Skip to main content

Economy Preparation Strategy: పోటీ పరీక్షల్లో–భారత ఆర్థిక వ్యవస్థ

Economy Preparation Strategy
Economy Preparation Strategy

యూపీఎస్‌సీ(యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నిర్వహించే సివిల్స్‌ స్థాయి పరీక్షల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు జరిపే.. గ్రూప్‌1, గ్రూప్‌2తోపాటు వివిధ పోటీ పరీక్షల్లో ఎకానమీ పాత్ర ఎంతో కీలకమైంది. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల్లో మొత్తం 150 మార్కులకుగాను ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు సగటున 15గా ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ప్రశ్నలతోపాటు కరెంట్‌ అఫైర్స్‌లో భాగంగా ఎకానమీకి సంబంధించి అడిగే ప్రశ్నలు ప్రతి పరీక్షలో సగటున 5 నుంచి 10 వరకూ ఉంటాయి. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు.. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌తోపాటు మెయిన్స్‌లో ఎకానమీకి సంబంధించిన అంశాలను కూడా మిళితం చేస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.
ప్రిలిమినరీ పరీక్షతోపాటు మెయిన్స్‌కు సన్నద్దమయ్యే విద్యార్థులు.. మొదటగా బేసిక్‌ కాన్సెప్ట్‌లను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్‌సీఈఆర్‌టి ప్రచురించే 10, 11,12 తరగతుల పుస్తకాల నుంచి బేసిక్‌ పదకోశాలైన ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, తలసరి ఆదాయం, రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి, బ్యాంకు రేటు, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, మూలధన ఉత్పత్తి నిష్పత్తి, మూలధన సంచయనం, మానవాభివృద్ధి, ద్రవ్యలోటు, కోశ విధానం, ద్రవ్య విధానం, వాణిజ్యలోటు లాంటి పదాలను అవగాహన చేసుకోవడంతోపాటు దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.
బేసిక్‌ పదకోశాలపై అవగాహన ఏర్పడిన తర్వాత.. కోర్‌ అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, నీతి ఆయోగ్,పన్నుల వ్యవస్థ,అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ విత్త సంస్థలు, వస్తు సేవల పన్ను, క్రిప్టో కరెన్సీ, డిజిటలైజేషన్, ఆర్థిక సంస్కరణలు,బ్యాంకింగ్,ద్రవ్య సప్లయ్, జనాభాకు సంబంధించిన వివిధ అంశాలు, బడ్జెట్‌లోని వివిధ అంశాలు, సుస్థిరాభివృద్ధి, సామాజిక రంగ అభివృద్ధిపై అధ్యయనం అవసరం. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ప్రామాణిక దినపత్రికలను చదువుతూ.. ఎకానమీకి సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌ నోట్స్‌ రూపొందించుకోవాలి. ప్రిపరేషన్‌ ప్రారంభంలో ఏ విధమైన సందేహాలకు గురి కాకుండా విద్యార్థులు శ్రద్ధ వహించాలి.

చ‌ద‌వండి: Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు.. 

ప్రిలిమ్స్‌–మెయిన్స్‌కు చదవాల్సిన అంశాలు..

ఆర్థికాభివృద్ధి
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదకోశాలు, అల్పాభివృద్ధి సూచికలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లక్షణాలు, మానవాభివృద్ధికి సంబంధించి వివిధ సూచీలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులు, పర్యావరణ విధానం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత ప్రగతికి సంబంధించి అధ్యయనం అవసరం. 

భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం
భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సహజ వనరులు, నూతన విద్యా విధానం, జాతీయ ఆరోగ్య విధానం, వివిధ అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, శ్రామిక శక్తి, ఉపాధి, నిరుద్యోగిత, జనాభా వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, ఆదాయ అసమానతలకు కారణాలు, ప్రభుత్వం విధానం, చర్యలు తదితర అంశాలు చదవాలి.

విదేశీ వాణిజ్యం–విదేశీ మూలధనం
భారత విదేశీ వాణిజ్యంలో భాగంగా ఎగుమతులు, దిగుమతుల విలువ, వివిధ దేశాలతో వాణిజ్య భాగస్వామ్యం, వస్తు సేవల ఎగుమతులు, దిగుమతులలో మార్పులను పరిశీలించాలి. వీటితోపాటు నూతన వాణిజ్య విధానంలోని ప్రధానాంశాలు, విదేశీ మూలధన ప్రవాహం, విదేశీ మారకపు రేటు విధానం,ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు,హాంకాంగ్‌ మినిస్టీరియల్‌ కాన్ఫరెన్స్, బాలీ ప్యాకేజీకి సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి. 

ద్రవ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్‌
ఈ అంశాలకు సంబంధించి ద్రవ్యోల్బణానికి కారణాలు, ప్రభావం, ద్రవ్యోల్బణ నివారణకు ప్రభుత్వ విధానంతోపాటు ‘ఇన్‌ఫ్లేషన్‌ టార్గెటింగ్‌‘కు సంబంధించి అవగాహన పెంచుకోవాలి. భారత ద్రవ్య మార్కెట్, ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో.. బ్యాంకింగ్‌ రంగ ప్రగతి, రిజర్వ్‌ బ్యాంకు ద్రవ్య విధాన లక్ష్యాలతోపాటు ద్రవ్య విధాన సాధనాల వినియోగం, భారత మూలధన మార్కెట్‌తోపాటు భారత అభివృద్ధి, విత్త సంస్థలకు సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి.

పబ్లిక్‌ ఫైనాన్స్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, వ్యయ, రుణ ధోరణులు, ప్రభుత్వ కోశ విధానం, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలతోపాటు 2022–23 కేంద్ర, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు, బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన నూతన కార్యక్రమాల లక్ష్యాలను పరిశీలించాలి. 

ఆర్థిక ప్రణాళిక–విధానం
ఆర్థిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలు, స్వాతంత్య్రానంతరం వివిధ రంగాలకు వనరుల కేటాయింపులు, పంచవర్ష ప్రణాళికల ఫైనాన్సింగ్‌కు సంబం«ధించి వివిధ ఆధారాలు, నల్లధనం పెరగడానికి కారణాలు, నివారణకు సంబంధించి ప్రభుత్వ విధానంపై అవగాహన అవసరం. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలకు సంబంధించి అధ్యయనం చేయాలి. 

కోవిడ్‌–భారత ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థికాభివృద్ధిపై కోవిడ్‌ ప్రభావం, ప్రభుత్వ విత్త ప్యాకేజీ,రిజర్వ్‌ బ్యాంకు విధానం,భారత ఆర్థిక పురోగతిలో భాగంగా సమిష్టి డిమాండ్‌ పెరుగుదలకు తీసుకున్న చర్యలపై అధ్యయనం అవసరం.

చ‌ద‌వండి: నీతి ఆయోగ్‌కు ఉన్న మరో పేరు ఏమిటి?

నీతి ఆయోగ్‌
నీతి ఆయోగ్‌ విధానాలలో భాగంగా 7 సంవత్సరాల విజన్, వ్యూహం, యాక్షన్‌ ప్లాన్, 15 సంవత్సరాల రోడ్‌ మ్యాప్, అమృత్, డిజిటల్‌ ఇండియా, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, వైద్య విద్య సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, విద్య, ఆరోగ్యం, నీటి యాజమాన్యంలో భాగంగా రాష్ట్రాల ప్రగతి కొలవడానికి సూచికలు, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్‌ పథకాల రేషనలైజేషన్‌ కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సబ్‌ గ్రూప్‌; నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు సంబంధించి ముఖ్యమంత్రుల సబ్‌ గ్రూప్‌ సిఫార్సులను అధ్యయనం చేయాలి.

వ్యవసాయరంగం
పంటల తీరును నిర్ణయించే అంశాలు, పంటల తీరు దోరణులు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదక దోరణులు, వ్యవసాయ ఉత్పాదకాలు, హరిత విప్లవం, వ్యవసాయ ధరల విధానం, వ్యవసాయ రంగ సబ్సిడీలు, ఆహార భద్రత,వ్యవసాయ శ్రామికుల స్థితి గతులు, వ్యవసాయ రంగ విత్తం, మార్కెటింగ్‌లో భాగంగా సహకార పరపతి సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఆర్థిక సమ్మిళితంతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ను మెరుగుపరచడానికి చర్యలు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు సంబంధించి సమగ్రంగా నోట్స్‌ రూపొందించుకోవాలి. 

పారిశ్రామిక రంగం
భారత్‌లో ముఖ్య పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, పంచదార, సిమెంట్, జౌళి, వస్త్ర పరిశ్రమ ప్రగతితోపాటు పారిశ్రామిక తీర్మానాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగ ప్రగతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ, ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్‌ట్సీ కోడ్, సాంఘిక భద్రతా చర్యలకు సంబంధించి అధ్యయనం చేయాలి.

సేవారంగం
జీడీపీలో సేవారంగ వాటా పెరుగుదల, ఉపాధిలో సేవారంగ వాటా, సేవల ఎగుమతులు, భారత్‌లో ఐటీ, ఐటీఈఎస్‌ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి.

చ‌ద‌వండి: భారత రూపాయి సింబల్‌ను డిజైన్ చేసిందిఎవరు?​​​​​​​

గత ప్రశ్నా పత్రాలలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు

1.    కింది వాటిని పరిశీలించండి?
    1. విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్లు
    2. వివిధ షరతులతో కూడిన విదేశీ సంస్థాగత పెట్టుబడి
    3. గ్లోబల్‌ డిపాజిటరీ రిసిప్ట్స్‌
    4. నాన్‌–రెసిడెంట్‌ బహిర్గత డిపాజిట్లు
    పైన ఇచ్చిన వాటిలో ఏది ప్రత్యక్ష పెట్టుబడులలో భాగంగా ఉంటుంది?

    ఎ. 1, 2, 3     బి. 3 మాత్రమే
    సి. 2, 4        డి. 1, 4
జవాబు: సి
2.    ద్రవ్య గుణకం కింది వాటిలో దేని పెరుగుదలకు కారణమవుతుంది?
    ఎ. బ్యాంకులలో నగదు–నిల్వల నిష్పత్తి పెరుగుదల
    బి. బ్యాంకులలో ఎస్‌ఎల్‌ఆర్‌ పెరుగుదల
    సి. ప్రజలలో బ్యాంకింగ్‌ అలవాట్లు పెరుగుదల
    డి. దేశంలో జనాభా పెరుగుదల
జవాబు: సి
3.    ఆర్థిక తిరోగమనం కాలంలో క్రింది వాటిల్లో ఏ చర్య తీసుకోవడం అధికంగా జరుగుతుంది?
    ఎ. పన్ను రేట్ల తగ్గింపుతోపాటు వడ్డీ రేట్ల పెంపు
    బి. ప్రభుత్వ ప్రాజెక్టులపై వ్యయం పెంపు
    సి. పన్ను రేట్ల పెంపుతోపాటు వడ్డీ రేట్ల తగ్గింపు
    డి. ప్రభుత్వ ప్రాజెక్టులపై వ్యయం తగ్గింపు
జవాబు: బి
4.    పట్టణ సహకార బ్యాంకులకు సంబంధించి కింది వాటిలో సరైనది?
    1. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్థానిక బోర్డుల పర్యవేక్షణ, నియంత్రణలో పట్టణ సహకార బ్యాంకులు పనిచేస్తాయి.
    2. ఈక్విటీ షేర్లు, ప్రిఫరెన్స్‌ షేర్లును ఇష్యూ చేస్తాయి.
    3. 1966లో సవరణ ద్వారా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం, 1949 కిందకు తెచ్చారు.

    ఎ. 1 మాత్రమే    బి. 2, 3
    సి. 1, 3     డి. 1, 2, 3
జవాబు: బి
5.    కింది వాటిలో ఏ చర్య అధిక ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది?
    ఎ. ప్రభుత్వ రుణం తిరిగి చెల్లింపు
    బి. బడ్జెట్‌ లోటు భర్తీ చేయడానికి ప్రజల నుంచి రుణం
    సి. బడ్జెట్‌ లోటు భర్తీ చేయడానికి బ్యాంకుల నుంచి రుణం
    డి. బడ్జెట్‌ లోటు భర్తీ చేయడానికి నూతన ద్రవ్యాన్ని సృష్టించడం
జవాబు: డి
6.    భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ పెట్టుబడిగా కింది వాటిలో దేనిని భావించవచ్చు?
    1. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలను నిర్ణయించడం
    2. ప్రా«థమిక వ్యవసాయ పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ
    3. సామాజిక మూలధన అభివృద్ధి
    4. రైతులకు ఉచిత విద్యుత్‌ సప్లయ్‌
    5. బ్యాంకింగ్‌ వ్యవస్థ వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం
    6. ప్రభుత్వం కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను కల్పించడం

    ఎ. 1, 2, 5    బి. 1, 3, 4, 5
    సి. 2, 3, 6     డి. 1, 2, 3, 4, 5, 6
జవాబు: సి
7.    గత కొంత కాలంగా భారత్‌లో బియ్యం ధర పెరుగుదలకు కింది వాటిలో ఏ విధానం కారణమయింది.
    1. కనీస మద్దతు ధర    2. ప్రభుత్వ ట్రేడింగ్‌
    3. ప్రభుత్వం స్టాకు నిర్వహించడం
    4. వినియోగదారులకు సబ్సిడీ

    ఎ. 1, 2, 4    బి. 1, 3, 4
    సి. 2, 3        డి. 1, 2, 3, 4
జవాబు: డి
8.    కింది వాటిలో ఏ నాలుగు దేశాలు జీ 20 సభ్య దేశాలు?
    ఎ. అర్జెంటీనా,మెక్సికో,దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్‌
    బి.ఆస్ట్రేలియా,కెనడా,మలేసియా,న్యూజిలాండ్‌
    సి. బ్రెజిల్,ఇరాన్,సౌదీ అరేబియా, వియత్నాం
    డి. ఇండోనేషియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా
జవాబు: ఎ
9.    వెస్ట్‌ టెక్సాస్‌ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించింది
    ఎ. క్రూడ్‌ చమురు    బి. బులియన్‌
    సి. అరుదైన భూమికి సంబంధించిన అంశం
    డి. యురేనియం
జవాబు: ఎ

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

రిఫరెన్సెస్‌

1. ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్,10,11,12 తరగతులు
2. భారత ఆర్థిక వ్యవస్థ–తెలుగు అకాడమీ
3. వివిధ మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్‌లు
4. భారత ఆర్థిక వ్యవస్థ–మిశ్రా అండ్‌ పూరి
5. స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ–
ఉమా కపిల
6. భారత ఆర్థిక సర్వే

డా. తమ్మా కోటిరెడ్డి, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!​​​​​​​

Published date : 17 May 2022 06:50PM

Photo Stories