Indian History for Competitive Exams : సివిల్స్, గ్రూప్స్ పోటీ పరీక్షలకు ప్రత్యేకం.. ప్రపంచంలోనే అతి ప్రాచీన గ్రంథం..! ఈ ప్రశ్నలతో..
‘ఆర్య’ అనేది భాషకు సంబంధించిన పదం. ఆర్య భాషను ఉపయోగించడం వల్ల వీరిని ఆర్యులనీ, వీరి నాగరికతను ‘ఆర్య నాగరికత’ అని అంటారు. ఈ నాగరికతకు ప్రధానాధారం వేద సాహిత్యం. అందువల్ల దీన్ని ‘వేద నాగరికత’ అంటారు.
వైదిక నాగరికత
భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 1500–600 మధ్య కాలాన్ని వైదిక యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో వైదిక నాగరికత విలసిల్లింది. ఈ నాగరికత నిర్మాతలు ఆర్యులు. ఈ నాగరికత కాలాన్ని రెండు దశలుగా విభజిస్తారు. క్రీ.పూ. 1500 నుంచి 1000 మధ్య కాలాన్ని ‘తొలివేద నాగరికత’ లేదా ‘రుగ్వేద నాగరికత’గా, క్రీ.పూ. 1000 నుంచి 600 మధ్య కాలాన్ని ‘మలివేద నాగరికత’గా వ్యవహరిస్తారు.
ఆర్యులు నార్డిక్ జాతికి చెందినవారు. వీరి జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనికి కారణం స్పష్టమైన ఆధారాలు లేకపోవడం. ఆర్యుల జన్మస్థలంపై ఉన్న వాదనల్లో ముఖ్యమైనవి..
1. మధ్య ఆసియా వాదం: ఇండో–యూరోపియన్ భాషల తులనాత్మక అధ్యయనం ఆధారంగా మాక్స్‌ముల్లర్ ఆర్యుల జన్మభూమి మధ్య ఆసియా అని పేర్కొన్నారు. మిగిలిన వాదనల కంటే ఇది అర్థవంతంగా ఉండటంతో అత్యధికుల ఆమోదం పొందింది.
2. జర్మనీ వాదం: ఆర్యుల జన్మభూమి జర్మనీ అని పెంకాతో పాటు ఇతర యూరోపియన్ చరిత్రకారులు వాదించారు.
3. ఆర్కిటిక్ వాదం: ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చారని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన ‘ఆర్కిటిక్ ది హోం ఆఫ్ ఆర్యన్స్’ అనే గ్రంథాన్ని రాశారు.
4. ఆస్ట్రో – హంగేరీ ప్రాంతమే ఆర్యుల జన్మస్థలమని డాక్టర్ గైల్ అనే చరిత్రకారుడు వాదించారు.
5. టిబెట్ వాదం: ఆర్యుల జన్మభూమి టిబెట్ అని దయానంద సరస్వతి వాదన.
6. స్వదేశీ వాదం: ఆర్యులు భారతదేశంలోని సప్తసింధూ ప్రాంతానికి చెందిన స్థానికులే అని డాక్టర్ ఎ.సి.దాస్ అభిప్రాయం. ఆర్యులు విదేశీయులు, బయటి ప్రాంతాల నుంచి భారత్‌కు వలస వచ్చారు అనే వాదనలను ఆయన ఖండించారు.
Chandegave: సబ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా చందేగేవ్
ఆర్యుల సాహిత్యం
‘వేదసాహిత్యం’ భారతదేశంలో లభిస్తున్న అత్యంత ప్రాచీన సాహిత్యం. దీన్ని వెలువరించినవారు ఆర్యులు. వేద సాహిత్యాన్ని శ్రుతి సాహిత్యం, స్మృతి సాహిత్యం అని రెండు రకాలుగా విభజించారు.
1. శ్రుతి సాహిత్యం: ఇందులో నాలుగు వేదాలతోపాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి.
వేదాలు: వేదాలను ‘అపౌరుషేయాలు’ అంటారు. అంటే ఇవి మానవమాతృలు రచించినవి కావు, దివ్యగ్రంథాలు అని అర్థం.
రుగ్వేదం: ఇది భారతదేశంలోనే కాకుండా మొత్తం ఇండో–యూరోపియన్ సాహిత్యంలోనే అతి ప్రాచీనమైంది. తొలి వేదకాలం గురించి తెలుసుకోవడానికి ఇది ప్రధాన ఆధారంగా ఉంది. ఇందులో మొత్తం 1028 శ్లోకాలున్నాయి. దీన్ని 10 మండలాలుగా విభజించారు. పదో మండలంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ తొలి ప్రస్తావన ఉంది. మూడో మండలంలో ప్రసిద్ధమైన గాయత్రి మంత్రం ఉంది.
సామవేదం: ఇందులో 1600కు పైగా శ్లోకాలున్నాయి. ఇది సంగీత ప్రధానమైంది. యజ్ఞాల సమయంలో పఠించే మంత్రాలకు అనువుగా ఈ సంగీతాన్ని రూపోందించారు. భారతీయ సప్త స్వరాలకు మూలం దీంట్లోనే ఉన్నట్లు చెబుతారు.
యజుర్వేదం: ఈ గ్రంథంలో యజ్ఞయాగాలు, క్రతువులు, కర్మకాండలు, బలిదానాలు తదితర సందర్భాల్లో పఠించే మంత్రాలు ఉన్నాయి. రాజులు నిర్వహించే రాజసూయ, వాజపేయ లాంటి యాగాలకు సంబంధించిన తొలి ప్రస్తావన ఇందులో కనిపిస్తుంది. తొలి రెండు వేదాలకు భిన్నంగా దీన్ని పద్య, గద్య శైలి రెండింటిలోనూ రాశారు. దీంట్లో సుమారు రెండువేల శ్లోకాలున్నాయి.
Jobs: తుంగల్‌గడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల ఖాళీలు.. అర్హతలు ఇవే..
అధర్వణ వేదం: ఇది మంత్రతంత్రాలతో కూడిన గ్రంథం. దీన్ని ఆర్యేతరులకు సంబంధించిందిగా భావిస్తున్నారు. ఆర్యేతరుల ఆచారాలు, సాంప్రదాయాలు ఇందులో కనిపిస్తాయి. దీంట్లో దుష్టశక్తులను పారదోలడానికి, వ్యాధులను నివారించేందుకు ఉపయోగించే మంత్రతంత్రాలున్నాయి. ఇందులో మొత్తం 711 శ్లోకాలున్నాయి. దీన్ని రెండు భాగాలు గా విభజించారు. అవి: పైప్పలాద, సౌనక.
బ్రాహ్మణాలు: ఇవి పూజా ప్రార్థనలు, యజ్ఞ యాగాలు, బలిదానాలు, ఉత్సవాలకు సంబంధించిన గ్రంథాలు. నాలుగు వేదాలకు అనుబంధంగా మొత్తం ఏడు బ్రాహ్మణాలు ఉన్నాయి. ఇవి నాటి ప్రజల ఆచార వ్యవహారాలు, సామాజిక జీవితాలను ప్రతిబింబిస్తున్నాయి. వీటిలో అతి పురాతనమైంది ‘తాండ్యమాహ బ్రాహ్మణం’. అన్నిటికంటే ముఖ్యమైనది ‘శతపథ బ్రాహ్మణం’. ప్రతి బ్రాహ్మ ణం ఏదో ఒక వేదంతో అనుబంధమై ఉంది.
అరణ్యకాలు: వీటిని వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులకు మధ్య అనుసంధానాలుగా భావిస్తారు. బ్రాహ్మణాలు వేదాలకు అనుబంధంగా ఉంటే అరణ్యకాలు బ్రాహ్మణాలకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి అడవుల్లో నివసించే రుషులను ఉద్దేశించినవి. వీటిలో ప్రధానాంశం సన్యాసవాదం. వీటిలో నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యమైన అరణ్యకాలు–ఐతరేయ, కౌసితాకి.
ఉపనిషత్తులు: యజ్ఞ యాగాలకు బదులుగా భక్తి, జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చే తాత్త్విక గ్రంథాలివి. భారతీయ తత్త్వ శాస్త్రానికి మూలం ఇవేనని భావిస్తున్నారు. శంకారాచార్యులు, రామానుజాచార్యుల తత్త్వ సిద్ధాంతాలకు కూడా మూలం ఇవే. పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ప్రస్తావన మొదటగా వీటిలోనే కనిపిస్తుంది. ఉపనిషత్తుల మొత్తం సంఖ్య 108. వీటిలో చాందొగ్య, బృహదారణ్యక, ముండక, జబల, ఐతరేయ, కౌసితాకి, శ్వేతాశ్వతార, కథ, కేన లాంటివి ముఖ్యమైనవి. జబల ఉపనిషత్తులో తొలిసారిగా నాలుగు ఆశ్రమాల ప్రస్తావన కనిపిస్తుంది. ముండకోపనిషత్తులో ‘సత్యమేవ జయతే’ అనే ప్రముఖ శ్లోకం కనిపిస్తుంది. ఉపనిషత్తులు కూడా నాలుగు వేదాలకు అనుబంధంగా ఉన్నాయి.
Badminton Tournament: అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు.. ఒకే వ్యక్తికి రెండు టైటిల్స్!
2. స్మృతి సాహిత్యం: ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా లభించిన సాహిత్యం కాబట్టి దీన్ని ‘స్మృతి సాహిత్యం’ అంటారు. ఇందులో వేదాంగాలు, సూత్రాలు, ఇతిహాసాలు, ఉపవేదాలు, పురాణాలు, షడ్దర్శనాలు ఉన్నాయి.
వేదాంగాలు: ఇవి మొత్తం ఆరు. మానవులు రచించినవే కాబట్టి వేదాల్లా ఇవి అపౌరుషేయాలు కావు.
➢ శిక్ష: ఇది ఉచ్ఛారణకు సంబంధించింది.
➢ కల్ప: ఇది వేదాంగాల్లో అతి ముఖ్యమైంది. క్రతువుల గురించి తెలియజేస్తుంది.
➢ వ్యాకరణ: భాషా వ్యాకారణానికి సంబంధించింది.
➢ నిరుక్త: పద వ్యుత్పత్తిని వివరిస్తుంది.
➢ ఛందస్సు: ప్రాస, లయలకు చెందింది.
➢ జ్యోతిష: ఖగోళ శాస్త్రానికి సంబంధించిన వేదాంగం.
➢ సూత్రాలు: ఇవి మూడు రకాలు.
శ్రౌత సూత్రాలు: ఇవి యజ్ఞ యాగాలు, క్రతువులు, కర్మకాండల గురించి వివరిస్తాయి. సుళ్వ సూత్రాలు ఇందులో ఒక భాగం. సుళ్వ సూత్రాల్లో రేఖాగణిత శాస్త్ర మూలాలు ఉన్నాయి.
గృహ్య సూత్రాలు: గృహస్థు తన జీవిత కాలంలో ఆచరించాల్సిన క్రతువులు, కర్మకాండల గురించి తెలియజేస్తాయి. వీటి ప్రకారం ఒక మనిషి పుట్టుక నుంచి మరణం వరకు మొత్తం 16 క్రతువులు, కర్మకాండలను నిర్వహించాలి.
ధర్మసూత్రాలు: చట్టాలు, ప్రజల ఆచార వ్యవహారాల గురించి తెలియజేస్తాయి. న్యాయశాస్త్రాలకు వీటినే మూలంగా భావిస్తారు. మనుస్మృతి లాంటి వివిధ ధర్మ శాస్త్రాలకు ఇవి ప్రాతిపదికగా ఉన్నాయి. అందువల్ల ఇవి చరిత్రకారులకు అత్యంత ప్రధానమైనవి.
షడ్దర్శనాలు: ఇవి భారతీయ తత్త్వశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలు. ఇవి యజ్ఞయాగాలు, క్రతువులను నిరసిస్తాయి. సచ్ఛీలత, నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తాయి. వివిధ సిద్ధాంతాలు – ప్రవచించిన రుషుల వివరాలను కింద గమనించవచ్చు.
➢ సాంఖ్య దర్శనం – కపిల మహర్షి
➢ వైశేషిక – ఉలూక కనద రుషి
➢ న్యాయ – గౌతమ
➢ యోగ దర్శన – పతంజలి
➢ పూర్వ మీమాంస – జైమిని మహర్షి
➢ ఉత్తర మీమాంస – బాదరాయణుడు
Management Trainee Posts : పీడీఐఎల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
ఉపవేదాలు: స్మృతి సాహిత్యంలో నాలుగు ఉపవేదాలున్నాయి. అవి:
1. ఆయుర్వేదం: వైద్య శాస్త్రానికి సంబంధించింది.
2. గాంధర్వ వేదం: గానం, సంగీతాలకు సంబంధించింది.
3. శిల్పవేదం: వాస్తు, శిల్పకళలను వివరిస్తుంది.
4. ధనుర్వేదం: ఇది యుద్ధ విద్యలకు ముఖ్యం గా ధనుర్విద్యకు సంబంధించింది.
పురాణాలు: స్మృతి సాహిత్యంలో భాగంగా ఉన్న మొత్తం 18 పురాణాలూ గుప్తుల అనంతర కాలానికి చెందినవే. కానీ వాటిలోని కథలు ప్రాచీనమైనవి. ఇవి ప్రధానంగా ప్రాచీన కాలానికి చెందిన రాజుల వంశానుక్రమాన్ని వివరిస్తాయి. ప్రపంచసృష్టి, వినాశనం, పునఃసృష్టి, సూర్య, చంద్ర వంశీకుల చరిత్ర మొదలైన అంశాలపై వివరాలను అందిస్తున్నాయి.
ముఖ్యమైన పురాణాలు: వాయు, విష్ణు, బ్రహ్మ, శివ, గరుడ, భాగవత, భవిష్య, పద్మ, స్కంధ పురాణాలు. అష్టాదశ పురాణాల్లో అతి ప్రాచీనమైంది వాయు పురాణం.
ఇతిహాసాలు:
➢ రామాయణం: పురాణాల ప్రకారం దీన్ని క్రీ.పూ. 500 ఏళ్ల కిందట రచించారు. దీనికి తొలిరూపం ఇచ్చిన వారు వాల్మీకి. ఇందు లో మొత్తం 7 కాండాలున్నాయి. మొదటి, చివరి కాండాలు మినహా మిగిలినవి ప్రాచీనమైనవి.
➢ మహాభారతం: వేదవ్యాసుడు రచించారు. భగవద్గీత కూడా ఇందులో అంతర్భాగమే. మహాభారతాన్ని మొదట ‘జయసంహిత’ అని పిలిచారు. ఇందులో మొత్తం 18 పర్వాలున్నాయి.
ధర్మశాస్త్రాలు (స్మృతులు): మానవుడి జీవితాన్ని నియమబద్ధం చేసేందుకు వీటిని రచించారు. ఇవి చాతుర్వర్ణాలు, వర్ణాశ్రమ ధర్మాలు, షోడష కర్మలు, సంస్కారాలు, ఆచారాలు, వ్యవహారాలు, శిక్షలు లాంటి అనేక అంశాల గురించి వివరిస్తాయి.
Guest Lecturer Jobs: డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు.. చివరి తేదీ ఇదే
ముఖ్యమైన స్మృతులు:
➢ మనుస్మృతి: అత్యంత ప్రాచీనమైన ధర్మశాస్త్రం. తర్వాతి కాలంలో వచ్చిన అనేక ధర్మశాస్త్రాలకు ఇది మూలంగా ఉంది.
➢ యాజ్ఞవల్క్య స్మృతి: యాజ్ఞ వల్క్య మహర్షి రచించారు. దీనిపై క్రీ.శ. 11వ శతాబ్దంలో విజ్ఞానేశ్వరుడు ‘మితాక్షర’ అనే వ్యాఖ్యానాన్ని రచించాడు.
➢ పరాశర స్మృతి: దీన్ని రచించినవారు పరాశర మహర్షి. ఇందులో కొంత ఆధునిక భావాలు కనిపిస్తాయి. దీన్ని కలియుగానికి అనువైందిగా భావిస్తారు.
➢ నారద స్మృతి: నారద మహర్షి రచించారు. వీటితోపాటు బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి కూడా ముఖ్యమైనవి.
మాదిరి ప్రశ్నలు
1. ‘ఆర్య’ అనేది జాతికి సంబంధించిన పదం అని వాదించిన విదేశీ చరిత్రకారుడు?
1) పెంకా 2) సర్ విలియమ్ జోన్స్
3) మాక్స్ ముల్లర్ 4) గైల్
2. రుగ్వేదంలోని గాయత్రీమంత్రం ఏ దైవానికి సంబంధించింది?
1) అథితి 2) ఉషస్సు
3) సావిత్రి 4) అరణ్యాని
3. వేదాలు – వాటి పురోహితులకు సంబంధించి కిందివాటిలో సరికాని జత?
1) రుగ్వేదం– హోత్రి
2) సామవేదం – ఉద్గాత్రి
3) యజుర్వేదం – అధ్వర్యు
4) అధర్వణ వేదం – శ్రామణుడు
Cochin Shipyard Recruitments : ముంబైలోని కొచ్చిన్ షిప్ యాడ్‌లో వివిధ ఉద్యోగాలు..
4. ‘కుటుంబ గ్రంథం’అని ఏ వేదాన్ని పిలుస్తారు?
1) రుగ్వేదం 2) సామవేదం
3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
5. సుప్రసిద్ధ ‘తమసోమా జ్యోతిర్గమయ’ శ్లోకం ఏ గ్రంథంలో ఉంది?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) బృహదారణ్యక ఉపనిషత్తు
3) యజుర్వేద సంహిత
4) భాగవత పురాణం
6. ప్రపంచంలోనే అతి ్ర΄ాచీన గ్రంథం?
1) రుగ్వేదం 2) సామవేదం
3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
7. అష్టాదశ పురాణాల్లో అతి ప్రాచీనమైనది?
1) విష్ణు పురాణం
2) భాగవత పురాణం
3) వాయుపురాణం
4) గరుడ పురాణం
సమాధానాలు
1) 1; 2) 3; 3) 4; 4) 1;
5) 2; 6) 1; 7) 3.
Tags
- Competitive Exams
- groups exams
- indian history for competitive exams
- study material and model questions
- study material of indian history for competitive exams
- oldest book in the world
- appsc and tspsc group exams
- competitive exams preparations
- preparatory questions for competitive exams
- Government Jobs
- civils exams preparation questions
- Education News
- Sakshi Education News