Skip to main content

Geography Notes for Groups: తీవ్ర వాతావరణ అలజడులే... చక్రవాతాలు!

Cyclone and Earthquakes
Cyclone and Earthquakes

ట్రోపో ఆవరణంలో సంభవించే అతి తీవ్రమైన వాతావరణ అలజడులనే చక్రవాతాలు లేదా తుపానులు అంటారు. ఇవి ఏర్పడే ప్రాంతాలను బట్టి, వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. అవి.. ఆయనరేఖా చక్రవాతాలు. సమశీతోష్ణ మండల లేదా వాతాగ్ర చక్రవాతాలు. ఆయనరేఖా చక్రవాతాలు.. ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో 5 నుంచి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య  సముద్ర ప్రాంతాల్లో సంభవిస్తాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. 40 నుంచి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో ఖండ, సముద్ర భాగాలపై ఏర్పడతాయి. సముద్రాలపై ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు తీరాన్ని దాటి, ఖండాల మీదకు ప్రయాణించినప్పుడు వేగంగా బలహీన పడతాయి. ఆయనరేఖా చక్రవాతాలతో పోల్చితే సమశీతోష్ణ మండల చక్రవాతాల విస్తీర్ణం చాలా ఎక్కువ. ఇవి 400 నుంచి 1000 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. సమశీతోష్ణ మండల చక్రవాతాలు.. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల పశ్చిమం నుంచి తూర్పునకు ప్రయాణిస్తాయి. నిర్దిష్టమైన గమన మార్గాలుండటం వల్ల సమశీతోష్ణ మండల చక్రవాతాలను తేలికగా పసిగట్టవచ్చు. ఇవి ప్రధానంగా అమెరికా, వాయువ్య, పశ్చిమ ఐరోపాల శీతోష్ణస్థితిని విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఏడాదంతా ఏర్పడినప్పటికీ.. శీతాకాలంలో మాత్రం బలంగా ఉంటాయి. అందువల్ల అమెరికా, వాయవ్య ఐరోపాలో శీతాకాలం శీతోష్ణస్థితి సంక్షుభితంగా ఉంటుంది.

ఆయనరేఖా చక్రవాతాలు

ఆయనరేఖా చక్రవాతాల పవనాలు గంటకు 120 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. వీటికి నిర్దిష్ట గమన మార్గాలుండవు. కాబట్టి వీటిని పసిగట్టడం చాలా కష్టం.  ఉదాహరణకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆయనరేఖా చక్రవాతాలు వివిధ దిశల్లో ప్రయాణిస్తాయి. నాగపట్నం వద్ద తీరాన్ని దాటుతుందనుకున్న వాయుగుండం..వేగంగా దిశను మార్చుకుంటూ..ఒడిశా, పశ్చిమ బెంగాల్‌వైపు ప్రయాణించి చివరకు బంగ్లాదేశ్‌ తీరాన్ని దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనరేఖా చక్రవాతాలను స్థానికంగా వివిధ పేర్లతో పిలుస్తారు అవి...
కరేబియన్‌ సముద్రం –    హరికేన్లు
దక్షిణ చైనా సముద్రం –    టైఫూన్లు
ఆస్ట్రేలియా తీరం –        విల్లీ విల్లీ
ఫిలిప్పైన్‌ సముద్రం –    బాగీలు
జపాన్‌ సముద్రం –        కైఫూలు
బంగ్లాదేశ్‌ తీరం –        గురింద్‌లు
భారత తీరం – తుపానులు/చక్రవాతాలు

చ‌ద‌వండి: Geography Notes for Groups: ఖండ చలనం.. పలక విరూపణ​​​​​​​​​​​​​​

వాతాగ్ర చక్రవాతాలు

ఆయనరేఖా, సమశీతోష్ణ మండల చక్రవాతాల నిర్మాణం, ఆవిర్భావ ప్రక్రియలో గుణాత్మక వ్యత్యాసం ఉంది. ఉన్నత అక్షాంశాల్లో వీచే శీతల, శుష్క తూర్పు పవనాలు.. మధ్య అక్షాంశాల్లో వీచే కహోష్ణ, ఆర్థ్ర పశ్చిమ పవనాలతో అభిసరణం చెందటం వల్ల సరిహద్దు మండలాల్లో వాతాగ్రాలు ఏర్పడతాయి. ఈ వాతాగ్ర మండలం వెంబడి శీతల తూర్పు పవనాలు–కహోష్ణ పశ్చిమ పవనాల మధ్య శక్తి మారకం జరుగుతుంది. శక్తి మారకం సందర్భంగా వాతాగ్రాల వెంబడి చక్రవాతాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని వాతాగ్ర చక్రవాతాలని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రత, ఆర్థ్రత కలిగిన వాయురాశులు.. చాలినంత కొరియాలిస్‌ బలం ఉన్న ప్రదేశాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ఏర్పడతాయి. కనీసం 20 డిగ్రీల సెల్సియస్‌ ఉపరితల ఉష్ణోగ్రత ఉన్న ఆయనరేఖా సముద్ర వాయురాశుల వల్ల ఈ చక్రవాతాలు సంభవిస్తాయి. భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల ఉత్తర–దక్షిణ అక్షాంశాల ప్రాంతంలో సముద్ర భాగాలపై ఆర్థ్ర వాయురాశులున్నప్పటికీ... కొరియాలిస్‌ బలాలు చాలినంతగా లేకపోవడంతో చక్రవాతాలు ఏర్పడవు. 30 డిగ్రీల ఆవలి ప్రాంతాల్లో.. ఉష్ణోగ్రత చాలినంతగా లేకపోవడం, వాయురాశుల ఆర్ధ్రత తక్కువగా ఉండటంతో చక్రవాతాలు సంభవించవు.

బలమైన గాలులు

చక్రవాతాలను నిర్మాణపరంగా పరిశీలిస్తే.. సమశీతోష్ణ మండల చక్రవాత ప్రాంతమంతా అలజడితో కూడిన వాతావరణం ∙ఉంటుంది. అధిక వర్షపాతం, బలమైన గాలులు వలయాకారంలో వీస్తుంటాయి. ఆయనరేఖా చక్రవాతాల కేంద్ర భాగాన్ని ‘నేత్రం’ (eye) అని అంటారు. నేత్ర భాగంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బాహ్య నేత్రకుడ్య ప్రాంతంలో వాతావరణం అత్యంత సంక్షుభితంగా ఉంటుంది. క్షితిజ సమాంతర తలంలో ఆయనరేఖా చక్రవాతం శంఖం రూపంలో ఉంటుంది. ఇది సముద్రమట్టం నుంచి సుమారు 7 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.

చ‌ద‌వండి: Geography Notes for Group 1, 2 Exams: అరణ్యాలు... దేశంలో అత్యధిక వర్షపాతాన్ని పొందే తీరం ఏది?​​​​​​​

వర్షాలు.. విధ్వంసం

బంగాళాఖాతంలో స్థానికంగా ఏర్పడే అల్పపీడన ద్రోణులు.. క్రమంగా బలపడి, వాయుగుండాలుగా మారి.. చివరకు చక్రవాతాలవుతాయి. నవంబర్, డిసెంబర్‌లలో సగటున 4–5 తుపానులు భారతదేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. విధ్వంసాన్నీ సృష్టిస్తాయి. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల్లో.. ఆయనరేఖా చక్రవాతాలు ముఖ్యమైనవి. చక్రవాతం ఒక ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడు.. ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా పీడనం క్షీణిస్తుంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఒక్కసారిగా పవన దిశలు మారిపోతాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు.. క్రమంగా వాయుగుండాలు, చక్రవాతాలుగా రూపొందటాన్ని.. ఇన్‌శాట్‌ ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ నిపుణులు వీటి గమన దిశలను నిరంతరం అంచనా వేస్తూ... ఇవి ఎక్కడ, ఎప్పుడు తీరాన్ని  దాటే అవకాశముందో వివరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తారు.

చ‌ద‌వండి: Geography Notes for Groups: మృత్తికలు.. సాగుకు మూలాధారం!

Published date : 19 May 2022 05:44PM

Photo Stories