Skip to main content

Indian History Notes for Groups: దక్షిణ భారతంలోనే.. తొలి బ్రిటిష్‌ వ్యతిరేక తిరుగుబాట్లు

Indian History Notes for Groups
Indian History Notes for Groups

దేశంలో బ్రిటిష్‌ వలస పాలన, విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సమరం ‘1857 సిపాయిల తిరుగుబాటు’. అయితే 1857 సంవత్సరానికి దాదాపు ఒక శతాబ్దం ముందు నుంచే దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన తిరుగుబాట్లు.. సిపాయిల తిరుగుబాటుతోపాటు మరెన్నో ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి. అంతేకాకుండా సైద్ధాంతిక నేపథ్యాన్ని, దశ–దిశను నిర్దేశించగలిగాయి. ఈ తొలి పోరాటాలు భావితరాల ఉద్యమాలకు బీజాంకురాలుగా పరిణమించాయి. ఎందరో వీరులు జాతీయోద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగించడానికి దోహదపడ్డాయి. అందుకే దక్షిణ భారతదేశంలో జరిగిన బ్రిటిష్‌ వ్యతిరేక తొలి తిరుగుబాట్లనే.. ‘1857 సిపాయిల తిరుగుబాటు’కు పునాదులుగా చెప్పొవచ్చు.
దక్షిణ భారతదేశంలో తొలి తిరుగుబాట్లు ప్రధానంగా స్థానికులు,జమీందారులు, పాలెగాళ్లు, సిపాయిల నాయకత్వంలో జరిగాయి. తాము వారసత్వంగా అనుభవిస్తున్న అధికారాలను బ్రిటిష్‌ వారు హరింపజేసినందుకు నిరసనగా ఈ తిరుగుబాట్లు చేశారు. బ్రిటిష్‌ వారికి శక్తిమంతమైన, అధునాతన యుద్ధ పరికరాలు ఉన్నాయని తెలిసినా.. భారతీయులు పోరాటాలు చేశారు. ‘బ్రిటిష్‌ వారు తక్కువ మంది.. మనం ఎక్కువ మంది అన్న అతి విశ్వాసంతో, ఎప్పటికైనా వలస పాలకులను తిప్పికొట్టవచ్చు’ అనే నమ్మకంతో ఈ తిరుగుబాట్లు జరిగాయి.
కాకతీయుల ‘నాయంకర’ వ్యవస్థకు.. విజయనగర సామ్రాజ్యం ‘పాలెగాళ్ల’ వ్యవస్థ తోడైంది. ఈ పాలెగాళ్లు నామమాత్రపు ’కప్పాన్ని’ చక్రవర్తికి కట్టేవారు. వీరు రాజులు లేక సామంతులు కాకపోయినా.. ఆయా ప్రాంతాలలో సొంత పాలన కొనసాగించేవారు. అలాంటి కొందరు బ్రిటిష్‌ వారిపై చేసిన తిరుగుబాట్లే దేశ స్వాతంత్య్ర సాధనకు తొలి పునాదులుగా మారాయి. వీరే తొలి విప్లవ వీరులు. వర్తకం కోసం భారతదేశం వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ.. క్రమంగా స్థానిక  పాలకుల నుంచి శిస్తును వసూలు చేసుకునే అధికారం పొందింది. క్రమేణా తన వలస సామ్రాజ్యాన్ని విస్తరించింది. 1757 సంవత్సరం ప్లాసీయుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమితో ఉత్తర భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారం సుస్థిరం చేసుకుంది. అనంతరం దక్షిణ భారతదేశం వైపు దృష్టి పెట్టింది. కర్నాటకలో టిప్పు సుల్తాన్‌.. ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడి.. 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే మరో వీరుడు ఉదయించాడు. అతడే వీరపాండ్య కట్టబ్రహ్మన. తమిళనాడులోని పాంచాలపురం కోట పాలకుడు.

వీరపాండ్య కట్టబ్రహ్మన

ఆంగ్లేయుల అక్రమాలను ఎదిరించి పోరాడేందుకు 1799లో సైన్యాన్ని సిద్ధం చేశాడు కట్ట బ్రహ్మన. ఈయన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిన బ్రిటిషర్లు.. పాంచాలపుర కోటపై దాడిచేశారు. కట్టబ్రహ్మన వారిని వీరోచితంగా ఎదుర్కొన్నాడు. ఆంగ్లేయులకు అతని అనుచరుడు పిళ్లై పట్టుబడ్డాడు. పిళ్లైని చంపి శవాన్ని కోట గుమ్మానికి వేలాడ తీశారు. కట్టబ్రహ్మన మనోౖధైర్యాన్ని దెబ్బ తీయడానికి బ్రిటిషర్లు సర్వశక్తులు ఒడ్డారు. ఆయన ఆచూకీ చెప్పినా లేదా తల తెచ్చి ఇచ్చిన వారికి భారీ బహుమానం ప్రకటించారు. కానీ ఆయన బ్రిటిషర్లకు దొరక్కుండా అనేక ప్రాంతాలలో అజ్ఞాత జీవితం గడిపాడు. చివరికి ‘కోలార్‌ పట్టి’లో రాజగోపాల్‌ నాయకర్‌ ఇంటిలో ఉండగా.. సైనికులు చుట్టుముట్టారు. కట్టబ్రహ్మన నేర్పుతో కాల్పులు జరుపుతూ, ఆంగ్లేయ సైనికుల నుంచి బయటపడ్డాడు. ‘కుడుకుట్టార్‌’ అడవిలోకి పారిపోయాడు. అడవులను చట్టు్ట ముట్టిన కంపెనీ సైన్యం.. చివరికి కట్ట బ్రహ్మనను పట్టుకుంది. 1799 అక్టోబర్‌ 16న చింత చెట్టుకు ఉరి తీశారు. సాహస వీరుడిగా, దేశ భక్తుడిగా కట్టబ్రహ్మన చరిత్ర నాటి యువతకు గొప్ప ప్రేరణగా నిలిచింది. 

Kakatiyas (History) Notes for Groups: ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?

పాలెగాళ్ల తిరుగుబాటు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలెగాళ్ల వ్యవస్థను నిర్మూలించడం ప్రారంభించింది. 1800 సంవత్సరంలో కలెక్టర్‌గా వచ్చిన థామస్‌ మన్రో.. రాయలసీమలోని 140 మంది పాలెగాళ్లను లొంగదీసుకున్నాడు. వారి ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నం చేయటంతో పాలెగాళ్లు తిరుగుబాటు చేశారు. 1801లో ప్రస్తుత చిత్తూరు(అప్పట్లో ఉత్తర ఆర్కాట్‌ జిల్లా) బంగారుపాల్యం పాలెగారు హత్యతో మొదలైన మన్రో అణచివేత.. 1807 అధోని పాలేగారు అనంతప్ప హత్యతో ముగిసింది. ఎక్కువ మంది పాలెగాళ్లు యుద్ధం చేసి బ్రిటిష్‌ సైన్యం చేతిలో చనిపోయారు. కొందరు మన్రోతో ఒప్పందం చేసుకొని.. ఆస్తులను, కోటలను వదులుకుని బ్రిటీషర్లు ఇచ్చే పెన్షన్‌ తీసుకున్నారు.
కర్నూల్‌ జిల్లా తెర్నేకల్‌ పాలెగారు ‘ముత్తుకూరు గౌడప్ప’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గౌడప్పను లొంగదీసుకోవడం బ్రిటిష్‌ సైన్యానికి చాలాకాలం పాటు సాధ్యపడలేదు. వారం రోజులకుపైగా యుద్ధం చేసినా.. అతని కోటను స్వాధీనం చేసుకోలేకపోయారు. చివరికి గౌడప్ప సైన్యంలోని ఒకరిని లొంగదీసుకుని..కోట రహస్యాలను తెలుసున్నారు. అనంతరం గౌడప్పను బంధించి బహిరంగంగా ఉరితీశారు. గౌడప్ప ఉరి కంటే ముందు అనేక మంది.. కోటలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిటిష్‌ అధికారుల రికార్డుల ప్రకారం (బెన్సన్‌ రిపోర్ట్, మన్రో రిపోర్ట్‌) 1807 నాటికీ పాలెగాళ్ల వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ తిరిగి నరసింహారెడ్డి రూపంలో ఉగ్రరూపం దాల్చింది.

History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

నరసింహారెడ్డి తిరుగుబాటు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఉయ్యాలవాడ, నుసుం పాలెగాడు. తల్లివైపు వారికి వారసులు లేకపోవడంతో నుసుం పాలన బాధ్యత కూడా నరసింహారెడ్డికే దక్కింది. ఇతని తండ్రి మన్రోతో ఒప్పందం చేసుకుని పెన్షన్‌ తీసుకున్నాడు. 1843 ప్రాంతంలో కంపెనీ ప్రభుత్వం ‘వారసత్వ హక్కుల చట్టం’ తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం–వారసత్వంగా సంక్రమించే ‘మిరాసి’ హక్కులు కోల్పోవలసి రావడంతో∙జమీందారులు, పాలెగాళ్లు.. వారి వారసత్వ మాన్యాలు, ఇనాం భూములు, పెన్షన్‌ కోల్పోయారు. 
ఈ మిరాసి రద్దు చట్టం వల్ల ఉయ్యాలవాడ నరసింçహారెడ్డి.. నుసుం లేదా ఉయ్యాలవాడ రెండింటిలో ఏదో ఒక దానిని వదులుకోవలసి వచ్చింది. అదే సమయంలో అయన సోదరుడు జయరామిరెడ్డి మరణించడం వల్ల ఆయనకు వచ్చే పెన్షన్‌ బ్రిటిష్‌ వారు రద్దు చేశారు. వారసత్వంగా అది నరసింహారెడ్డికి రావాలి. ఈ కారణాలతో నరసింహారెడ్డి 1846లో బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేశారు. అనేక నెలల పాటు ‘గెరిల్లా యుద్ధం’ చేశారు. చివరికి బ్రిటిష్‌ వారు నరసింహారెడ్డిని ఓడించి బహిరంగంగా ఉరి తీశారు. అయన శవాన్ని చాలా రోజుల పాటు కోట గుమ్మానికి వేలాడదీశారు.

తొలి వీరవనిత కిత్తూరు చెన్నమ్మ

తన రాజ్యం స్వతంత్రత కోసం బ్రిటిష్‌ కంపెనీతో పోరాటం చేసిన తొలి భారతీయ వీరవనిత.. కిత్తూరు చెన్నమ్మ. ఆమె కర్ణాటకలోని కిత్తూరు అనే చిన్న రాజ్యానికి రాణి. కి త్తూరు అనేది బెల్గాంకు సమీపంలో ఉన్న చిన్న రాజ్యం. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వలస సామ్రాజ్య విధానానికి వ్యతిరేకంగా గళమెత్తి..1824 సంవత్సరంలో తిరుగుబాటు చేసింది. చివరికి వారికి బందీగా చిక్కి చెరసాలలో మరణించింది. ఝాన్సీరాణి కన్నా 34 సంవత్సరాల ముందే స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరవనిత కిత్తూరు చెన్నమ్మ.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Telangana History For Groups Exams: పానగల్లు శాసనాన్ని వేయించింది ఎవ‌రు?

హైదరాబాద్‌ రాజ్యంలో తిరుగుబాట్లు

మోమినాబాద్‌ పితూరి 1827: నిజాం రాజ్యంలో 1827 సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన మోమినాబాద్‌ పితూరి తిరుగుబాటుకు తెరతీసింది. రెండో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ దేశంలోనే తొలిసారిగా బ్రిటిష్‌ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. దీంతో బ్రిటిష్‌ పాలకులు నిజాం సైన్యంలో నూతన సంస్కరణలు చేపట్టారు. 1811 సంవత్సరంలో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా ఉన్న రస్సెల్‌.. నిజాం సైన్యాన్ని పూర్తిగా ఆధునికీకరించాడు. 1813లో రస్సెల్‌ బ్రిగేడ్‌ను ఏర్పరిచాడు. ఇది శక్తిమంతమైన సైనిక బెటాలియన్‌గా మారింది. ఈ సైన్యాన్ని 1820లో సర్‌ చార్లెస్‌ మెట్‌కాఫ్‌ మరింత పటిష్టంగా తయారు చేశాడు. పేరుకే నిజాం సైన్యం కానీ అధికారం పూర్తిగా బ్రిటిష్‌ కంపెనీదే. 1827 సంవత్సరంలో మే 5న ఇద్దరు సిపాయిలు బ్రిటిష్‌ అధికారులపై తిరుగుబాటు చేశారు. వీరిని కల్నల్‌ డేవిస్‌ కాల్చి చంపాడు. 

History Notes for Group 1, 2: రాష్ట్రకూట వంశానికి చెందిన వారే కాకతీయులు!

బొల్లారం పితూరి 1855

1855 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ బొల్లారంలో నిజాం అశ్విక దళంలోని కొంతమంది సిపాయిలు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వీరిని అణచి వేసేందుకు ప్రయత్నించిన కోలిన్‌ మెకంజీ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ బొల్లారం తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికింది.
దక్షిణ భారతదేశంలో జరిగిన ఈ తిరుగుబాట్లు అనుకున్న లక్ష్యాలను, విజయాలను సాధించలేకపోయినా.. సామాన్య ప్రజానీకంలో బ్రిటిష్‌ వ్యతిరేక భావాలను నాటుకునేలా చేయడంలో విజయం సాధించాయి. ఈ కారణంగానే భవిష్యత్తులో ఎన్నో స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. భారత తొలి స్వాతంత్య్ర తిరుగుబాటు 
1857కు పునాదులు వేశాయి.
– డాక్టర్‌ మురళి పగిడిమర్రి, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌

మాదిరి ప్రశ్నలు

1. కింది వాటిలో సరైనది?
ఎ) ‘నాయంకర’ విధానాన్ని విజయనగర రాజులు ప్రవేశపెట్టారు.
బి) అమరనాయంకర విధానాన్ని కాకతీయులు ప్రవేశపెట్టారు.
సి) వీరపాండ్య కట్ట బ్రహ్మన ‘పాంచాలపురం’ కోట పాలకుడు

1) ఎ మాత్రమే సరైనది
2) బి, సి సరైనవి    
3) ఎ, బి, సి సరైనవి
4) సి మాత్రమే సరైనది
సమాధానం: 4
2. బ్రిటిషర్లు ‘వారసత్వ హక్కుల చట్టం’ చేయడానికి ప్రధాన కారణం?
ఎ) వారసత్వంగా లభించే ‘మిరాసి’ హక్కులను కాలరాయడం
బి) పాలెగాళ్లను ఆర్థికంగా దెబ్బతీయడం

1) ఎ మాత్రమే సరైనది
2) బి మాత్రమే సరైనది
3) ఎ, బి రెండూ సరైనవి
4) ఎ, బి రెండూ సరికావు
సమాధానం: 3
3. ఝాన్సీ రాణి కంటే ముందు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారు?
ఎ) కిత్తూరు చెన్నమ్మ(కర్ణాటక)
బి) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (రాయలసీమ)
సి) వీరపాండ్య కట్ట బ్రహ్మన(తమిళనాడు)

1) ఎ, బి సరైనవి
2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి
4) బి, సి సరైనవి
సమాధానం: 2
4. కోలిన్‌ మెకంజీ ఏ తిరుగుబాటు అణచివేతలో గాయపడ్డారు?

1) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగాళ్ల తిరుగుబాటు(1846)
2) బొల్లారం పితూరి 1855(హైదరాబాద్‌)
3) 1857 సంవత్సరంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయి తిరుగుబాటు
4) ముత్తుకూరు గౌడప్ప తిరుగుబాటు (కర్నూలు, రాయలసీమ)
సమాధానం: 2
5. బ్రిటిషర్లపై చేసిన తిరుగుబాట్లలో స్వదేశీపోరాటయోధుల వైఫల్యానికి ప్రధాన కారణం?
ఎ) బ్రిటిషర్లు తక్కువ మంది, మనసైన్యం ఎక్కువ అనే అతివిశ్వాసం వల్ల
బి) బ్రిటిషర్ల శక్తిమంతమైన ఆయుధాల వల్ల
సి) బ్రిటిషర్ల క్రమశిక్షణ ఉన్న సైనిక వ్యవస్థ వల్ల

1) ఎ, బి సరైనవి
2) బి, సి సరైనవి
3) ఎ, సి సరైనవి
4) ఎ, బి, సి సరైనవి
సమాధానం: 4

APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

Published date : 26 May 2022 05:30PM

Photo Stories