Sri Sri : యుగకవికి నీరాజనం... నేడు శ్రీశ్రీ జయంతి!
భావకవితా యుగంలో కలం పట్టి, ‘శ్రీశ్రీ’గా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు... అభ్యుదయ కవితా రథసారథిగా, విప్లవ కవితా విధాతగా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. తన 18వ ఏట అప్పటి భావకవిత్వ ప్రభావంతో 16 పద్యకవితా ఖండికలను రచించారు.
Also read: Ambedkar Memorial : అంబేడ్కర్ స్మృతివనం ఒక చారిత్రక చిహ్నం
అబ్బూరి రామకృష్ణారావు ప్రేరణతో ‘ప్రతిజ్ఞ’ గీతం రాసి... శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ‘‘పొలాల నన్నీ / హలాల దున్నీ / ఇలాతలంలో హేమం పిండగ / జగానికంతా సౌఖ్యం నిండగ’’ గీతం రచించారు. సామాన్య మానవుణ్ణి కథానాయకుణ్ణి చేసి రాసిన ‘ప్రతిజ్ఞ గీతం’ ఆధునికాంధ్ర కవిత్వానికి ధృవతార వంటిది. ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి / సమిధ నొక్కటి ఆహుతిచ్చాను’’ అంటూ సాగే ‘జయ భేరి’ గీత రచన అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచింది. ‘‘తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించిన’’ అపూర్వ శక్తిగా మహాప్రస్థానం సంపుటిని చలం ప్రశంసించారు.
Also read: జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
అభ్యుదయ కవితా ఉద్యమ తీవ్రత చల్లారిన తరువాత 1970లో విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడయ్యారు శ్రీశ్రీ. విరసం కవిగా ప్రచురించిన మరో ప్రస్థానంలో ‘‘సాయుధ విప్లవ బీభత్సుని ర«థసారథి /మంటలచేత మాట్లాడించి/రక్తంచేత రాగాలాపన చేయిస్తాన’’న్నారు. ‘సిప్రాలి’ చమత్కార కవితాసంపుటిని, చరమరాత్రి కథల సంపుటిని, మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటిని ప్రచురించారు. సంచల నాత్మక స్వీయచరిత్ర ‘అనంతం’ వెలువరించారు.
సినీ గీతాలతోపాటూ సాహితీ ప్రక్రియలు అన్నింటినీ స్పృశించి సుసంపన్నం చేశారు. 1983 జూన్ 15వ తేదీన తుదిశ్వాస విడిచిన శ్రీశ్రీ ‘యుగకవి’గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు.
– డా‘‘ పీవీ సుబ్బారావు, చిలకలూరిపేట