెలంగాణపై దాడిచేసి బాలకొండ వద్ద ముస్లిం సైన్యాన్ని ఓడించాడు. ఇతడి మరణానంతరం ఇతడి కుమారులు చిన్నవాళ్లు కావడంతో సేనాధిపతి తుళువ నరసానాయకుడు తన పెద్ద కుమారుడైన తిమ్మరాజును, అతడు మరణించాక రెండో కుమారుడైన రెండో నరసింహరాయలను రాజులను చేసి రాజ్యాధికారం నెరిపాడు. రెండో నరసింహరాయలను హతమార్చి తుళువ వంశాన్ని ప్రారంభించారు.

Telangana History for Groups: కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?

తుళువ వంశం (1505–1570)

వీర నరసింహుడు (రెండో నరసనాయకుడు) 1505 నుంచి 1509 వరకు పాలించాడు. ఇతడు మరణించిన తర్వాత సోదరుడు శ్రీకృష్ణ దేవరాయలు (1509–1529) రాజయ్యాడు. ఇతడు తూర్పు దండయాత్రలో చితాబ్‌ఖాన్‌ పాలనలో ఉన్న తెలంగాణలోని అనంతగిరి, ఉండ్రకొండ, జల్లిపల్లి, కందికొండ, దేవరకొండ, నల్లగొండ, కనకగిరి, శంకరగిరి, ఖమ్మం ప్రాంతాలను ఆక్రమించాడు. సింహాచలం దాకా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర కూడా ఇతడి వశమైంది. ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను ఇతడికి ఇచ్చి ఇరు రాజ్యాల మధ్య కృష్ణానది సరిహద్దుగా ఉండే విధంగా సంధి చేసుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణతో పాటు కృష్ణానది ఉత్తర భాగాలను గజపతికే ఇచ్చేశాడు. 
కృష్ణదేవరాయల తర్వాత అతడి సోదరుడు అచ్యుత దేవరాయలు (1530–42) అధికారంలోకి వచ్చాడు. అచ్యుత దేవరాయల తర్వాత రాజైన అతడి కుమారుడు వెంకటరాయలను హత్య చేసి సలికం తిరుమలరాయలు రాజయ్యాడు. ఇతడిని తుదముట్టించి అళియ రామరాయలు (కృష్ణదేవరాయల అల్లుడు) అచ్యుత రాయల అన్న కొడుకైన సదాశివరాయలను (1543–76) రాజుగా చేసి అధికారం చెలాయించాడు. ఇతడి కాలంలో ముస్లిం పాలకులు ఏకమై విజయనగరంపై దండెత్తారు. దీన్నే రక్కస తంగడి (తళ్లికోట) యుద్ధంగా పేర్కొంటారు. రామరాయల తర్వాత అతడి సోదరుడు తిరుమలరాయలు ఆరవీటి వంశ (1569–1578) పాలన ప్రారంభించాడు. విజయనగరం తన ప్రాభవాన్ని తిరిగి పొందలేదు. మూడో శ్రీరంగరాయల (1665–1680) మరణంతో ఆరవీటి వంశం, విజయనగర సామ్రాజ్యం అంతమయ్యాయి. ఈ సామ్రాజ్యంలోని కొంత భాగాన్ని గోల్కొండ సుల్తాన్‌లు ఆక్రమించగా, మరికొంత భాగం మధుర, తంజావూర్, మైసూర్‌ నాయక రాజుల వశమైంది. 
విజయనగర రాజులకు బహమనీ సుల్తాన్‌లతో, కుతుబ్‌షాహీలతో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రదేశంలో నిరంతరం యుద్ధాలు జరిగేవి. అందువల్ల అలంపురం తదితర ప్రాంతాలు నిరంతరం చేతులు మారాయి. మల్లికార్జున రాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయల హయాంలో కొంతకాలంపాటు ‘అలంపురం’ విజయనగర పాలకుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

TS History for Group 1 & 2: తెలంగాణ చరిత్ర... తొలి కాకతీయులు అవలంభించిన మతం?

కళింగ గజపతులు

గాంగ వంశ రాజైన నాలుగో భానుదేవుడి పై అతడి మంత్రి కపిలేశ్వర గజపతి 1434లో తిరుగుబాటు చేసి గజపతి వంశాన్ని స్థాపించాడు. ఈ వంశ పాలకులు 1434 నుంచి 1538 వరకు ఒడిశా తదితర ప్రాంతాలతో పాటు తెలుగు ప్రాంతాలను కూడా పాలించారు. వీరికి విజయనగర రాజులు, కొండవీటి రెడ్డి రాజులు, పద్మనాయకులు, తెలంగాణను ఆక్రమించిన బహమనీ సుల్తాన్‌లతో యుద్ధాలు జరుగుతుండేవి. బహమనీ పాలకుడైన హుమాయూన్‌ 1458లో తెలంగాణను ఆక్రమించి మాలిక్‌షాను సుబేదారుగా నియమించాడు. సికిందర్‌ఖాన్‌ పద్మ నాయకులతో కలిసి సుల్తాన్లపై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచివేసి సుల్తాన్‌లు పద్మనాయక రాజధానుల్లో ఒకటైన దేవరకొండను ముట్టడించారు. ఈ సమయంలో పద్మనాయక లింగమనీడి అభ్యర్థన మేరకు కపిలేశ్వర గజపతి ఆదేశంతో ‘హంవీరుడు’ లింగమనీడికి బాసటగా నిలిచి సుల్తాన్లను తరిమేశాడు.
కపిలేశ్వర గజపతి అనంతరం అతడి కుమారులైన పురుషోత్తమ గజపతి (1468–97), హంవీరుడి మధ్య వారసత్వ తగాదా తలెత్తింది. హంవీరుడు బహమనీ సుల్తాన్లను ఆశ్రయించి తనకు రాజ్యం ఇప్పిస్తే తీరాంధ్ర, తెలంగాణను ఇస్తానని చెప్పాడు. సుల్తాన్‌లు అతడికి సహాయపడి తీరాంధ్ర, అతడి ఆధీనంలోని తెలంగాణను వశపరుచుకున్నారు. పురుషోత్తమ గజపతి తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన అతడి కుమారుడు ప్రతాపరుద్ర గజపతి (1497–1538) బహమనీలు ఆక్రమించిన తెలంగాణ భూభాగాలను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఇతడికి సహకరించిన చిత్తాఫ్‌ఖాన్‌ (చితాబ్‌ఖాన్‌)ను ఖమ్మం, ఓరుగల్లు ప్రాంతాలకు సామంతుడిగా నియమించాడు. ప్రతాపరుద్ర గజపతి కొండపల్లి, ఉర్లుగొండ, చిట్యాల, అనంతగిరి, అరువపల్లి, నల్లగొండ, సిరికొండ దుర్గాలను పాలించడానికి సేనానులను నియమించాడు. 1512లో దిగ్విజయ యాత్ర ప్రారంభించిన విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు కళింగ గజపతులతో ఉన్న పూర్వ వైరాన్ని దృష్టిలో ఉంచుకొని 1515లో ప్రతాపరుద్ర గజపతి ఆధీనంలో ఉన్న కొండవీడు, కొండపల్లి, అనంతగిరి, చిట్యాల, నల్లగొండ, ఉర్లుగొండ, అరువపల్లి మొదలైన దుర్గాలను జయించాడు. చితాబ్‌ఖాన్‌ను ఓడించి ఖమ్మం, ఓరుగల్లు ప్రాంతాలను జయించాడు. తర్వాత 1516లో గజపతుల కటకం దాకా పురోగమించాడు. ప్రతాపరుద్ర గజపతి తన కూతురు తుక్కాదేవిని కృష్ణదేవరాయలకు ఇచ్చి సంధి చేసుకొని తిరిగి ఈ ప్రాంతాలను పొందాడు. ఉభయ రాజ్యాలకు కృష్ణానది సరిహద్దుగా ఉండే విధంగా ఒప్పందం కుదిరింది.
శ్రీకృష్ణ దేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా ప్రతాపరుద్ర గజపతి రాజ్య భాగాలపై 1524లో దండెత్తడం, 1530లో కొండపల్లి దుర్గాన్ని వశపరచుకోవడాన్ని బట్టి తెలంగాణ మొత్తం అతడి ఆధీనంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు ప్రతాపరుద్ర గజపతి మరణించడంతో ఆ వంశం అంతరించింది.
sunkireddy narayana reddy

డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ‘తెలంగాణ చరిత్ర’ రచయిత

Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?

Published date : 11 Jul 2022 05:04PM

Photo Stories