Geography Material for Groups Exams : సారవంత మైదానాలను ఏర్పరిచే సంక్లిష్ట ప్రక్రియ..!
ఉపరితలంపై ప్రవహించే నదులు, హిమనీ నదాలు, పవనాలు, వేలా తరంగాల లాంటి బాహ్య బలాల ప్రభావం
వల్ల భూపటల శిలలు శైథిల్యమవడాన్నే ‘క్రమక్షయం’గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం భూగోళం కవోష్ణ యుగంలో
ఉండటం వల్ల నదులు ప్రధాన క్రమక్షయ కారకాలు. ఎత్తైన పర్వతాలు, పీఠభూములు నదుల క్రమక్షయ ప్రక్రియ
వల్ల క్రమంగా శిథిలమై వివిధ రకాల భూస్వరూపాలు రూపాంతరం చెందుతున్నాయి.
నదులు – క్రమక్షయం
నదులు శైథిల్య శిలా పదార్థాన్ని రవాణా చేసి లోతట్టు హరివాణాలు లేదా సముద్ర భూతలంపై నిక్షిప్తం చేస్తాయి. అందువల్ల వివిధ రకాల క్రమక్షయ, నిక్షేపణా భూ స్వరూపాలు ఏర్పడతాయి. గంగా–సింధు మైదానం, నైలు నదీ లోయ, మిసిసిప్పీ – మిస్సోరి మైదానం తదితరాలను ప్రపంచంలోని ప్రధాన నదీ హరివాణాలు, నదీ భూ దృశ్యాలకు (Fluvial landscape) ఉదాహరణగా పేర్కొనవచ్చు. నదులు క్రమక్షయ శక్తి వల్ల అవి ప్రవహించే లోయలను కోతకు గురి చేస్తాయి. ఈ కోత క్షితిజ లంబ దిశలో (అథో క్రమక్షయం) లేదా క్షితిజ సమాంతర దిశలో (పార్శ్వ క్రమక్షయం) ఉండవచ్చు. శైథిల్య శిలా పదార్థాన్ని నదులు తమతో పాటు ద్రావణం రూపంలో, చోదక రూపంలో లేదా తేలియాడటం ద్వారా రవాణా చేస్తాయి. నదీ భారం బాగా అధికమైనప్పుడు, నదీ వేగం క్షీణించినప్పుడు శిలా పదార్థం అనువైన ప్రదేశాల్లో నిక్షిప్తమవుతుంది. శిలా పదార్థాన్ని కణాల పరిమాణం ఆధారంగా వేరు చేసిన తర్వాతే నది నిక్షేపిస్తుంది. అందువల్ల నదీ హరివాణం ఎగువ భాగంలో స్థూల రేణువులతో కూడిన ఇసుక, మధ్య భాగంలో సిల్ట్, చివరగా నదీ ముఖద్వారాల వద్ద సూక్ష్మ రేణు నిర్మితమైన బంకమన్ను ఉంటుంది.
క్రమక్షయ దశలు
నదులు.. అవి ఆవిర్భవించిన ఎత్తైన పర్వతాలు, పీఠభూముల ప్రాంతాల్లో వేగంగా ప్రవహిస్తూ అధిక క్రమక్షయ శక్తి కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతాల్లో నదులు కేవలం క్రమక్షయాన్ని.. ముఖ్యంగా అథో క్రమక్షయాన్ని మాత్రమే కలిగిస్తాయి. పర్వతాలు, పీఠభూముల ద్వారా మైదానాలను చేరిన తర్వాత నదుల క్రమక్షయ శక్తి బాగా క్షీణిస్తుంది. ఈ సమయంలో అవి పార్శ్వ క్రమక్షయం మాత్రమే చేస్తాయి. క్రమంగా ఇది స్వల్ప పరిమాణంలో నిక్షేపణ చేసే దశకు చేరుకుంటుంది. సముద్రాల్లో కలిసే దశలో నదులు అధిక నదీ భారం వల్ల పెద్ద మొత్తాల్లో నిక్షేపణ చేస్తాయి. క్రమక్షయం పూర్తిగా స్తంభించిపోతుంది.
☛Follow our YouTube Channel (Click Here)
భూ స్వరూపాలు
నదీ హరివాణంలో ఆవిర్భావ ప్రాంతం నుంచి నదీ ముఖ ద్వారం మధ్య అనేక రకాల భూ స్వరూపాలను గమనించవచ్చు. ఆవిర్భావ ప్రాంతాల్లో క్రమక్షయ భూ స్వరూపాలు, మధ్య భాగంలో క్రమక్షయ, నిక్షేపణా భూ స్వరూపాల మిశ్రమం, ముఖద్వారాల వద్ద నిక్షేపణ భూ స్వరూ΄ాలు స్పష్టంగా కనిపిస్తాయి. నది ఎగువ భాగాల్లో కింద పేర్కొన్న క్రమక్షయ భూ స్వరూపాలు ఏర్పడతాయి.
ఠి ’V’ ఆకారపు లోయలు, గార్జ్‌లు, కానియన్‌లు
ఠి నదీ గ్రహణం, ప్లంజ్ పూల్స్
ఠి జలపాతాలు, రాపిడ్స్, కాస్కేడ్స్
క్షితిజ లంబదిశలో అథో క్రమక్షయం వల్ల నదుల్లో లోతైన ’V’ ఆకారం సంతరించుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇవి చాలా లోతుగా ఉండి నిటారు వాలులు ఏర్పడినప్పుడు గార్జ్‌లు, కానియన్లుగా పిలుస్తారు. ఉదాహరణకు హిమాలయ నదులు శివాలిక్ కొండలు దాటేటప్పుడు లోతైన గార్జ్‌ల ద్వారా ప్రవహిస్తాయి. బ్రహ్మపుత్రా నది భారతదేశంలోకి అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘సయాడియా’ గార్జ్ నుంచి ప్రవేశిస్తుంది. యూఎస్‌ఏలోని కొలరాడో నది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘గ్రాండ్ కానియన్’ నుంచి ప్రవహిస్తుంది.
ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అనేక నదులు వేగంగా ప్రవహిస్తూ భారీ జలపాతాలను ఏర్పరుస్తాయి. సహ్యాద్రి కొండల్లోని శరావతి నది మన దేశంలోకెల్లా ఎత్తైన ‘జోగ్’ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. నయాగరా, లివింగ్ స్టోన్, ఏంజల్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ జలపాతాలు నదుల క్రమక్షయం వల్లే ఏర్పడ్డాయి. కావేరి నది ఎత్తైన కర్ణాటక పీఠభూమిని వదిలి తమిళనాడు పీఠభూమిని చేరేటప్పుడు శివసముద్రం, హోగెంకల్ జలపాతాలు ఏర్పడ్డాయి. ఆవిర్భావ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నదులు సమాంతరంగా ప్రవహించే చిన్న నదులను క్రమంగా తమలో కలుపుకుంటాయి. ఈ ప్రక్రియనే ‘నదీ గ్రహణం’గా పిలుస్తారు. భగీరథీ నది సమీపంలోని అలక్‌నందా నదిని కలుపుకోవడం ద్వారా గంగానది ఆవిర్భవిస్తుంది. సమాంతర నదులను వేరుచేసే ఎత్తైన ప్రాంతాన్ని వేగంగా ప్రవహించే నది శిథిలం చేయడంతో నదీ గ్రహణం సంభవిస్తుంది. ప్రవాహ దిశ మరలించిన చిన్న నది లోయ ఎండిపోతుంది.
గిరిపద మైదానాలు
నదులు పర్వతాలను వీడి మైదానాలను చేరినప్పుడు అకస్మాత్తుగా తమ గతిశక్తిని కోల్పోవడంతో పర్వతపాదాల వద్ద కొంత శిథిల శిలా పదార్థాన్ని నిక్షేపిస్తాయి. ఈ రకంగా ఏర్పడిన మైదానాలనే ‘గిరిపద మైదానాలు’ (Peidmont plains) గా పిలుస్తారు. శివాలిక్ కొండలు –గంగా మైదానానికి సంధి ప్రాంతంలో హిమాలయ నదీ నిక్షేపణం వల్ల ఏర్పడిన గిరిపద మైదానాన్ని భాబర్, టెరాయి మండలాలుగా విభజిస్తారు. భాబర్ మండలం గులకరాళ్లు, ఇసుకతో కూడి ఉంటుంది. అధిక సచ్ఛిద్రత వల్ల భాబర్ మండలంలో హిమాలయ నదుల నీరు ఇంకిపోయి లోయలు ఎండిపోతాయి. టెరాయి మండలంలో ఇంకిన నీరు పైకి ఉబికి వచ్చి చిత్తడి నేలలు ఏర్పడతాయి. టెరాయి మండలంలో దట్టమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
☛ Follow our Instagram Page (Click Here)
మైదాన ప్రాంతాల్లో పార్శ్వ క్రమక్షయం వల్ల విశాలమైన 'U' ఆకారపు లోయల నుంచి నదులు ప్రవహిస్తాయి. కఠిన శిలా ప్రాంతాలను క్రమక్షయం చేసే శక్తి లేకపోవడంతో నదులు వంకలు తిరిగి ప్రవహిస్తాయి. ఈ నదీ మార్గాలను ‘నది వక్రతలు’గా పిలుస్తారు. 'U' ఆకారపు లోయలతో కూడిన వక్ర తల ద్వారా ప్రవహించేటప్పుడు అంతర్ వక్రతల తలాల వెంట శిలా పదార్థం నిక్షేపితమై ఇసుక దిబ్బలుగా ఏర్పడతాయి. ఈ ఇసుక దిబ్బలనే ‘స్పర్స్’ అంటారు. నదుల్లోకి వరదలు వస్తే లోయను వీడిన నది ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది. ఈ వరద నీటిలో ఉన్న శిలా పదార్థం నదీ లోయకు ఇరువైపులా నిక్షిప్తమవుతుంది. దీనివల్ల ఏర్పడే మైదానాలను ‘వరద మైదానాలు’ అంటారు. ఇవి చాలా సారవంతమైనవి. గంగా–సింధు–బ్రహ్మపుత్ర మైదానం అనేక వరద మైదానాలతో కూడి ఉంది. గంగా మైదానంలోని వరద మైదానాన్ని ‘ఖాదర్’, భంగర్ అనే రెండు భాగాలుగా విభజిస్తారు. వరద మైదానంలో నదీ లోయకు సమీపంలోని లోతట్టు ప్రాంతాన్ని ఖాదర్ మైదానంగా పిలుస్తారు. ఇది తరచుగా వరద ముంపునకు గురవడం వల్ల నవీన ఒండ్రుమట్టితో నిండి ఉంటుంది. వరద మైదానంలో లోయకు దూరంగా ఉన్న ఎత్తైన ప్రాంతాలను ‘భంగర్ మైదానం’గా పిలుస్తారు. ఈ మండలం పురాతన ఒండ్రుమట్టితో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో వరద ముంపు తక్కువ. వరద మైదానంలో అర్ధ చంద్రాకృతిలో ఉండే ఆక్స్‌బే సరస్సులు కూడా ఏర్పడతాయి. నదీ లోయలకు ఇరువైపులా ఒండ్రుమట్టి నిక్షేపణం వల్ల ఏర్పడే ఎత్తైన ఇసుకదిబ్బలను సహజ లెవీలుగా పిలుస్తారు. ఇవి వరద మైదానాన్ని భవిష్యత్‌లో సంభవించే వరదల నుంచి కాపాడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ లెవీలు, ఉప నదుల సంగమాన్ని నిరోధిస్తాయి. ఉప నదులు సహజ లెవీలకు సమాంతరంగా ప్రవహించి చాలా దూరం తర్వాత ప్రధాన నదిలో కలుస్తాయి. ఈ రకమైన సంగమ ప్రాంతాలను ‘యాజూ సంగమాలు’గా పిలుస్తారు.
నదీ ముఖద్వారాలు
నదులు.. సముద్రాల్లో కలిసే ప్రాంతాల (నదీ ముఖద్వారాలు) వద్ద ఒండ్రుమట్టిని లోయల్లోనే నిక్షేపించడంతో శాఖోపశాఖలుగా చీలిపోతాయి. ఈ శాఖల మధ్య ఒండ్రుమట్టి నిక్షేపణం వల్ల ఏర్పడే మైదానాలను ‘డెల్టాలు’ అంటారు. ఇవి చాలా సార వంతమైనవి. అనాదిగా డెల్టా ప్రాంతాల్లో సాంద్ర వ్యవసాయం అభివృద్ధి చెందింది. గోదావరి నది రాజమండ్రికి దిగువ మూడు ప్రధాన పాయలుగా చీలిపోతుంది. ఈ పాయల మధ్య గోదావరి డెల్టా ఏర్పడింది. గంగా–హుగ్లీ–బ్రహ్మపుత్ర డెల్టా పక్షిపాద ఆకారంలో ఉంటుంది. కృష్ణా డెల్టా డిజిటేట్ తరగతి కి, గోదావరి డెల్టా లోబేట్ రకానికి చెందింది. నర్మద, తపతి నదులు వాటి ముఖద్వారాల వద్ద కాకుండా శైథిల్య శిలా పదార్థాన్ని సముద్ర భూతలంపై నిక్షేపిస్తాయి. అందువల్ల అవి డెల్టాలను ఏర్పరచవు. వీటి ముఖద్వారాలను ‘ఎస్చ్యురీలు’గా పిలుస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
హిమనీనదాలతో క్రమక్షయం..
కదిలే హిమ భాగాలనే హిమనీనదాలుగా పిలుస్తారు. ఇవి వేగంగా ప్రవహించే పర్వతీయ (లోయ) లేదా నెమ్మదిగా కదిలే విశాలమైన ఖండాంతర హిమనీనదాల రూపంలో ఉండవచ్చు. హిమనీనదాలు ఉత్పాతనం, అపఘర్షణ లేదా ఫ్రాస్ట్ వెడ్జింగ్ ప్రక్రియల ద్వారా పటల శిలలను శైథిల్యం చేస్తాయి. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, అంటార్కిటికా లాంటి ధ్రువ ప్రాంతాలు, ఆల్ప్స్–హిమాలయాల లాంటి ఎత్తైన పర్వత శిఖరాల ప్రాంతాల్లో హిమనీనద క్రమక్షయం ఉంది. ఉత్తర అమెరికాలోని మహా సరస్సుల ప్రాంతం, ఐరోపా, సైబీరియా హిమనీనద భూదృశ్యాలకు మంచి ఉదాహరణలు. శైథిల్య శిలా పదార్థాన్ని హిమనీనదాలు పరిమాణాన్ని అనుసరించి వేరు చేయకుండా నిక్షేపిస్తాయి. అంటే ఈ నిక్షేపాల్లో స్థూల, సూక్ష్మ రేణువులు గుట్టగా ఉంటాయి.
పర్వత వాలులపై ప్రవహించే హిమనీనదాలు లోతు తక్కువ ఉన్న విశాలమైన 'U'ఆకారపు లోయల ద్వారా ప్రవహిస్తాయి. వీటి క్రమక్షయ ప్రభావంతో పర్వత వాలుల వెంట పడక కుర్చీ ఆకారంలో ఉండే లోతైన గుంటలు ఏర్పడతాయి. వీటిని ‘సర్క్’ (Cirque) అంటారు. పర్వతం లేదా కొండ వివిధ వాలులపై వేర్వేరు హిమనీనదాలు ప్రవహిస్తూ సర్క్‌లను ఏర్పాటు చేస్తుంటాయి. వివిధ తలాలపై ఏర్పడిన సర్క్‌లు విశాలమై, క్రమంగా కొండను పదునైన అంచుతో కూడిన పిరమిడ్‌గా మారుస్తాయి. వీటిని ఏరేట్‌లు అంటారు. ఏరేట్‌లు మరింత క్రమక్షయం చెంది శృంగాకారంలోకి మారతాయి. వీటిని ‘హార్న్’గా వ్యవహరిస్తారు. ఉదాహరణకు ఆల్ఫ్స్ పర్వతాల్లోని ‘మాటర్ హార్న్’ శృంగాలు మరింత హిమనీనద క్రమక్షయానికి లోనవడంతో కొండ దాదాపుగా అదృశ్యమై ‘కనుమ’గా రూపోందుతుంది. హిమాలయాల్లోని కారంకోరం, షిప్కిలా, జోజిలా, బనిహాల్ కనుమలు ఈ కోవకు చెందినవే. ఖండ భాగాల్లో ప్రవహించే హిమనీనదాలు వాటి ప్రవాహ మార్గంలోని పెద్ద పెద్ద శిలలను క్రమక్షయం చేయడం వల్ల క్రాగ్ అండ్ టెయిల్, రోబే మాంటేన్ లాంటి భూ స్వరూపాలు ఏర్పడతాయి. క్రాగ్ అండ్ టెయిల్‌లో కఠిన శిలా భాగం క్రమక్షయాన్ని నిరోధించడంతో నిట్రాలుగా ఏర్పడగా, మృదువైన శిలా భాగంలో తిన్నని వాలుగా ఏర్పడుతుంది. హిమనీ నది ప్రవాహ దిశలో శిలల తలాలపై అపఘర్షణ వల్ల అవి మృదువుగా తయారవుతాయి. పరాన్ముఖ దిశలో ఉత్పాతన వల్ల గరుకైన తలాలు ఏర్పడతాయి. ఈ రకంగా ఒకవైపు మృదు, ఇంకోవైపు గరుకైన తలాలతో కూడిన శిలలనే ‘రోబేమాంటేన్’గా పిలుస్తారు.
మొరైన్‌లు
హిమనీనదాలు శిలా పదార్థాన్ని తీసుకొచ్చి అనువైన ప్రాంతాల్లో నిక్షేపించడం వల్ల వివిధ రకాల భూ స్వరూ΄ాలు ఏర్పడతాయి. రేఖీయంగా ఎత్తు తక్కువలో ఉండే దిబ్బల లాంటి హిమనీనద నిక్షేపాలను ‘మొరైన్’లుగా పిలుస్తారు. ఇవి పొరలతో కాకుండా వివిధ పరిమాణాల రేణువులతో కూడి ఉంటాయి. కోడిగుడ్డు ఆకారంలో ఉండే నిక్షేపణా భూ స్వరూపాలను ‘డ్రమ్లిన్లు’ అంటారు. ఉత్తర ఐర్లాండ్ ప్రాంతంలో కొన్ని వేల సంఖ్యలో డ్రమ్లిన్‌లు వరసగా అమరి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ‘ఎగ్ బాస్కెట్ కంట్రీ’ అంటారు.
హిమనీనదాల అంత్య దశలో మంచు క్రమంగా కరిగి నీరుగా మారడం ప్రారంభమవుతుంది. అందువల్ల అంత్య దశలో హిమనీనదాల్లో మంచుతో పాటు నీరు కూడా ప్రవహిస్తుంది. దీంతో హిమనీనద క్రమక్షయానికి నదీ క్రమక్షయం కూడా తోడవుతుంది. నీటి ప్రక్రియ వల్ల హిమనీనదాల అంత్య దశలో రేఖీయంగా ఉండే పొడవైన దిబ్బల మాదిరిగా మెత్తని ఇసుక నిక్షిప్తమవుతుంది. ఈ ఇసుక దిబ్బలను ‘ఎస్కర్లు’గా పిలుస్తారు. ఇవి కొన్ని కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటాయి. ఇవి హిమనీనద లోయలకు సమాంతరంగా ఏర్పడతాయి. వీటిలో కేవలం సూక్ష్మ ఇసుక రేణువులు మాత్రమే ఉంటాయి.
ఎర్రాటిక్స్
తిన్నని వాలులతో కూడిన శంఖు ఆకారపు ఒండ్రుమట్టి దిబ్బలు కూడా హిమనీనద నిక్షేపణ వల్ల అంత్య దశలో ఏర్పడతాయి. వీటిని ‘కేమ్స్’గా పిలుస్తారు. ఇవి సాధారణంగా హిమనీనద ముఖద్వారం వద్ద ఏర్పడతాయి. హిమనీనదాలు తమతో పాటు పెద్ద బండరాళ్లను చాలా దూరం తీసుకొచ్చి అంత్య దశలో నిక్షేపం చేస్తాయి. ఈ బండరాళ్లకు, స్థానిక శిలలకు పోలికలుండవు. వీటిని ‘ఎర్రాటిక్స్’ అంటారు. ‘ఎర్రాటిక్స్’ హిమనీనదాల ప్రయాణ దిశను సూచిస్తాయి. అంత్యదశలో మెత్తని గులకరాళ్లు ఒండ్రుమట్టి నిక్షేపణం వల్ల ఏర్పడే సమతల మైదానాలను ‘అవుట్ వాష్ మైదానాలు’ అంటారు. వీటి ఏర్పాటులో నీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మైదానంలో హిమనీనదం అనేక చిన్న పాయలుగా చీలిపోతుంది. ఈ మైదానంలో ఉండే చిన్నచిన్న గుంటల లాంటి హరివాణాలను ‘కెటిల్ రంధ్రాలు’ అంటారు.
Tags
- geography material for groups exams
- Competitive Exams
- appsc and tspsc geography
- geography material
- preparatory material for groups exams in geography
- Government jobs exams
- groups exams preparations
- appsc and tspsc groups
- appsc groups material
- APPSC Geography
- Government Jobs
- police jobs
- tspsc geography
- tspsc groups material in geography
- Education News
- Sakshi Education News