Skip to main content

Geography for Groups Exams : ఎడారీకరణ సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలేవి..?

ఒక ప్రాంతంలోని సగటు వాతావరణ పరిస్థితులనే శీతోష్ణస్థితిగా వ్యవహరిస్తారు. భారతదేశం శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్‌లో ఆరు రుతువులను గుర్తించవచ్చు. అంటే.. ప్రతి రెండు నెలలకు వాతావరణ మార్పులు సంభవిస్తాయి.
APPSC, TSPSC and police jobs exams material and bit banks  Six seasons recognized in India Climate changes every two months in India Unique seasonal variations in India

భారతదేశ శీతోష్ణస్థితిని ‘రుతుపవన శీతోష్ణస్థితి’ అంటారు. శాస్త్రీయంగా పరిశీలిస్తే భారతదేశం ‘ఉష్ణో–ఆర్థ్ర శీతోష్ణస్థితి మండలం’ కిందకు వస్తుంది. కానీ సువిశాల భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కో ప్రాంతంలో, ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాయి. సువిశాల విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం, రుతుపవనాలు, భౌగోళిక ఉనికి లాంటి అంశాలు వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక(ఉదా.చిరపుంజి,మాసిన్‌రామ్‌), మరికొన్ని ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది (ఉదా: థార్‌ ఎడారి). వేసవిలో దక్కన్‌ పీఠభూమి, పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంతాలు 45ని సెంటీగ్రేడ్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి భిన్నంగా అదే సమయంలో ఉత్తరాన హిమాలయ పర్వత సానువుల్లో వాతావరణం చల్లగా ఉంటుంది.
వాతావరణ శాస్త్రజ్ఞులు భారత శీతోష్ణస్థితిని 4 భాగాలుగా విభజించారు. 1. రుతు పవన పూర్వకాలం(మార్చి15–జూన్‌ 15) 2. నైరుతి రుతుపవన కాలం (జూన్‌ 15 –సెప్టెంబర్‌ 15) 3. ఈశాన్య రుతు పవన కాలం (సెప్టెంబర్‌ 15 –డిసెంబర్‌ 15) 4. రుతుపవన అనంతర కాలం (డిసెంబర్‌ 15–మార్చి 15). 
రుతుపవన పూర్వ కాలం
రుతుపవన పూర్వ కాలం (మార్చి 15 –జూన్‌15)లో దేశమంతటా ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. ఇది మండు వేసవి. ఈ సమయంలో సంవహన గాలులు వీస్తాయి. ఈ పవనాలను ఆంధీ, లూ, కాల్‌బైశాఖీ, మామిడి జల్లులు లాంటి స్థానిక పేర్లతో పిలుస్తారు. ఈ వేడిగాలులకు అప్పుడప్పుడూ చిరుజల్లులు, గాలిదుమ్ము కూడా తోడవుతాయి. ఈ కాలంలో ద్వీపకల్ప పీఠభూములు, వాయవ్య భారతదేశం బాగా వేడెక్కడంతో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించటానికి ఉపకరిస్తుంది.
నైరుతి రుతుపవన కాలం 
నైరుతి రుతుపవన కాలం(జూన్‌15– సెప్టెంబర్‌15)లో అరేబియా సముద్రం, హిందూమహా సముద్రాల నుంచి నైరుతి రుతు పవనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, దేశమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వార్షిక వర్షపాతంలో సుమారు 2/3 వంతు ఈ మూడు నెలల కాలంలోనే సంభవిస్తుంది. భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతు పవనాలు మెుదటగా జూన్‌ మెుదటి వారంలో మలబార్‌ తీరాన్ని తాకుతాయి. క్రమంగా ఇవి జూలై 15 కల్లా దేశమంతా వ్యాపిస్తాయి. నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా(అరేబియా సముద్రం, బంగాళాఖాతం) దేశంలోకి ప్రవేశిస్తాయి. నైరుతి రుతు పవనాలు ఎత్తయిన పర్వతాలు, పీఠభూములను దాటే సమయంలో పవనాభిముఖదిశలో ఉండే ప్రాంతాల్లో అధిక వర్షపాతం ఉంటుంది. కానీ అదే సమయంలో పవనపరాన్ముఖదిశలో ఉండే ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం ఉండటంతో అవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఉదాహరణకు అరేబియా సముద్రం నుంచి ప్రవేశించే నైరుతి రుతుపవనాలను పశ్చిమ కనుమలు అడ్డుకుంటాయి. దీనివల్ల మలబార్, కొంకణ్‌ తీరాల్లో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఇవి అతి ఆర్ధ్ర మండలాలు. కానీ సహ్యాద్రి కొండలకు వెనుక ఉన్న దక్కన్‌ పీఠభూమికి చెందిన ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, మరాట్వాడా, విదర్భ ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. అందువల్ల ఇవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఈ ప్రాంతాలు ఎడారీకరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో వర్షపాత పరిమాణంలో అనిశ్చితి కూడా అధికంగా ఉంది. ఈ మండలం తరచూ తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటోంది.
విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతం నుంచి ప్రవేశించే నైరుతి రుతు పవనాలు తూర్పు, ఈశాన్య భారతదేశం, గంగా మైదానాల్లో వర్షాన్నిస్తాయి. ఈ పవనాలను పూర్వంచల్‌ కొండలు, శివాలిక్‌ పర్వతాలు అడ్డుకుంటున్నాయి. దాంతో పవనాభిముఖదిశలోని తెరాయి మండలం, మేఘాలయలోని షిల్లాంగ్‌ పీఠభూమి, నాగాలాండ్‌ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గారో, ఖాసీ కొండల పవనాభిముఖదిశలో ఉన్న మాసిన్‌రామ్, చిరపుంజి ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతాలు నైరుతి రుతు పవనాలకు సమాంతరంగా ఉండటంతో ఇవి నైరుతి రుతుపవనాలను అడ్డగించలేవు. అదే సమయంలో పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంత ఊర్థ్వ ట్రోపో ఆవరణంలో ఉన్న చల్లని స్థిర వాయురాశి నైరుతి రుతు పవనాలను పైకి లేవనీయకుండా అదిమిపెడతాయి. ఈ కారణాల వల్ల పశ్చిమ రాజస్థాన్‌లో వర్ష΄ాతం అత్యల్పంగా ఉండి, శుష్క మండలం ఏర్పడింది. థార్‌ ఎడారి ఏర్పడటానికి ప్రధాన కారణం.
దక్షిణార్ధగోళంలోకి సూర్యుడు
సెప్టెంబర్‌ మధ్య నుంచి సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి ప్రవేశిస్తాడు. దీంతో భారత్‌లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. భారత భూభాగంపై విస్తరించి ఉన్న అల్ప పీడనం క్రమంగా క్షీణించి, ఆ స్థానంలో అధిక పీడనం బలపడుతుంది. ఈ రకంగా నైరుతి రుతు పవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమించే రుతుపవనాలు శుష్కంగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను పీల్చుకొని, ఆర్ధ్రగా మారుతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో వీస్తున్న ఈశాన్య వ్యాపారపవనాలు.. తిరోగమన రుతు పవనాలను ఈశాన్య రుతు పవనాలుగా రూపాంతరం చెందిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల్లో వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా గమనించాల్సిందేమిటంటే.. తమిళనాడు ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు రాకుండా.. నీలగిరి, అన్నామలై, ఏలకుల కొండలు అడ్డగిస్తాయి. అందువల్ల నైరుతి రుతుపవన కాలంలో తమిళనాడులో వర్షం అంతగా కురవదు. 
ఈశాన్య రుతుపవనాలతో ఈ ప్రాంతం విస్తారంగా వర్షాన్ని పొందుతుంది. డిసెంబర్‌ 15కల్లా దేశమంతటా శీతాకాలం ప్రారంభమవుతుంది. సైబీరియా నుంచి వచ్చే అతిశీతల పవనాలు.. గంగా–సింధూ మైదానంలోకి  రాకుండా హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయి. లేకపోతే వీటి ప్రభావం వల్ల గంగా– సింధూ మైదానంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకొని, నదులు గడ్డకట్టి రబీ సాగు సాధ్యమయ్యేది కాదు. డిసెంబర్, జనవరిల్లో హిమాలయాల నుంచి వీచే శీతల పవనాల వల్ల గంగా–సింధూ మైదానంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. డిసెంబర్‌–ఫిబ్రవరి కాలం సాధారణంగా దేశమంతా శుష్కంగా ఉంటుంది. కానీ ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం నుంచి వాయవ్య భారతదేశంలోకి  కవోష్ణ చక్రవాతాలు ప్రవేశిస్తాయి. వీటిని పశ్చిమ అలజడులుగా పిలుస్తారు. వీటి ప్రభావం వల్ల దేశ వాయవ్య ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రబీలో సాగయ్యే గోధుమ దిగుబడి పెరగటానికి దోహదపడతాయి.
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు కొన్ని బలపడి ఆయనరేఖా చక్రవాతాలుగా మారి తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. 

Published date : 14 Sep 2024 01:13PM

Photo Stories