Indian Economy Survey for Competitive Exams: ఆర్థిక సర్వే 2021–22: ధరలు.. ద్రవ్యోల్బణం
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయనే సంకేతాలు కోవిడ్ మహమ్మారి రెండవ సంవత్సరంలో కనిపించినప్పటికీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ సవాళ్లను ఎదుర్కొంది. అభివృద్ది చెందిన, వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో కోవిడ్–19 సంబంధిత విత్త మద్దతు, వినియోగ వ్యయం,డిమాండ్ పెరుగుదలకు దారితీసి.. ద్రవ్యోల్బణం తీవ్రమైంది. శక్తి, ఆహారం, ఆహారేతర, ఉత్పాదక‡ధరల పెరుగుదల, సప్లయ్ అవరోధాలు, ప్రపంచ సప్లయ్ చెయిన్‌లో అవరోధాలు, ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా వ్యయాల పెరుగుదల.. 2021–22లో ప్రపంచ ద్రవ్యోల్బణానికి కారణాలుగా నిలిచాయి. ఆర్థిక వ్యవస్థల పురోగమనం, ఓపెక్ దేశాల సప్లయ్ నిబంధనల కారణంగా.. క్రూడ్ చమురు ధరలలో పెరుగుదల ఏర్పడింది.
వివిధ దేశాలలో ద్రవ్యోల్బణం
ఐఎంఎఫ్ అంచనా ప్రకారం–అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం 2020లో 0.7 శాతం నుంచి 2021లో 3.1 శాతానికి పెరిగింది. సెకండ్ హ్యాండ్ వాహనాలు, శక్తి ధరల పెరుగుదల కారణంగా.. 1982 తర్వాతి కాలంలో అధికంగా ద్రవ్యోల్బణం అమెరికాలో డిసెంబర్ 2021లో 7 శాతంగా నమోదయింది. ఆహార ధరల పెరుగుదల కారణంగా.. గత 30ఏళ్లలో అధిక ద్రవ్యోల్బణం 5.4 శాతంగా డిసెంబర్ 2021లో బ్రిటన్‌లో నమోదయింది. వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌లో ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021లో 10.1 శాతం, టర్కీలో 36.1 శాతం.. కాగా గత ఆరు నెలల కాలంలో అర్జెంటీనాలో ద్రవ్యోల్బణం 50 శాతంగా నమోదయింది. సమర్దవంతమైన సప్లయ్ నిర్వహణ, ప్రభుత్వ అనుకూల విధానాల కారణంగా.. భారత్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021లో 5.6 శాతంగా నిలిచింది. 2020, 2021 మొదటి అర్ధ భాగంలో అంతర్జాతీయ వస్తు ధరలలో పెరుగుదల ఏర్పడింది. ఈ కాలంలో శక్తి ధరలలో ఒడిదుడుకులు అధికమయ్యాయి. కోవిడ్–19 కాలంలో శక్తి సూచీలో రుణాత్మక వృద్ది నమోదయినప్పటికీ.. 2021లో మొత్తం 12నెలలకు గాను ఐదు నెలల్లో శక్తి సూచీలో మూడంకెల వృద్ధి ఏర్పడగా... 2021లో ఆహారం, మెటల్స్, ఖనిజాల ధరలలో రెండంకెల వృద్ధి నమోదైంది. సప్లయ్ నిర్వహణ కారణంగా భారత్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికి.. తయారీ ఉత్పత్తుల ప్రపంచ ధరలలో పెరుగుదల భారత్‌లో స్వదేశీ ధరలపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా బేసిక్ మెటల్స్ విషయంలో ఈ ప్రభావం కనిపించింది.
- వాహనాలతో పాటు తయారీ వస్తువుల డిమాండ్ పెరుగుదల, నిర్మాణ కార్యకలాపాలు వేగవంతమయిన కారణంగా.. ప్రపంచ అల్యూమినియం ధరలలో పెరుగుదల ఏర్పడింది. పర్యావరణ అంశాలను దృష్టిలో ఉంచుకొని.. ప్రపంచంలో అల్యూమినియం ఎగుమతులలో ముఖ్య దేశం అయిన చైనా తన ఉత్పత్తిని తగ్గించుకొంది. 2021 మొదటి నెలల్లో కాపర్ ధరలలో పెరుగుదల సంభవించింది. అవస్థాపనా సౌకర్యాలు, నిర్మాణ రంగంపై చైనా అధిక పెట్టుబడులు, ప్రపంచ వ్యాప్తంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి అధికంగా ఉండటం కారణంగా.. కాపర్ ధరలలో పెరుగుదల ఏర్పడింది. ఇన్వెంటరీ తగ్గుదల చిలీ, పెరూలో సమ్మె బెదిరింపుల కారణంగా కాపర్ ఉత్పత్తి తగ్గి ధరల పెరుగుదల సంభవించింది.
- చైనాలో ఉక్కు ఉత్పత్తికి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇనుప ధాతువు దిగుమతులు పెరగడం, ఇనుప ధాతువు ధరలలో పెరుగుదల ఏర్పడింది.ఇటీవలి కాలంలో ఇనుప ధాతువు ధరలలో తగ్గుదలను గమనించవచ్చు. ఇనుప ధాతువు ఎగుమతులు ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్ నుంచి పెరిగాయి. 2021 మొదటి చతుర్దాంశం (quarter) టిన్ ధరలలో 33 శాతం పెరుగుదల ఏర్పడింది. బొలీవియా, పెరు, మలేసియాలో లాక్‌డౌన్ కారణంగా సప్లయ్‌లో ఏర్పడిన అడ్డంకులు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టిన్ అమ్మకం దారులకు డిమాండ్ అధికంగా ఉండటం టిన్ ధరలలో పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. బ్రెజిల్, ఇండోనేషియాలు స్వచ్ఛందంగా టిన్ ఉత్పత్తిని తగ్గించుకోవడంతో పాటు మయన్మార్‌లో రాజకీయ అనిశ్చితి కూడా టిన్ ధరల పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. గత పది సంవత్సరాల కాలంతో పోల్చినప్పుడు మే, 2020 తర్వాతి కాలంలో అంతర్జాతీయ పత్తి ధరలలో పెరుగుదలను గమనించవచ్చు. పత్తి సూచీధర ఏప్రిల్ 2020లో $ 1.4/కిలో కాగా.. నవంబర్ 2021లో $2.79/కిలోకి చేరుకుంది. కోవిడ్–19 కాలంలో పత్తికి డిమాండ్ తగ్గినప్పటికి.. తర్వాతి కాలంలో క్రమంగా డిమాండ్‌లో పెరుగుదల పత్తి ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది.
Indian Economy Notes for Competitive Exams: ఆర్థిక సర్వే 2021–22
భారత్‌లో ద్రవ్యోల్బణం–ప్రస్తుత ధోరణులు
- 2018–19లో 4.3 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ.. 2020–21లో 1.3 శాతానికి తగ్గడానికి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో తగ్గుదల, అల్ప ప్రపంచ క్రూడ్ చమురు ధరలు, డిమాండ్ క్షీణత కారణంగా నిలిచాయి. 2021–22 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో టోకు ధరల సూచీ 12.5 శాతంగా నమోదు కావడానికి ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం. ప్రపంచ క్రూడ్ చమురు ధరల పెరుగుదల, దిగుమతి చేసుకునే ఉత్పాదకాల ధరలలో పెరుగుదల, అధిక సరుకు రవాణా వ్యయం కారణాలుగా నిలిచాయి.
- కోవిడ్–19 సంబంధిత సప్లమ్ చెయిన్ అవరోధాలు, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2019–20లో 4.8 శాతం నుంచి 2020–21లో 6.2 శాతానికి పెరిగింది. జూలై 2021 తర్వాతి కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితికి లోబడి కొనసాగుతున్నది. –2021–22 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా నమోదయింది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల కారణమైంది.
- వినియోగ ధరల సూచీ, టోకు ధరల సూచీ మధ్య నిర్దిష్ట వస్తు గ్రూపుల ప్రా«ధాన్యత, భారితం (weights)లో వ్యత్యాసాలను గమనించవచ్చు. వినియోగధరల సూచీలో ఆహారం–బేవరేజెస్ అధిక భారితం(45.9) కలిగి ఉండగా.. టోకు ధరల సూచీలో తయారీ ఉత్పత్తుల గ్రూపు భారితం (64.2) అధికంగా ఉంటుంది. ఇంధనం గ్రూపు భారితం (weights) టోకు ధరల సూచితో పోల్చినప్పుడు.. వినియోగ ధరల సూచీలో తక్కువ. వినియోగ ధరల సూచీలో మిసిలేనియన్ గ్రూప్ 28.3 భారితాన్ని కలిగి ఉంటుంది. ఈ గ్రూపులో విద్య, ఆరోగ్యం, రిక్రియేషన్, బంగారు ఆభరణాలు భాగంగా ఉంటాయి. టోకు ధరల సూచీలో సేవలు భాగం కావు. 2021లో టోకు ధరల సూచీలో భాగంగా ఇంధన గ్రూపు, తయారీ రంగంలో అధిక ద్రవ్యో ల్బణం నమోదయింది. వినియోగ ధరల సూచీ తగ్గుదలకు అల్ప ఆహార ద్రవ్యోల్బణం కారణం కాగా, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు శక్తి, ఉత్పాదక ధరలు అధికంగా ఉండటం కారణమయింది. వినియోగ ధరల సూచీ–ఉమ్మడి, టోకు ధరల సూచీ మధ్య వ్యత్యాసం గత సంవత్సరం చర్చనీయాంశమైంది. బేస్ ప్రభావం, ఈ రెండు సూచీల పరిధి, కవరేజిలో తేడా, ఆయా సూచీల గణనకు ధరల సేకరణలో వ్యత్యాసం,వస్తు భారితాలలో తేడాలు కారణాలుగా నిలిచాయి.
Economy Preparation Strategy: పోటీ పరీక్షల్లో–భారత ఆర్థిక వ్యవస్థ
వ్యవసాయ ఉత్పత్తుల ధరల ఒడిదుడుకులు
- స్వదేశీ వంట నూనె వినియోగంలో దిగుమతి వాటా 60 శాతం. మొత్తం వంట నూనె దిగుమతిలో పామాయిల్(క్రూడ్, రిఫైండ్) వాటా 60 శాతం. దిగుమతులలో ఒడిదుడుకులు, అంతర్జాతీయ ధరల ప్రభావం భారత్‌లో వంటనూనె ధరలపై కనిపించింది. అధిక అంతర్జాతీయ వంటనూనె ధరల కారణంగా భారత్‌లో వంటనూనె ధరలు పెరిగాయి. వంటనూనె అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా భారత్‌లో వంటనూనె దిగుమతులు 2020–21లో తగ్గాయి. గత ఆరు సంవత్సరాల కాలంలో వంటనూనె దిగుమతులు 2020–21లో తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. అయితే విలువ పరంగా 2019–20తో పోల్చినప్పుడు 2020–21 వంటనూనె దిగుమతుల విలువలో పెరుగుదల 63.5 శాతం.
- పప్పు ధాన్యాలలో ద్రవ్యోల్బణం 2020–21లో 16.4 శాతం కాగా డిసెంబర్ 2021 నాటికి 2.4 శాతానికి తగ్గింది. సప్లయ్‌వైపు అవరోధాలు, లాక్‌డౌన్ కారణంగా అధిక నిల్వలు నిర్వహించాలనే కుటుంబాల ఆసక్తి 2020–21లో పప్పు ధాన్యాల ధరల పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. నియంత్రణల తొలగింపు, ఖరీఫ్ కాలంలో పప్పుధాన్యాల పంట విస్తీర్ణం.. అక్టోబర్ 1, 2021 నాటికి 142.4లక్షల హెక్టార్లకు పెరగడం వలన పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం ఇటీవల కాలంలో క్షీణించింది.
–డాక్టర్ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్
TSPSC Group 1 Preparation Tips: వంద రోజుల్లో.. ప్రిలిమ్స్ నెగ్గేలా!