Skip to main content

Indian Economy Notes for Competitive Exams: ఆర్థిక సర్వే 2021–22

Indian Economy Notes for Groups and Competitive Exams
Indian Economy Notes for Groups and Competitive Exams

బాహ్యరంగం (External sector)

భారత్‌లో మూలధన ప్రవాహాలలో పెరుగుదల కారణంగా.. విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థాయి పెరగడంతో 2021–22లో విదేశీ వాణిజ్యం పటిష్టమైన పురోగతి సాధించింది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి కూడా విదేశీ వాణిజ్యం కారణంగా నిలిచింది. ప్రపంచ వస్తు ధరలలో అనిశ్చితి, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యత్వం తగ్గడం, సరుకు రవాణా వ్యయాల పెరుగుదల, కోవిడ్‌–19కు సంబంధించి కొత్త వేరియంట్లు భారత్‌కు 2022–23లో సవాళ్లుగా పరిణమించే అవకాశాలున్నాయి. స్వదేశీ కార్యకలాపాలు, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌లో పురోగతి వల్ల కోవిడ్‌ ముందు కాలం కంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వస్తు ఎగుమతులు, దిగుమతుల స్థాయిలో మెరుగుదల ఏర్పడింది. ప్రభుత్వ చర్యలు కూడా ఎగుమతుల వృద్ధికి కారణంగా నిలిచాయి. ఏప్రిల్‌–నవంబర్‌ 2021లో అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, చైనాలు.. భారత్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా నిలిచాయి. అలాగే చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా.. ప్రధాన దిగుమతి కేంద్రాలుగా నిలిచాయి. పర్యాటక రంగ రాబడి తగ్గినప్పటికీ.. సాఫ్ట్‌వేర్, వ్యాపార రాబడులు పెరిగిన కారణంగా.. నికర సేవల రాబడులలో గణనీయమైన పెరుగుదల ఏప్రిల్‌–డిసెంబర్‌ 2021లో నమోదైంది.

  • 2021–22మొదటి అర్ధ భాగంలో అధిక వాణిజ్య లోటు కారణంగా కరెంటు ఖాతాలోటు జీడీపీలో 0.2 శాతంగా నమోదయింది. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడి ప్రవాహాలలో పెరుగుదల, నికర బహిర్గత వాణిజ్య రుణాలలో పురోగతి, అధిక బ్యాంకింగ్‌ మూలధనం, అదనపు స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ కేటాయింపు లాంటి అంశాలు.. భారత్‌లో నికర మూలధన ప్రవాహాల పెరుగుదలకు కారణాలుగా నిలిచాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐఎంఎఫ్‌ అదనంగా భారత్‌కు స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ కేటాయించడం, అధిక వాణిజ్య రుణాల కారణంగా.. సెప్టెంబర్‌ 2021 నాటికి భారత్‌ విదేశీ రుణం రూ.593.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కరెంటు ఖాతాలోటును భర్తీ చేయడానికి మూలధన ప్రవాహాలు సరిపోయినంతగా ఉండటంతో.. 2021–22 మొదటి అర్ధ భాగంలో చెల్లింపుల శేషంలో మిగులు 63.1 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. డిసెంబర్‌ 31,2021 నాటికి విదేశీ మారక నిల్వలు 633.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్‌ తర్వాత ప్రపంచంలో భారత్‌ నాల్గవ అతిపెద్ద విదేశీమారక నిల్వలు నిర్వహిస్తున్న దేశంగా నిలిచింది.

Indian Economy Notes for Group 1&2: ఆర్థిక సర్వే 2021–22

ప్రపంచ ఆర్థిక వాతావరణం (Global Economic Environment)

  • ప్రపంచ ఆర్థిక వాతావరణంపై కోవిడ్‌–19 ప్రభావాన్ని సర్వే ప్రస్తావించింది. 2021–22 మొదటి అర్ద భాగంలో ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల కారణంగా.. వస్తు వాణిజ్య వృద్ధి కోవిడ్‌ మహమ్మారి ముందు కంటే అధికంగా నమోదయింది. ఐఎంఎఫ్‌ తాను ప్రచురించే వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌ లుక్, అక్టోబర్‌ 2021 నివేదిక.. ప్రపంచ వస్తు, సేవల వాణిజ్య పరిమాణ వృద్ధి 2021లో 9.7 శాతం, 2022లో 6.7 శాతంగా అంచనా వేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అక్టోబర్‌ 2021లో ప్రపంచ వస్తు వాణిజ్య పరిమాణ వృద్ధి 10.8 శాతం, 2022లో 4.7 శాతంగా అంచనావేసింది. 2021–22 మూడవ త్రైమాసికంలో డెల్టావేరియంట్‌తోపాటు నూతన వేరియంట్‌ల కారణంగా ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ది క్షీణించింది.
  • ప్రపంచ విత్త స్థితిగతుల నేపథ్యంలో.. ఆర్థిక కార్యకలాపాల పురోగతి ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసింది. 1982 తదుపరి నవంబర్‌ 2021లో అమెరికాలో మొదటిసారి అత్యధికంగా 6.8 శాతం ద్రవ్యోల్బణం నమోదయింది. శక్తి, ఆహారధరలలో పెరుగుదల అమెరికాలో అధిక ద్రవ్యోల్బణానికి కారణమైంది. ద్రవ్యోల్బణాన్ని నివారించే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు విత్త మద్దతును తగ్గించాయి. ఈ స్థితి ప్రపంచ విత్త స్థితిగతులు, మూలధన ప్రవాహాలు,వినిమ య రేటు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యత్వం క్షీణత, ప్రపంచ కరెన్సీ వినిమయ రేటులో ఒడిదుడుకులు లాంటి పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టే విషయంలో సవాళ్లుగా నిలుస్తాయి.

భారత్‌ వస్తువాణిజ్యం–ఎగుమతులు

  • 2019–20లో భారత్‌ ఎగుమతుల రాబడి 313.4 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా అధికం(13.2 శాతం). కాగా తర్వాతి స్థానాలలో వరుసగా ముత్యాలు, విలువైన రాళ్లు(6.6 శాతం), డ్రగ్‌ ఫార్ములేషన్, బయోలాజికల్స్‌(5.1 శాతం), బంగారం, ఇతర విలువైన మెటల్‌ జ్యూయలరీ(4.4 శాతం), ఇనుము, ఉక్కు (3 శాతం) నిలిచాయి.
  • 2020–21లో భారత్‌ ఎగుమతుల రాబడి 291.8 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా అధికం(8.8 శాతం). కాగా తర్వాతి స్థానాలలో వరుసగా డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్‌(6.5 శాతం), ముత్యాలు, విలువైన రాళ్లు(6.2 శాతం), ఇనుము, ఉక్కు(4.2 శాతం) నిలిచాయి.
  • 2021–22 ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో.. మొత్తం ఎగుమతుల రాబడి 265.7 బిలియన్‌ డాలర్లగా నిలిచింది.మొత్తం ఎగుమతుల రాబడిలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా(14.9 శాతం) అధికం.. కాగా తర్వాతి స్థానంలో వరుస క్రమంలో ముత్యాలు, విలువైన రాళ్లు(6.8 శాతం), ఇనుము, ఉక్కు(6 శాతం), డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయోలాజికల్స్‌(4.7 శాతం) నిలిచాయి.
  • మెరైన్‌ ఉత్పత్తులు, buffalo meat, టీ, కాఫీ, డైరీ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి 2020–21లో ప్రగతి తక్కువగా ఉన్నప్పటికి.. 2021–22లో ఆయా ఉత్పత్తుల ఎగుమతులలో అధిక వృద్ది నమోదయింది. రాబోవు కాలంలో వ్యవసాయ ఎగమతులకు ఉన్న అధిక అవకాశాలను సర్వే పేర్కొంది.
  • 2021–22 ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో.. అమెరికా, భారత్‌కు సంబంధించి ప్రధాన ఎగుమతి కేంద్రం. కాగా తర్వాతి స్థానాలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, చైనాలు నిలిచాయి. ఇదే కాలంలో భారత్‌కు సంబంధించి మొదటి పది ఎగుమతి కేంద్రాలలో మలేషియా స్థానాన్ని బెల్జియం ఆక్రమించింది.
  • గత 25ఏళ్ల కాలంలో భారత్‌ ఎగుమతి గమ్యస్థానాల్లో మార్పు జరిగినప్పటికీ.. నేటికీ భారత్‌ ఎగుమతులలో ఏడు దేశాల వాటా 40 శాతం. ఎగుమతులపై కోవిడ్‌–19 ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఎగుమతి ఉత్పత్తులపై రీఫండ్‌ చేయని కేంద్ర, రాష్ట్ర, స్థానిక పన్నులు, డ్యూటీలను తిరిగి చెల్లించే నూతన పథకం, ఎగుమతి హబ్‌గా జిల్లాలను అభివృద్ధి చేయడం, ఉత్పతి–ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రిఫరెన్షియల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఆరిజన్‌కు సంబం«ధించి ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ఫామ్, భారత ప్రభుత్వం 2021–22లో తన వాటా మూలధనంగా రూ.750 కోట్లను ఎగుమతి–దిగుమతి బ్యాంక్‌కు అందించడం, 2021–22 నుండి 2025–26 మధ్య కాలంలో ‘ఎగుమతి పరపతి గ్యారంటీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’కు రూ.4,400 కోట్ల మూలధనం అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెల్పడం లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఎగుమతి ప్రోత్సాహక పథకాలయిన ‘ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ ఎక్ప్‌పోర్ట్‌ స్కీమ్‌(TIES)’, మార్కెట్‌ అందుబాటు(Access)చర్యలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పథకం, అత్యవసర పరపతి లైన్‌ గ్యారంటీ పథకం,‘అడ్వాన్స్‌ ఆ«ధరైజేషన్‌ స్కీమ్‌’లు కొనసాగుతున్నాయి. ఈ పథకాలన్నీ వాణిజ్య అవస్థాపన, మార్కెటింగ్‌కు తగిన మద్దతునిస్తాయి.

Indian‌ Economy for Group 1 & 2: భారత ఆర్థిక సర్వే 2021–22

భారత్‌ వస్తు వాణిజ్యం–దిగుమతులు

  • 2019–20లో భారత్‌ దిగుమతుల విలువ 474.7 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. మొత్తం దిగుమతుల విలువలో పెట్రోలియం క్రూడ్‌ వాటా అధికం కాగా(21.6 శాతం) తర్వాతి స్థానంలో వరుస క్రమంలో బంగారం(5.9 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు(5.9 శాతం), ముత్యాలు, విలువైన రాళ్లు(4.7 శాతం) నిలిచాయి.
  • 2020–21లో భారత్‌ దిగుమతుల విలువ 394.4 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. మొత్తం దిగుమతుల విలువలో పెట్రోలియం క్రూడ్‌ వాటా(15.1 శాతం) అధికం కాగా తర్వాతి స్థానాలలో బంగారం(8.8 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు (5.9 శాతం), ముత్యాలు, విలువైన రాళ్లు(4.8 శాతం), బొగ్గు, కోక్‌ Briquittes(4.1 శాతం) నిలిచాయి.
  • 2021–22 ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో మొత్తం దిగుమతుల విలువ 381.4 బిలియన్‌ డాలర్లగా నమోదయింది. ఈ మొత్తంలో పెట్రోలియం క్రూడ్‌ వాటా(19.2 శాతం) అధికం. కాగా తర్వాతి స్థానంలో బంగారం(8.7 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు(6.3 శాతం), ముత్యాలు, విలువైన రాళ్లు(5 శాతం), బొగ్గు, కోక్, Briquittes(4.9 శాతం) నిలిచాయి.
  • 2021–22 ఏప్రిల్‌–నవంబర్‌లో భారత్‌ దిగుమతులలో చైనా వాటా(15.5 శాతం)అధికం. కాగా తర్వాతి స్థానాలలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికా,సౌదీ అరేబియా, ఇరాక్‌లు నిలిచాయి. 
  • 2021–22 ఏప్రిల్‌–నవంబర్‌లో భారత్‌ వస్తు వాణిజ్య మిగులు అమెరికాకు సంబంధించి అధికం(21.6 బిలియన్‌ డాలర్‌లు). కాగా, తర్వాతి స్థానాలలో బంగ్లాదేశ్, నేపాల్‌లు నిలిచాయి. ఇదే కాలంలో భారత్‌ వస్తు వాణిజ్య లోటు చైనాకు సంబంధించి అధికం. కాగా తర్వాతి స్థానాలలో ఇరాక్, స్విట్జర్లాండ్‌లు నిలిచాయి. 

సేవల వాణిజ్యం

  • పోస్ట్‌ కోవిడ్‌–19 కాలంలో ప్రపంచ సేవల వాణిజ్యంలో భారత్‌ అధిక ప్రగతి కనబర్చిందని సర్వే పేర్కొంది. కోవిడ్‌ మహమ్మారి కాలంలో çప్రపంచవ్యాప్తంగా నియంత్రణలు, పర్యాటక రంగ రాబడి క్షీణించినప్పటికి.. 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో.. భారత్‌ సేవల ఎగుమతులలో వృద్ధి క్రితం సంవత్సరం అదే కాలంతో పోల్చినప్పుడు 18.4 శాతంగా నమోదయింది. ఈ కాలంలో భారత్‌ సేవల ఎగుమతులలో కంప్యూటర్, బిజినెస్, రవాణా సేవల వాటా 80 శాతం కంటే ఎక్కువ. సేవల ఎగుమతుల విలువ 2019–20లో 213.2 బిలియన్‌ డాలర్లు కాగా 2020–21లో 206.1 బిలియన్‌ డాలర్‌లకు తగ్గి.. 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో 177.7బిలియన్‌ డాలర్లగా నమోదయింది. సేవల ఎగుమతులలో భారత్‌ అధిక వృద్ది సాధించడానికి ప్రభుత్వం అమలుపరచిన ముఖ్య సంస్కరణలు కారణాలుగా నిలిచాయి. టెలికాం రంగానికి సంస్కరణల ప్యాకేజి ప్రకటించడం, పెట్టుబడి ప్రోత్సహించడం, టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్స్‌పై నియంత్రణ భారం తగ్గించడం లాంటి చర్యలు సేవల ఎగుమతుల వృద్దికి దోహదపడ్డాయి. 
  • 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌లో సేవల దిగుమతులలో క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు 21.5శాతం వృద్ది నమోదయింది. సేవల దిగుమతుల విలువ పెరుగుదలకు వ్యాపారం, ప్రయాణం, కంప్యూటర్‌ సర్వీసెస్‌ కారణాలుగా నిలిచాయి.ఈ మొత్తం సేవల దిగుమతుల విలువలో 75 శాతం కంటే అధికం. సేవల దిగుమతుల విలువ 2019–20లో 128.3 బిలియన్‌ డాలర్‌ల నుండి 2020–21లో 117.5 బిలియన్‌ డాలర్‌లకు తగ్గి.. 2021–22 ఏప్రిల్‌–డిసెంబర్‌లో 103.3 బిలియన్‌ డాలర్‌లకు చేరుకుంది.
  • 2019–20లో కరెంటు ఖాతాలోటు జీడీపీలో 0.9శాతం కాగా 2020–21లో మిగులు జీడీపీలో 0.9 శాతం. 2021–22 మొదటి అర్ద భాగంలో కరెంటు ఖాతాలోటు జీyీ పీలో 0.2 శాతం.

Indian Economy practice test

వాణిజ్య ఒప్పందాల ప్రగతి

  • గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌ అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు, ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందాల సమీక్షను చేపట్టింది. ఎగుమతులను పెంపొందించుకోవడానికి అనేక దేశాలలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. ఇటీవలి కాలంలో ‘సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం’ ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో ఏర్పరచుకోవడానికి భారత్‌ ప్రయత్నిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఇప్పటికే సింగపూర్‌తో ఉన్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం,ఆసియాన్‌ దేశాలతో ఉన్న ఆసియాన్‌ –ఇండియా వస్తు వాణిజ్య ఒప్పందం ప్రగతిని భారత్‌ సమీక్షిస్తున్నది. 
  • జనవరి 13, 2022న బ్రిటన్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంకు సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయి. తద్వారా 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యం. సాంఘిక భద్రతా ఒప్పందం, న ర్సింగ్‌ సేవలు ,అకౌంటింగ్‌ సేవలు, భారతీయ వృత్తి నిపుణులకు సంబంధించిన అంశాలపై అక్టోబర్‌ 06, 2021 అమెరికా ప్రతినిధులతో ‘ఇండియా–అమెరికా వాణిజ్య విధాన ఫోరం(మినిస్టీరియల్‌)’ కింద చర్చలు జరిగాయి.

tamma kotireddyడా. తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్‌
 

Published date : 22 Jun 2022 07:48PM

Photo Stories