Skip to main content

Indian Economy Notes for Group 1&2: ఆర్థిక సర్వే 2021–22

indian economy preparation for groups
indian economy preparation for groups

గత రెండు సంవత్సరాలుగా కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక క్షీణతను నివారించడంలో కోశ విధానం ముఖ్య సాధనంగా ఉపకరించింది. ప్రభుత్వ కోశ విధానం.. సమాజంలో వెనుకబడిన ప్రజలు, సంస్థల పురోగమనానికి తగిన మద్దతునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు 2020లో అవలంభించిన ‘వాటర్‌ ఫాల్‌ వ్యూహం’ కంటే.. భారత్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎంచుకొన్న ‘Agile విధానం’ భిన్నమైనది. పాలసీ సర్కిల్స్‌లో ఎజైల్‌ విధానం అత్యంత సమ్మతమైందిగా రూపొందిందని ఐఎంఎఫ్‌ ఫిస్కల్‌ మానిటర్‌ అక్టోబర్‌ 2021లో అభిప్రాయపడింది. 

కరోనా మహమ్మారి మొదటి దశలో కోశ విధానం.. పేద, పీడిత వర్గాల ప్రజలకు రక్షణ వలయాలను ఏర్పరచింది. ఆయా వర్గాల ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ, చిన్న వ్యాపారాలకు అత్యవసర పరపతి, 80.96 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే ఆహార సబ్సిడీ కార్యక్రమం లాంటి ముఖ్యమైన చర్యలను చేపట్టడం జరిగింది. ఈ దశలో ఆర్థిక పురోగతి సాధనకు పెట్టుబడిని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, అవస్థాపనా రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయంలో పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. 2020–21 మొదటి రెండు త్రైమాసికాలలో కంటైన్‌మెంట్‌ జోన్‌లలో నియంత్రణలు; పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు, శ్రామికులు విముఖత చూపడం వల్ల మూలధన వ్యయంలో తగ్గుదలను గమనించవచ్చు. ఇదే సంవత్సరం మూడవ త్రైమాసికంలో రాకపోకలు, ఆరోగ్య సంబంధిత నియంత్రణలను సులభతరం చేయడం వల్ల.. ఆర్థిక వ్యవస్థపై ధనాత్మక ప్రభావం చూపించే రంగాలలో మూలధన వ్యయం పెరిగింది. 2021–22 మొదటి మూడు త్రైమాసికాలలో మూలధన వ్యయంలో పెరుగుదల ఏర్పడింది.

Economy Preparation Strategy: పోటీ పరీక్షల్లో–భారత ఆర్థిక వ్యవస్థ

2020–21 కేంద్ర బడ్జెట్‌ అంచనాలు

కేంద్ర బడ్జెట్‌ 2021–22.. అధిక ఉత్పాదక మూలధన వ్యయం కోసం కేటాయింపులు పెంచింది. 2020–21 బడ్జెట్‌తో పోల్చినప్పుడు.. 2021–22లో మూలధన వ్యయంలో పెరుగుదల 34.5 శాతంగా ఉంది. 2021–22లో రైల్వేలు, రోడ్లు, పట్టణ రవాణా, విద్యుత్, టెలికాం, టెక్స్‌టైల్స్, హౌసింగ్, జాతీయ అవస్థాపనా పైప్‌లైన్‌కు అధిక కేటాయింపులు జరిగాయి. 2021–22లో జాతీయ అవస్థాపనా పైప్‌లైన్‌ పరిధిలోని ప్రాజెక్టుల సంఖ్యను 6835 నుంచి 7400కు విస్తరించడం జరిగింది. 2021–22 మొదలు 5 సంవత్సరాల వరకు స్వదేశీ తయారీ రంగ సామర్థ్యాన్ని.. పునర్వినియోగ ఇంధనం, భారీ పరిశ్రమలు, వ్యవసాయం, ఆటోమోటివ్, వస్త్ర రంగంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. 
13 రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.1.97లక్షల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ విధమైన ప్రోత్సాహకాల ప్రభావం.. మధ్యకాలం నుంచి దీర్ఘ కాలంలో ఉపాధిని పెంపొందించడం ద్వారా ఉత్పత్తి పెరుగుదలకు దారితీస్తుందని భావించడం జరిగింది. 2021–22లో అవలంభించిన ఉద్దీపన(stimulus) చర్యలు.. ద్రవ్యత్వం పెంపు, పెట్టుబడిని పెంచే ఉత్పత్తి–ఆధారిత ప్రోత్సాహకాలు, పరపతి గ్యారంటీ పథకాలు, పేదలకు ఉచిత ఆహారధాన్యాల పంపిణీ, ఎగుమతుల పెంపు లక్ష్యంగా కొనసాగాయి. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదపడ్డాయి. 2021–22 బడ్జెట్‌లో వ్యయం పెరుగుదల మాత్రమే కాక.. పెరిగిన వ్యయం.. ఉత్పాదక మూలధన వ్యయంగా మరలడాన్ని గమనించవచ్చు.

2021–22లో విత్త మద్దతు

కోవిడ్‌ రెండో దశ(సెకండ్‌ వేవ్‌) ప్రభావాన్ని తగ్గించి.. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి తగిన మద్దతునివ్వడానికి ప్రభుత్వం 2021–22లో అదనపు ఉపశమన చర్యలను ప్రకటించింది. పేద ప్రజలతోపాటు ఆయా రంగాలకు ఆర్థిక పురోగమనం; ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచడం; వృద్ధి, ఉపాధి పెంపునకు ప్రోత్సాహకం లాంటి లక్ష్యాల దిశగా ప్రభుత్వ చర్యలను గమనించవచ్చు. 
కోవిడ్‌–19 రిలీఫ్‌గా.. జూన్‌ 2021లో రూ.6.29 లక్షల కోట్ల విత్త మద్దతును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో కోవిడ్‌–19 ప్రభావిత రంగాలకు రుణ గ్యారంటీ పథకం, అత్యవసర పరపతి లైన్‌ గ్యారంటీ పథకం, పీఎంజీకేఏవై(ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నా యోజన) పథకం కింద ఉచిత ఆహారధాన్యాల పంపిణీ, ఎగుమతి బీమా కవరేజీ పెంపు, ఫలితాల ఆధారిత విద్యుత్‌ పంపిణీ పథకాలు ప్రాధాన్యత పొందాయి. 2021 జూలైలో రూ.23,123 కోట్ల విత్త మద్దతును భారత్‌ కోవిడ్‌–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్‌–హెల్త్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ప్యాకేజీ రెండో దశకు ఇచ్చారు. 2021 డిసెంబర్‌లో రూ.53,344 కోట్ల విత్త మద్దతును పీఎంజీకేఏవైకు అందించడం జరిగింది.

2020-21 కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు?

2021–22లో Fiscal Indicators (విత్త సూచికల) ప్రగతి

  • రెవెన్యూ రాబడులలో పెరుగుదల, మూలధన వ్యయం పెంపు లక్ష్యంగా వ్యయ పంపిణీ, ఏప్రిల్‌–నవంబర్‌ 2021లో కేంద్ర ప్రభుత్వ విత్తస్థితి పటిష్టతను స్పష్టపరుస్తున్నది. గత రెండు సంవత్సరాలలో ఏప్రిల్‌–నవంబర్‌తో పోల్చినప్పుడు 2021 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రెవెన్యూ రాబడిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. ఈ స్థితి పన్ను–పన్నేతర రాబడిలో పెరుగుదలను స్పష్టపరుస్తున్నది. 2019 ఏప్రిల్‌– నవంబర్‌తో పోల్చినప్పుడు.. ఏప్రిల్‌–నవంబర్‌ 2020లో ప్రత్యక్ష పన్నులలో భాగంగా, వ్యక్తిగత ఆదాయపన్ను రాబడిలో 47.2శాతం, కార్పొరేట్‌ ఆదాయ పన్నులో 90.4 శాతం పెరుగుదల ఏర్పడింది. కార్పొరేట్‌ సంస్థల లాభదాయకత పెరగడం, పన్ను సంస్కరణల కారణంగా పన్ను చెల్లింపులు మెరుగుపడటంతో..కార్పొరేట్‌ ఆదాయపు పన్నులో పెరుగుదల ఏర్పడింది.
  • రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనాల ప్రకారం–లిస్టెడ్‌ ప్రభుత్వేతర నాన్‌–ఫైనాన్షియల్‌ కంపెనీల స్థూల లాభాలు 2021–22 మొదటి త్రైమాసికంలో తయారీ రంగంలో 132.5 శాతం, ఐటీ రంగంలో 21.5 శాతం పెరిగాయి. ఇదే సంవత్సరం రెండవ త్రైమాసికంలో..తయారీ రంగంలో 39.7 శాతం, ఐటీ రంగంలో 18.4 శాతం స్థూల లాభాలలో పెరుగుదల ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పన్ను పాలన, విధాన సంస్కరణలు అమలు చేయడం.. పన్ను వసూళ్లలో మెరుగుదలకు దోహదపడ్డాయి. 
  • 2021–22 మొదటి ఎనిమిది నెలల్లో పరోక్ష పన్నుల రాబడిలో గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు 38.6 శాతం పెరుగుదల ఏర్పడింది. తయారీ రంగం, వినియోగ డిమాండ్‌లో పెరుగుదల కారణంగా.. వస్తు, సేవల దిగుమతులు పెరిగి కస్టమ్స్‌ వసూళ్లు పెరిగాయి. ఏప్రిల్‌–నవంబర్‌ 2019తో పోల్చినప్పుడు తదుపరి సంవత్సరం ఇదే కాలంలో 65 శాతం, ఏప్రిల్‌–నవంబర్‌ 2020తో పోల్చినప్పుడు 2021లో ఇదే కాలంలో కస్టమ్స్‌ రాబడిలో 100 శాతం పెరుగుదల ఏర్పడింది.
  • ఆర్థిక వ్యవస్థ పురోగమనం కారణంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు,సేవల పన్ను ముఖ్య రాబడి ఆధారంగా నిలిచింది. ఏప్రిల్‌–నవంబర్‌ 2021లో కేంద్ర ప్రభుత్వ జీఎస్‌టీ వసూళ్లు మొత్తం బడ్జెట్‌ అంచనాలో 61.4 శాతం. ఏప్రిల్‌–డిసెంబర్‌ 2021లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.10.74లక్షల కోట్లుగా నమోదైంది. 2021–22 మూడవ త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్‌టీæవసూళ్లు రూ.1.30 లక్షల కోట్లు. నెలవారీ సగటు జీఎస్‌టీ వసూళ్లు 2017–18లో 0.9 లక్షల కోట్లు కాగా 2021–22(డిసెంబర్‌ వరకు) రూ.1.19 లక్షల కోట్లకు పెరిగింది. జీఎస్‌టీ ఎగవేతదారులపై చర్యలు, ఆర్థిక పురోగమనం, ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన అనేక విధానపర మార్పులు జీఎస్‌టీ వసూళ్ల పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి.
  • పన్నేతరరాబడి 2021–22 మొదటి ఎనిమిది నెలలో క్రితం సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు 79.5 శాతం పెరుగుదల ఏర్పడింది. డివిడెండ్లు, లాభాలలో పెరుగుదల కారణంగా పన్నేతర రాబడి పెరిగింది. 2021–22 బడ్జెట్‌ డివిడెండ్లు, లాభాలను రూ.1.04 లక్షల కోట్లగా ప్రతిపాదించగా.. మొదటి ఎనిమిది నెలల్లో వీటిద్వారా రూ.1.28 లక్షల కోట్ల రాబడి సమకూరింది. ఈ మొత్తం పెరుగుదల రిజర్వ్‌ బ్యాంకు.. కేంద్ర ప్రభుత్వానికి రూ.0.99 లక్షల కోట్ల మిగులును బదిలీ చేయడంతో సాధ్యమైంది. రికవరీ అయిన రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబడి.. రుణేతర మూలధన రాబడిలో భాగంగా ఉంటాయి.
  • 2021–22 బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.1.75లక్షల కోట్లుగా ప్రతిపాదించగా.. జనవరి 24,2022 నాటికి రూ.9,330 కోట్లను మాత్రమే ప్రభుత్వం సమీకరించింది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం’,‘అసెట్‌ మానిటైజేషన్‌ విధానం’ ద్వారా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కట్టుబడినట్లుగా స్పష్టమవుతోంది. ప్రైవేటీకరణను వేగవంతం చేసే విధానంలో భాగమే ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ.

ప్రస్తుత ధరల వద్ద జి.డి.పి. పరంగా అమెరికా తర్వాతి స్థానం పొందిన దేశంఏది?

వ్యయ ధోరణులు

దీర్ఘకాలంలో ఉత్పత్తిపై ప్రభావం చూపించే పునర్నిర్మాణం, రంగాల వారీగా.. వ్యయ ప్రాధాన్యత ఆధారంగా..2021–22లో ప్రభుత్వ వ్యయ విధానం రూపుదిద్దుకొంది. ఏప్రిల్‌–నవంబర్‌ 2021లో కేంద్ర ప్రభుత్వ వ్యయం గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చినప్పుడు 8.8 శాతం పెరుగుదల నమోదయింది. ఇదే కాలంలో రెవెన్యూ వ్యయంలో పెరుగుదల 8.2 శాతం కాగా వడ్డీయేతర రెవెన్యూ వ్యయంలో పెరుగుదల 4.6 శాతం. ముఖ్య సబ్సిడీలపై వ్యయం ఏప్రిల్‌–నవంబర్‌ 2021లో రూ.2.31లక్షల కోట్లు. ఆహార సబ్సిడీపై జరిగిన వ్యయం ఎక్కువ. ఏప్రిల్‌–నవంబర్‌ 2020తో పోల్చినప్పుడు 2021లో ఇదే కాలంలో మూలధన వ్యయంలో పెరుగుదల 13.5 శాతం. 2021–22 ఆర్థిక సంవత్సరం రెండవ అవస్థాపనా–సాంద్రత రంగాలైన రోడ్లు, హైవేలు, రైల్వేస్, హౌసింగ్, పట్టణ వ్యవహారాలపై మూలధన వ్యయం అధికంగా ఉంటుంది. రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ 2021–22 బడ్జెట్‌ ప్రకారం–జీడీపీలో రెవెన్యూ లోటును 5.1 శాతంగా, ద్రవ్యలోటును 6.8 శాతంగా, ప్రాథమిక లోటును 3.1 శాతంగా ప్రతిపాదించారు.

రాష్ట్రాల విత్త స్థితిగతులు

  • 2020–21 సవరించిన అంచనాలు, 2021–22 బడ్జెట్‌ అంచనాలను పరిశీలించినప్పుడు.. రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో పొందుపర్చిన 3 శాతం పరిమితి కంటే అధికంగా నమోదయింది. రాష్ట్రాల రెవెన్యూలోటు 2018–19లో జీడీపీలో 0.1 శాతం కాగా 2020–21లో 2శాతానికి పెరిగింది. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల రాబడి క్షీణించి.. వ్యయాలలో పెరుగుదల ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల రుణ పరిమితిని సడలించింది. రాష్ట్రాల నికర రుణ పరిమితి 2020–21లో ఆయా రాష్ట్రాల జీఎస్‌డీపీలో 5 శాతంగా, 2021–22లో 4 శాతంగా అనుమతించడం జరిగింది. 
  • గత సంవత్సరంతో పోల్చినప్పుడు 2021–22 బడ్జెట్‌ అంచనాలలో రాష్ట్రాల సొంత పన్ను రాబడిలో 28.5 శాతం, సొంత పన్నేతర రాబడిలో 36 శాతం, రెవెన్యూ వ్యయంలో 12.1 శాతం, మూలధన వ్యయంలో 30.5 శాతం అధిక మొత్తాన్ని ప్రతిపాదించారు. విద్యుత్‌ రంగంలో ప్రగతి ఆధారంగా రాష్ట్రాలు జీఎస్‌డీపీలో అదనంగా 0.50 శాతం అదనపు రుణాన్ని సమీకరించుకోవడానికి పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. విద్యుత్‌ రంగంలో ఆర్థిక సమర్దత మెరుగుపరచుకోవడం, విద్యుత్‌ వినియోగంలో పెరుగుదలను ప్రోత్సహించడం లక్ష్యాలుగా రాష్ట్రాలు అదనపు రుణాన్ని సమీకరించుకోవడాన్ని అనుమతించడం జరిగింది.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275ప్రకారం–రాష్ట్రాలకు post Devolution రెవెన్యూ లోటు గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుంది. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం–ఈ గ్రాంట్లను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేస్తుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు ఆర్థిక సంఘం రూ.1.18 లక్షల కోట్ల మొత్తాన్ని post devoluti-on Revenue deficit గ్రాంట్‌గా సిఫార్సు చేయగా.. జనవరి 6 2022 నాటికి రూ.98,710 కోట్లను రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది.

డా. తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్‌

ఐదో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

Published date : 15 Jun 2022 07:40PM

Photo Stories