Group 3 Exam Questions: ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?.. గ్రూప్–3లో రాంజీగోండుపై ప్రశ్న.. ఎవరీ రాంజిగోండు?
ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.
తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది.
ఏంటా ప్రశ్న...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్‌లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే.
ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ !
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు.
పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు.
తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు.
కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు.
ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది
1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు.
ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ముందుతరాలకు తెలిసేలా..
నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
–ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడు
పాఠ్యాంశంగా పెడితే...
వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు.
– డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్
Tags
- Group 3 Exam Questions
- TGPSC Group 3 Exam
- telangana history
- TGPSC
- telangana public service commission
- Textbooks
- Ranjigondu was a Freedom Fighter
- First Tribal Warrior
- Ranjigondu Memorial Tribal Museum
- Freedom fighter Ranjigondu Latest News in Telugu
- Ranjigondu telangana
- Telangana News
- TGPSC Group 3
- TGPSC Job Exams
- TGPSC Group 3 2024
- who is ranjigoud
- telengana history
- first tribal warrior in telengana