Geography for Competitive Exams : ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా పేరొందిన ప్రాంతం ఏది?
➾ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది.
➾ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది
➾ వ్యవసాయ భూమిపై పంటలే కాక పశుపోషణ కూడా ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు.
➾ మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం.
➾ ద్రాక్ష సారాయి తయారీకి ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ ప్రసిద్ధి.
వ్యవసాయం
ప్రముఖ ఆర్థిక భౌగోళిక శాస్త్రజ్ఞుడు విట్లిసీ కింద సూచించిన వ్యవసాయ వ్యవస్థలను గుర్తించాడు.
☛ సాంద్ర జీవనాధార వ్యవసాయం
☛ విస్తార వాణిజ్య వ్యవసాయం
☛ మిశ్రమ వ్యవసాయం
☛ వాణిజ్య పండ్ల తోటల సాగు
☛ మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
☛ ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
☛ వాణిజ్య పాడి మండలం
☛ వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
☛ పోడు వ్యవసాయం
☛ సంచార పశు పోషణ
సాంద్ర జీవనాధార వ్యవసాయం
ఆయనరేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాలకు చెందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో జీవనాధార సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంది. ఇండియా, చైనా, బ్రెజిల్, థాయ్‌లాండ్, మెక్సికో, ఈజిప్ట్ లాంటి వ్యవసాయ ప్రధాన దేశాల్లోని వ్యవసాయ వ్యవస్థలు ఈ కోవకు చెందినవి. సాంద్ర వ్యవసాయంలో పంటల తీవ్రత అధికం. పెద్ద మొత్తాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు నీటిని వాడతారు. వ్యవసాయ భూకమతాల సగటు పరిమాణం చాలా తక్కువ. జనాభాలో అధిక శాతం ప్రత్యక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. కాబట్టి వ్యవసాయ భూమిపై ఒత్తిడి అధికం. ప్రధానంగా ఆహార పంటలను పండిస్తారు. జనాభా, జనసాంద్రతలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా దేశీయంగానే వినియోగిస్తారు. మిగులు లేకపోవడంతో ఎగుమతులు అత్యల్పం. వ్యవసాయంలో శ్రామిక శక్తిని అధికంగా వినియోగిస్తారు. సగటు వ్యవసాయ భూమికి దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ, తలసరి దిగుబడులు కనిష్టంగా ఉంటాయి. వ్యవసాయ జనాభా ప్రధానంగా సన్న, చిన్నకారు రైతుల రూపంలో ఉంటుంది. ఈ వ్యవసాయ మండలంలో రైతుల ఆదాయాలు స్వల్పంగా ఉంటాయి. రైతులు తమ గృహ అవసరాల ఆధారంగా పంటలను ఎంచుకుంటారు.
విస్తార వాణిజ్య వ్యవసాయం
ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అర్జెంటీనాల్లో విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే శ్రామిక జనాభా శాతం చాలా తక్కువ. వ్యవసాయంలో యాంత్రీకరణ స్థాయి అధికం. వ్యవసాయ భూకమతాలు చాలా పెద్దవి. ఉదాహరణకు యూఎస్‌ఏలో సగటు భూకమతాల పరిమాణం 1000–1400 హెక్టార్లు. పంటల తీవ్రత సాంద్ర వ్యవసాయ మండలంతో పోలిస్తే∙తక్కువగా ఉంటుంది.
ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవసాయ మండలంలో పంటలు పండిస్తారు. జనాభా, జనసాంద్రత తక్కువగా ఉండటం వల్ల స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం తక్కువ. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్ల పెద్ద మొత్తాల్లో ఎగుమతి చేస్తారు. విస్తార వాణిజ్య వ్యవసాయం అమల్లో ఉండే యూఎస్‌ఏ, కెనడా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా దేశాలు ప్రపంచంలో ప్రధాన వ్యవసాయ ఎగుమతిదారులు. ఈ మండలాన్ని ప్రపంచ ధాన్యాగారంగా అభివర్ణిస్తారు. ఈ తరహా వ్యవసాయం విస్తారంగా పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉంది.
మిశ్రమ వ్యవసాయం
పంటలతోపాటు పశుపోషణ కోసం కూడా వ్యవసాయ భూమిపై ఆధారపడటాన్ని మిశ్రమ వ్యవసాయంగా వ్యవహరిస్తారు. ఈ తరహా వ్యవసాయంలో పంటల నుంచి వచ్చిన రొట్టను, వ్యవసాయ ఉత్పత్తులను పశుగ్రాసంగా వాడతారు. పశువుల మేతకోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లు ఉండవు. అయితే జీవనాధార వ్యవసాయంలా కాకుండా, ఈ మండలంలో వ్యవసాయ పంటలు, పశుపోషణ వాణిజ్య తరహాలో జరుగుతుంది. పశ్చిమ, మధ్య ఐరోపాల్లో వ్యవసాయం ఈ కోవకు చెందింది. ఈ మండలంలో సగటు వ్యవసాయ భూకమతాల పరిమాణం మధ్యస్థంగా (100–200 హెక్టార్లు) ఉంటుంది.
వాణిజ్య పండ్ల తోటల సాగు
మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు అనుకూలం. కవోష్ణ వాతావరణం వల్ల ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల తోటలు ఇక్కడ సాగవుతాయి. మధ్యధరా తీరంలోని ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాలు, దక్షిణాఫ్రికాలోని కేప్ ప్రాంతం, యూఎస్‌ఏలోని కాలిఫోర్నియా తీరం, మధ్య చిలీ, ఇజ్రాయెల్ తీర ప్రాంతాలు ఈ వ్యవసాయ మండలం కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, నారింజ, దానిమ్మ లాంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను వాణిజ్య పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఇది పెట్టుబడితో కూడుకున్న వ్యవసాయం. పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, సాస్‌లు, ఎండు∙పళ్లను ఈ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. ద్రాక్ష సారాయి తయారీ కూడా పెద్ద పరిశ్రమగా రూపోందింది. ఫ్రాన్స్‌లోని రైన్ లోయ, ఇటలీలోని గెరొన్ బేసిన్ వీటికి ప్రసిద్ధి.
మార్కెట్ గార్డెనింగ్/ట్రక్ ఫార్మింగ్
పారిశ్రామిక విప్లవం తర్వాత ఐరోపా, ఉత్తర అమెరికాల్లో విస్తృత నగరీకరణ జరిగింది. విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ నగరాల్లో తాజా కూరగాయలు, పండ్లకు గిరాకీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో వాయవ్య ఐరోపా, ఉత్తర అమెరికాల్లోని పెద్ద పెద్ద నగరాల సమీపంలో పండ్లు, కూరగాయల సాగు వాణిజ్య పద్ధతిలో ప్రారంభమైంది. రోజూ ఉదయాన్నే ఈ
వ్యవసాయ ప్రాంతాల నుంచి నగరాలకు భారీ ట్రక్కుల ద్వారా తాజా పండ్లు, కూరగాయల రవాణా జరుగుతుంది. అందువల్ల దీన్ని ట్రక్ ఫార్మింగ్ (మార్కెట్ గార్డెనింగ్) అని పిలుస్తారు. ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని నగర జనాభాకు కావాల్సిన తాజా పండ్లు, కూరగాయలను టాస్మానియా దీవి నుంచి బాన్ జలసంధి ద్వారా మర పడవలపై సరఫరా చేస్తారు. అందువల్ల టాస్మానియా దీవిని ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా వ్యవహరిస్తారు.
ఉద్యానవన తోటలు/ఎస్టేట్ ఫార్మింగ్
ఎస్టేట్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఉద్యానవన తోటల పెంపకాన్ని వలస పాలనా కాలంలో వలస రాజ్యాలు ప్రారంభించాయి. ఉష్ణమండల ఆయన రేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లోని దేశాల్లో వలస పాలకులు కాఫీ, తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చెరకు, అరటి పంటలను ఎస్టేట్‌ల రూపంలో సాగు చేయడం ప్రారంభించారు. ఈ రకమైన సాగులో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా నడిపిస్తారు. ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే యాజమాన్యం కేవలం విధాన నిర్ణయాలను మాత్రమే తీసుకుంటుంది. సాగు నిర్వహణ కోసం సుశిక్షుతులైన, సాంకేతిక అర్హతలు ఉన్న వారిని ‘మేనేజర్లు’గా వేతన ప్రాతిపదికన నియమిస్తారు. శ్రామికులను దినసరి లేదా రోజువారీ కూలీ ప్రాతిపదికన వినియోగిస్తారు. లాభాలను ఆశించి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఇప్పటికీ ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు కన్పిస్తాయి.
దేశం | ఎస్టేట్లు | పెట్టుబడి పెట్టిన దేశం |
శ్రీలంక | తేయాకు | బ్రిటన్ |
మలేషియా | రబ్బరు | బ్రిటన్ |
ఇండోనేషియా | రబ్బరు, చెరకు డచ్ | |
దక్షిణాఫ్రికా | చెరకు | డచ్, బ్రిటన్ |
బ్రెజిల్ | కాఫీ | పోర్చుగల్ |
ఫిలిప్పీన్స్ | కొబ్బరి | యూఎస్‌ఏ |
కరేబియన్ దీవులు |
చెరకు, అరటి | యూఎస్‌ఏ |
పశ్చిమ ఆఫ్రికా | కొకురా | ఫ్రాన్స్ |
వాణిజ్య పాడి మండలం
వాయవ్య ఐరోపాలోని సమశీతోష్ణ వాతావరణంలో పచ్చిక బయళ్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ పరిస్థితులు పశుపోషణకు అనుకూలం, జెర్సీ, ఆరిషైర్, స్విస్‌బ్రౌన్, ఆబర్డన్, హార్ట్‌ఫోర్డ్, ఫ్లెచ్‌విక్ లాంటి మేలి రకం పాడి పశువుల జాతులకు ఈ ప్రాంతాలు నిలయాలు. పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుతూ పాడి పశువులను పెంచుతారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోని యూకే, డెన్మార్క్, బెల్జియం, నెదర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్ దేశాల నుంచి పెద్ద మొత్తాల్లో పాడి వస్తువులు ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. డెన్మార్క్‌ను Butter House of Europe గా అభివర్ణిస్తారు. కొపెన్‌హెగెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజూ విమానాల ద్వారా వెన్నను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేస్తారు.
వాణిజ్య పశుమాంస ఉత్పత్తి మండలం (రాంచింగ్)
పశ్చిమ యూఎస్‌ఏలోని రాకీ పర్వత ప్రాంతం, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే దేశాలు రాంచింగ్ (Ranching) మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో మాంసం ఉత్పత్తి కోసం పశువులను పెంచుతారు. పశుపోషణ కోసం ప్రత్యేకంగా పచ్చికబయళ్లను నిర్వహిస్తారు. పశువుల మేత కోసం ప్రత్యేకంగా మొక్కజొన్నను పండిస్తారు. బాగా లావెక్కిన పశువులను యాంత్రిక వధ శాలల్లో సంహరించి, మాంసాన్ని యంత్రాల సహాయంతో శుద్ధి చేసి ప్యాక్ చేస్తారు. మాంసం శుద్ధి, ప్యాకింగ్ ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందింది. అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వేల నుంచి శుద్ధి చేసిన మాంసాన్ని యూఎస్‌ఏకు ఎగుమతి చేస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా రాంచింగ్ అమల్లో ఉంది.
సంచార పశు పోషణ
దట్టమైన అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల నుంచి కొన్ని ఆదిమ తెగల సమాజాల్లో ఇప్పటికీ సంచార పశుపోషణ, సంచార వ్యవసాయం అమల్లో ఉంది. ఈశాన్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ‘జూమింగ్’గా పిలుస్తారు. మధ్య భారతదేశంలో ‘బేవార్’ అని, కేరళలో ‘΄÷నమ్’ అని పిలుస్తున్నారు. సంచార వ్యవసాయం బ్రెజిల్ (రోకా), మలేషియా (లడాంగ్)లలో కూడా అమల్లో ఉంది.
మాదిరి ప్రశ్నలు
1. వ్యవసాయ జనాభా ప్రధానంగా సన్న, చిన్నకారు రైతుల రూపంలో ఉండే వ్యవసాయ విధానం ఏది?
1) సాంద్ర జీవనాధార వ్యవసాయం
2) విస్తార వాణిజ్య వ్యవసాయం
3) మిశ్రమ వ్యవసాయం
4) పైవేవీ కాదు
2. Butter House of Europe గా పేరొందిన దేశం ఏది?
1) ఆస్ట్రేలియా 2) చిలీ
3) దక్షిణాఫ్రికా 4) డెన్మార్క్
3. పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతం ఏది?
1) వాయవ్య ఐరోపా
2) పశ్చిమ ఆఫ్రికా
3) మధ్యధరా ప్రాంతం
4) తూర్పు ఐరోపా
4. ‘గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా’గా పేరొందిన ప్రాంతం ఏది?
1) టాస్మానియా 2) న్యూసౌత్‌వేల్స్
3) క్వీన్స్‌లాండ్ 4) విక్టోరియా
5. మధ్య భారతదేశంలో సంచార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) జూమింగ్ 2) పోనమ్
3) బేవార్ 4) ఏదీకాదు
6. కింద సూచించిన పంటల్లో చల్లటి వాతావరణంలో పండించే పంట ఏది?
1) కొబ్బరి 2) రబ్బరు
3) తేయాకు 4) చెరకు
7. దేశంలో వాణిజ్య పద్ధతుల్లో అత్యధికంగా పూలను ఎగుమతి చేస్తోన్న రాష్ట్రం ఏది?
1) కేరళ 2) తమిళనాడు
3) తెలంగాణ 4) కర్ణాటక
8. కింది వాటిలో రాంచింగ్ మండలంలో ఉన్న దేశం ఏది?
1) ఉరుగ్వే 2) కెనడా
3) లాత్వియా 4) శ్రీలంక
9. ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకొని భారత్‌లో సహకార రంగంలో ΄ాడి సహకార సంఘాలను స్థాపించారు?
1) బ్రెజిల్ 2) నెదర్లాండ్స్
3) ఇజ్రాయెల్ 4) డెన్మార్క్
సమాధానాలు
1) 1 2) 4 3) 3 4) 1
5) 3 6) 3 7) 4 8) 1
9) 4
Tags
- geography material
- model questions
- Competitive Exams
- material for groups preparations
- groups exams preparations
- appsc and tspsc exams
- geography for groups preparations
- previous questions of geography
- previous questions and material of geography for groups exams
- appsc groups exams
- TSPSC
- Government Jobs
- police jobs
- entrance exams for govt jobs
- groups and civils exams
- groups and civils exams preparation material
- geography based questions for groups preparation
- Agriculture
- questions on agriculture for geography
- Extensive commercial agriculture
- Education News
- Sakshi Education News